హాఫిజ్ చేసేదదే

నేనొక పూలతోట పక్కన జీవించాలనుకున్నాను, కాని, ఒక పూల అంగడి పక్కన జీవిస్తున్నాను. ఈ పండగ రోజుల్లో ఇక్కడ పూల వెల్లువ ముంచెత్తుతుంది. ఎక్కడెక్కడి కొనుగోలు దారులూ ఇక్కడికి వరదలాగా పోటెత్తుతారు. తెల్లవారకముందే రాత్రంతా ఇక్కడ బారులు తీరతారు. బుల్బుల్ పక్షుల కూజితాలకు బదులు ట్రక్కులు, ఆటోలు, మోటారు సైకిళ్ళ హారన్లతో గాలినిండిపోతుంది.
 
ఇట్లాంటి వేళల్లోనే హాఫిజ్ గుర్తొస్తాడు. పారశీక కవీంద్రుడు అందామా? కాదు, ఋషీశ్వరుడు. రూమీ, సాదీ ల కవిత్వాన్ని ప్రేమించనిదెవరు? కాని ఆ కవిత్వం కవిత్వం మాత్రమే. హాఫిజ్ కవిత్వం మంత్రమయవాణి, దివ్యవాణి. జీవితంలో అన్ని దారులూ మూసుకుపోయినప్పుడు, పొద్దుపొడవనప్పుడు, దిక్కు తోచనప్పుడు దివాన్-ఇ-హాఫిజ్ తెరిస్తే ఏ వాక్యం కనిపిస్తే ఆ వాక్యాన్నే భగవంతుడి ఆదేశంగా పరిగణించేవాళ్ళు ప్రపంచమంతా ఉన్నారు. వాళ్ళల్లో ఒకణ్ణి కావాలన్నదే నా ఆశ కూడా.
 
కానీ నాకు పారశీకం రాదే! నికల్సన్ రూమీని అనువదించినట్టే హెచ్.విల్బర్ ఫొర్స్ క్లార్క్ (1840-1905) హాఫిజ్ దివాన్ ని మొత్తం ఇంగ్లిషులోకి 1891 లో అనువదించాడు. ఆ పుస్తకం మూడు సంపుటాలు కొనుక్కుని చాలా ఏళ్ళే అయింది. అదొక పూలతోట, ఒక పచ్చిక మైదానం, ఒక సముద్రం. దాని చెంతన జీవించడానికి ఒక జీవితం కావాలి. మరింకేమీ కోరని ఒక అనన్యశ్రద్ధ కావాలి. ప్రాపంచిక యశంకోసం పాకులాడటం మానేసిన ఒక ప్రశాంత మనఃస్థితి కావాలి.
 
ఇరవయ్యవ శతాబ్దంలో రూమీకి కొత్త తరం ఇంగ్లిషు అనువాదకులు వచ్చినట్టే హాఫిజ్ కి కూడా అనువాదకులు వచ్చారు. రాబర్ట్ బ్లై, డేనియల్ లాడిన్స్కీ మొదలైనవాళ్ళు. దాదాపు యాభై మందిదాకా ఉన్నారు. వారిలో లాడిన్స్కీది స్వేచ్ఛానువాదం. బ్లై సిద్దహస్తుడైన అనువాదకుడు కాబట్టి పారశీకంలోని గులాబీపరిమళాన్ని ఇంగ్లిషులోకి వడగట్టగలిగాడు.
 
ఈ పొద్దున్నే The Angels Knocking on the Tavern Door ( హార్పర్ కాలిన్స్, 2008) తెరిచాను. ముప్పై గజళ్ళ అనువాదం. ఒకప్పుడు కోలమన్ బార్క్స్ తో కలిసి రాబర్ట్ బ్లై ఇరాన్ వెళ్ళినప్పుడు అక్కడ బడిపిల్లలు హాఫిజ్ గీతాలు పాడటం విన్నాడు. ఆ సౌందర్యాన్ని తక్కిన ప్రపంచానికి పరిచయడమెలా అన్నదానిమీదనే ఆ తర్వాత పదిహేనేళ్ళ పాటు బ్లై దృష్టిపెట్టాడు. లియొనాల్డ్ లువిసెన్ అనే పారశీకపండితుడితో కలిసి హాఫిజ్ అనే సాగరం నుండి ముప్పై ముత్యాల్ని ఏరి మనకి అందించాడు.
 
పదిపదిహేనేళ్ళు దాటి ఉంటుంది ఈ పుస్తకం కొనుక్కుని. ఇప్పుడు తిరగేస్తుంటే, ఇంతకు ముందు చదివినప్పుడు, కొన్ని వాక్యాల దగ్గర మార్జిన్లో పెట్టుకున్న గుర్తులు కనిపించాయి. మొదటిపేజీలోనే రాబర్ట్ బ్లై రాసిన ముందుమాటలో ఒక వాక్యం:
 
‘ఒక పద్యం రాయడం మొదలుపెడుతూనే హాఫిజ్ వంద ఆశీర్వాదాలు మనమీద వర్షిస్తాడు. అంతరంగ రహస్యాలు విప్పి పరుస్తాడు. మధుపాత్రను ప్రశంసిస్తాడు, పూర్వకవుల పద్యాల్లోని గూడార్థాలు మనతో చర్చించడం మొదలుపెడతాడు.’
 
పుస్తకం చివర్లో లియొనార్డ్ లువెసొన్ రాసిన మరొక వ్యాసం కూడా ఉంది. హాఫిజ్ ప్రతిభ గురించీ, హాఫిజ్ ను అనువదించడంలోని సమస్యల గురించీ రాసిన వ్యాసం. అందులో కూడా కొన్ని వాక్యాల పక్కన గుర్తులు పెట్టుకున్నవి కనిపించాయి. ఒక వాక్యంలో అంటున్నాడు, తామిద్దరూ, అంటే తానూ, రాబర్ట్ బ్లై ఒక్కో గజల్ నీ అనువదించడానికి కూచున్నప్పుడు ప్రతి ఒక్క గజలూ అనేక అంతరార్థాల బరువుతో వీపుమీద సరుకు నింపుకున్న ఒంటె తమ గదిలోకి ప్రవేశించినట్టు తమ మధ్య అడుగుపెట్టేది అని.
 
హాఫిజ్ ను చదవడం సంస్కృతంలో వాల్మీకిని, తమిళంలో నమ్మాళ్వారుని, హిందీలో తులసీదాస్ ని, ఇంగ్లిషులో మిల్టన్ ని చదవడం లాంటిది. ఆ కవుల్ని అనువాదంలో చదివినా బాగానే ఉంటుంది, కానీ ప్రతిసారీ మూలం చదవాలన్న మోహం ముప్పిరిగొంటూనే ఉంటుంది.
 
ఒకప్పుడు హాఫిజ్ ని దక్కన్ కి ఆహ్వానించారట. అనుకున్నది అనుకున్నట్లు జరిగిఉంటే ఆయన గోల్కొండ వచ్చి ఉండేవాడు. తనని ఆహ్వానించినప్పుడు వాళ్ళతో అన్నాడట కూడా: ‘మీ దగ్గర ఖుస్రో ఉన్నాడు చాలదా?’ అని. అయినా బయల్దేరాడు. తీరా ఓడ ఎక్కబోయే సమయానికి పెద్ద గాలిదుమారం రేగింది. భగవత్సంకల్పం తనకు అనుకూలం లేదనుకున్నాడు, ఓడ ఎక్కకుండానే వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ సందర్భంగా రాసిన గజల్ చూడండి:
 
 
ఇండియా వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాక
 
ఒక్క క్షణం పాటేనా ఈ ప్రపంచం గురించి ఆలోచించడం
వృథా. పద పోదాం, కట్టుగుడ్డలు అమ్ముకుని మధువు
కొనుక్కుందాం. ఎవరు చెప్పారు మధువుకన్నా వస్త్రాలు మెరుగని?
 
మధువిక్రేతలు కిక్కిరిసిన సందుల్లో ప్రార్థనకోసం పరుచుకునే
చాప గిన్నెడు మధువుకి కూడా కొరగాదు. ప్రార్థనచేసుకోడానికి
పరుచుకునే చాపల గురించి అంతకన్నా ఏం చెప్పగలం?
 
పానశాల ద్వారపాలకుడు నామీద అరిచాడు. గుమ్మం దగ్గర
నించోవద్దన్నాడు. దూరంగా పొమ్మన్నాడు. ఇదేమిటిది? ఒక శిరసుకన్నా
గుమ్మందగ్గర దుమ్ము ఎక్కువ విలువైందా?
 
చక్రవర్తి రత్నకిరీటంలోపల దాగి ఉంటుంది, తననెవరన్నా
చంపేస్తారన్న భయం. కిరీటమంటే ఏమిటి? అదో రకం టోపీ.
మన శిరసు చెల్లించి మరీ కొనుక్కోవలసిందేమీ కాదది.
 
ఒకింత లాభం పొందడానికి సముద్రాన్నీ, సముద్రపు తుపానుల్నీ
సహించడం సులభమనిపించింది. కానీ పొరపడ్డాను.
వంద ముత్యాలకి ఒక తుపాను మరీ ఎక్కువ మూల్యం.
 
నీ ఆరాధకులనుంచి నీ ముఖం తప్పించడం మంచింది. ప్రపంచం మీద
పెత్తనంలో సైనికాధికారులు పొందే సంతోషం
ఒక సైన్యం పడే నరకయాతన కన్నా విలువైంది కాదు.
 
తృప్తిపడటానికి ప్రయత్నించడం మంచిది. హాఫిజ్ చేసేదదే.
ప్రపంచాన్ని వదిలిపెట్టు. లవలేశం నువ్వీ ప్రపంచానికి ఋణపడ్డా
అది వంద కుంచాల బంగారం కన్నా ఎక్కువ భారం.
 
4-10-2022
 
 
 
 
 
 

Leave a Reply

%d bloggers like this: