
ప్రాచీన ప్రపంచం అంటే చరిత్ర పూర్వయుగాలానాటి ప్రపంచం, పాతరాతియుగం నాటి ప్రపంచం, అంతకన్నా ప్రాచీన కాలానికి చెందిన ప్రపంచం. కవిత్వం పుట్టింది ఆ కాలంలో. చిత్రకారుడు కూడా ఆ కాలంలోనే పుట్టాడు. మనిషిలోని నటుడు, నర్తకుడు, ఆరాధకుడు, తొలి భిషక్కు కూడా ఆ కాలాల్లోనే పుట్టాడు.
గత రెండువందల ఏళ్ళుగా యూరోపు తాను ప్రపంచానికి కేంద్రంలో ఉన్నానని భావిస్తూ, చరిత్ర, సాహిత్యం, సంస్కృతి, తత్త్వశాస్త్రం తనతోనే మొదలయ్యాయని నమ్ముతూ ఉండగానే మరొక పక్క, మానవశాస్త్రజ్ఞులు, పరిశోధకులు, పురాతత్త్వవేత్తలు, జానపద విజ్ఞానవేత్తలు యూరోపు కి ఆవల ఆసియా, ఆఫ్రికా, అమెరికా, ఆస్ట్రేలియా ఖండాల్లోనూ, మహాసముద్రాల మధ్య ఒంటరిగా ఉన్న ద్వీపాల్లోనూ సుసంపన్నమైన సంస్కృతుల్ని, సాహిత్యాల్ని కనుగొంటూ వచ్చారు. వారు కొత్త ద్వీపాన్ని కనుగొన్న ప్రతిసారీ, కొత్త భాషని కనుగొన్నప్రతిసారీ, పురావస్తు అవశేషాలు, ఒక మట్టిపెంకు, ఇక ఓరకిల్ బోన్, ఒక కూనిఫాం టాబ్లెట్ ని కనుగొన్న ప్రతిసారీ ప్రపంచం ఉలిక్కిపడుతూనే ఉంది.
ఆ పరిశోధనల సారాంశంగా యూరోపు ప్రపంచానికి ఏమని చెప్తూ వచ్చిందంటే, మానవచరిత్రలో క్రీస్తుకు పూర్వం 5000 నుండి 3000 ఏళ్ళ మధ్యకాలంలో కొత్తరాతియుగం నుంచి మానవుడు కాంస్యయుగానికి పరివర్తన చెందాడనీ, ఆ కాలంలో ప్రపంచంలోని కొన్ని నదీతీరాల్లో ఉజ్జ్వలమైన తొలినాగరికతలు విలసిల్లాయనీ, ఆ నాగరికతల్లోనే మొదటిసారిగా అత్యున్నత స్థాయి సాహిత్యం ప్రభవించిందనీ. సుమేరియన్, అక్కాడియన్, అసీరియన్, బాబిలోనియన్, ఈజిప్షియన్ నాగరికతలతో పాటు భారతదేశంలో సింధునదీ తీరంలోనూ, గంగా-యమునా పరీవాహక ప్రాంతంలోనూ, చైనాలో హొయాంగ్ హో, యాంగ్ సికియాంగ్ నదీతీరాల్లోనూ వర్ధిల్లిన నాగరికతలే తర్వాత రోజుల్లో మానవప్రస్థానానికి మొదటిమజిలీలని చెప్తూ వచ్చారు.
మరొకవైపు ప్రపంచమంతటా కూడా అంతకన్నా ప్రాచీనమైన కాలంలో మానవుడు పాడుకున్న పాటలూ, చెప్పుకున్న కథలూ, వేసుకున్న చిక్కుప్రశ్నలూ కూడా బయటపడుతూన్నప్పుడు వాటిని primitive song అనీ, oral literature అనీ, folklore అనీ పిలుస్తూ వాటిని కూడా అధ్యయనం చెయ్యడం మొదలుపెట్టారు. అయితే చాలాకాలం పాటు శాస్త్రవేత్తలూ, సాహిత్యవేత్తలూ కూడా primitive literature ని classical literature నుంచి వేరుచేసి చూపడానికి వాటిమధ్య ముఖ్యమైన తేడాల్ని గుర్తుపట్టే క్రమంలో ఆదిమగీతాలు అత్యంత సరళసాహిత్యమనీ, అవి మానవ సంస్కృతిలోని శైశవ అవస్థని ప్రతిబింబిస్తాయనీ, కాంస్యయుగంలోని అత్యున్నత సంస్కృతుల్లో కనబడే సంక్లిష్టత, సుసంకృత సాహిత్య శిల్పం వాటిలో కనబడవనీ చెప్తూ వచ్చారు.
కాని 1960 లనుంచీ ఈ ప్రతిపాదనలు పెద్ద కుదుపుకి లోనయ్యాయి. లెవి స్ట్రాస్ లాంటి మానవశాస్త్రజ్ఞులు స్ట్రక్చరలిజం పేరిట పరిచయం చేసిన ఆలోచనాధోరణి ఆదిమజాతుల పట్ల మన అభిప్రాయాల్ని ప్రశ్నించడం మొదలుపెట్టింది. అసలు primitive అనే మాటనే అర్థంలేని మాటగా మారిపోయింది. ఆదిమానవుడు నిజంగా ఆదిమమానవుడా? అంటే మనతో పోలిస్తే, అతడి ఆలోచనలు, తార్కికశక్తి, భాషా నిర్మాణ కౌశల్యం, సామాజిక నిర్వహణ మొదలైన రంగాల్లో అతడు మనం భావిస్తున్నట్లుగా శిశుప్రాయుడేనా?
కాదనే చెప్పడం మొదలుపెట్టాయి కొత్త పరిశోధనలు. సాహిత్యానికి సంబంధించినంతవరకూ ఆదిమ జాతుల పట్ల మన అవగాహనలో paradigm shift తెచ్చిన పుస్తకంగా జెరోమ్ రోథెన్ బర్గ్ సంకలనం చేసిన Technicians of the Sacred (యూనివెర్సిటి ఆఫ్ కాలిఫోర్నియా ప్రెస్, 1968) నిలబడిపోతుంది. గత రెండు శతాబ్దాలుగా పరిశోధకులు యూరోప్ కి ఆవల ఉన్న సంస్కృతుల్ని అధ్యయనం చేస్తున్నప్పుడు వారికి తారసిల్లిన, లభించిన, వారు సేకరించిన సాహిత్యాల అనువాదాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి రోథెన్ బర్గ్ ఆఫ్రికా, అమెరికా, ఆసియా, ఓషియానియా సాహిత్యాల్ని బట్టి ఒక అలంకారశాస్త్రాన్ని నిర్మించే ప్రయత్నం చేసాడు. తన సంకలనాన్ని ఆ తర్వాత కూడా మరింత విస్తరిస్తూ, ప్రాచీన యూరోప్ సాహిత్యాల్ని కూడా చేర్చి 1984 లో మరొక ఎడిషన్ వెలువరించాడు.
పురాతన మానవ సంస్కృతుల పట్లా, వారి ప్రాపంచిక దృక్పథం పట్లా, వారి సాహిత్యం, ఆరాధనా సంప్రదాయాల పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ రోథెన్ బర్గ్ సంకలనం ఒక కానుక. దాన్ని అతడు రాబోయే కాలాల్లో చేపట్టవలసిన పరిశోధనకూ, తులనాంతక అధ్యయనానికీ మొదటిమాటగా మాత్రమే భావించాడు. తాను సంకలనం చేసిన మౌఖిక సాహిత్యం, దాని పైన అతడు రాసిన సవివరమైన నోట్సు, ‘ఆదిమ’ కవిత్వానికీ, అత్యాధునిక కవితాలకూ మధ్య అతడు కనుగొన్న సారూప్యతలూ మనల్ని నివ్వెరపరుస్తాయి.
తన సంకలనానికి రోథెన్ బర్గ్ 1968 లో, 1984 లో రెండు ముందుమాటలు రాసుకున్నాడు. వాటిలో అతడు చేసిన ప్రతిపాదనలు మనం పురావాజ్ఞ్మయం గురించీ, ‘ఆదిమ ‘సాహిత్యం గురించీ ఇంతదాకా ఏర్పరచుకున్న అభిప్రాయాల కాళ్ళ కింద నేలని కదిపేస్తాయి.
అన్నిటికన్నా ముందు అతడు చెప్పేదేమంటే, అసలు primitive అనే మాట అర్థరహితమే కాక, primitive అంటే simple అనుకోవడంకన్నా మించిన పొరపాటు మరొకటి లేదని చెప్తాడు. ..where poetry is concerned, ‘primitive’ means complex అంటాడు.
‘ఆదిమ కవిత్వం’ ఏకకాలంలో పదం, శబ్దం, అభినయం, ఆరాధన, క్రతువు, వర్ణవిన్యాసం, ఉచ్చాటన, సమస్తం. మనం ‘ఆదిమ’ గీతాలు పేరిట సేకరిస్తున్నవీ, అనువదించుకుంటున్నవీ వాటిలోని కొన్ని మాటల్ని మాత్రమే అంటాడు. ‘ఆదిమ’ గీతం energy+intelligence అంటాడు. ఆ రెండింటినీ కలిపే మనం తర్వాత రోజుల్లో ఇమేజినేషన్ అనీ, విజన్ అనీ వ్యవహరిస్తున్నాం అని కూడా అంటాడు. తమకి కలుగుతున్న ఉత్తేజాన్ని, తమని సంచలింపచేస్తున్న శక్తిని ఒక గీతంగా మార్చడంలో ‘ఆదిమ’ గాయకుడు అనితర సాధ్యమైన సాంకేతిక ప్రజ్ఞను కనపరిచాడనీ, అందుకని తాను ‘ఆదిమ’ కవుల్నీ, గాయకుల్నీ technicians గానే భావిస్తాననీ, వారు ప్రధానంగా technicians of the sacred అనీ అంటాడు.
1984 లో రాసిన ముందుమాటలో మరికొంత ముందుకి వెళ్లి, అసలు ఆదిమ గీతాలు సమష్టి కర్తృత్వం, అక్కడ ఒక వ్యక్తి కవి లేడనే అభిప్రాయాల్ని కూడా ఖండిస్తాడు. ఆదిమకాలంలో జాతులు సమష్టిజీవితం జీవిస్తున్నప్పుడు వారి అవసరాలకు కవులు విడివ్యక్తులుగా వారికి కవిత్వం సమకూర్చినట్టుగా సాక్ష్యాధారాలు లభ్యమవుతున్నాయని చెప్తాడు. అలాగే కవిత్వం reflective కావడం, self-conscious కావడం మనం ఇంతదాకా ఆధునిక యుగ లక్షణాలుగా, అవి ఐరోపానుంచి మొదలయినట్లుగా భావిస్తున్నాం. కాని రోథెన్ బర్గ్ ఆ అభిప్రాయం కూడా తప్పని చెప్తాడు. మానవసంస్కృతులు తొలినుంచీ ప్రపంచవ్యాప్తంగా పర్యావలోకన స్వభావాన్ని చూపిస్తూనే ఉన్నాయని చెప్తాడు.
ఆదిమ సంస్కృతులు యథాతథవాదాన్ని నమ్మాయనీ, స్థిరంగా ఏవో కొన్ని విశ్వాసాలకు కట్టుబడిపోయే జీవించాయనీ, మార్పుని వ్యతిరేకించాయనీ అనుకునే అభిప్రాయం కూడా తప్పంటాడు రోథెన్ బర్గ్. హెరాక్లిటస్ చెప్పినట్టుగా ఈ ప్రపంచంలో మార్పు చెందని దేదైనా ఉంటే, అది మనిషిలో మార్పు చెందాలన్న కోరిక ఒక్కటే అంటాడు.
ఏథెన్సులో అరిస్టాటిల్ ప్రతిపాదించిన పొయెటిక్స్ కన్నా ఎన్నో మహాయుగాలకు ముందునుంచే ప్రపంచవ్యాప్తంగా ఆదిమజాతులకొక కావ్యాలంకార శాస్త్రం ఉందని మనం రూఢిగా చెప్పవచ్చునని కూడా అంటాడు.
ఫ్రాంజ్ బోవాస్, పాల్ రాడిన్, సి.ఎం.బౌరా, రాబర్ట్ రెడ్ ఫీల్డ్ వంటి యాంత్రొపాలజిస్టుల్నీ, జోసెఫ్ కాంప్ బెల్ వంటి మైథాలజిస్టుల్నీ, ఇప్పుడు జెరోమ్ రోథెన్ బర్గ్ ని చదివితే ప్రాచీన మానవుడి గురించి మనకి తెలిసేది ఇదే:
ఆ కాలంలో భూమి ఖండాలుగా విడిపోలేదు. అసలు భూమీ, ఆకాశమూ అని కూడా విడిపోలేదు. అప్పుడు కంటికి కనిపించే దిగ్వలమంతా భూమినే. అదంతా ఒకే తల్లి. అమ్మతల్లి. అప్పుడు మనిషి తనలోంచి ఒక మహాశక్తిని ఆవాహన చేసుకున్నాడు. ఆ ప్రథమ క్షణాలు, తను ఏకకాలంలో వ్యక్తిగానూ, గణంగానూ, సమస్త పృథ్విగానూ ఉండే క్షణాలు, ఆ క్షణాల్లోని ఎల్లల్లేని ఆ ఐక్యభావన, తాను ‘అవిభక్త కుటుంబీ, ఏకరక్త బంధువు’ అని స్ఫురించిన ఆ క్షణాలు, అవే తొలిమానవుడి సైన్సు, దర్శనం, కవిత్వం.
అనంతర కాలాల్లో భూమీ, ఆకాశమూ విడిపోయేక, నగరాలు పుట్టుకొచ్చేక, రాజ్యాలూ, పురోహితులూ, బానిసలూ అంటో మానవసమాజం విడిపోవడం మొదలయ్యేక, ఆ తొలికాలాల్లోని ఆ ఏకకుటుంబస్మృతి మనిషి అవ్యక్తమానసంలో కదలాడినప్పుడు, తిరిగి ఆ మళ్ళా ఆ రోజుల కోసం తపించడంలోంచే వ్యాసవాల్మీకులు, ఈజిప్షియన్, సుమేరియన్ కవులూ, హీబ్రూ ప్రవక్తలూ, కన్ ఫ్యూసియస్, హోమర్ లు పుట్టుకొచ్చారు. బేబెల్ గోపురం కూలిపోయి అసంఖ్యాకమైన భాషలు చెల్లాచెదరుగా ప్రపంచమంతా వ్యాపించాక, ప్రతి భాషలోనూ, ఆ భాషాపూర్వస్థితిలోని మానవహృదయస్పందనని పట్టుకోవడం కోసమే ప్రతి మహాకవీ తపించడం మొదలుపెట్టాడు.
రోథెన్ బర్గ్ సంకలనం మనకి ఒక నమూనా. అందులో ఆ చరిత్రపూర్వయుగాల, చరిత్ర తొలియుగాల మానవహృదయస్పందనలు కొట్టుకుంటూ ఉండటం మనం గమనించవచ్చు. ఆ కవితలు ఇప్పుడు మనతో ఒక స్వప్నలిపిలో మాట్లాడుతుంటాయి.
ఆ సంకలనం నుంచి రెండు మూడు ఉదాహరణలు మీకోసం, నా తెలుగులో. చదువుతుంటే, ఆధునిక ఫ్రెంచి సర్రియలిస్టు కవితలు చదువుతున్నట్టు అనిపిస్తే, ఆశ్చర్యం లేదు.
1
పుట్టుక
మావోరి, న్యూజీలాండ్
మాట ఫలిస్తుంది
అది మిణుకుమిణుకుమంటున్నదాన్ని గుర్తుచేసుకుంటుంది
అది రాత్రిని బయటికి లాగుతుంది.
గొప్ప రాత్రి, దీర్ఘరాత్రి
క్షుద్రరాత్రి, మహారాత్రి
అనుభవిస్తే తప్ప తెలియని దట్టమైన రాత్రి
తాకి చూడవలసిన రాత్రి, కంటికి కనిపించని రాత్రి
ఆ రాత్రి అలానే కొనసాగుతుంది
మృత్యువుతో అంతమయ్యే రాత్రి.
2
ఇళ్ళు జీవించి ఉన్నప్పుడు
ఎస్కిమో
ఒక రాత్రి ఒక ఇల్లు ఉన్నట్టుండి నేల మీంచి పైకి లేచి గాల్లో తేలుకుంటూ వెళ్ళింది. అంతా చీకటి. అది అలా వెళుతుంటే దానికి ఏదో చప్పుడు బుసకొట్టినట్టుగా వినిపించింది. అది ఇంకా బాట చివరికి చేరుకోకముందే మనుషులు దాన్ని ఆగిపొమ్మని అడుక్కోవడం మొదలుపెట్టారు. అది ఆగిపోయింది.
అది ఆగిపోయినప్పుడు వాళ్ళ దగ్గర మైనం లేదు. అందుకని వాళ్ళు అప్పుడే కురుస్తున్న ఇంత మంచు తీసుకుని దీపాల్లో చమురుగా పోసారు, అది వెలగడం మొదలుపెట్టింది.
వాళ్ళు ఊరి చివరకు చేరుకున్నారు. ఒక మనిషి ఆ ఇంటికి దగ్గరకొచ్చి ‘ చూడండి, వాళ్ళు మంచుతో దీపాలు వెలిగిస్తున్నారు. మంచు కూడా మండుతుందన్నమాట అన్నాడు.
ఆ మాటలు అన్నాడో లేదో దీపాలు ఆరిపోయేయి.
3
గొంగళిపురుగును పెళ్ళి చేసుకున్న మహిళ
హవాయి, పోలినేషియా
కుముహెయా ఒక రాత్రి-గొంగళిపురుగు. అది ఒక స్త్రీని ప్రేమించింది. పగలనే మగవాడి దేహంతో అమెను పెళ్లి చేసుకుంది, అందమైన పెద్ద మగ గొంగళిపురుగు, రాత్రవగానే చిలగడ దుంపల పొలాలమీద పడిమేస్తుండేది. బాగా మేసి మేసి ఉబ్బిన దేహంతో తెల్లవారగానే ఇంటికొచ్చేది. మెత్తగా, వదులుగా కుముహెయా. రాత్రంతా ఆమెకి తిండి ఉండేది కాదు,. ‘అతడు రాత్రిళ్ళు ఎక్కడికి వెళ్తున్నాడు’ అడిగాడు ఆమె తండ్రి. ‘రాత్రుళ్ళు అతడు ఎక్కడికి పోతున్నాడు’ అడిగింది జనపనార. అతడి భార్య అతడికి నారతగిలించింది. అతడు బయటికి పాకగానే నార చిరచిరమంది. రాత్రి- గొంగళిపురుగుకి కోపమొచ్చింది. అతడు చుట్టూ ఉన్న మొక్కలమీద విరుచుకుపడ్డాడు. జనమంతా పోయి దేవుడికి మొరపెట్టుకున్నారు. ‘ఈ రాత్రి-గొంగళిపురుగు మాకు తిండిలేకుండా చేస్తోంది. వాణ్ణి వాడి గుహలో పారెయ్యి, వాడు మా తిండి దోచుకుంటున్నాడు’ అంటో మొరపెట్టుకున్నారు. దయకల్గిన దేవుడు ఆ గొంగళిపురుగుని ముక్కలుముక్కలు చేసేసాడు. అప్పణ్ణుంచీ మనం వాణ్ణి ముక్కలపురుగు, ముక్కలపురుగు, ముక్కలపురుగు అంటున్నాం.
12-10-2022
Featured image: Cave paintings of the Lascaux, Courtesy: https://www.bradshawfoundation.com/