
వేదంలానే బైబిల్ కూడా అత్యున్నత స్థాయి కవిత్వం. ఎప్పుడైనా బైబిల్ మతగ్రంథంగా కొనసాగకపోయే రోజు వచ్చినా కూడా అది కవిత్వంగా నిస్సందేహంగా నిలబడిపోతుందన్నాడు వాల్ట్ విట్మన్. నిజానికి వేదాన్ని గానీ, బైబిల్ ని గానీ కవిత్వమనలేం. అది అంతకన్నా ఉన్నతస్థాయి భూమికకి చెందిన అభివ్యక్తి. అందుకనే అరవిందులు వేదాన్ని మంత్రమయవాణి అన్నాడు. ఆ మాట బైబిలుకు కూడా వర్తిస్తుంది. కొత్త నిబంధనలోని నాలుగు సువార్తలే కాక, పాత నిబంధనలోని సొలోమోన్ గీతం, డేవిడ్ రాసాడని చెప్పే సామగీతాలు, లామెంటేషన్స్ మొత్తం అధ్యాయం చిక్కటి కవిత్వం అనడంలో సందేహం లేదు. కాని వాటన్నిటికీ సమానమైందీ, కొన్నితావుల్లో, అంతకన్నా సాంద్రమైందీ, ఒక విధంగా చెప్పాలంటే అత్యంత కవితాత్మకమే కాక, రూపకసమానమని చెప్పదగ్గదీ ఇషయ్యా గ్రంథం.
పాతనిబంధనలోని ఇషయ్యా గ్రంథాన్ని బైబిలు పండితులు మొత్తం పాతనిబంధనకి సంగ్రహరూపంగా పరిగణిస్తుంటారు. దాహార్తభూమి మీద కృపావర్షం కురిపించినట్లుగా, ఆ గ్రంథంలో వినవచ్చిన దివ్యవాణిని, భవిష్యవాణి ని దృష్టిలో పెట్టుకుని చూస్తే అది మరొక కొత్తనిబంధన అనవచ్చు. అందుకని కొందరు దాన్ని అయిదవ సువార్తగా కీర్తించడంలో ఆశ్చర్యం లేదు.
ఇషయ్యా గ్రంథంలో సొలోమోను ప్రేమగీతంలోని సుకోమలత్వంతో పాటు, సామగీతాల్లోని దాహార్తీ, విలాపాల్లోని ఆక్రోశమూ మాత్రమే కాక, కొండమీది ప్రసంగంలోని మహిమాన్విత భగవత్సందేశం కూడా ఉన్నాయి. నాకు తెలిసి, ప్రపంచసాహిత్యంలో అపారమైన వ్యాకులతా, ఎల్లల్లేని ఆనందదర్శనమూ ఒకదానితో ఒకటి కలిసిపోయిన కావ్యం మరొకటి లేదని చెప్పగలను.
మరింత లోతుకి వెళ్ళి చెప్పాలంటే ఇషయ్యా గ్రంథంలో అభివ్యక్తి కవిత్వమూ కాదు, వచనమూ కాదు. మనిషి మాటల్తో కాకుండా నేరుగా హృదయంతో మాట్లాడం మొదలుపెట్టినప్పుడు ఆకాశం ఉరిమినట్టు, భూమి కంపించినట్టుగా ఉంటుందే, అట్లాంటి ప్రకంపనల్తో కూర్చిన అగ్నిమాలిక ఆ గ్రంథం. కాలరిడ్జి అన్నాడట, ఇషయ్యా మొదటి గ్రంథంలోని మాటల్ని మనం జాగ్రత్తగా అమర్చుకుంటే అవి హోమరీయ హెక్సామీటర్లలో ఒదిగిపోతాయి అని. ఆ మాటని ప్రస్తావిస్తూ ఒక బైబిల్ పండితుడు, హృదయం నుంచి నేరుగా పలికే మాటలకి ఛందస్సు దానికదే సమకూరుతుంది అన్నాడు. మనకి ఈ భావన కొత్త కాదు. ఎందుకంటే వాల్మీకి శోకం శ్లోకంగా మారడంతోనే మన కావ్యగంగ భూమ్మీదకు అవతరించింది.
పాతనిబంధనలోని మొత్తం 39 గ్రంథాల్లోనూ ఇషయ్యా గ్రంథం ఒక కీలకస్థానంలో కనిపిస్తుంది. ఇజ్రాయేలీల చరిత్రలోనూ, సర్వేశ్వరుడికీ, అతడు ఎంచుకున్న మానవసమూహానికీ మధ్య వార్తాహరులుగా పనిచేసిన మొత్తం 88 మంది ప్రవక్తల్లో, పాతనిబంధనలోని 63 ప్రవక్తల్లోనూ ఇషయ్యాది ప్రత్యేక స్థానం. కొందరి దృష్టిలో మొదటిస్థానం. కొందరి దృష్టిలో ప్రధానమైన ముగ్గురు ప్రవక్తల్లో అతడు కూడా ఒకడు.
ఇషయ్యా గ్రంథం మూడు శతాబ్దాల ఆవేదననీ, ఆక్రోశాన్నీ, వేదననీ, అద్భుతాన్నీ, ఆనందాన్నీ ప్రతిబింబించే గ్రంథం. కాబట్టి అది ఒకరి రచన లేదా ఒకరినోటివెంట ఒక జీవితకాలంలో వినవచ్చిన దైవవాణి కాదని చాలామంది అభిప్రాయం. ఆ గ్రంథంలోని మొత్తం 66 అధ్యాయాల్లో, 1-39 దాకా ఒక ప్రవక్తవాణి అనీ, 40 నుంచి 55 దాకా రెండవ ఇషయ్యా రచన అనీ, 56 నుండి 66 దాకా మూడవ ఇషయ్యా రాసాడనీ పరిశోధకుల అభిప్రాయం. కాని అది మొత్తం ఒకే ఒక్కరి రచన అని కూడా అంతే బలంగా వాదిస్తున్న పండితులు కూడా లేకపోలేదు. కాని ఒకటి మాత్రం స్పష్టం. క్రీ.పూ 8 వ శతాబ్దం నుండి 6 వ శతాబ్దందాకా అందులో కనవచ్చే అనుభవాలు, ప్రస్తావనలు, చారిత్రిక సంఘటనలు, అన్నిటిమధ్యా వినవచ్చే ఆ దైవవాణిలో మాత్రం ఒకే ఏకసూత్రత ఉంది. అందుకనే కొత్తనిబంధనలో సువార్తీకులు మరే ప్రవక్తకన్నా కూడా ఇషయ్యానే ఎక్కువసార్లు తలుచుకోవడమే కాక, ఆ గ్రంథ రచయిత ఒకడన్నట్లుగానే మాట్లాడేరు.
ఇషయ్యా గ్రంథంలోని కవిత్వం, ఆ గ్రంథకర్త వేదననుంచి విడదీయలేనిది. కాబట్టి ఆ కవిత్వమహిమను అర్థం చేసుకోవాలనుకుంటే అప్పటి చారిత్రిక నేపథ్యం కొంతైనా తెలిసి ఉండాలి.
ఇషయ్యా మొదటి గ్రంథం నాటికి, అంటే క్రీ.పూ.739-701 నాటికి, యూదు నేల రెండు రాజ్యాలుగా విడిపోయింది. వాటిలో ఉత్తరాన ఉన్నదాని ఇజ్రాయిల్ అనీ, దక్షిణాన ఉన్నదాన్ని యూదా అని పిలిచేవారు. అవి రెండూ రెండు చిన్న రాజ్యాలు, చిన్న భూభాగాలు. వాటికి ఒక పక్క ఈజిప్టు, మరొకపక్క అసీరియా, ఇంకొక పక్క బేబిలోను మహాసామ్రాజ్యాలున్నాయి. ఆ మహాసామ్రాజ్యాలనుండి ఎప్పటికప్పుడు తన జాతిని కాపాడుకోడానికి యెహోవా చెయ్యని ప్రయత్నం లేదు. కాని ఆయనకీ, యూదులకీ మధ్య జరిగిన మొదటి ఒప్పందాన్ని ఇస్రాయేలీలు పూర్తిగా పెడచెవిన పెట్టేసారు. దేవుడికి మొహం చాటేసిన తరువాత మిగిలేది విధ్వంసం, పరాజయం, దాస్యం మాత్రమేనని ప్రవక్తలు వారిని హెచ్చరిస్తూ వచ్చారు. దేవుడితో జరిగిన మొదటి ఒప్పందాన్ని పక్కన పెట్టడమంటే మోషే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించడం. మరీ ముఖ్యంగా సర్వేశ్వరుణ్ణి వదిలి చిల్లరదేవుళ్ళని పూజించడం, బలహీనుల్ని అణచిపెట్టడం, తాగుడు, వ్యభిచారం, హింసా ప్రవృత్తికి లోబడటం. అటువంటి ధోరణులు సమాజంలో ప్రబలినప్పుడల్లా ఆ రాజ్యం మరొక రాజ్యం చేతిలో ఓడిపోక తప్పదనీ కాబట్టి జాగ్రత్త పడమనీ ప్రవక్తలు హితవు చెప్తూ వచ్చారు.
యూదా రాజ్యాన్ని అహాజ్ పాలిస్తున్న కాలంలో ఇషయ్యా పుట్టాడు. అహాజ్ కాలంలో యూదా ఒక రాజకీయ సమస్యను ఎదుర్కొంది. అదేమంటే తాను అసీరియాకు అనుకూలంగా ఉండాలా, లేక విరోధించాలా అని. ఇషయ్యా వాళ్ళకి చెప్పిందేమంటే మీరు అసీరియాకు అనుకూలంగా ఉండాలా వద్దా అని కాదు, దేవుడికి అనుకూలంగా ఉండాలా లేదా అని ఆలోచించండి అని. సహజంగానే అహాజ్ అతడి మాటలు లెక్కపెట్టలేదు. ఈలోపు ఇజ్రాయిల్ సిరియాతో కలిసి యూదా మీద దండెత్తింది. దాంతో అహాజ్ అసీరియా శరణు కోరాడు. దాన్ని అవకాశంగా తీసుకుని అసీరియా యూదానుంచి పెద్ద మొత్తంలో కప్పం కొల్లగొట్టింది.
అహాజ్ కొడుకు హెజికీయ రాజుకాగానే సహజంగానే అసీరియా ప్రతికూల విధానాన్ని అనుసరించకతప్పలేదు. తనకి సహాయంకోసం ఈజిప్టు వైపు చూసాడు. కాని ఇషయ్యా ఆ విధానం సరైందికాదని మళ్ళా హెచ్చరించాడు. హెజికీయ అతడి మాటలు వినకుండా తన సరిహద్దుల్లో ఉన్న ఫిలిస్టియా మీద దండెత్తాడు. దాంతో అసీరియా యూదా మీదకు సైన్యాలు నడిపించింది. అప్పుడు హెజికీయ మళ్ళా ఇషయ్యాకు కబురు చేసాడు. ఇషయ్యా ఎప్పుడూ చెప్పిన మాటలే మళ్ళా చెప్పాడు. నిన్ను కాపాడేది సర్వేశ్వరుడొక్కడే. ఆయన్ని నమ్ముకో, ఈజిప్టునీ, అసీరియానీ కాదని చెప్పాడు. ఇషయ్యా ఎంతో నిశ్చయంగా ఆ మాటలు చెప్తున్నప్పుడు అసీరియన్ చక్రవర్తి సెన్నాచెరిబ్ సైన్యాలు జెరూసలేం గోడదాకా వచ్చేసాయి.
హెజికీయ మొదటిసారిగా ఇషయ్యాను పరిపూర్ణంగా విశ్వసించాడు. సర్వేశ్వరుడిముందు సాష్టాంగపడ్డాడు. తెల్లవారేలోపు అద్భుతం జరిగింది. సెన్నాచెరిబ్ సేనల్లో లక్షా ఎనభై వేలమంది రాత్రికి రాత్రే మరణించారు. యెరుషలేం గోడని తాకకుండానే అసీరియన్ సైన్యాలు వెనుతిరక్క తప్పింది కాదు.
అసీరియా యెరుషలేం ని ముట్టడించకుండానే వెనుదిరిగిందనేది ఒక చారిత్రిక యథార్థం. అంతమంది సైనికులు రాత్రికి రాత్రి ఎలా మరణించారనేది మనకు తెలియదు. ప్లేగు వల్ల కావచ్చుననేది ఒక ఊహ. కాని ఇషయ్యా దృష్టిలో అది సర్వేశ్వరుడు తనని నమ్ముకున్నవాళ్ళ పట్ల స్పష్టంగా చూపించిన ప్రేమ తప్ప మరొకటి కాదు.
అక్కడితో ఇషయ్యా మొదటి గ్రంథం పూర్తవుతుంది.
8-10-2022
Featured image courtesy: Biblical Archaeology Society Online Archive