
(ఆ మధ్య రాజవొమ్మంగి వెళ్ళినప్పుడు అక్కడ పుస్తకాల్లో నా పాత డైరీ ఒకటి దొరికింది. 1986 లో రాసింది. రాజమండ్రి డైరీ. ఆ డైరీ గాంధీ డైరీ. సాహితీవేదికలో మేము తమ్ముడు అని పిలుచుకునే యెల్లేపెద్ది హనుమంతరావు నాకు కానుకగా ఇచ్చాడు. అ డైరీలో మొదటిపేజీల్లో Importance of Diary అని గాంధీరాసిన చిన్న రైట్ అప్ ఉంది. అందులో ఈ వాక్యాలు అప్పుడు నేను అండర్ లైన్ చేసుకున్నట్టుగా కనిపిస్తున్నాయి:
Once we regularly start writing, we ourselves will know what to write and how.
Control in the form of diary helps in self-purification.
కాని ఆ డైరీ అన్ని నెలలూ రాసింది లేదు. కొన్ని నెలల్లో, కొన్ని రోజులు మటుకే రాసుకున్నాను. ఇప్పుడు ఆ పేజీలు మళ్ళా ఆసక్తిగా చదివాను. అప్పుడు నా ఆలోచనలు ఎలా ఉండేవో గుర్తుతెచ్చుకుందామని చదివాను.
అప్పుడు నాకు 23 ఏళ్ళ వయస్సు. ఆ ఏడాదే నా మొదటి కవితా సంపుటి నిర్వికల్పసంగీతం తీసుకొచ్చేను. ఆ ఏడాదే గ్రూపు 1 పాసయి ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ మరుసటి ఏడాదే గిరిజన సంక్షేమ శాఖలో ఉద్యోగం వచ్చి రాజమండ్రి వదిలిపెట్టేసాను.
ఆ డైరీలో అన్నిటికన్నా నాకు ఎక్కువ ఆసక్తిగా తోచింది, ఆ మనుషులూ, ఆ బృందజీవితం. రాజమండ్రిలో, కాకినాడలో, రాజవొమ్మంగిలో మూడు ప్రపంచాలు. ఆ మూడు ప్రపంచాల మధ్యా తిరుగుతూ, కొంతసేపు ఉత్సాహంగా, కొంతసేపు నిరుత్సాహంగా, కాని ఏదో చెప్పలేని దిగులుతో.
ఒక కొత్త ఆశతో ఒక కొత్త బరువుతో
ఒకడనే పడిపోదును
శూన్యమున ఒకడనే కృశియింతును
అని భావకవి పాడుకున్న వేదననో లేదా అస్తిత్వవాదులు చెప్పే angst నో తెలియదుగాని, ఒక చెప్పలేని వేదన, ఆ రోజులన్నిటా, ఆ రాత్రులన్నిటా గోదావరితో పాటు ప్రవహిస్తూ ఉండటంకనిపించింది.
ఆ మధ్య జపనీస్ హైకూ కవి బషో యాత్రాకథనాల్ని అనువదిస్తున్నప్పుడు ఆయన దినచర్య కూడా ఒకటి అనువదించాను. ఆయన కొన్నాళ్ళు క్యోతో శివార్లలో ఉన్న ఒక మిత్రుడి భవంతిలో ఉన్నాడు. ఆ భవంతి పెర్సిమోన్ చెట్లతోటలో ఉంది. రోజువారీ నగర జీవితం నుంచి దూరంగా ఉండవచ్చునని బషో అక్కడికి వెళ్ళాడుగానీ, ఆయన అక్కడ ఉన్నన్నిరోజులూ మిత్రులు వస్తూపోతూనే ఉన్నారు. కవి ఎవర్నైనా వదులుకోగలడుగాని మిత్రబృందాన్ని వదులుకోవడం కష్టం.
నా రాజమండ్రి డైరీలో ఆ సాహిత్యచర్చలు, ఆ పుస్తకాలు, ఆ స్పర్థలు, ఆ మనస్పర్థలు వాటిని దాటి ఆ బృందగానంలోని సంతోషం మీకు నచ్చుతుందేమో అనుకుంటూ కొన్ని పేజీలు రెండు మూడు వారాలపాటు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను.)
~
10-1-1986
attachments ని ఎవరు మాత్రం కావాలని బలవంతాన తెంపుకుంటారు?- ఇట్లాంటి వాక్యాలు నాలంటి morbid soul ని ఎంతగా కలవరపరుస్తాయని! కాని సంగతల్లా ఒక్కటే, సంబంధాల్లో తప్పనిసరి అయిన వియోగం గురించో, ఇతర true relations గురించో ఏ మాత్రమో తెలిసి ఉండటం వల్ల, ఒక్కొక్కప్పుడు నేను కనపరిచే అనాసక్తత-ఇదేమన్నా కలతపెట్టి వుండాలి. కాని నా ఆంతర్యం తెలిస్తే ఆ indifference వెనుక ఎంత క్షోభ ఉంటుందో గ్రహించకపోదురా?
ఇట్లా కొనసాగుతూ ఉంటుంది. అంతే. ఇట్లానే జీవితం కడదాకా ఇదే శ్రుతి. ఇదే చీకటి. ఇదే నిరీక్షణ. నిరీక్షణ ఫలిస్తుందనిగాని, ఫలించదని గాని చెప్పలేని-ఇదే అనిశ్చయత.
11-1-1986
కలలుగన్న కాలం ఒకటుండేది. కాని అది అద్రుశ్యమయిపోయింది. ఒక్కసారిగా కాదు, చిట్లిపోయిన ఒక్కొక్క కలతో కలలుగనే పసితనమూ అయిపోయింది. ఇప్పుడు వున్న రూపం వేరు, స్వభావం వేరు.. ఉన్న రూపాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ ప్రయత్నంలో మన స్వభావమూ మారిపోతూ వుంటుంది. ఇలా తెలిసి కొంతా, తెలియక కొంతా చాలా దూరం ప్రవహించేక ఇంక ఒక్కసారి దాటి వచ్చిన దేశాల గురించి ఆలోచిస్తే ఎట్లా వుంటుందని?
రాత్రి ఎప్పుడో గోపీచంద్ కి రాసిన ఉత్తరం చదివాను. అది నన్ను బాధపెట్టిన మాట వాస్తవమే. కాని ఏ కోణంలోంచి బాధ పెట్టిందో స్పష్టంగా చెప్పలేను. అది గోపీచంద్ కి రాసిన ఉత్తరం అనిపించలేదు, కాని ఈ mortification ఇంత త్వరగా జరిగిపోయిన వెనుక మిగిలేది ఏమిటన్నదే అర్థం చేసుకోలేకపోతున్నాను.
12-1-1986
మళ్ళీ ఆవరిస్తూ sickness.
విదుల్చుకునే ప్రయత్నాలు చేస్తూ మరింత మరింత పుంజుకుంటున్నాను. ఒదుల్చుకునే ప్రయత్నాలు నిజమా లేక నటనా అన్న సందేహం కలుగుతూ వుంటుంది.
కాకినాడ వెళ్దామనుకున్నాను గాని, వెళ్ళలేకపోయాను. రోజంతా బుక్ ఫెయిర్ లోనే. తమ్ముడికి సాయపడుతూ. వెదర్ లో మార్పు వచ్చింది. తుపాను ఏదో కమ్మినట్లుంది. మధ్యాహ్నం ఆ చలిలో
శాంతినివాస్ లో భోజనం. సాయంకాలం లిటరరీ క్విజ్ నిర్వహించాను. మంచి రెస్పాన్స్ వచ్చింది.
రాత్రి దిగుల్లో పీకలదాకా మునిగి ముఖేష్ ని విన్నాను. నా నెత్తిమీద సిగరెట్ పొగ. అశ్రువుల్తో నిండిపోయింది ఈ జీవితరహదారి.. నేను రాసాను, అతను పాడాడో, అతను రాస్తే నేను పాడానా?
13-1-1986
పండగ రోజు. అయినా రాజమండ్రిలోనే ఆఫీసులోనే గడిచిపోయింది. బుక్ ఫెయిర్ లో లాస్ట్ డే. అయిదు రోజులూ గడిచిపోయాయి. ఇదివరకటి మనుషులూ, సందడీ అంతగా లేవు. అయినా ఈ ఏడాది ఉత్సాహం మరోవిధంగా వుంది. ఇవాల్టితో ఇంక కార్యకలాపాల్నుంచి విరామం దొరికినట్టే. గోపీచంద్ కూడా యీ అయిదురోజులూ ఒదులుకోలేకపోయాడు.
తొమ్మిదింటికి హడావిడిగా ఆఫీసుకి వస్తూ వుంటే దారి పొడుగునా ఆరిపోతూన్న భోగిమంటలు. ఇలా ఈ రోజు గడుస్తుందని వూహించానా? మధ్యాహ్నం మల్లాప్రగడ రామారావుగారు వారి శ్రీమతితో ఆఫీసుకి వచ్చారు. రాత్రి వాళ్ళింట్లో భోజనం చేస్తానని చెప్పాను.
ఎక్కడో తెగిపోయింది నిశ్చయంగా తెగిపోయిందే. అయితే sickmind దాన్ని realize చేస్తూంటుందిగాని confirm చేసుకోదు. ఒప్పుకుని తీరేదాకానే అసలయిన దుఃఖం. ఆ తర్వాత మిగిలేది శూన్యమే.
13-10-2022