రాజమండ్రి డైరీ-10

2-10-1986

ఉదయం గాంధీ జయంతి సమావేశం. రీడర్స్ క్లబ్ ఆధ్వర్యంలో, సదనంలో. ఈ ceremonial tones వెనుక అందరం-ఏదో ఆనందం పొందుతున్నాం. పొద్దున్నే మాష్టారు ‘రాకుండా ఎలా వుండగలను ‘ అంటో. పిల్లలు గాంధీగారి గురించి routine stuff తోటే వచ్చారు. తప్పు వాళ్ళది కాదు, ఆయన గురించి అందుబాటులో వున్న సమాచారం ఎప్పుడూ అలాగే వుంటోందన్న మాట.

మాష్టారు మాట్లాడేరు. in his unique way.

సాయంకాలానికి కాకినాడ.

అ- father పోయారన్న వార్త. Shocking. ఆయన ఇంకా నా కళ్ళముందు మెదుల్తున్నాడు. (రెండే రెండు సార్లు మాటాడినా). ఇది అ-కి, వాళ్ళ కుటుంబానికీ ఎంత విషాదమో ఊహించగలను.

ఎస్-కి fits వచ్చాయనీ, వాళ్ళ అన్నయ్య వైజాగ్ తీసుకువెళ్ళిపోయాడనీ మరొక వార్త. ‘నేను ఇలాంటిదే అవుతుందని అనుకుంటూ వున్నాను. నువ్వు ఎవరన్నా doctor దగ్గరికి తీసుకువెళ్తావేమోనని నీకు చెప్పాను’ అంటో complain చేస్తోంది అక్క.

3-10-1986

వాన. మధ్యాహ్నం రాజమండ్రి వెళ్ళలేదు. అట్లా ‘అనంతం’ చదువుతో.

పూర్తి చేసేసాను. తృప్తిగానూ, fulfilment పొందినట్టుగానూ వుంది.ఇదే మనిషి జీవితంలోని ఆనందం. ఎక్కడన్నా ఒక మనిషి మనిషిగా జీవించినట్లయితే, ఆ కథ విన్నట్టయితే, మనకీ అంత joyful గా వుంటుంది. శ్రీ శ్రీ జీవితం-ఒక శతాబ్దం పాటు పరచుకున్న ఆ కథలో, with distortions and shortcomings-గొప్ప సత్యమూ, కాంతీ ఉన్నాయి.

అనంతం అంటే ఏమిటి? ముగింపు లేనిది. అంటే ప్రాణవంతమైన జీవితమే. ‘నా కవిత్వంలో తల్లితనపు పవిత్రతతో పాటు కక్కసులోని కల్మషం కూడా వుంది ‘-ఇలా వాక్యాలు రాసుకున్న ఆత్మ ఎంత liberated soul అయి వుండాలి! అది శిష్ట్లాకీ, నారాయణబాబుకే అర్థం కాలేదు, కె.వి.రమణారెడ్డికీ, విరసానికీ ఎలా అర్థమవుతుంది?

శ్రీ శ్రీ కవి, కాని అంతకన్నా గొప్ప మనిషి.

3-10-1986

వానజల్లుల మధ్య రాజమండ్రికి. ద్వారపూడి రోడ్డున. పచ్చని పొలాలు, పంటకాలువలు, నల్లని చెట్ల మానులు, దూరంగా లేత ఎర్రని కాంతుల్తో మేఘాలు- ఈ ప్రశాంత సజీవ వర్ణచిత్రం కళ్ళల్లో నిండిపోయింది.

‘పాపపోయింది’ పూర్తి చేసేసాను. technique అంటూ చూస్తే అది నవలగానే కాదు, అసలు ఒక prose work  గా కూడా అది చాలా defective. కాని శిల్పం కోసమో, అపూర్వమైన structure కోసమో బైరాగి దాన్ని రాయలేదు. It is a poem extended an expression of movements. ఒక సరళమయిన narrative poem. అన్ని ప్రతీకల్తో, సందేహాల్తో, నిర్ధారణల్తో. పుస్తకం ముగింపుకి వచ్చిన తర్వాత మనని haunt చేసేదీ, నిలువెల్లా కుదిపేదీ ఏమీ వుండదు. ఒక చల్లని ప్రశాంతి తప్ప. తెల్లని వెలుగు తప్ప. చాలా విసుగయిన, కఠినమయిన మార్గాయాసం తర్వాత గమ్యాన్ని చేరిన సంతృప్తి, feeling of homecoming. బైరాగి- రచయితల్ని మించిన రచయిత.

5-10-1986

సాయంకాలం విజయుడి ఇంట్లో get together. బయట వర్షం. శరత్ entertaining.

పగలు మాష్టారినీ, గోపీనీ కలిసాను. nothing important. ఎస్- విషయం ఏమైందన్నాడు గోపీ. ఈ రోజు కూడా కాకినాడలో వుండిపోయి వాణ్ణి కలిసి రావాల్సింది.

మణి అయ్యర్ మృదంగం. torrential percussion అని పేరుపెట్టారు. కాని ఆ  లయలో గొప్ప softness కూడా వుంది. in fact, it speaks to us మాటలు నేర్చుకుంటున్న పసివాడిలాగా. మృదంగం అంటే ఏమిటో నాకు మణి అయ్యర్ వల్లే తెలిసింది.

6-10-1986

Strike చెయ్యని తప్పని స్థితి. కారణం స్వల్పమైనదే కావచ్చు. కానీ solidarity అంత బలంగా వుంది. strike  పేరు వినగానే మనుషుల్లో కలుగుతున్న మార్పులు ఆశ్చర్యకరంగానూ చిరాగ్గానూ వుండి, ఒకటి రెండు సందర్భాల్లో వెలపరం పుట్టిస్తున్నప్పటికీ అర్థం చేసుకోగలను. Past experience వాళ్ళనట్లా గిచ్చుతోంది. మనిషి తొలిసారి త్యాగాలకి ఎప్పుడూ వెనుదియ్యలేదు. అట్లాంటి fresh spirits ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత నాయకులదీ, ఉద్యమ తాత్త్వికులదీను. ఈ గవర్నమెంటు యూనియన్ల ఒక్కరోజు token strike కి అనే కాదు, అసలు ఏ పోరాటానికైనా విశాల ప్రాతిపదికతో అంటున్నది

రాత్రి రాఘవేందర్ పెళ్ళి. భోజనాల్లో తారసపడ్డవాళ్ళతో హడావిడి. మిత్రులు.

సాయంకాలం రోణంకి సంతాపసభ. సుదర్శనం గారే మాట్లాడేరు. ఒక rare connoisseur. అట్లాంటి వాళ్ళని పొందడానికి మళ్లా చాలాకాలం పడుతుంది.

ఆంధ్రజ్యోతి daily లో నిర్వికల్ప సంగీతం పైన review శ్రీకాంత్ చేసాడు. చాలా detailed గా, careful గా చేసాడు. దాన్ని present చేసిన తీరు చాలా ఆనందపర్చింది.

7-10-1986

Disappointment బాధాకరం. కాని దానికి కారణమయిన ఆసక్తి, అది ఎంత సమ్మోహనకరం. ఎంత basic forces లోంచి వచ్చింది కాకపోతే, ఆసక్తి అంత గాఢగా మనసుకీ, కళ్ళకీ పొరలు కప్పుతుంది! నా ఆసక్తిలోని ప్రచడమైన కాముకత్వం, sexual vibrations నన్ను భయపెడుతున్నాయి. అయినా అవే అసలు కారణమనుకోను. ఈ ఆసక్తి దేన్నుంచి పుడుతోందో ఆ existential necessity- అదేమిటో తెలుసుకోవాలన్న తపన, కోరిక..

కవి దీన్నే మృత్యువును తెలుసుకునే ప్రయత్నం అంటాడు. కాని మానవమాత్రుడు మాత్రం బాబాకరంగానూ, తనకే వెగటు పుట్టించేంత మూర్ఖంగానూ అర్రులు చాస్తూనే వుంటాడు.

దీనికి సమాధానం ఎట్లా కలుగుతుంది?

రాత్రి రెండింటిదాకా గోపీ, రామకృష్ణ. మళ్ళీ relations గురించి కొత్తగా, hopeful గా, నిర్మలంగా భావించుకోవడం ఇవాళ mood లో కొంత unusality, మనుషులు కాస్త బయటపడుతున్నప్పటి ఆత్మల ప్రకాశం.

8-10-1986

రాత్రి నేను, విజయుడూ మిత్రులకి పార్టీ ఇచ్చాం. ఈ వూళ్ళో, కాస్త హాయిగా, వీలుగా కలవడానికి తగినచోటు లేదు. అయినా ఎక్కడో కాస్త వీలు చేసుకున్నాం.

రోణంకి గురించిన death news పుకారే అయినప్పటికీ దాన్ని report చేసినవాళ్ళూ, meetings convene చేసినవాళ్ళూ ఇష్టం కొద్దీ చేసారు తప్ప వేరే motives తో కాదు. కాని మన చెంచా పత్రికలూ, అసాహిత్యకారులూ దీనిమీద చేస్తున్న గోలసంగతి? పత్రికలు వ్యవహరిస్తున్న వైఖరి మీద ఒక meeting పెట్టి నిరసన వ్యక్తం చేదామనుకున్నాం…

రూంలో రెండు పిల్లికూనలు. వాటి మెత్తని అల్లరి మధ్య తెలుగు పాటలు. రోజులు నిండుగా, మత్తుగా గడిచిపోతున్నాయి.

11-10-1986

పాటలు వింటూ, పరాచికాలు ఆడుతూ, కునుకు తీస్తూ, కాలక్షేపానికి కబుర్లు చెప్తూ-

కాని అప్పుడప్పుడు అన్పిస్తుంది. సెలవులు అనుభవించడానికి నాకేమిటి అర్హత అని. కానీ నిజంగా అవిశ్రాంతంగా చెయ్యడానికి నాకున్న పని మాత్రం ఏమిటి? ఈ సెలవు, ఈ విశ్రాంతి ఇదంతా పైపైన. లోపల జ్వలిస్తున్నది జ్వలిస్తూనే వుంటుంది.

కాని, ఏ క్షణాన, (బహుశా ఒక సోమరి క్షణానే)నిజంగా ఆలోచిస్తే, చూస్తే, నా ఆత్మ యీ కార్యకలాపానికీ యీ విశ్రాంతికీ కూడా చెందనిదే అన్పిస్తుంది. ఇవన్నీ నేను కప్ల్పించుకున్నవి, నేను కూరుకుపోతున్నవీను.

12-10-1986

ప్రశాంతం.

సాయంకాలం అద్భుతమయిన నీరవతలో, గొప్ప ఆకుపచ్చతనపు స్వాభావికమయిన శోభలో, కరిగిపోతున్న సంధ్యలో ఆ వూరునించి. ఆ పైన వెన్నెల, అరణ్యాల్ని పునీతపరుస్తో, ఆకాశాన్ని మెరుగుపరుస్తో.

నశించేవన్నీ నశిస్తాయి. వికసించేవి వికసిస్తాయి. అపార్థాలు, ఉక్క, మొగాలు ముడుచుకోవడాలు-ఇవన్నీ పోతాయి. పసిపాపలు ‘అంకుల్ దా , కూచో – ఈ మాటలు, ఈ మాటలన్న పెదాలు, అనిపించిన నిష్కళంక హృదయాలు, ఆ క్షణాన ఆ పిల్ల ద్వారా జీవించిన ఈశ్వర కరుణావీక్షణాలు ఇవి నిలుస్తాయి. వాంఛ నశిస్తుంది. ద్వేషం నశిస్తుంది. ఉన్మాదం నశిస్తుంది. ప్రేమ బతుకుతుంది. ప్రేమ వికసిస్తుంది. ప్రేమ నిలుస్తుంది.

16-10-2022

Leave a Reply

%d