
15-9-1986
ఈ రోజుతో మాష్టారి ప్రసంగాలు పూర్తి అయ్యాయి. శంకరులవారి ‘శివానందలహరి’తో. భవభూతి, శిఖరిణీ వృత్తము, తార్కిక శంకరుడు, కవి శంకరుడు-ఇవన్నీ స్పృశిస్తూ శంకరుల కవిత్వం పరమశివుడు, కాళిదాసు కవిత్వం అమ్మవారు అన్నారు. ఆయన దర్శనం గౌరీశంకర శిఖరం అయితే. కవిత్వం ఆ heights లోంచే అందరినీ తరింప చెయ్యడానికి ప్రవహించే గంగ అన్నారు. ఇంకా ఇలాగే ఎన్నో విషయాలు in his unique style.
చివరన నా అభిప్రాయాలు చెప్పాను. It pleased him. చాలా calmగా, serene గా మాట్లాడేవు, నా ఉపన్యాస క్లేశమంతా తగ్గి relief గా వుంది. ఈసారి నా ప్రసంగాలకు నిన్ను అధ్యక్షుడిగా కూర్చోబెట్టాలని వుంది. ఈ వూళ్ళో నా ప్రసంగాలను సమీక్షించడానికి నువ్వు తప్ప ఎవరున్నారు?’.. ఆయన వివశత్వం ఆయన చేత అలా మాట్లాడించింది. దగ్గరగా తీసుకుని చుబుకాన్ని ముద్దాడి ‘చాలా హాయిగా వుంది ‘ అన్నారు.
ఈ ఆనందాన్ని నా మిత్రులెవ్వరూ పంచుకోలేకపోయారు.
16-9-1986
షేక్ హమీదుల్లా షరీఫ్ అనే ఆయన మొహర్రం గురించి రాసిన వ్యాసం చదివాను. ఇమాం హుస్సేన్ ప్రజాస్వామిక విశ్వాసాల కోసం మరణించాడని రాసాడు. a wise interpretation.
తెలుగుపాటలు-కొన్ని మంచివి ఏరి రికార్డు చేయించాను. రాత్రి ఆ పాటల గాలుల్లోనే.
17-9-1986
రోజురోజుకీ deep isolation. అన్ని వైపుల నుంచీ constraint. ఈ ఏకాకిత్వం నుంచి పద్మం లాంటిది ఏదయినా వికసిస్తుందేమో అనుకుంటాను. కాని ఏముంటుంది? నీరసం, నిద్ర, అర్థం లేని కలలు!
రాత్రి వర్షం, ఆ పైన వెన్నెల.
శ్రమించాలనీ, మన శ్రమలో నలుగురూ కలవాలనీ, శ్రమఫలితాన్ని అంతా కలిసి అనుభవించాలనీ అనుకుంటాం. కని శ్రమనుంచి ఎంతో పరాయితనం, ఇష్టంగా చేసే, యీ సాహిత్యకృషి అయినా శ్రమ అనుకొందాం అనుకుంటాము, కాని, ఇక్కడ మనుషులు ముందే విడిపోతారు.
రేడియో లో డి.వి.పలుస్కర్ గానం.
18-9-1986
మనిషి స్వధర్మమే అతన్ని తనవాళ్ళనుంచి isolate చేస్తుంది అన్నాడు గోపీచంద్. రాత్రి చాలాసేపు వెన్నెల్లో అతని యింటి దగ్గర కబుర్లు.
మనలో సాంఘికమయినది ఏదయితే వుందో, దాన్ని మొద్దుబరిచే ప్రయత్నాలు ప్రతి ఒక్కరం చేస్తున్నాం. కాని, దాన్ని మొద్దుబరిచిన తర్వాత అది ఆత్మికంగా కూడా వుపయోగపడదు. గొప్ప ప్రేమ, సాంఘికమయిన instinct నుంచే వస్తుంది. అది అత్మకి సహజమయిన వికాసమూను. ఎంత గొప్పగా అన్నాడు టాల్ స్టాయి ‘ప్రతిభ అంటే ప్రేమ’ అని.
జ్యేష్టగారికి ఉత్తరం రాసాను.
19-9-1986
రాత్రి బి.ఎస్ ఇంటి డాబా మీద వెన్నెట్లో మిత్రబృందం. చరిత్ర పరిశోధకుడు రతన్ లాహిరీతో ఇష్టాగోష్టి. చరిత్రకారుడిగా, truth పట్ల ఒక జిజ్ఞాస ఉండి, అదే సమయంలో కొన్ని వ్యక్తిగత విశ్వాసాలూ ప్రబలంగా వుండి అవస్థపడేవాడి స్థితి ఆయనదీను. గొప్ప చరిత్రకారుడు ఎవరంటే clarity పొందినవాడే, because he is also a certain kind of writer. అలాంటివాళ్ళు ఎందరుంటారు? ఎక్కడుంటారు? ఎవరో Carr లాంటి వాడు తప్ప.
బి.ఎస్. ఆతిథ్యం.
వాళ్ళు బెంగాలీ కవిత్వం విన్పించారు. మనవాళ్ళు తెలుగు. with translation. వాళ్ళు సుబ్బారావు పాణిగ్రాహి ‘కష్టజీవులం, మేం కమ్యూనిష్టులం..’పాటని బెంగాలీలో పాడేరు’. టాగూర్ కన్నా గొప్ప హీరో మా బెంగాల్లో అతను. ఆ గీతం అన్ని ప్రపంచభాషల్లోకి అనువాదమయ్యింది’ అన్నారు వాళ్ళు.
20-9-1986
మధ్యాహ్నం కాళీపట్నం రామారావు మాష్టారు వచ్చారు. నేనూ, నాయుడూ1 స్టేషన్ కి వెళ్ళాం. శాంతినివాస్ లో దిగారు. సాయంకాలం శరభయ్యగారు వచ్చారు ఆయన్ని చూడటానికి. బి.ఎస్. విజయుడు కూడా. చాలా ఉల్లాసకరమైన సమావేశం. ఎంతో lively గా ఉంది. రాత్రి మళ్ళీ సన్నిధానం, ప్రభాకరరావు, సూర్యనారాయణలు.
ఒళ్ళు నెప్పులు, జ్వరం, ఎక్కువ physical strain పడుతున్నానేమో అన్పిస్తుంది. కాని నిజంగా శ్రమిస్తున్నదంటూ కూడా ఏమీ లేదు. మానసికంగా ఇదివరికటికన్నా తెరిపి.
S-కి మగపిల్లవాడని వార్త. చాలా ఆలస్యంగా ఎవరిద్వారానో వినడం. తల్లినీ, పిల్లవాడ్నీ చూడాలనిపించింది.
21-9-1986
రామారావు మాష్టారిని మధ్యాహ్నం ఇంటికి తీసుకొచ్చాను. కాసేపు సంగీతం విన్నారు. విశ్రాంతి తీసుకున్నారు. కథ విన్పించాను. సాయంకాలం శరభయ్యగారి ఇంటికి. చాలాసేపు కూరున్నాం. మాష్టారి రామాయణం ప్రసంగం cassette పెట్టి విన్పించారు. రామారావు మాష్టారిలో వయసు, జీవితం పెట్టిన ఇబ్బందుల్ని దాటిన జిజ్ఞాస, స్తిమితత్వం-వీటిని మాష్టారు గుర్తించకపోలేదు. కాని ఆయన తన isolation తాలూకు agony ని చాలా స్ఫుటంగా ప్రస్తావించేరు. నిన్నవాళ్ళు ఏమి మాట్లాడుకోలేదని సంతోషించేనో, ఇవాళ వాళ్ళ ప్రసంగ విషయం అదే అయింది. ఎలా యీ కొత్త generations కి తమ ఆశల్ని అందచెయ్యడం అన్నదే. ఆ ప్రస్తావన వాళ్ళని మరీ నిరుత్సాహపరుస్తుందని నేను అనుకోను కానీ, it is always a disappointing reference.
22-9-1986
కాస్త ఓపిక చేసుకుని ఆఫీసుకి.
సాయంకాలం రామకృష్ణ ఇంటికి. మనుషుల్తో యీ మధ్య ఏర్పడ్డ problems గురించి చెప్పుకొచ్చాడు. అందులో నేను కూడా ఉన్నాను. చాలాసేపు చర్చించాం. అక్కడే రాత్రి భోజనం. మన మాలిన్యం ఇతరులని బాధపెట్టినా పెట్టకపోయినా, ముందు మనని బాధిస్తుంది. దాన్నుంచి తప్పించుకోవాలంటే మంచి మనసు ఉండాలి. రామకృష్ణకి కనీసం మంచి హృదయముంది.
తెలుగు సాహిత్యం మీద రతన్ లాహిరీ కోసం ఇంగ్లీషులో వ్యాసం రాసాను. సంతృప్తికరంగా వచ్చింది.
S-కి చిన్న ఉత్తరం.
23-9-1986
‘..తీరిక సోమరితనం అవుతుందనీ, దాన్నుంచే అన్ని చికాకులూ కలుగుతున్నాయనీ అన్పించింది. కష్టపడటం, physical గా, ఈ బండతనం ఎంత మానసికమయిన relief ఇస్తుందనుకున్నావు!.. సోమరితనం నన్ను విషంతోటీ, ద్వేషంతోటీ పొగతోటీ నింపింది. క్రిమిలాగా బతికాను. అబ్బ, తలుచుకుంటేనే ఘోరం, క్రిమి..క్రిముల్ని తింటూ..
‘..నిజమే, శారీరిక సుఖం చాలా గొప్పది. అపురూపమయిన comfort వుంది అందులో. ఇంద్రియాలకు శాంతి. silencing all the agony- కాని నాది నా soul తాలూకు struggle, దూరంగానూ, వేదాంతంగానూ మాటాడుతున్నాను అనుకోకు, I want to unveil myself. నేను ఇంతదాకా ఇది దైహికమైన matter అనుకునే ఎంతో రొష్టు పడ్డాను. చాలా భయమకరమైన తప్పులు చేసాను. నా గౌరవాన్నీ, విశ్వాసాల్నీ కూడా తీసి పక్కన పెట్టేసాను. కాని ఇందువల్ల నేను పొందింది ఏమీ లేదు, ఉత్త బాధ, ఉక్రోషం, ఆవేశం, ఆడవాళ్ళనుంచి, ఆత్మీయులనుంచి తిరస్కారం. నేను కోరుకున్నది గొప్ప relation, ఎట్లాంటి బంధాలూ, మోహాలూ లేని రిలేషన్. అది ఎంత దగ్గరో అన్పించి ఎంత దూరమో తెలియవచ్చింది.’
ఇట్లా ప్రసాద్ కి ఉత్తరం.
రాత్రి రామకృష్ణ బర్త్ డే పార్టీ ఇచ్చాడు మిత్రబృందానికి.
16-10-2022
_______________
1 నాయుడు ఎవరో గుర్తు రావడం లేదు. బహుశా సాదనాల వెంకటస్వామినాయుడు కావచ్చు.