రాజమండ్రి డైరీ-4

1-7-1986

నిజంగానే, వెతుకులాట అంతా కూడా, ఒక్క మనిషి కోసం. ఒక్క క్షణమయినా, లేదా even in an event- అట్లా సజీవమైన మనిషి తటస్థిస్తే- ఆ రోజుకి ఎంత సాఫల్యత.

మనుషులు ఉన్నారు. కాని వాళ్లతో సజీవమయిన రిలేషన్సే లేవు. అవి ఏర్పడాలంటే ఎన్ని అవరోధాలు తొలగాలి? కాని ఎవరు తొలగించేది యీ అవరోధాల్ని?

ఈ రోజు ఆమె- మళ్ళీ నా routine లో తన వాత్సల్యాన్ని ప్రకటించింది. ఇంత ఆనందంలోనూ  I was trembling. దూరంగా వుండాలి అని అనుకుంటూనే వున్నాను.

బతకడం ఎంత అవాంఛనీయం అయిపోయింది!

(తిరిగి మళ్ళా జూలై 18 దాకా ఎంట్రీల్లేవు)

19-7-1986

బంద్. ఎన్నడూలేనిది ఆఫీసుకి కూడా సెలవు డిక్లేర్ చేసారు. మధ్యాహ్నం విజయకుమార్ ఇంట్లో మీల్స్. ఇంటికి వచ్చేటప్పటికి గోపీచంద్. చాలాసేపు గురజాడ అప్పారావుగారి గురించే.

సాయంకాలం వెన్నెల వ్యాపిస్తుండగా కాకినాడకి. అక్కకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాను. పాపాజీ, బుజ్జి, బావగారు, సోమయాజులు-ఇల్లంతా కలకలలాడుతూ వుంది. అక్క కళ్లల్లో ఆనందం.

రాత్రి టివిలో తాన్ సేన్ ఫిల్మ్. అంత గొప్పగా లేదు. కొత్త ఫిల్మ్ ట! సగం చూసి నిద్రపోయాను. ఇండియన్ పనోరమా ఫిల్మ్స్ వైజాగ్ లో చూడాలని నిశ్చయించాం.

20-7-1986

మధ్యాహ్నం టివిలో అస్సామీ ఫిల్మ్ అగ్నిస్నాన్. బాగా తీసాడు. డబ్బు వల్ల సాధారణ సమాజంలో వచ్చే humiliation, అది వ్యవస్థిత నైతిక చట్రం మీద, తద్వారా మానవత్వం మీదా తీసే దెబ్బలు. అయితే డా. భవేంద్ర నాథ్ సైకియా ( ఈయన ఫిజిక్స్ ప్రొఫెసరట) దీనికి తీసుకున్న పరిష్కారం ఏమిటంటే, అది తిరిగి humiliator ని shock చెయ్యగలిగేటట్లు ఉండాలని. ఈ moralising వల్ల సినిమా తనకి నచ్చలేదని రాజారామ్మోహన రావు అన్నాడు. అంత subtilities కి పోతే చెప్పలేనుగానీ, though there are some technical defects ( ఈ ఫిల్మ్ కి Best Screenplay award) ఫిల్మ్ బావుంది. కథనం గొప్పగా వుంది.

సాయంకాలం రాజారామ్మోహన రావు వెళ్ళిపోయాడు. అతనితో పెద్దగా ఏమీ మాట్లాడలేకపోయాను. అట్లానే అ-తోనూ. ఇకముందు కూడా మాట్లాడగలను అనుకోను. The relation arrived to its funeral.

21-7-1986

ముసురు. అనుకున్నట్టుగా వైజాగ్ నిన్న వెళ్ళలేదు. రాత్రికి వాయిదా. సొమయాజులు కూడా వస్తున్నాడు. చదవాలని అన్పించింది. ఏమీ చదవలేదు. రాయాలని అన్పించింది. ఏమీ రాయలేదు.

22-7-1986

చిదంబరం. Worthy.. not just another story of crime and punishment. It is  a conflict between the splendor of all that is peaceful and the ugly faces of the world. జీవిత ప్రశాంతతలో హఠాత్తుగా పలికిన ఒక బాధాకరమయిన వికృత స్వరంతో కల్లోలపడ్డ మనిషి భూమ్యాకాశాల్ని కలిపే దేవాలయ ప్రాంగణంలో తిరిగి తన మనస్సుతో సమాధానపడటం. Aravidan is neither philosophical nor religious. అతను చాలా aesthetic. ఎంత అంటే, దాని మూలాల్లోకి వెళ్ళగలిగేటంత.

పోర్ట్ గెస్ట్ హవుస్ లో.. బయట ముసురు. .. అక్కా,నేనూ, సోమయాజులూ, పద్మా. సాయంకాలం అత్తయ్యగారింటికి వెళ్ళాం. ఆ ఇంట్లో అందరి ముఖాల్లో గూడుకట్టిన బెంగ. మనసు నెమ్మదిగా వికలమయిపోయింది.

రాత్రి వెన్నెల్లో బస్ లో కాకినాడకి.

23-7-1986

Work-

శ్రమించడం వల్ల మానసిక రుగ్మత నశిస్తుందని నమ్మడంలో- ఇంతవరకూ విప్రతిపత్తి ఏమీ కన్పించడం లేదు. ఆవశ్యకమయిన కర్తవ్యం, దేన్ని నెరవేర్చకపోడం వల్ల యీ బాధంతా కల్గుతోందో, దాన్ని చేపట్టాలన్న నిశ్చయం. కాని, అదేమిటో తెలిస్తే కదా. But, we have to do what is to be done immediately.

ఇప్పటివరకూ ఇలా అన్పిస్తోంది.

24-7-1986

పుస్తకం1 ఇన్నాళ్ళకు complete అయ్యింది. ఇప్పుడు దాని ఆకృతి సంతృప్తికరంగా వుంది. నేను కలగన్నట్టుగా పుస్తకం వచ్చింది. ఇక అది ఎవర్ని reach అవుతుంది, ఎట్లాంటి ఫలితాల్ని ఇస్తుంది, ఎంతకాలం నిలబడుతుంది- ఇవన్నీ ఎదురు చూడాల్సిందే. కాని హ్యూమ్2 గారి పుస్తకంలా dead-born కాకూడదనే అనుకుంటాను.

Vedic literature గురించి చదువుతూ వున్నాను. notes తీసుకోవాలి. ‘యజ్ఞపశు ‘ నాటకం మొదలుపెట్టి చాలాకాలమే అయింది. దాన్ని authentic గా కొనసాగించాలి.

( తిరిగి మళ్ళా ఆగస్టు 6 దాకా ఎంట్రీల్లేవు)

14-10-2022

~

1 నిర్వికల్ప సంగీతం కవితా సంపుటి. ఆవిష్కరణ మార్చిలో జరిగింది. కాని అప్పటికింకా పుస్తకం పూర్తిగా తయారుకాలేదు. అది జూలై చివరికి చేతికొచ్చింది.

2 బ్రిటిష్ ఎంపిరిసిస్టు తత్త్వవేత్త డేవిడ్ హ్యూమ్ తన పుస్తకం still born from the press అని చెప్పుకున్నాడు. అంటే ఆ పుస్తకం వచ్చినా కూడా ఎవరూ పట్టించుకోలేదు అన్న అర్థంలో. ఆ మాట రేవతీదేవి తన శిలాలోలిత లో కూడా తలుచుకుంది.

One Reply to “రాజమండ్రి డైరీ-4”

  1. తొలి వాక్యమే ప్రశ్నించింది.సజీవమైన మనిషి తటస్థించిన సందర్భాలున్నాయా అని ఇప్పుడు నాలో వెతుకులాట మొదలయింది.శ్రమించడం వల్ల మానసిక రుగ్మత నశిస్తుందనేది మంచి విషయం.
    పని వ్యక్తికి తనమీద ధ్యాసను మళ్లిస్తుంది.ఇది మానసిక జాడ్యాన్ని తొలగింపుపై చేస్తుంది.
    బహశః Empty mind is devil’s workshop అనే సామెతకు కూడా పనే మార్గాంతరం.యజ్ఞపశు నాటకం పేరు ఎప్పుడు చెవిన పడలేదు.దాని వివరాలు ముందు ముందుంటాయేమో

Leave a Reply

%d bloggers like this: