
పాబ్లో నెరుదా Leaves of Grass కొత్త ఎడిషన్ వచ్చినప్పుడల్లా కొనుక్కునేవాడట. నేను మరీ అంత కాకపోయినా, ఆ పుస్తకం కొత్త అట్టతో కనబడ్డ ప్రతిసారీ కొనుక్కుంటూనే ఉన్నాను. చూసుకుంటే చాలానే ఉన్నాయి, 1855 నాటి మొదటి ఎడిషన్ నుంచి 1892 నాటి deathbed edition దాకా. కానీ అన్నిట్లోనూ చెప్పుకోదగ్గది రాక్వెల్ కెంట్ వుడ్ కట్స్ తో అలంకరించిన 1855 నాటి ఎడిషన్.
అమెరికా జాతీయ కవి, ప్రపంచ సార్వజనీన కవి అని చెప్పదగ్గ వాల్ట్ విట్మన్ (1819-1892) Leaves of Grass మొదటిసారిగా 1855 లో ప్రచురించినప్పుడు, దాని ప్రతి ఒకటి తాను గురువుగా భావించే ఎమర్సన్ కు పంపినప్పుడు, ఎమర్సన్ ముందు ఆ పుస్తకం కలా నిజమా అని కళ్ళునులుముకుని చూసుకున్నాడట. కాని ఆ పుస్తకంలో ఒక పోస్టాఫీసు నంబరు కనబడటంతో, ఆ కవి ఏదో ఒక చిరునామా ఉన్న కవి అనే నిర్ధారించుకున్నాడట. అమెరికాకి ఒక నవేతిహాసం లభించిందన్న ఉత్సాహంతో ఆయన ఆ కవికి ఒక ఉత్తరం రాసాడు. అది జగత్ప్రసిద్ధం. 21 జూలై 1855 నాటి ఆ ఉత్తరంలో ఆయన రాసాడు కదా:
‘ఆ పుస్తకం చదువుతుంటే నాకెంతో సంతోషంగా అనిపించింది. గొప్ప శక్తి మనల్ని తాకినప్పుడు మనలో కలిగే సంతోషం లాంటిది. ..అందులో అద్వితీయమైన విషయాలు అద్వితీయంగా పలికాయి. గొప్ప దర్శనం మాత్రమే మనలో రేకెత్తించగలిగే ఉత్తేజం, మనల్ని సంతోషభరితుల్ని చేసే సాహసవైఖరి కనుగొన్నానందులో’
ఆ రోజునుంచీ గత 165 ఏళ్ళుగా Leaves of Grass మొదటిసారి చేతుల్లోకి తీసుకున్న ప్రతి పాఠకుడి అనుభూతి అదే. మొదటిసారి చదివిన తరువాత, మళ్ళా మళ్ళా ఏ పాఠకుడు ఆ పుస్తకాన్ని తెరిచినా ప్రతిసారి కలిగే అనుభూతి కూడా అదే.
1855 ఎడిషన్ లో వాల్ట్ విట్మన్ Song of Myself తో పాటు మరొక పదకొండు కవితలు సంపుటం చేసాడు. ఆ తర్వాత తన చివరి క్షణందాకా ఆ పుస్తకాన్ని మరింత మరింత సవరిస్తూ సుమారు 400 కవితలదాకా అందులో చేరుస్తోపోయేడు. కొందరి లెక్కలో తొమ్మిది, మరికొందరి లెక్కలో పన్నెండు సార్లు ఆ పుస్తకాన్ని సవరించి విడుదల చేస్తూనే ఉన్నాడు. కానీ చాలామంది దృష్టిలో పన్నెండు కవితల్తో కూడిన ఆ మొదటిసంపుటం మనలో ప్రవేశపెట్టే విద్యుత్తు మాత్రం అద్వితీయం. కొంతమంది ఆ పన్నెండుకూ మరొక ఎనిమిది కవితలు చేర్చి విట్మన్ కవిత్వంలో అత్యున్నతస్థాయి కవితలుగా ఇరవై కవితలుదాకా లెక్కవేస్తారు. ఉదాహరణకి, అబ్రహాం లింకన్ హత్యకు గురైనప్పుడు రాసిన When lilacs last in the dooryard bloom’d, (1865) కవిత మొదటి ఎడిషన్లో లేదు. అటువంటి కవితలు కొన్నింటిని కలిపి ఆ మొదటి ఎడిషన్ నే ఆరాధించే వారు కూడా ఉన్నారు. కాని నా దృష్టిలో విట్మన్ ఒక మహాసముద్రం. అతణ్ణి మొదటిసారి చూసిన తీరం మన మనసుపైన ఎంత ప్రగాఢముద్ర వేసినప్పటికీ, అదొక్కటే తీరం కాదు, ఆ సముద్రానికి, అని మనం మర్చిపోకూడదు.
కాని రాక్ వెల్ కెంట్ అనే చిత్రకారుడు తన వుడ్ కట్స్ తో అలంకరించిన ఆ మొదటి ఎడిషన్ మాత్రం నేను నాకిచ్చుకున్న అపురూపమైన కానుక అనే అనుకుంటాను. అందులో ఆ పన్నెండు కవితలతో పాటు, తన పుస్తకానికి విట్మన్ రాసుకున్న ముందుమాట కూడా ఉంది. ఆ ముందుమాట దానికదే ఒక కావ్యం, ప్రపంచ కవుల మానిఫెస్టో అది. ఆ ముందుమాటతో కలిపి ఆ పుస్తకం ఒక జీవితకాల పారాయణ గ్రంథం. నీ జీవితపు ప్రతి మలుపులోనూ నువ్వు ఆ పుస్తకం తెరవాలి. నీ ప్రయాణంలో నువ్వెప్పుడో వదిలిపెట్టేయవలసిన బరువులింకా మోస్తూ ఉంటే ఆ పుస్తకం చెప్తుంది, నిన్ను ఎప్పటికప్పుడు తేలికపరుస్తుంది, శుభ్రపరుస్తుంది. ఈ మాటలు చూడండి:
నువ్వు చెయ్యవలసిందిదే. ఈ నేలనీ, సూర్యుణ్ణీ, జంతుజాలాన్నీ ప్రేమించు. సంపదల్ని తిరస్కరించు. అర్థించిన ప్రతి ఒక్కడికీ భిక్షనందించు. పతితులకోసం, దుర్బలుల కోసం నిలబడు, నీ ఆదాయం,యావచ్ఛక్తులూ పరులకోసమే వెచ్చించు, నియంతల్ని ద్వేషించు, దేవుడి విషయమై వాదోపవాదాలు కొనసాగించకు, మనుషుల్ని సహించు, పట్టించుకో, తెలిసిన దాని ఎదటగాని, తెలియనిదాని ఎదటగాని, ఏ ఒక్కడిముందుగాని, ఏ సమూహం ముందుగాని శిరసు వంచకు, శక్తిమంతులైన నిరక్షరాస్య మానవులతో యువతతో, వారి తల్లులతో సంతోషంగా ఉల్లాసంగా కలిసిపో. నీ జీవితంలో ప్రతి ఏడాదీ, ప్రతి ఋతువులో ఈ కవితల్ని ఆరుబయట బిగ్గరా చదువుకో, నీ బడిలో, చర్చిలో, లేదా ఏదన్నా పుస్తకంలో నువ్వింతదాకా ఏది విన్నా, ఏది చదివినా దాన్ని మరొక్క మారు పునః పరీక్షించుకో. నీ ఆత్మని అవమానకరంగా తోచిన ప్రతిఒక్కదాన్నీ పక్కకు నెట్టెయ్యి. అప్పుడు రక్తాస్థిగతమైన నీ దేహమే గొప్ప పద్యమవుతుంది. ఆ పద్యం తన పదజాలంలోనే కాదు, నీ వదనానికీ, పెదాలకీ నీ కనురెప్పలకీ మధ్యనుండే నిశ్శబ్దరేఖలద్వారా కూడా ధారాళంగా మాట్లాడుతుంది. అప్పుడు నీ ప్రతి ఒక్క కదలికా, నీ దేహాంగం ప్రతి ఒక్కటీ పద్యంగా మారిపోతాయి.
ఇరవయ్యేళ్ళప్పుడు మొదటిసారి చేతుల్లోకి తీసుకున్నాను వాల్ట్ విట్మన్ కవిత్వాన్ని, ఒక మహాసముద్రాన్ని మొదటిసారి దగ్గరగా చూసినట్టు. ఋషీశ్వరులైన వాల్మీకి, తిరువళ్ళువర్, సాదీల్లాగా, ఓల్డ్ టెస్టమెంట్ ప్రవక్తల్లాగా విట్మన్ చిన్నపిల్లలకి కూడా సులభగ్రాహ్యుడు. ఆ కవిత్వంలోకి ప్రవేశించడానికి మెట్రిక్యులేషన్ స్థాయి ఇంగ్లిషు చాలు. వేమనలాగా సులభగ్రాహ్యుడైన విట్మన్ యూరోప్ కి హోమర్ లాగా, భారతదేశానికి వ్యాసుడిలాగా మహాకవులకు మహాకవి. హోమర్ నుంచి ఎస్కిలస్, యురిపిడిస్, టెన్నిసన్, జాయిస్, డెరెక్ వాల్కాట్ లు ప్రభవించినట్టు, మహాభారతంలో ఒక పాత్రని పట్టుకున్నా, ఒక ఘట్టాన్ని పట్టుకున్నా ఒక కాళిదాసు, ఒక భాసుడు, ఒక అరవిందులు ప్రభవించినట్టు, విట్మన్ నుంచి ఒక నెరూదా, ఒక లాంగ్ స్టన్ హ్యూస్, ఒక మయకోవస్కీ, ఒక నజీం హిక్మత్ లు పుట్టుకొచ్చారు. సమాజమూ, రాజకీయాలూ ప్రజాస్వామికం కావాలనుకునేవారికీ, సామాన్యమానవుడే నవ్యసాహిత్యానికి నాయకుడు కావాలనుకునేవారికీ విట్మన్ ఆదర్శంగా ఉంటూనే ఉన్నాడు. అతణ్ణించే వచనకవిత ప్రభవించిందని కూడా చెప్పుకోవచ్చు. అజంతా, కుందుర్తి మొదలుకుని నేటి తెలుగు వచనకవులదాకా విట్మన్ వెలుగు సోకని వాళ్ళు లేరు. కాని తెలుగుకవులు అతడిలోని వక్తని పట్టుకున్నట్టుగా ప్రవక్తని పట్టుకోలేకపోయారు. ఆ loftiness మాటల్తో వచ్చేది కాదు. బోర్హెస్ చెప్పినట్టుగా ముందు మనం మనలోని ఒక విట్మన్ ని అన్వేషించాలి, ఆవాహన చేసుకోవాలి. కేవల ప్రజాస్వామిక ఆదర్శాలూ, కేవల సామ్యవాద దృక్పథం విట్మన్ కి దగ్గరగా తీసుకుపోలేవు. శ్రీ శ్రీ ‘మానవుడా’ కవితలో లాగా ఎల్లల్లేని, గోడల్లేని దర్శనం సాధ్యమయితే తప్ప విట్మన్ నీకు ఆదర్శమని నువ్వు చెప్పుకోలేవు.
నలభయ్యేళ్ళ ప్రయాణంలో ఇప్పుడు మళ్ళా విట్మన్ ని చదువుతుంటే, అతడొక రూమీలాగా, కబీరులాగా, జిబ్రాన్ లాగా వినిపిస్తున్నాడు. Song of Myself లో ఈ భాగం (#46)చూడండి:
ఇప్పుడు నీ కళ్ళకు అంజనం పూస్తాను
శ్రేష్ఠమైన స్థలకాలాలు నాకు దక్కాయని తెలుసు నాకు- నన్నింతవరకూ కొలిచి లెక్కగట్టినవాళ్ళు లేరు, ఎప్పటికీ ఉండబోరు.
నేనొక నిత్యసంచారిని. వానకోటూ, చక్కటి బూట్లూ, అడవినుంచి తెచ్చుకున్న చేతికర్ర- నన్ను పోల్చుకోడానికి గుర్తులివే.
ఇంతదాకా నాకు పాఠం చెప్పిన మిత్రుడు లేడు. అలాగని నేనూ ఎవరికీ పాఠం చెప్పను, నాకంటూ ఒక మఠం లేదు, తత్త్వశాస్త్రం లేదు.భోజనాలబల్లదగ్గరికి గాని, ఒక గ్రంథాలయానికి గాని, ఒక హుండీదగ్గరికిగాని నేనెప్పుడూ ఎవరినీ ఆహ్వానించి ఉండలేదు.
కానీ మీలో ప్రతి ఒక్క స్త్రీని, ప్రతి ఒక్క పురుషుణ్ణి నేనొక కొండదిక్కుగా తీసుకుపోతాను . నా ఎడమ చెయ్యి మీ నడుం చుట్టూ వేసుకుని నా కుడిచేత్తో ఖండాల్ని, క్షేత్రాల్ని, ముందుకు సాగవలసిన దారి చూపిస్తూ నడుస్తాను.
కాని నేనుకాదు సరికదా మరెవ్వరూ నీ కోసం ఆ బాటపట్టలేరు, ఆ దారిన నీ అంతటనువ్వే ముందుకు సాగాలి.
అలాగని అదేమంత దూరం కాదు.. దగ్గరే. బహుశా నువ్వు పుట్టినప్పటినుంచీ ఆ దారిలోనే నడుస్తున్నట్టున్నావు, నీకు తెలియకపోవచ్చు. బహుశా ఆ దారి ప్రతి ఒక్కచోటా ఉన్నదే, నేలమీదా, నీటిమీదా.
నీ మూట భుజానికెత్తుకో, నేను నా మూట నెత్తికెత్తుకుంటాను, ఇద్దరం చకచకా అడుగులేద్దాం. మనం నడిచే దారిలో అద్భుతమైన నగరాలు, స్వేచ్ఛాలోకాలెన్నో కనగలం.
నువ్వు అలిసిపోయావా, ఇద్దరి బరువూ నేనే మోస్తాను, ఆసరాకు నా నడుమ్మీద నీ చెయ్యి వెయ్యి.. కొంతసేపు గడిచాక నా బరువు నువ్వు తీసుకో. ఒకసారి యాత్రమొదలయ్యాక మనం ఆగడమంటూ ఉండకూడదు.
ఈ రోజు ఉషోదయంకన్నా ముందే నేనొక కొండ ఎక్కి స్వర్గ వైభవం కళ్ళారా చూసాను. అప్పుడు నాకు నేనిట్లా చెప్పుకున్నాను: ఆ కాంతిగోళాల్ని మనం ఎప్పటికి విప్పిచూడగలం? వాటిలో ఏముందో ఆ జ్ఞానానందం మనమెప్పటికి పొందగలం? ఎప్పటికి ఆ పూర్ణకాంతి మనలో నిండి మనం సంతృప్తులం కాగలం? కాని నా ఆత్మ అన్నది కదా, ముందు మనం ఆ ఎత్తుకు చేరుకుందాం, అప్పుడు దాన్ని దాటి మరింత ముందుకు సాగిపోదాం.
నువ్వు కూడా ఏదో అడుగుతున్నట్టున్నావు, వినబడుతున్నది నాకు. కాని నీకు జవాబివ్వలేనన్నదే నా జవాబు.. నీ సమాధానాలు నువ్వే వెతుక్కోవాలి.
బాటసారీ, ఒక క్షణం కూచుందామిక్కడ. ఇవిగో, తినడానికి బిస్కట్లు, తాగడానికి పాలు. నువ్వొక కునుకు తీసి లేచి బలంపుంజుకోగానే నీనుంచి వీడ్కోలు తీసుకుంటూ ఒక ముద్దుపెట్టుకుంటాను, నీ తదనంతర పయనానికి తలుపులు బార్లా తెరిచిపెడతాను.
తుచ్ఛమైన కలలు కంటూ వచ్చావు ఇంతకాలం, ఇక చాలు. ఇప్పుడు నీ కళ్ళకు అంజనం పూస్తాను. మిరుమిట్లు గొలిపే ఆ కాంతికి అలవాటుపడటం మొదలుపెట్టు, ఇకనుంచి ప్రతి క్షణం యావజ్జీవితం.
ఒక కొయ్యదుంగ పట్టుకుని పిరికిగా ఒడ్డమ్మటే తిరిగావు ఇన్నాళ్ళూ. ఇప్పుడు గజ ఈతగాడివి కమ్మని చెప్తున్నాను. నడిసముద్రంలోకి దూకు, మళ్ళా పైకి లే, నన్ను చూసి తలాడించు, అరిచి చప్పట్లు కొట్టు, మళ్ళా మునకలెయ్యి నవ్వుకుంటూ.
5-10-2022
Good feeling
Thank you.