ఇషయ్యా-2

Reading Time: 4 minutes
Prophet Isaiah, Marc Chagall, 1968

ఇషయ్యా గ్రంథం రెండవ, మూడవ భాగాల్లో చారిత్రిక సంఘటనలు మొదటిగ్రంథంలో ఉన్నంత స్పష్టంగా కనిపించవు. కాని రెండవ గ్రంథం క్రీ.పూ. 605 నుంచి 539 మధ్యకాలానికి చెందిన చారిత్రిక నేపథ్యం లోంచి మాట్లాడుతున్నట్టుగా చరిత్రకారులు గుర్తుపట్టారు.

ఏడవశతాబ్దం ముగిసి ఆరవ శతాబ్దం మొదలయ్యేటప్పటికి అసీరియన్ సామ్రాజ్యం బలహీనపడి ఆ స్థానంలో బేబిలోన్ బలపడటం మొదలయ్యింది. క్రీ.పూ 586 లో బేబిలోన్, పర్షియాతో కలిసి యూదా మీద దండెత్తి యెరుషలేం దేవాలయాన్ని ధ్వసం చేసింది. ఆ రోజుల్లో అసీరియన్లు, బేబిలోనియన్లు మొదలైనవాళ్లు తాము ఒక ప్రాంతాన్ని జయించినప్పుడు అక్కడ మళ్ళా తిరుగుబాటు తలెత్తకుండా ఒక క్రూరమైన పద్ధతి పాటించేవారు. అదేమిటంటే తాము ఏ ప్రాంతాన్ని జయించారో ఆ ప్రాంతంలో ఇంకా బతికి ఉన్న ప్రథమశ్రేణి నాయకుల్ని అక్కణ్ణుంచి తీసుకుపోయి దూరప్రాంతంలో వదిలిపెట్టేవారు. అంటే ఒక రకమైన ద్వీపాంతరవాస శిక్ష అన్నమాట. వారి స్థానంలో ఆ ప్రాంతంతో సంబంధంలేని వేరే ప్రాంతాల నుంచి ప్రజల్ని తెచ్చి వదిలిపెట్టేవాళ్లు. ఇలా కొత్తగా అక్కడికి తీసుకురాబడ్డ ప్రజలకి ఆ ప్రాంతం పట్ల ఎలాంటి మమకారమూ ఉండదు కాబట్టి, వాళ్లల్లో జాతీయభావాలు అంకురించవు, వాళ్లు రేప్పొద్దున్న తమ మీద తిరుగుబాటు చెయ్యరని ఆ రాజ్యాలు భావించేవి. అలా యూదాను, ఇజ్రేయిల్ ను ఆక్రమించాక బేబిలోనియన్లు అక్కడి నాయకుల్ని బేబిలోనుకు ప్రవాసులుగా తీసుకుపోయేరు.

యూదులు బేబిలోనుకు ప్రవాసులుగా వెళ్ళవలసి రావడం వాళ్ళకి రాజకీయంగానే కాక ఆధ్యాత్మికంగా కూడా ఒక సంక్షోభంగా మారింది. ఎందుకంటే ఇంతదాకా వాళ్లని యెహోవా కనిపెట్టుకుని ఉన్నాడని నమ్ముతూ వచ్చారు. కాని అత్యంత అవమానకరమైన ఈ పర్యవసానంవల్ల తక్కిన రాజ్యాల దృష్టిలో యూదుల దైవానుగ్రహం అనుమానంలో పడింది. మరొకవైపు వాళ్లు తమని ఓడించి బందీలుగా మార్చిన బేబిలోనియన్ దేవతల్ని కొలవకతప్పని పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా ఈ సంక్షోభకాలంలో రెండవ ఇషయ్యా వారికి అండగా నిలబడ్డాడు. అతడు వాళ్లకి చెప్పిందేమంటే, ఆ పరాజయం, ఆ ప్రవాసం, ఆ దాస్యం అవన్నీ సర్వేశ్వరుడి అస్తిత్వాన్ని మరింత బలపరిచేవేననీ, ఒకప్పుడు ఈజిప్టుదాస్యం నుంచి యూదులు బయటపడ్డట్టుగా బేబిలోన్ ప్రవాసం నుంచి కూడా బయటపడే రోజులు తప్పకుండా వస్తాయనీ ఇషయ్యా ఘంటాపథంగా చెప్పడం మొదలుపెట్టాడు.

ఇషయ్యా దైవవాణి ఒకసారి అసీరియా ముందు యెరుషలేముని కాపాడినట్టే, బేబిలోన్ ప్రవాసం నుంచి కూడా దేవుడు యూదుల్ని కాపాడాడు. అనూహ్యపరిస్థితుల్లో బేబిలోన్ ని ఆక్రమించిన పర్షియా చక్రవర్తి సైరస్ యూదుల్ని విడిచిపెట్టేసాడు. వాళ్ళు స్వేచ్ఛగా తమ స్వదేశానికి పోవచ్చునని చెప్పాడు.

ఆ విధంగా దాదాపు యాభైవేలమంది యూదులు తిరిగి జెరుసలేం బాట పట్టారు. అలా తిరిగి వచ్చిన తరువాత అంటే క్రీ.పూ 539 నుంచి 400 దాకా, లేదా 500 దాకా మధ్యకాలంలో పరిస్థితుల నేపథ్యంలో ఇషయ్యా మూడవ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది.

ప్రవాసం నుంచి తిరిగి వచ్చిన యూదులకి యెరుషలేం లో ఘనస్వాగతం లభించకపోగా అవహేళన మాత్రమే ఎదురయ్యింది. అప్పటికి యూదు సమాజం మూడు రకాల మనుషుల్తో నిండిపోయింది. ఒకరు తమకీ, సర్వేశ్వరుడికీ మధ్య సంబంధాన్ని ఇంకా నమ్మేవారు, ఆ ఒప్పందానికి అనుగుణంగా నడుచుకోవాలని ప్రయత్నించేవారు. కాని వారు చాలా తక్కువమంది. మరొక వర్గం వారు దేవుణ్ణి వదిలిపెట్టి మతాన్ని మాత్రమే పట్టుకు వేలాడేవారు. ఈ రెండింటితోనూ పనిలేనివాళ్ళు మూడవ వర్గం.

దాదాపు మూడు శతాబ్దాల రాజకీయ-సామాజిక కల్లోలం మధ్య ఇషయ్యా సంప్రదాయం యెహోవాకీ, యూదులకీ మధ్య సంబంధాన్నినిశితంగా పునఃపరీక్షించింది. ఎంతచెప్పినా మారని ప్రజలమీద యెహోవా కరుణ కురుస్తూనే ఉండటానికి కారణమేమిటని ఆలోచించింది. అధిక సంఖ్యాకుల అవిధేయతని, భోగలాలసతనీ, ఇతరవిగ్రహారాధననీ యెహోవా ఎప్పటికప్పుడు తీవ్రాతితీవ్రంగా శిక్షిస్తూ వచ్చాడు, నిజమే, కాని, మరొకవైపు ఆయన తన ప్రజల పట్ల తల్లిలాగా, తండ్రిలాగా షరతుల్లేని అపారమైన ప్రేమ కూడా చూపిస్తూ వచ్చాడు. ఆ ప్రేమని కొందరేనా పొందడానికి కారణమేమిటి? దాన్ని నిలబెట్టుకోవాలంటే ఏమి చెయ్యాలి? కృతఘ్న సోదరసమాజం పట్ల నిప్పులు కురిపిస్తూ వచ్చిన ఇషయ్యాలో అమృతం ఊటలూరే తావులు ఆ ప్రశ్నలకి సమాధానాలు.

ఒక జాతి నైతికంగా పతనం చెందాకనే రాజకీయ పతనం మొదలవుతుందని ఇషయ్యా స్పష్టంగా గుర్తుపట్టాడు. కాని ఎంత చెప్పినా ఎంత హెచ్చరించినా, దేవుడు ఎంత దయచూపినా మనిషి నీతిరహితుడిగా ఉండటాన్నే ఇష్టపడుతుండటం కూడా అతడు చూసాడు. ఒక పాపి కృతార్థుడు కావడం ఎట్లా? గాఢమైన ఆ ప్రశ్నకి ఇషయ్యా ఇచ్చిన జవాబు servanthood. ఒక మనిషి దైవసేవకుడిగా మారడం ద్వారా మాత్రమే, సంపూర్ణ శరణాగతి ద్వారా మాత్రమే విముక్తి తాను విముక్తుడు కాగలుగుతాడు, తన సోదర సమాజాన్ని విముక్తపరచగలుగుతాడు.

ఇషయ్యా గ్రంథం రెండవ, మూడవ భాగాలు ఈ వార్తనే సువార్తగా మనముందు ప్రకటిస్తాయి. తర్వాత రోజుల్లో యేసుక్రీస్తు జీవితాన్ని పరిశీలిస్తే ఆయన ఇషయ్యా గ్రంథాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఉంటాడనీ, ఇషయ్యా కోరినట్టుగా తాను భగవత్సేవకుడిగా మారడానికే తన జీవితమంతా ప్రయత్నించాడనీ మనకి అనిపిస్తుంది. అందుకనే ఎవరో అన్నట్టుగా, ఇషయ్యా గ్రంథం ఏసుక్రీస్తు ఆగమనాన్ని సూచించేదిగా కాక, ఆ జీవితాన్ని కళ్ళారా చూసి వర్ణించిన గ్రంథంగా కనిపిస్తుంది.

మొత్తం 66 అధ్యాయాల ఇషయ్యా గ్రంథం ఆ విధంగా ఒక ఇతిహాసం, ఒక ఉపనిషత్తు, ఒక సువార్త, దేవుడికీ, మనిషికీ మధ్య నడిచిన దీర్ఘసంభాషణ. ఒక అవిశ్వాసికీ, అవిశ్వాస సోదరసమాజానికీ మధ్య నడిచిన ఎడతెగని సంవాదం. కొన్నిసార్లు ఆగ్రహం, కొన్ని సార్లు ఎక్కసెక్కెం, కొన్నిసార్లు నిస్సహాయత, కాని చివరికి, అపారమైన ప్రేమ- ఇషయ్యా గ్రంథం చదవడమంటే అగ్నినీ, అమృతాన్నీ ఏకకాలంలో అనుభవానికి తెచ్చుకోవడం.

బుల్టేమా అనే ఒక బైబిలు పండితుడు ‘ఇషయ్యాలో డేనియల్ లోని సాహసం, జెరిమియాలోని మృదుత్వం, హోసియాలోని విషాదం, ఆమోస్ లోని ఆగ్రహం ఏకకాలంతో కనిపిస్తాయి ‘అన్నాడు. అంతేకాదు, ‘వారెవ్వరిలోనూ కనబడని పవిత్ర అవహేళన ఇషయ్యా వాక్కుకే స్వంతం’ అని కూడా అన్నాడు. ‘ఆ గ్రంథంలో ఎక్కడా క్షణం పాటు కూడా ఇషయ్యా వెనకడుగు వేసినట్టు కనబడదు. అటువంటి సాహసం అతడిది’ అని కూడా అన్నాడు.

1603-11 మధ్యలో  కింగ్ జేమ్స్ వెర్షన్ లో బైబిల్ ఇంగ్లిషు అనువాదం వెలువడిన తరువాత, ఇషయ్యా మాటలు ప్రపంచ చైతన్యంలో విడదీయరాని భాగమైపోయాయని పీటర్ ఎక్రాయిడ్ అనే పండితుడు అన్నాడు. యూరోప్ ని గాఢంగా ప్రభావితం చేసిన గ్రీకు, రోమన్ రచయితలసరసన ఇషయ్యా కూడా చేరిపోయాడు. ఇషయ్యా గ్రంథం ఆద్యంతం కవితాత్మకం అని చెప్పాను కదా. దాని ఎత్తిచూపడానికి కొన్ని రూపకాలంకారాలో, లేదా ఆ వాక్య నిర్మాణం నుంచి కొన్ని ఉదాహరణలో ఇస్తే సరిపోదు. కాని ఇంత రాసిన తరువాత, ఒకటి రెండు ఉదాహరణలైనా ఇవ్వకుండా ఎలా ఉండటం?

భగవంతుడి ఆవేదన

 ఉజ్జియ, జోతాము, అహాజ్, హెజికీయ యూదాను పరిపాలించిన రోజుల్లో యూదా గురించి, యెరుషలేము గురించి,అమోజ్ కుమారుడు ఇషయ్యాకి కలిగిన దర్శనం.

ఆకాశమా, ఆలకించు, భూమండలమా, చెవియొగ్గు, సర్వేశ్వరుడు నాతో ఇలా అన్నాడు: ‘నేను పెంచి పెద్దచేసిన నా పిల్లలు నా మీద తిరగబడుతున్నారు. ఒక ఎద్దుకి తన యజమాని ఎవరో తెలుసు. ఒక గాడిద తన యజమాని కొట్టాన్ని గుర్తుపడుతుంది. కాని ఇజ్రాయేలుకి మాత్రం తెలియదు. నా ప్రజలే నన్ను అర్థం చేసుకోవడ లేదు.

అయ్యో! పాపిష్టి జాతి. క్రూరత్వం ముదిరిపోయిన మనుషులు. దుర్మార్గసంతతి, మొత్తం అవినీతిమయం. వాళ్ళు తమ ప్రభువుని వదిలిపెట్టేసారు. ఇస్రాయేలుకి చెందిన పవిత్రాత్మని ఈసడించుకుంటున్నారు. ఆయన్నుంచే ముఖం చాటేస్తున్నారు. ఎందుకు ఏ దెబ్బలు మీమీద ఇంకా పడుతున్నాయని మీరింకా తిరగబడుతూనే ఉన్నారు? శిరసు జబ్బుపడింది, హృదయం మూర్ఛపోతున్నది, అపాదమస్తకం, దేహంలో ఎక్కడా సత్త్వమన్నది లేదు. ఒళ్ళంతా గడ్డలు, పుండ్లు, నెత్తురోడుతున్న గాయాలు. మీ దేశం నిర్జనమైపోయింది. మీ నగరాలు దగ్ధమైపోయాయి. సీయోను రాకుమార్తె ద్రాక్షతోటలో పాకలాగా మిగిలిపోయింది. దోసపాదులమధ్య గుడిసెలాగా నలుదిక్కులా ముట్టడిలో నగరం చిక్కుకుపోయింది. సర్వేశ్వరుడు మనవంటి కొంతమందిని ఇంకా ప్రాణాలతో మిగిల్చి ఉండకపోయి ఉంటే మనం కూడా సొదోము, గొమొర్రాలుగా నశించిపోయి ఉండేవాళ్ళం. 

ఒరే సొదోము పాలకులారా, సర్వేశ్వరుడి మాటలు వినండి. ఓ గొమొర్రా సంతానమా, భగవంతుడి మాటలు ఆలకించండి. ( ఇషయ్యా, 1.1-11)

ఇషయ్యాకి అప్పగించిన పని

ఉజ్జియ మరణించిన ఏడాదే నేనొక దృశ్యం చూసాను. సర్వేశ్వరుడు ఒక సింహాసనం మీద ఆసీనుడై ఉండగా చూసాను.అందరికన్నా ఎత్తున, అత్యంత ఔన్నత్యంలో ఉండగా చూసాను. దేవాలయం మొత్తం ఆయన వైభవంతో ప్రకాశిస్తున్నది. అక్కడ దేవదూతలు నిలబడి ఉన్నారు. ఒక్కొక్కరికీ మూడేసి జతల రెక్కలు. రెండు రెక్కలు వారి వదనాన్ని, రెండు పాదాల్ని కప్పి ఉంచగా మరొక రెండు రెక్కల్తో వారు ఎగురుతున్నారు.

వారిలో వారు ఒకరితో ఒకరు ఆనందంగా చెప్పుకుంటున్నారు, ‘ఎంత పవిత్రం, ఎంత పవిత్రం, సర్వేశ్వరుడు పరమపవిత్రం, ఈ భూమండలమంతా ఆయన కాంతితో ప్రకాశిస్తున్నది, చూడండి ‘ అంటో గానం చేస్తున్నారు.

అప్పుడు ఆ దేవాలయ స్తంభాలు కంపించాయి. ఆ మందిరమంతా ధూపంతో నిండిపోయింది.

నేనన్నాను కదా: ‘అయ్యో, ఎంత దురదృష్టవంతుణ్ణి! నిస్సహాయుణ్ణి. అపరిశుభ్రంగా ఉండే మనుషుల మధ్య నివసిస్తూ నా పెదాలు కూడా అపరిశుభ్రమైపోయాయి. కాని నా నేత్రాలు సర్వేశ్వరుణ్ణి చూసాయి. రాజాధిరాజుని దర్శించుకున్నాయి.’

అప్పుడొక దేవదూత నా వైపుగా ఎగురుకుంటూ వచ్చింది. హోమగుండం నుంచి మండుతున్న ఒక నిప్పుకణికను పట్టకారుతో పట్టుకొచ్చింది.  దాన్ని నా పెదాలమీద పెట్టి, ‘ఇదిగో, ఈ నిప్పు నీ పెదాల్ని తాకింది కాబట్టి నీ దోషాలు తొలగిపోయాయి, నీ పాపాలు ప్రక్షాళితమయ్యాయి’ అంది.

అప్పుడు దేవుడు మాట్లాడం విన్నాను. ఆయన అంటున్నాడు: ‘ఎవరిని పంపాలి మనం? ఇప్పుడు మన తరఫున ఎవరు వెళ్తారు?’

నేనన్నాను ‘ప్రభూ, ఇదిగో నేనున్నాను, నన్ను పంపండి.’

అప్పుడు ఆయనిట్లా అన్నాడు: వెళ్ళు, వెళ్ళి ఈ మనుషులకి నా మాటలుగా చెప్పు . మీరు నన్ను వింటున్నారుకాని అర్థం చేసుకోవడం లేదు. చూస్తున్నారు, కాని గ్రహించడం లేదు.’ అని చెప్పు.

‘వాళ్ళ హృదయాన్ని కొవ్వెక్కించు. చెవులు దిమ్మెక్కించు. కళ్ళు మూసుకుపోనివ్వు. లేకపోతే వాళ్ళు కళ్ళతో చూస్తారు, చెవుల్తో వింటారు, హృదయంతో అర్థం చేసుకుంటారు. మారిపోతారు, స్వస్థులవుతారు.’

‘ఎంతకాలం ప్రభూ, ఇలాగ? ‘అనడిగాన్నేను.

‘ఒక్క నివాసి కూడా మిగలకుండా నగరాలు ధ్వసమయ్యేదాకా ‘అన్నాడాయన. ఇంకా ఇలా అన్నాడు: ‘ ఆ ఇళ్లల్లో ఒక్కమనిషి కూడా మిగలకుండేదాకా. ఆ భూములు నిర్జనమైపొయ్యేదాకా. ప్రభువు ఆ మనుషుల్ని మరొకచోటకి తీసుకుపోయి, ఆ నేలమొత్తం బీడుపడేదాకా. అయితే, వాళ్ళల్లో పదోవంతు మిగుల్తారు, తిరిగివస్తారు,  వాళ్లు కూడా మిగలరు, కాని నరికేసిన తరువాత కూడా మొద్దుల్లాగ పడి ఉండే తెరిబింతు  చెట్టులోనో, ఓకుచెట్టులోనో ఇంకా కొద్దిగా జీవం మిగిలిఉంటుంది చూడు, అదే రానున్న కాలంలో పవిత్రసంతతికి ప్రాణం పోస్తుంది. (ఇషయ్యా, 6:1-13)

9-10-2022

Featured image courtesy: The Church of Jesus Christ of Laterday Saints

Leave a Reply

%d bloggers like this: