
14-1-1986
రాత్రంతా ప్రయాణం చేస్తూ వుదయానికి యింటికి వచ్చాను. పండగ అంటే ఇంతకన్నా ఏం కావాలి అన్నట్లుంది ఇల్లు. మత్తుగా గడిచిపోయింది. ఆ వూళ్ళో కాకుండా పండగ జరుపుకోవడం, అలాగే ఆ పాత associations ఏవీ కదలాడకుండానే రోజు గడిచిపోయింది. అక్క వచ్చి ముగ్గులు పెట్టి వెళ్ళిపోయింది. ఎంత ఆరోగ్యవంతురాలు అక్క. అందుకే ఆవిడ ఉన్నచోటనే అద్భుతమైన లోకాలు ఏర్పడతాయి. నేను గడిచిపోయిన లోకాల గురించి బెంగ పెట్టుకుని ఏడుస్తూ వుంటాను. బాగా విరిసిన మామిడిపూతల్లోంచి చల్లని గాలులు వీస్తోంటే పిల్లలూ, మిత్రులూ వున్న యింట్లో పాటలు వింటూ గడుపుతున్నా-ఏదో దిగులు.. సరే దిగులుని అట్లా ఓ మూలకి నెట్టి రాజేందర్ సింగ్ బేడీ నవల చదువుతూ కూచున్నాను. పోయిన సంక్రాంతి పోయిన సంక్రాంతే. గడుస్తున్నదే నిజమయినది, అసలయినది, నాది.
15-1-1986
ఇవాళ మరీ వర్షం. పుష్యమాసంలో రోజులా లేదు. రాత్రి కుంపటి దగ్గర కూచొని కబుర్లు చెప్పుకుంటూంటే వానకు తడిసిన మామిడిపూత లోంచి తియ్యని గాలి వీస్తూంటే చాలా గమ్మత్తుగా వుంది. ఏదో శ్రావణమాసపు రాత్రిలా వుంది.
మధ్యాహ్నం శరభవరం వెళ్ళాను. వెళ్ళకుండా ఉండలేకపోయాను. ఎక్కువసేపు వుండలేదు. వూరంతా తిరిగి వచ్చేసాను..
కాని యీ రెండు రోజులూ ఎంత శాంతిగా గడిచాయని. కాని యీ రెండురోజులే. మళ్ళీ జీవితమ్మీద దాని యథాప్రకారం భారాలు పడకతప్పదు. మొయ్యకా తప్పదు. మధ్యలో ఇట్లాంటి విరామాలు ఉండాలా వద్దా- పోయిన సంక్రాంతి జ్ఞాపకాలు కదుల్తున్నాయి. అదే చివరి సంక్రాంతి, ఎన్నో రకాలుగా, ఎందరికో.
రాజేందర్ సింగ్ బేడీ నవల పూర్తయింది. బాగా రాసాడు. అయితే అందులో అతను కన్పరిచిన modern implications తెలిస్తే మరీ బావుంటుంది. అవేమీ తెలియనివాళ్ళకి ఒక చక్కని గ్రామీణ వాతావరణపు కథ రాసాడనిపిస్తుంది.. కొన్ని చోట్ల మరీ బాగా రాసాడు.
పిల్లలూ, భద్రం, అమ్మా, నాన్నగారూ.. ఈసారి పండగ బాగా జరగలేదని ఎట్లా అనుకోను? పాతని ఒదులుకోలేకపోతున్నాను, అంతే. కాని నేనే ఏమిటి? ఇంత దూరం వచ్చీ నాన్నగారే ఇంకా ఆ పాతఛాయల్నుంచి ఒదుల్చుకుని రాలేకపోతున్నారు.
16-1-1986
రాజమండ్రి వచ్చేసాను. మధాహ్నానికి కాస్త అవస్థపడి గానీ చేరలేకపోయాను. వచ్చేసరికి ఆఫీసులో ప్రసాద్. విజయకుమార్ అతనూ కలిసి అనకాపల్లి రమ్మని బలవంతం. కానీ వెళ్లగలనా? ఆ మాటే చెప్పాను. Physical గా, mental గా ఎక్కడికీ కదిలే స్తితిలో లేనని. భీమ్లీ కూడా వెళ్తారుట. వాళ్ళందరితో కలిసి భీమ్లీ వెళ్ళడం గొప్ప అనుభవం అవుతుంది. కాని వెళ్లలేను. వాళ్ళతోనే కాదు, ఎవరితోనూ కూడా. ఈసారి ప్రసాద్ తో spend చెయ్యడానికే కుదర్లేదు. కానీ అతని ఉల్లాసానికి నా company అంత బాగుంటుందనుకోను…
తమ్ముడు, బాలసుబ్రహ్మణ్యం కలిసారు. బా- హెర్మన్ హెస్ కథలు ఇస్తాను, చదవమన్నాడు. హెన్రీ మిల్లర్ ని అతనిచ్చి చాలా కాలం అయినా ఇంకా మొదలు పెట్టలేదు. ఇంక అన్ని కార్యకలాపాలకీ స్వస్తి చెప్పి యింట్లో కూచొని పాటలు వింటూ పుస్తకాలు చదువుకుంటూ వుండాలని గట్టిగా అన్పిస్తోంది. నా గూట్లోకి వెళ్ళిపోవాలన్న బలమయిన urge.
17-1-1986
ఎందుకో మరీ వికలంగా ఉంది ఇవ్వేళ. ఏమయినా చెయ్యాలని అన్పించింది గాని ఏమీ చెయ్యలేదు. చాలా leisurely గానే గడిపేసాను. ఇట్లా ఉదయాలు, దినాలు, సాయింత్రాలు, రాత్రులు గడిచిపోతుంటాయి. ఏవో ఆనందాలు, అద్భుతమైన సౌందర్యాలు దూరం నుంచి తెలుస్తుంటాయి గాని, – అశక్తులం, ఏమీ తెగించలేం, చెయ్యలేం.
అన్పిస్తూ వుంటుంది అప్పుడప్పుడు, యీ distress కూడా నిజమయిన బాధ కాదేమోనని. కాకపోవచ్చు కూడా. అసలయిన బాధ నిజానికి ఏమీ లేకపోవడమే. శూన్యం, వెలితి, ఆ వెలితికి, దాన్నుంచి వచ్చే అసంతృప్తికి కారణాలేమిటో ఇంకా విచారించుకోవాల్సే వుంటుంది. కాని అసలు కారణాలెప్పుడూ conscious state లో బయటపడవు. ఏ remote dream లోనో చటుక్కున బోధపడి తెలిసేలోగా మర్చిపోయేట్లుగా జారిపోతుంది. మనం కూడా తెలుసుకునే ప్రయత్నాలు చెయ్యం.
అందుకే, ఏదన్నా బాధపెట్టినా మాటిమాటికీ ఆ సన్నివేశాన్నో, ఆ బాధనో, ఆ క్షణాల్నో తడుముకుని బాధపడటం తప్ప లోతుకి చూడాలని ప్రయత్నించము. ఎప్పుడో చటుక్కున ఆ links వూడి మంచులాగా ఆ బాధంతా కరిగిపోతుంది. మాయ చెదిరిపోవడం అంటే అదేనా? చిన్ని చిన్ని బాధల్నే అట్లా చటుక్కున మర్చిపోయినప్పుడు అంత హాయి కలుగుతుంటే, మరీ యీ రూపంలేని, పేరు తెలియని మహాబాధ అంతా తొలిగిపోయినప్పుడు ఎట్లా ఉంటుంది? అసలది తొలగిపోవడమంటూ వుంటుందా? అది possible అన్న నమ్మికతోనే రోజుల్ని గడుపుతూండటం మాత్రం తప్పదు.
13-10-2022
Profound!
కారణం తెలీని దిగులు ఒకప్పుడు మీకూ ఉండేదనుకోవడం నాకింకా నమ్మశక్యంగా లేదు. గాంధి సత్యశోధనలో ఇలాంటి లోపలి కల్లోలాలు చదివాక, వాటిని ఒక్కొక్కటిగా ఆయన గెలవడం చదివాక, నాకూ గొప్ప బలమొచ్చినట్టు ఉండేది. సీతావియోగ వేళ రాముడి మాటలు చదివాకా- దానిని ఎట్లా దాటుకున్నాడన్నది నన్ను పట్టి కుదిపిన విశేషం.
మీ డైరీ చదువుంటే కూడా అలాంటి ఉద్వేగమే ఉంది..తరువాత ఏం చేశారు. నేను టైంలైన్ వేసుకోవాలి – కానీ, మీరు మధ్యలో, ఒక ఎనిమిదేళ్ళ పాటు కవిత్వం రాయలేదు. అది ఈ కాలమేనా? రాయకుండా ఎలా ఉన్నారు? ఈ కాలాన్ని దాటించినదెవరు? ఏమిటి?
Eagerly waiting for the next day!
మీ స్పందన చాలా సంతోషం కలిగించింది. అయితే మీకు ఏమి జవాబు రాయాలా అని నిన్నటి నుంచి ఆలోచిస్తున్నాను..
ఈ డైరీ షేర్ చేయాలా వద్దా అనుకున్నప్పుడు ఇప్పటి యువతరానికి దీంతో ఎంతో కొంత కనెక్ట్ అయ్యే అవకాశం ఉందనిపించింది. అందుకని షేర్ చేశాను. మీ స్పందన దాన్ని బలపరిచింది. థాంక్యూ వెరీ మచ్. 😀