
అతడు మరోమాట కూడా చెప్పాడు
‘ఇటువంటి వృద్ధాశ్రమాలు నడపాలంటే మనం మన ఇంట్లో ఉండి సిబ్బందిని పెట్టుకుని వాళ్ళ ద్వారా నడపాలంటే సాధయమయ్యే పని కాదు.మనం కూడా ఇక్కడే ఉండాలి. వీళ్ళతోటే జీవించాలి. అప్పుడే నిర్వహణ పూర్తిగా మన ఆధీనంలో ఉంటుంది. నేను మొదట్లో షిర్డీలో ఇల్లు కట్టుకోవాలనుకున్నాను. కొంత స్థలం కూడా కొనుక్కున్నాను. కాని ఇప్పుడు ఆ ఆలోచన విరమించాను. బాబాకి వాగ్దానం చేసుకున్నాను. ఎప్పటికీ ఇల్లు కట్టుకోననీ, ఈ వృద్ధులతో పాటే ఇక్కడే కలిసి ఉంటాననీ.’
ఇరవయ్యేళ్ళుగా నిర్వహిస్తున్న ఈ సద్వ్రతం అతణ్ణి ఆధ్యాత్మికంగా మరింత బలోపేతుణ్ణి చేసిందనేఅనిపిస్తున్నది. ఇవ్వడం అనేది అతడి స్వభావంగా మారిపోయింది. నేను దేవుడికి ఒక నూతన వస్త్రం కొనడం కోసం ఒక వస్త్రాల దుకాణంలో అడుగుపెట్టాను. ఆ దుకాణం అతడు చూపించిందే. అతడు కూడా నా వెనక వచ్చాడు. ఏ వస్త్రం కొంటే బాగుంటుందో ఎంపిక చేసాడు. మేము బిల్లు చెల్లిస్తూ ఉండగా దుకాణదారుకి నన్ను పరిచయం చేసాడు. ఆ దుకాణదారు చేతిలో పాలకోవా పాకెట్టు ఉంది. అతడు ఒక కోవాబిళ్ళ నా చేతిలో పెట్టాడు. బాబా ప్రసాదం అన్నాడు. నేను వెంటనే తినడం మొదలుపెట్టాను. అతడి చేతిలో కూడా పెట్టాడు. కాని అతడు దాన్ని తినలేదు. వాళ్ళని చిన్న ప్లాస్టిక్ కవరు అడిగి అందులో భద్రంగా పెట్టాడు. బయటకి రాగానే అక్కడ మా కోసం వేచి ఉన్న అమృత చేతుల్లో పెడుతూ ‘నీ కోసమే ఇది ‘అన్నాడు. నాకు చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది. వళ్ళంతా పుండుగా మారిపోయిన ఒక వృద్ధురాలికి ఆశ్రమం సిబ్బంది కూడా అన్నం వడ్డించడానికి సందేహిస్తున్న సమయంలో, అతడు గిన్నెలో అన్నం కలుపుకుని ముద్దలు చేసి ఆమెకి తినిపించాడంటే ఆశ్చర్యం లేదనిపించింది.
3
షిర్డీ ఎప్పుడు వెళ్ళినా చుట్టుపక్కల పుణ్యక్షేత్రాలో, చారిత్రిక ప్రదేశాలో కూడా చూస్తూ ఉండటంతో, ఇక దగ్గరలో చూడవలసినవేవీ మిగల్లేదు. విజ్జి వని వెళ్ళి సప్తశృంగి చూడాలనుకుంది. కాని దసరా మొదలవడంతో అక్కడ బాగా రద్దీ ఉంటుందని చెప్పడంతో ఆ ఆలోచన విరమించుకున్నాం. కాని షిర్డీకి దగ్గర్లోనే ఒక దత్తక్షేత్రం ఉంది చూడవచ్చని చెప్పడంతో ఒకరోజు అక్కడికి బయల్దేరాం.
కానీ ఆ క్షేత్రం అహ్మద్ నగర్ జిల్లాలో నెవాసాకు దగ్గరలో ఉన్న దేవ గఢ్ శ్రీ క్షేత్రం. షిర్డీనుంచి దాదాపు వందకిలోమీటర్ల దూరంలో ఉంది. వర్షాలకు మహారాష్ట్ర రోడ్లనీ ఎంత పాడయిపోయాయో ఆ రోజు ప్రత్యక్షంగా చూసాం. ప్రయాణానికి రెండున్నర గంటల పైనే పట్టింది. కాని చెరకు, పత్తి, సోయాబీన్ పొలాల మధ్య, మహారాష్ట్ర పల్లెల మధ్య ఆ ప్రయాణం చేస్తూన్నంతసేపూ ఒకప్పటి అదిలాబాదు జిల్లాలో ప్రయాణిస్తున్నట్టే ఉంది.
కాని మా అలసట అంతా ఆ శ్రీక్షేత్రంలో అడుగుపెట్టగానే దూదిపింజలాగా తేలిపోయింది. ప్రవర అనే ఒక నది ఒడ్డున ఒక తపోశాలి సూచన మేరకు నిర్మించిన క్షేత్రం అది. దాన్ని ఎవరో ఒక స్వర్గఖండంగా అభివర్ణించడంలో అతిశయోక్తి లేదు. ఆ మందిరప్రాంగణం చూడగానే నాకు కొలనుపాకలో శ్వేతామబర జైన మందిరం గుర్తొచ్చింది. వైశాల్యాన్నీ, ఔదార్యాన్నీ స్ఫురింపచేసే వాస్తు అది. అందులో ప్రధానమైన మందిరం దత్తాత్రేయుల మందిరం. చిన్న మందిరం. ఆ మందిరమధ్యంలో పాలరాతిలో చెక్కిన దత్తాత్రేయుడు పట్టపగలే వెన్నెల కురిపిస్తూ ఉన్నాడు. బయట ఆయనకు అటూ ఇటూ జ్ఞానేశ్వర మహరాజ్, తుకారాం విగ్రహాలున్నాయి. దత్తాత్రేయులకు పాలకోవా నైవేద్యంగా సమర్పించి తిరిగి ఆయన ప్రసాదంగా స్వీకరించాం. అక్కణ్ణుండి ఆ నది ఒడ్డుకు వెళ్ళాం. ప్రవర నది గోదావరి ఉపనది. ఆ నదికి అక్కడ చాలా చక్కని స్నానఘట్టం నిర్మించారు. బోటింగుకి కూడా ఏర్పాటు ఉంది. ఆ క్షేత్రం ఒక పూట వెళ్ళి వచ్చేదికాదనీ, కనీసం ఒక వెన్నెల రాత్రి, ఒక శుభప్రభాతం అక్కడ ఉండవలసిందనీ అనిపించింది.
అక్కడ భోజన హోటల్ కూడా ఉంది. ఆకలి నకనకలాడటంతో భోజనానికి కూచున్నాం. మహారాష్ట్ర గ్రామసీమల తరహా భోజనం. రొట్టె, పప్పు, కూర, ఊరగాయ.
సద్గురు కిసన్ గిరి మహరాజ్ (1907-1983) అక్కడికి దగ్గరలో ఉన్న గోధెగావ్ లో జన్మించాడు. జీవితాన్ని తపస్సుకీ, సంఘసేవకీ అంకితం చేసాడు. ఆయన శిష్యుడు భాస్కరగిరి మహారాజ్ ఆయన తపసు చేసుకున్న ఆ ప్రాంతాన్ని ఒక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాడు. ఆ ప్రాంగణమంతా మూర్తీభవించిన పరిశుభ్రత అని చెప్పవచ్చు. ఒకప్పుడు జ్ఞానేశ్వర మహారాజ్ నెవాసాలోనే జ్ఞానేశ్వరి రాసాడని చెప్తారు. కాబట్టి ఆ ప్రాంతాన్ని ఒక తీర్థస్థలంగా మార్చడంకోసం ఆ శ్రీక్షేత్రాన్ని రూపొందించారు. ఆ ప్రాంగణంలో కిసన్ గిరి మహరాజ్ సమాధి కూడా ఉంది. దానితో పాటు ఒక కీర్తనమంటపం, సిద్ధేశ్వరుడి పేరిట ఒక శివాలయం కూడా ఉన్నాయి.
కాని నెవాసాలో జ్ఞానేశ్వర మహరాజ్ తపసు చేసి జ్ఞానేశ్వరి రాసిన చోటు చూడలేకపోయానే అన్న వెలితి మాత్రం మిగిలిపోయింది. మహారాష్ట్ర సంత్ కవులు పుట్టి పెరిగి పాటలు పాడిన తావులు చూడాలన్న ఒక ఆలోచన ఎలానూ ఉంది కాబట్టి, నెవాసా సందర్శనం ఆ యాత్రకోసమే మిగిలిపోయిందని నాకు నేను చెప్పుకున్నాను.
3-10-2022