రాజమండ్రి డైరీ-7

Reading Time: 3 minutes

8-9-2016

ఇవాల్టినుంచీ శరభయ్యగారి ప్రసంగాలు. ఇవాళ introductory, కాని సహజంగానే సూక్ష్మంగానూ, సమగ్రంగానూ వుంది. అందుకు ఒక్కటే గుర్తు. కాళిదాసు. తాను తన కౌమార యవ్వనాల్లో ఎట్లా ఆ కావ్యాలు చదివి ఉన్మత్తుడయి సంచరించిందీ చెప్తుంటే..

మాష్టారు కాళిదాసు వర్ణనని ఒకదాన్ని చెప్తూ తనకి ఎంతో ఇష్టమయిన ఆ శ్లోకాన్నే టాగూర్ కూడా ఉదాహరించాడని చెప్తున్నారు. మళ్లీ ఎప్పట్లానే ఆయన రసానంద సంపన్నత పట్ల అసూయ. ప్రయత్నించీ, అభ్యసించీ చదవాల్సినవాడు కాడు కాళిదాసు. అది బాల్యంలో, ఆయన ఎలా అయితే చదువుకున్నాడో అలా. మబ్బుపట్టిన ఉదయాలు మేఘసందేశాన్నీ, ముసురుపట్టిన నాడు మృచ్ఛకటికాన్నీ..

9-9-1986

మధ్యాహ్నం బి.ఎస్ ని కలిసాను. ఆయన తన problem చెప్పి నా అభిప్రాయం అడిగాడు. నేను వివరంగా నా అభిప్రాయాలు చెప్పాను. ఆయనలో నాకు కన్పిస్తున్న లోపాలు,వీటికి ఏ సవరణలు చెయ్యవచ్చును-ఇట్లా. కాని ఆయనకి ఒక minimum financial security ఏర్పడాలనీ, అప్పుడుగానీ అరుదయిన ఆయనలాంటి వ్యక్తిత్వాలకి విలువ నిలబడదనీ మనసా అనుకున్నాను. అదే ఆయనకీ ఇంకాస్త స్పష్టంగా చెప్పాను, చెప్పనిది ఇంకొకటి ఉండిపోయింది. లోపాలు బాధపెడతాయనీ, అందులోనూ మనకి ఇష్టులయినవాళ్ళ లోపాలు మనని మరింత గుచ్చుకుంటాయనీను. కాని, ఇది ఎవరన్నా నాకే చెప్పాల్సిన విషయం.

కథ విన్పించాను. మల్లాది రామకృష్ణశాస్త్రిగారిని గుర్తుకు తెస్తోందన్నాడు.

శరభయ్యగారు-లీలాశుకుడి కృష్ణకర్ణామృతం మీద. అది మురళీగానంలాగా, వెన్నెలలాగా, తమాలవృక్షఛాయలాగా, గోధూళిలాగా, నెమిలిపింఛం రంగులాగా వుంది. ముట్నూరివారితో ‘ఇది చదివితే కాళిదాసు,భవభూతి గుర్తుకు రావడం లేదు’ అని అంటే ఆయన అన్నారుట ‘లీలాశుకుడు ఏ సౌందర్యాన్నయితే శ్రీకృష్ణదేవుడిలో చూసాడో కాళిదాసు, భవభూతి దాన్ని మొత్తం ప్రపంచంలో చూసారు. ఇది అర్థం కావడానికి నీకు కొంతకాలం పడుతుంది’ అని.

10-9-1986

కృష్ణకర్ణామృత స్మరణలో ఉండగానే, ఇవాళ శ్రీ వేణుగోపాల శతకం. ఇంతవరకూ ఆయన ద్వారా వినలేదు, అలాగే ఆ కావ్యావిష్కరణ వెనుక వున్న దైవికమైన గాథని కూడా. ఎవరు అనాసక్తులో అనుగ్రహాలూ వాళ్ళనే వచ్చి చేరతాయి. మాష్టారి కన్నా అందుకు నిదర్శనం ఏమిటి? కాని మాష్టారు మాష్టారే. ఆయన దేవుడికి తనవంతు అర్చన తాను చేసుకున్నారు.

Van Meer  హిందుస్తానీ సంగీతం గురించిన పుస్తకాన్ని గొప్ప ఆసక్తితో చదువుతున్నాను.

రాత్రి చిదంబరం ఫిల్మ్ మీది reviews ని తెలుగు చెయ్యాలని కూచుని.. దాన్నుంచి సంగీతంలోకి.

11-9-1986

జ్యేష్టగారికి ఉత్తరం రాసాను. క్లుప్తంగా. ‘మీరు నా రచనలో చూస్తున్న confusion, incoherence వీటివెనుక మంద్రంగానయినా విన్పిస్తున్న సూనృతగీతాన్ని మీరు విని వుండాల్సింది. ఆమె తేజోరూపిణి అయిన రాజరాజేశ్వరి అయినా, terracota అమ్మతల్లి ప్రతిమలయినా అన్నిటివెనుకా ఒకే అమ్మవారి ప్రసన్న దయావిలోకనమే కదా.’

ఇవాళ మాష్టారు కావ్యానుశీలనం చెయ్యలేదు. భారత కథని చెప్తూ వుండిపోయారు. అసలే the greatest story of human society. దాన్ని మాష్టారి వంటి మనిషి interpret చెయ్యడం. ‘కానీ నేను ఎప్పుడూ చెయ్యనిది, కథ చెప్పాను’ అంటో ఆయన ఒకటే నలిగిపోతుంటే అన్నాను ‘మీరు చెప్పింది కథ అనుకోను. అది కవిత్వం కన్నా క్లిష్టమయిన విషయం.’

12-9-1986

టాగూర్ ‘మేఘదూత ‘పైని వ్యాసం చదివాను. ఇంతకాలం చదవకపోవడం దురదృష్టం. కాని దాని భావం నిజంగా బోధపడేది ఇప్పుడే. ఈ రోజంతా ఆనందమే.

గౌస్ ‘స్పర్శ’ చదివాను. మోహన ప్రసాద్ ఎందుకు ఇష్టపడ్డాడో తెలుస్తోంది. చాలా freshగా, neat గా ఉంది, sincereగా వుంది.

ఈ రోజు రామాయణ గాథ. అగ్నిప్రవేశం దృశ్యం.. దాన్ని ఆయన ఆలోకనం చేస్తూ ‘సీతకాదు, అగ్నిలో ప్రవేశించింది, ఆ క్షణాన శ్రీరామచంద్రుడే ప్రవేశించాడు. అన్ని అగ్నుల్నీ మించిన ధర్మాగ్నిలో రాముడు తన సమస్త బంధనాల్నీ, అనురాగాల్నీ త్యజించివేసాడు..’ ఈ మాట అంటూ ఉండగా ఆయన కంఠం తొణికింది. కళ్ళల్లోకి నీళ్ళు పొంగాయి. రెప్పపాటులో దాన్ని సంబాళించుకున్నారు. ., కాని ఆ క్షణం నుంచే నాలాంటి శ్రోతలకి ఎంత వేదనని transform చేసివుంటారని!

13-9-1986

భారతం real life అనీ, రామాయణం ideal life అనీ, భాగవతం divine life అనీ చెప్తూ- యీ రోజు భాగవత విషయం ఎత్తుకున్నారు. వ్యాసుడికీ, శుకమహర్షికీ వున్న భేదం చెప్తూ ఆ భేదమే ఆ రెండు మహాగ్రంథాల్లోనూ వున్నదీ అన్నారు. అంతకన్నా భాగవతానికి వివరణ ఏం కావాలి? పరీక్షిత్తు, భీష్ముడు, ద్రౌపది-ఇలా భారతంలోనూ, భాగవతంలోనూ వున్న differences between tones చెప్పారు. భారతం రాజసమయింది కాగా, భాగవతం పరమోదాత్తమూ, సాత్త్వికమూ అని. గోపికా కీర్తనల్తో ముగించారు.

ప్రతిరోజూ సమావేశాలకి నేను attend కావడం ఆయన్ని ఎక్కడో బాగా move చేసిందని ఇవాల్టి ఆయన ప్రవర్తన చెప్తోంది. ఆయన తన జీవితకాలమంతా ఒక శ్రోతని, శిష్యుణ్ణి వెతుక్కుంటూనే వున్నారు. In fact, it is a search for a companion. ఆ రోజు companion లేకపోవడం ఎంత బాధకరం అని ఆయన అంతే ఆ గోదావరి ఒడ్డున నేను అన్నమాట నాకు ఇంకా గుర్తుంది. ‘అదే అన్నిటికన్నా పెద్ద విషాదం’ అని. నా కళ్ళల్లోకి అనుమానంగా, ఆశగా చూస్తూ ‘అవును, అవును’ అన్నారాయన.

జ్యేష్టగారినుంచి pleasant letter. ఆయన పైకి కనిపిస్తున్నట్టుగా harsh కాదు, చాలా deep concern వున్నవాడు అన్పించింది.

14-9-1986

ఉదయం మాష్టారి ఇంటికి వెళ్ళాను. టాగూర్ గారి వ్యాసాలూ, దానికి మాష్టారి ముందుమాటా.. ఆయనతో కలిసి మధ్యాహ్న భోజనం, కాసేపు అరవిందుల వ్యాసాలు చదివాను. టాగూర్ ‘విక్టరీ’ కథ చదవమన్నారు.

సాయంకాలం అనుకోకుండా కాటూరి మాష్టారి ‘పౌలస్త్య హృదయం’ ఎత్తుకున్నారు.  A rare gift. విశ్వనాథ కల్పవృక్షం ఆరుకాండలూ ఈ పద్యాలముందు నిలబడవన్నారు. ఆ courage ఎంత ప్రేమించదగ్గది!’ రేపు యీ సభలు అన్నిటినీ సమీక్షించు’ అన్నారు నన్ను.

సాయంకాలం వరలక్ష్మి ఇంట్లో భోజనం. గిరిజ, శ్రీను, వరలక్ష్మి, వాళ్ళాయన..శరభవరంలో వాళ్ళ ఇంట్లో గడిపినట్టుగా వుంది. చల్లగా, హాయిగా అనిపించింది.

మధ్యాణం టివిలో అస్సామీ చిత్రం ‘ప్రతిధ్వని’. ఒక భగ్న ప్రణయ వృత్తాంతం. చాలా కోమలంగా తీసారు. Pleasant wind లాగా ఉంది. వెదురుపొదలు, పిల్లంగోవి సవ్వడీను.

రాత్రి అన్నపూర్ణగారిని కలిసాను. ఎమ్మే first class వచ్చిందన్న వార్త ఆమె ద్వారా. ఎంత ఆనందంగా వుందో చెప్పలేను.

16-10-2022

Leave a Reply

%d bloggers like this: