
Image Courtesy: https://en.most-famous-paintings.com
ఎక్కడి పుష్కిన్! ఎక్కడి చినవీరభద్రుడు!
కొన్ని చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అవును. పుష్కిన్ నాకు చాలా ఇష్టమైన కవి. ఆ మాటకొస్తే ఎవరికి ఇష్టం కాడు? రష్యాకి కవిత్వం నేర్పినవాడు. అతడు ఒకసారి తన మిత్రుల ఇంట్లో బసచేసాడు. అక్కడ కొన్నాళ్ళు ఉన్నాడు. ఆ ఇంటిముందు ఒక సైప్రస్ చెట్టు ఉండేది. ఒక కోకిల రోజూ ఆ చెట్టుమీదకు వచ్చి వాలేదట. పుష్కిన్ అక్కడ ఉన్నన్నాళ్ళూ ఆ కోకిల రోజూ ఆ చెట్టు మీద వాలేది. అక్కణ్ణుంచి పుష్కిన్ వెళ్ళిపోయాక కూడా ఆ కోకిల కొన్నాళ్ళు పాటు ఆ చెట్టుమీద వచ్చి వాలుతూనే ఉండేదట. కవిని కోకిల ప్రేమించిన ఈ కథ నా మనసులో నాటుకుపోయింది.
నేను విజయవాడలో ఉండగా ఒక రోజు పొద్దున్నే బస్ స్టాండ్ కు వెళ్ళినప్పుడు ఇంకా తెల్లవారకుండానే కోకిల నా వెనక గొంతెత్తి కూస్తూ ఉండటం వినిపించింది. ఇంటికి రాగానే ఈ కవిత రాసాను:
కవి, కోకిల
ఒకప్పుడు యువకవి పుష్కిన్
కొన్నాళ్ళు ఒక చోట విడిది చేసాడట
ఆ ఇంటిముందొక సైప్రస్ చెట్టు,
అక్కడున్నన్నాళ్ళూ
అతడా చెట్టుకిందనే కూచునేవాడట,
తోడుగా కొమ్మల్లో ఒక కోకిల.
కొన్నాళ్ళకు పుష్కిన్
అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు,
ఆ కోకిల మాత్రం
ఆ తర్వాత కూడా చాన్నాళ్ళ పాటు
ఆ కవికుమారుడి కోసం
ఆ చెట్టు మీద వాలేదట.
మరి ఇదేమిటీ కోకిల!
నేనెప్పుడో మా ఊరు వదిలిపెట్టేసినా
నా వెనకే వస్తుంది!
చివరికి విజయవాడ బస్టాండుకి కూడా.
కానీ, ఊహించలేదు, ఒకరోజు ఈ కవిత గురించీ, పుష్కిన్ గురించీ, నా గురించీ, కోకిల గురించీ ఒక మిత్రురాలు నేరుగా రష్యన్ మిత్రులముందే ముచ్చటిస్తారని!
థ్రిల్లింగ్ గా అనిపించింది. ఒకప్పుడు మిత్రుడు చోరగుడి ఉపేంద్రనాథ్ నా మోహన రాగం ప్రసంగాలు టాంజానియోలో కిలిమంజారో పర్వతం మీద పెట్టుకు విన్నానన్నప్పుడు ఎంత పులకింతగా అనిపించిందో ఇప్పుడు కూడా అంతే పులకింత.
మిత్రులు స్వాతిగారు చెన్నై లో ఉంటారు. ఒకసారి చెన్నైలో నేను చలంగారి మీద ప్రసంగిస్తే మర్నాడు పత్రికల్లో చాలా చక్కటి సమీక్ష వచ్చింది. నా ప్రసంగ సారాంశాన్ని అంత బాగా ఎవరు పట్టుకున్నారా అని చూస్తే ఆమె స్వాతి గారు. ఆ తర్వాత ఫేస్ బుక్ స్నేహితులయ్యారు. మంచి కవి. థాంక్యూ స్వాతి గారు! నా కవిత నేరుగా పుష్కిన్ విన్నట్టే అనిపించింది మీరు రష్యన్ మిత్రులకి ఆ కవిత గురించి చెప్తుంటే!
10-10-2022
Featured image: Alexander Pushkin at Seashore, Wikicommons courtesy.