విధ్వంసం మీంచి నిర్మాణం

Reading Time: 3 minutes

Image generated through AI bot.

ఈ పొద్దున్నే నాకు రాజమండ్రిలో గోదావరిమీద సూర్యోదయ కాంతి పరుచుకుంటున్నప్పుడు ఒక పడవ బొమ్మ గియ్యాలనిపించింది అనుకోండి. కాని పెన్సిలు స్కెచ్చి గియ్యడానికో, నీటిరంగులు కలపడానికో ఓపికలేదనుకోండి. ఎలా?

అవసరం లేదు. ఇప్పుడు ఆ పని కంప్యూటరు మీ కోసం చేసి పెడుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్సు ద్వారా బొమ్మలు గీసిపెట్టే బాట్ botలు నెట్ లో ప్రత్యక్షమవుతున్నాయి. మీరు చెయ్యవలసిందల్లా ఆ సైట్ తెరిచిపెట్టి, మీరు ఊహించుకుంటున్న దృశ్యాన్ని మాటల్లో అక్కడ టైప్ చెయ్యండి. మీ కోసం కంప్యూటర్ మెషిన్ లెర్నింగ్ ద్వారా పది పన్నెండు సెకండ్లలో మీరు ఊహించిన దృశ్యాన్ని మీకు కావలైన శైలిలో, మీకు నచ్చిన కళా ఉద్యమ పద్ధతిలో గీసిపెడుతుంది.

ఆశ్చర్యంగా ఉంది కదూ! కాని ఆశ్చర్యం లేదు. రాబోయే కాలమంతా ఆర్టిపిషియల్ ఇంటలిజెన్సుదే అని మనం ఇంకా మాట్లాడుకుంటూ ఉండగానే కొత్త ప్రపంచం నెమ్మదిగా, చాప కింద నీరులాగా మన ఇంట్లోకి వచ్చేసింది.

దీన్ని ఎలా అర్థం చేసుకోవడం? muturalart.com 21-9-2002 నాటి వెబ్ పత్రికలో Michael Pearce అనే పండితుడు The Romantic Artist is dead. AI has killed him అనే వ్యాసంలో ఇలా రాస్తున్నాడు:

‘ఈ సైబర్ సృజనాత్మకత విధ్వంసం మీంచి నిర్మాణమవుతుంది. ఒక చిత్రాన్ని ఊహించడం కోసం స్టేబుల్ డిఫ్యూజన్ పిక్చర్ బాట్లకి ఒక ఇమేజి ఎంచుకుని దానికి దృశ్యం తాలూకు noise ని చేర్చడంలో శిక్షణ ఇస్తారు. ఈ విజువల్ నాయిస్, ఈ డిఫ్యూసన్, రంగుకీ, టోన్ కీ చెందిన అసంఖ్యాకమైన చుక్కలద్వారా రూపొందుతుంది. ఆ క్రమంలో అది ఇమేజిని పూర్తిగా చెరిపేస్తుంది. ఆ ఇమేజిలో మనం గుర్తుపట్టగలిగే అన్ని వివరాల్నీ చెరిపేసి దాన్నొక స్తబ్ధ క్షేత్రంగా మార్చేస్తుంది. ఒకసారి ఇమేజిలోని పిక్సెళ్లని ఈ విధంగా కలిపెయ్యడం నేర్చుకున్నాక, అప్పుడు ఆ నాయిస్-మేకింగ్ ప్రక్రియ విలోమక్రమంలో మళ్ళా మొదలుపెడుతుంది. ఒక ఇమేజిని రూపొందించడానికి, బాట్ తనముందున్న స్తబ్ధ క్షేత్రం నుంచి పిక్సెళ్లను తీసుకుని, మనం అడుగుతున్న దృశ్యానికి సంబంధించి, తన డాటాబేస్ లో ఉన్న ఇమేజిలనుంచి కొత్త చిత్రాన్ని రూపొందించే ప్రక్రియ మొదలుపెడుతుంది. దీన్ని LAION-Aesthetics అంటారు. దీనిప్రకారం అది నాయిస్ ని మళ్ళా విధ్వంసం చేయడం మొదలుపెట్టి, మనం కోరుకున్న ఇమేజిని రుపొందించడం మొదలుపెడుతుంది. ఇలా తన సమాచారభాండాగారంలో ఉన్న చిత్రాలనుంచి తాను అనుకరించడానికి దానికి ఒక మానవుడు కావాలి, అతడు తనకిచ్చే ఒక ఆదేశం కావాలి.’

స్థూలంగా చెప్పాలంటే, ఇప్పటికే కంప్యూటర్లలో, ప్రపంచవ్యాప్తంగా సెర్చ్ ఇంజన్లద్వారా పోగుపడ్డ కోట్లాది ఇమేజిలనుండి కంప్యూటర్ మనం కోరుకున్న ఇమేజిని మనకి తయారు చేసి ఇవ్వగలదన్నమాట. ఇప్పుడు ఒక పత్రికా సంపాదకుడు తనకి ఒక్క బొమ్మకావాలంటే ఇలస్ట్రేటర్ ని పిలిచి ఇతివృత్తం చెప్పి తనకి కావలసిన శైలిలో ఇమ్మని అడుగుతున్నాడు. ఒక కవి తన పుస్తకానికి ముఖచిత్రం కావాలంటే ఒక చిత్రకారుణ్ణి అర్థిస్తున్నాడు. పిల్లలకోసం పాఠ్యపుస్తకాలు రూపొందించే విద్యావేత్తలు ఆ బొమ్మలు ఎలా ఉండాలని ఎంత కలగన్నప్పటికీ, వారి చిత్రకారులు ఏ మేరకు ఊహించగలిగితే ఆ మేరకు దొరికే బొమ్మలతోటే తృప్తి పడుతున్నారు. ఇక మీదట అదేమీ అవసరం లేదు. కావలసిందల్లా ఒక మెషిన్ లెర్నింగ్ యాప్. దానిముందు కూచుని తనకి ఏ బొమ్మ కావాలో చెప్పే ఒక మానవుడూ మాత్రమే.

‘ఆదియందు వాక్యముండెను.’ ఒకప్పుడు సృష్ట్యాదిలో, అస్తిత్వ, అనస్తిత్వాలు ద్రవరూపంలో ఉన్నప్పుడు, సృష్టికర్త, ఆ అపారజలరాశినుంచి ప్రథమ సృష్టి చెయ్యడానికి తన word ఉపయోగించినట్టుగా, ఇప్పుడు మనిషి కంప్యూటరు ముందు కూచుని మంత్రంలాగా ఒక మాట చెప్తే చాలు. అప్పుడు ఆ యంత్రం ప్రపంచంలోని ఇమేజిలన్నిటినీ ఒకే ద్రవరూపస్థితికి తీసుకుపోయి, వాటినుంచి మీ కోసం కొత్త సృష్టి మొదలుపెడుతుంది. అలా కంప్యూటర్ కి మనం ఇచ్చే ఆదేశాన్ని prompt అంటారు. మీ కోసం మెషిన్ రూపొందించిన బొమ్మలు మీరు అనుకున్నట్టుగా వచ్చాయనుకునేదాకా మీరు ఎంచుకుంటూ పోయే ప్రక్రియ curating. కాబట్టి, ఈ కొత్త ప్రపంచంలో, చిత్రకారుడు కనుమరుగైపోయి, అతడి స్థానంలో, ఒక prompter, ఒక curator వచ్చి చేరతారన్నమాట.

ఇరవయ్యవశతాబ్దం మొదలవుతూ ‘దేవుడు మరణించాడు ‘ అని చెప్పింది. ఇరవై ఒకటవ శతాబ్దం ‘చిత్రకారుడు మరణించాడు ‘ అని చెప్తున్నది. దీనికి రెండు పర్యవసానాలు వెంటనే కనిపిస్తున్నాయి. మొదటిది చిత్రకళ ప్రజాస్వామికం కావడం. ఎవరైనా ఏదైనా గియ్యవచ్చు ఇప్పుడు. ప్రతి ఒక్కడూ చిత్రకారుడే. కావలసిందల్లా కంప్యూటర్ కు ఎలా prompt ఇవ్వాలో తెలుసుకోవడం. తనకి నచ్చిన బొమ్మని క్షణాల మీద రూపొందించుకోవడం.

ఇంతవరకూ బాగానే ఉంది. కాని రెండవ పర్యవసానం భీకరం, దారుణం. అది మాయలఫకీరు చేతుల్లోకి మెషీన్ యాప్ వెళ్ళడం లాంటిది. అత్యంత హింసాత్మకమైన, జుగుప్సాత్మకమైన, వికృతమైన ఆలోచనల్తో బొమ్మలు గియ్యడం కూడా మొదలవుతుంది. ఈ ప్రక్రియను అర్థం చేసుకుని, దీన్ని అరికట్టడానికి చట్టాలు రూపొందించేలోపే కోట్లాది బొమ్మలు తయారైపోతాయి. ఈ మెషిన్ లెర్నింగ్ యాప్ లు బేటా వెర్షన్లు రిలీజైన మొదటివారంలోనే లక్షలాది మంది వాడిని వాడటం మొదలుపెట్టేసారు. ఒకవేళ మనం ఆ దుష్పరిణామాన్ని అరికట్టడానికి చట్టం చెయ్యాలనుకున్నా, దేన్ని నిషేధించగలం? ఎటువంటి prompt లు ఇవ్వాలి, వేటిని ఇవ్వకూడదు అనా? ఏమో, ఊహించడానికి సాధ్యం కావడం లేదు.

సరే, ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో నాకై నేను తెలుసుకుందామని ఒక ఎం.ఎల్ యాప్ బేటా వెర్షన్ లో గోదావరి మీద పడవ బొమ్మ గియ్యమని ఆదేశమిచ్చాను. ఒకటి పెన్సిల్ స్కెచ్, మరొకటి నీటిరంగుల్లో. ఆ బొమ్మలు ఎలా వచ్చాయో చూడండి.

ఈ వారం రోజులుగా ఈ యాప్ మీద ప్రయోగాలు చేసాక నాకు ఏమి అర్థమయిందంటే, కెమేరా వచ్చినప్పుడు కూడా, ఇలానే చిత్రకారుడు అదృశ్యమైపోతాడన్నారు, కాని చిత్రకారుడు కనుమరుగు కాకపోగా, చిత్రలేఖనం అత్యంత ప్రతిష్టాత్మకకళగా మారిపోయింది. ఇప్పుడు ఈ మెషిన్ లెర్నింగ్ కూడా అంతే. ఇప్పటికే ఉన్న ఇమేజిల్లోంచి రూపొందించే బొమ్మ ఎంత త్వరగా, ఎంత ఆకర్షణీయంగా రూపొందినప్పటికీ, అది derivative మాత్రమే. చిత్రలేఖనం అంటే ఒట్టి ఇమేజి కాదు. అదొక భావోద్వేగం. కొన్ని మహాయుగాలకు పూర్వం క్రోమాన్యాన్ గుహల్లో, అల్టామీరా గుహల్లో బొగ్గుతో చిత్రలేఖనాలు గియ్యడం మొదలుపెట్టినప్పుడు మానవుడు వేటకన్నా, ఆహారసముపార్జన కన్నా ప్రత్యేకమైన మానవానుభవాన్ని అందులో చూసాడు. ఒక మానవానుభవానికి మెషిన్ అనుభవం ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాజాలదు.

దాన్నే Michael Pearce ఒక్క మాటలో ఇలా అన్నాడు. ‘మనిషి కంప్యూటర్ తో చదరంగం ఆడవచ్చు, కాని ఒక టోర్నమెంటు ఆడలేడు ‘ అని.

6-10-2022

Leave a Reply

%d bloggers like this: