ఆ సూర్యకాంతి మరికొంచెం

పాతికేళ్ళ కిందటి మాట. నేను హైదరాబాదు వచ్చిన కొత్తలో. అప్పట్లో ఒకసారి హరిహరకళాభవన్ లో బిమల్ రాయి రెట్రాస్పెక్టివ్ వేసారు. అవి వానాకాలం రోజులని గుర్తు. ‘బందిని’, ‘సుజాత’ లాంటి సినిమాలు చూసి, నగరవీథుల్లో పడెలు కట్టిన రోడ్లమీద విద్యుద్దీపాల కాంతులు మెరుస్తూ ఉంటే, సిటీబస్సు పట్టుకుని ఇంటికి వచ్చిన జ్ఞాపకాలు, వాటిని అల్లుకుని ఏదో అస్పష్టమైన దిగుల్లాంటి సంతోషం. ఆ రోజుల్ని తలచుకుంటే ఆనందం లాంటి విచారం కలుగుతుందని కవి అన్నట్టే.

అటువంటి ఒక సాయంకాలం ఆ థియేటరు పోర్టికోలో ఇద్దరు మిత్రులు పరిచయమయ్యారు. జయసూర్య, లలిత. జయసూర్య మంచి ఫిల్మ్ క్రిటిక్. ఒక సినిమాను ఎలా సమీపించాలో, దాన్లో ఎలా సంలగ్నం కావాలో తెలిసినవాడు. ఆ రోజు వాళ్ళే నా దగ్గరికొచ్చి నన్ను పరిచయం చేసుకున్నారు. మాట్లాడటం మొదలుపెడుతూనే అతడు చెప్పిన మాట: ‘నేనూ, ఆమె ప్రేమించుకుంటున్న కొత్తలో, ఒకరి ఇష్టాలు మరొకరం తెలుసుకుంటున్నప్పుడు, అన్నిటికన్నా ముందు అడిగిన ప్రశ్న. నీకు చినవీరభద్రుడు రాసిన కథలు ఇష్టమా? అని’ అన్నాడు.

ఉలిక్కిపడ్డాను. అప్పటికి నా కథల సంపుటి ప్రశ్నభూమి వచ్చిన మాట నిజమే కాని, ఆ పుస్తకాలు కాకినాడ దాటి ఎక్కడికీ వెళ్ళి ఉండవని నాకు నమ్మకం. బహుశా పత్రికల్లో పడ్డ కథలు, అవి కూడా పట్టుమని పది పదిహేను మించి ఉండవు. కాని ఇద్దరు యువతీయువకులు తమ తొలియవ్వనపు ప్రేమభరితదినాల్లో, సంజె వేళల్లో నా కథల గురించి మాట్లాడుకున్నారన్న ఊహనే నాకెంతో నమ్మశక్యం కాకుండానూ, కానీ, నన్నెంతో పైకితేల్చేదిగానూ, నాకు కొత్త రెక్కలిచ్చేదిగానూ అనిపించింది. ఇప్పుడు ఎప్పుడన్నా బిమల్ రాయ్ అనగానే, వెడల్పైన నుదురుతో, కాటుకపిట్టల్లాంటి కళ్ళతో నూతన్ గుర్తొస్తుంది, ఆ వానాకాలపు సాయంకాలాలు గుర్తొస్తాయి, ఆ రెట్రాస్పెక్టివ్, ఆ పాట ‘ఓ జానెవాలే, హో సకే తో లౌట్ కే ఆనా/యే ఘాట్, తు యే బాత్ కహీన్ భూల్ న జానా ‘, ఆ పోర్టికో లో ఆ సంభాషణ, అపురూపమైన ఆ ప్రేమికులు, అప్పుడు, చివరగా నా మనసు నాకోసం దాచిపెట్టుకున్న మిఠాయిలాగా, ఆ మాట, ‘నీకు చినవీరభద్రుడు రాసిన కథలు ఇష్టమేనా?’

రచయితలకీ, కళాకారులకీ కరతాళధ్వనులు గొప్ప బలాన్నిస్తాయి, సందేహం లేదు, ఎవరో ఎక్కడో కనబడి ‘మీ ఫలానా పుస్తకం చదివాను ‘ అన్నప్పుడో, ‘ఇండియా టుడేలో అరకు మీద రాసిన ట్రావెలాగు నేను కత్తిరించి పెట్టుకున్నాను, ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది’ అని అంటున్నప్పుడో పైకి నిశ్శబ్దంగా, గంభీరంగా, లేదా చిన్న మందహాసంతో తలపంకిస్తున్నప్పటికీ, లోపల మనసు మాత్రం తుళ్ళిపడుతూనే ఉంటుంది. కాని ఆ ప్రశంసలన్నిటికన్నా విలువైన ప్రశంస, ఇద్దరు మిత్రులో, సహచరులో, నీ పరోక్షంలో, నీ రచనల గురించి మాట్లాడుకున్నారని తెలియడం, మాట్లాడుకుంటూ ఉంటారని తెలియడం.

ఇన్నేళ్ళ తరువాత మళ్ళా అటువంటి పులకింత మొన్న లభించింది. వారిద్దరూ మిత్రులు. రిజర్వ్ బాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నతోద్యోగులు. ఒకరు ఢిల్లీలో ఉంటారు. మరొకరు హైదరాబాదులో. ఆ మిత్రుల్లో ఒకరు నాకు మెసేజి పెట్టారు. మేమిద్దరం మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం. ‘మరేమీ లేదు, ఊరికినే, మిమ్మల్ని చూడాలనీ, మీకు థాంక్స్ చెప్పాలనీ’ అంటో.

అన్నట్టుగానే ఆదివారం పొద్దున్నే వచ్చారు. ఒకరు రాజేంద్ర కుమార్, మరొకరు జయకుమార్. ఆ మిత్రులిద్దరూ నాకు కొత్తవాళ్ళుగా అనిపించలేదు. ఎప్పటినుంచో నాకు తెలిసినవాళ్లలాగే అనిపించారు. ఏవేవో మాట్లాడుకున్నాం. వారిద్దరూ నా రచనలు, ఫేస్ బుక్ పోస్టులు, ముఖ్యంగా నా బ్లాగు గురించి మాట్లాడుకుంటూ ఉంటామని చెప్పారు. రాజేంద్ర కుమార్ తాను ఏది చదివినా వెంటనే తన మిత్రుడితో పంచుకుంటూ ఉంటానని చెప్పారు. తెలియకుండానే గంటసేపు గడిచిపోయింది.

ఒక మనిషి జీవితం, ఒక జాతి జీవితం సంస్కృతిగా రూపొందే క్షణాలు ఇవి. మన రోజువారీ జీవితంలో ఎందరినో కలుస్తూ ఉంటాం. ఏదో మాట్లాడుకుంటాం. చర్చలు, వాదోపవాదాలు, గాసిప్ చాలానే నడుస్తాయి. కాని అవేవీ గుర్తుండవు. కానీ, ఇట్లాంటి సమయాలుంటాయి. మనం మాట్లాడుకుంటూ ఉండగా మనకే తెలియకుండా మన సాధారణ ప్రాపంచిక జీవితం ఒక మేఘానికో, ఒక సెలయేటికో, ఒక పూలపందిరికో తగిలి అక్కడే చిక్కుకుంటుంది. మనం అక్కణ్ణుంచి వచ్చేస్తాంకాని, ఎప్పుడో, ఏ మధ్యాహ్నవేళ నిశ్శబ్దంలోనో, ఏ అర్థరాత్రినో దూరంగా కొండమీద ఒంటరి నెలవంకను చూసినప్పుడో, దీర్ఘ ప్రయాణం తర్వాత నగరానికి వస్తున్నప్పుడు ఒకటొకటిగా విద్యుద్దీపాలు వెలుగుతున్నప్పుడో, మనకి ఆ క్షణాలు, మన మిత్రులతో మాట్లాడుకున్న ఆ మాటలు, అప్పుడు తలుచుకున్న ఏదో కవిత, మాటల మధ్యలో పరస్పరం మన విలోకనాల్లో తటిల్లున మెరిసే ఒక మిలమిల- ఇవి గుర్తొస్తాయి. చాలా సంతోషమనిపిస్తుంది. చాలా దిగులుగా కూడా ఉంటుంది.

రాజేంద్ర కుమార్ గారూ, జయకుమార్ గారూ, మనం మళ్ళా మరెప్పటికీ కలుసుకోలేకపోయినా కూడా, మీరు నాకు చాలా దగ్గరగా గుర్తుంటారు. దూషించడమూ, ద్వేషించడమూ తీరికసమయపు వ్యాపకాలుగా మారిపోతున్న కాలంలో మీలాంటి ఇద్దరు మిత్రులు నా రచనల గురించి మాట్లాడుకుంటూ ఉంటారన్న మాట నాకెంత బలాన్నిచ్చిందో చెప్పలేను. అది నాకు చెప్పలేనంత బాధ్యతని కూడా అప్పగించింది.

నేను నా జీవితవృక్షాన్ని బతికించుకోడానికి ఆకాశం నుంచి జీవజలాలు పీల్చుకుంటూ ఉంటాను. మనసుని చెప్పలేని నిరాశ ఆవహించినప్పుడు రకరకాల వెలుగుల్ని గుర్తుతెచ్చుకుంటాను. మరీ ముఖ్యంగా ఈ శరత్కాల ప్రభాతాలు చూడండి. శరత్కాలమనగానే అందరూ వెన్నెల్ని తలుచుకుంటారు. కాని ఈ ప్రభాతాలు ఎంత దివ్యంగా ఉంటాయో నాకు తెలుసు. బూజు దులిపి శుభ్రం చేసిన కిటికీల్లోంచి సూర్యకాంతి మరింత ప్రకాశవంతంగా పడ్డట్టుగా వర్షాలు శుభ్రం చేసి వెళ్ళిపోయిన దిగంతాల్లోంచి పొద్దున్నే మనమీద పరుచుకునే ప్రభాతసూర్యరశ్మి ఎంత ప్రాణప్రదాయకంగా ఉంటుందో. ఈ రోజునుంచీ ఆ సూర్యకాంతిని మరికొంచెం మూటగట్టుకుంటాను, తోటల్లో యాపిల్ చెట్లూ, నారింజచెట్లూ ఈ సూర్యకాంతిని పండ్లుగా మూటగట్టుకున్నట్టు నేను నా పోస్టుల్లో మూటగట్టి మీతో పంచుకుంటాను.

11-10-2022

One Reply to “ఆ సూర్యకాంతి మరికొంచెం”

  1. నేను కూడా నా స్నేహితునితో మీ బ్లాగ్ గురించి, కొన్ని FB పోస్ట్స్ గురించి అప్పుడప్పుడూ మాట్లాడు కుంటామండీ! _/\_

Leave a Reply

%d bloggers like this: