
విమోచన రెండు రకాలు. ఒకతరహా విమోచన కారులు మనల్ని మరిన్ని ఆర్థిక అవకాశాలవైపూ, సౌకర్యవంతమైన జీవితంవైపూ, సామాజిక అభ్యుదయం వైపూ నడిపిస్తారు. మన హక్కులకోసం పోరాడతారు. వారిద్వారా మనకి సిద్ధించేది ఆర్థిక స్వాతంత్య్రం, రాజకీయ స్వాతంత్య్రం. మరొక తరహా విమోచనకారులు మనల్ని సరళతరం చేస్తారు, నిరాడంబరత వైపు నడిపిస్తారు, అవసరమైతే మనల్ని పూర్తిగా నిర్ధనుల్ని చేస్తారు. వాళ్ళు పోరాడేది మన బాధ్యతల గురించి. వాళ్ళ ద్వారా మనకి సిద్ధించేది మానసిక స్వాతంత్య్రం. కబీరూ, సాయిబాబా, గాంధీ ఈ రెండవతరహా విమోచన కారులు. కపర్దే తన డైరీలో ఒకచోట ఇలా రాసుకున్నాడు:
‘ఈ సాయంకాలం మేము మసీదుకి చేరుకున్నాక, సాయిబాబా వాహ్యాళికి బయల్దేరబోయేముందు దీక్షిత్ తో నా భార్యకు రెండువందలు ఇమ్మని చెప్పారు. అప్పుడు నా భార్య ఆయన పాదాలకు మర్దనా చేస్తూ ఉంది. సాయిబాబా అలా ఎందుకు ఆదేశించారో నాకు ఎంత మాత్రం అర్థం కాలేదు. చివరికి నేను ఇతరుల దయాభిక్ష మీద బతకవలసిన స్థితికి చేరుకున్నానన్నమాట! ఇంతకన్నా చావడం నయం. బహుశా సాయిబాబా నా అహంకారాన్ని అణచిపెట్టడానికీ, అంతిమంగా నా గర్వాన్ని ధ్వంసం చెయ్యడానికీ పూనుకున్నారనుకుంటాను. అందుకోసమే ఆయన నన్ను పేదరికానికీ, దానధర్మాలకీ అలవాటు చేస్తున్నారనుకుంటాను.’
ఏళ్ళ తరువాత కపర్దే తన పాత డైరీలు తిరగేస్తూ, ఇక్కడకు వచ్చేటప్పటికి మళ్ళా ఒక ఫుట్ నోట్ రాసుకున్నాడు. అందులో ఇలా అంటున్నాడు:
‘1912 ఫిబ్రవరి 1 వతేదీ డైరీ తీసి నువ్వు చూపించిన పేరాగ్రాఫు మళ్ళా చదివాను. ఆ వాక్యాలు నా భావాల్ని సరిగానే వెల్లడిస్తున్నాయి. మన సద్గురు సాయి మహరాజ్ ఇచ్చిన ఆదేశాలవి. సర్వజ్ఞుడు కాబట్టి ఆయనకు అంతాతెలుసు. కాబట్టి నా అంతరంగంలోపల ఉన్నది కూడా ఆయనకి తెలుసు. కాని తన ఆదేశాలు పాటించితీరమని ఆయన ఎప్పుడూ ఒత్తిడి చెయ్యలేదు. ఇప్పుడు మళ్ళా ఈ పేరాగ్రాఫుమీద నా దృష్టిమళ్ళించావు కాబట్టి నాకు ఒకటి అనిపిస్తూ ఉంది. ఆ రోజుల్లో నా భార్య పేదరికాన్నీ, కాయకష్టమ్మీద ఆధారపడి జీవించడాన్నీ ఇష్టపడేది కాదు. కాకా సాహెబ్ దీక్షిత్ పేదరికాన్నీ, కాయకష్టాన్నీ ఇష్టపడ్డాడుకాబట్టి సంతోషంగా ఉన్నాడు. అందుకనే సాయిమహరాజ్ నాకు రెండువందలు ఇమ్మన్నాడు. అంటే నా జీవితానికీ పేదరికమూ, సహనమూ అన్నమాట.’
ఈ మాటలు చదవగానే నాకు ‘బహురూపి గాంధి’ పుస్తకంలో అను బంధోపాధ్యాయ రాసిన ఈ వాక్యాలు గుర్తొచ్చాయి. ఆయన గాంధీని ఒక బందిపోటు అని అభివర్ణిస్తూ ఇలా రాసాడు:
‘ఒకసారి వీథులూడ్చేపనివాళ్ళ సమావేశంలో ఒక మహిళ తన చేతికి ఉన్న రెండు బంగారుగాజులూ గాంధీకి ఇచ్చి, ‘ఈ రోజుల్లో భర్తలు భార్యలకోసం చాలా తక్కువ సొమ్ము కేటాయిస్తున్నారు. అందుకే నేను తమకు ఇంతకంటే ఇంకేమీ ఇచ్చుకోలేకపోతున్నాను. ఇవే నా వద్ద మిగిలిన ఆఖరి ఆభరణాలు. వీటిని హరిజనుల సేవకు వినియోగించండి ‘ అంది. ‘నేను అనేకమంది వైద్యులనూ, న్యాయవాదులనూ, వర్తకులనూ బిచ్చగాళ్ళుగా చేశాను. ఇందుకు నేనేమీ పశ్చాత్తాప పడటం లేదు. ఒక పైసా సంపాదన కోసం మనుషులు మైళ్ళకొద్దీ వెళ్ళాల్సి వస్తున్న భారతదేశంలో ఖరీదైన ఆభరణాలు ధరించడం ఎవరికైనా శోభనివ్వదు ‘అన్నాడు గాంధీ.’
ఇది స్పష్టంగా కబీరు మార్గం. ఈ పేరాగ్రాఫు గురించి రాస్తూ వి.బి.ఖేర్ కపర్దేల జీవనశైలి ఉండేదో వివరంగా చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు కపర్డే వార్షికాదాయం దాదాపు లక్ష రూపాయల దాకా ఉండేదట. దాదాపు యాభై మంది ఆ ఇంటిని ఆశ్రయించుకుని ఉండేవారట. పదిపన్నెండు మంది విద్యార్థులు చదువుకుంటూ ఉండేవారు. ఎవరికి వారికి నేతిగిన్నె లేకుండా వడ్డన జరిగేది కాదు. ఆ నేపథ్యంలో చూసినప్పుడు సాయిబాబా దీక్షిత్ ని కపర్దే దంపతులకి రెండువందలు ఇమ్మనడంలోని స్ఫూర్తి ఏమిటో అర్థమవుతుంది. కాని ఆ నిర్మల భక్తి ఊరకనే పోలేదు. సాయిబాబా కపర్దే శ్రీమతిని తన తల్లిలాగా, తనయలాగా దగ్గరకు తీసుకున్నాడు. ఆమెకి రాజారాం అనే మంత్రోపదేశం చేసాడు. ఆ కృపాబలం వల్ల ఆమె ఈ లోకం నుంచి నిష్క్రమించేటప్పుడు అపరిమితమైన ప్రశాంత చిత్తంతో సెలవుతీసుకొన్నదని వి.బి.ఖేర్ కళ్ళకి కట్టినట్టు వివరిస్తాడు.
2
ఇన్నాళ్ళుగా వస్తున్నా దీక్షిత్ వాడాలో ఒక మూజియం ఉందని నాకు తెలీదు. ఈ సారి మా అమృత చూపిస్తే చూసాను. అందులో సాయిబాబా ధరించిన దుస్తులు, వాడిన పాత్రలు, ఉపకరణాలతో పాటు అరుదైన ఫొటోలు కూడా ఉన్నాయి. ఆ ఫొటోల్లో సాయిబాబా నేత్రాలు ఏకకాలంలో చాలా పలచగానూ, చాలా లోతుగానూ కూడా కనిపించాయి. ఆయన ఎవరు? పఠానా, ఆఫ్గనా, దక్కనీనా అని ఆలోచిస్తూ ఉంటే, ఎవరో నా మదిలో ‘జాతి నా పూఛో సాధుకీ పూఛ్ లీజియే గ్యాన్ ‘అంటున్నారు!
ఆ పక్కనే ఒక పారాయణమందిరం కూడా ఏర్పాటు చేసారు. అది కూడా ఈసారే కొత్తగా చూడటం. అక్కడ కూచుని అందరం కొంతసేపు సచ్చరిత్ర పారాయణం చేసాను. నా వరకూ పదిహేనో అధ్యాయం చదవాలనిపించి తెరిచాను. అందులో నాకెంతో ఇష్టమైన చోల్కర్ కథ ఉంది. సచ్చరిత్రలోని ఎందరో సాయి భక్తుల కథల్లో చోల్కర్ కథలో చెప్పలేని తీయదనముంది.
చోల్కర్ థానాలో సివిల్ కోర్టులో చిన్న ఉద్యోగి. తన ఉద్యోగం పర్మనెంటు అయితే షిరిడి వచ్చి అందరికీ కలకండ పంచుతానని మొక్కుకున్నాడు. పండగ, సెలవు, తీర్థయాత్ర అప్పుచేసి గడపకూడదనేది సాయిబాబా పెట్టిన నియమం కాబట్టి, తన షిర్డీ యాత్రకి నెమ్మదిగా సొమ్ము ఆదాచెయ్యడం మొదలుపెట్టాడు. చిన్న ఉద్యోగి, బండెడు సంసారం కాబట్టి సొమ్ము ఆదాచెయ్యడం కష్టమైపోయేది. అందుకని తన ఆహారంలో చక్కెర వదిలిపెట్టేసాడు. చక్కెరలేకుండానే టీ తాగేవాడు. ఇట్లా చాలినంత పొదుపు చేసుకున్నాక షిరిడీ వెళ్ళాడు. అందరికీ కలకండ పంచాడు. సాయిబాబా ఎదట నిలబడి ‘నా సంకల్పం నెరవేరింది. నాకు సంతోషంగా ఉంది’ అన్నాడు. అతడు బాపూసాహెబ్ జోగ్ కి అతిథిగా ఉన్నందువల్ల, అతడితో కలిసి సాయిబాబా దగ్గరికి వెళ్ళినందువల్ల, బాబా నుంచి సెలవు తీసుకోవడానికి జోగ్ లేవగానే తను కూడా లేవకతప్పింది కాదు. అప్పుడు సాయిబాబా జొగ్ తో ‘ఇంటికి వెళ్ళాక అతడికి బాగా చక్కెర వేసి తేనీరు కాచి ఇవ్వు ‘ అన్నాడు. ఎప్పుడూ లేనిది సాయిబాబా టీ ప్రసక్తి ఎందుకు తెచ్చాడో జోగ్ కి అర్థం కాలేదు. కాని చోల్కర్ కి అర్థమయింది. అతడి కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి.
సాధారణంగా నియమం, లేదా వ్రతం చాలా చేదుగా ఉంటుంది. కాని వ్రతఫలితం, ఎంత మధురంగా ఉంటుందో ఈ చిన్న కథ చెప్తున్నది. అందుకనే ఈ కథ అంటే ఎంతో ఇష్టం నాకు. అయితే ఆ మాధుర్యం వ్రతసమాప్తివేళమాత్రమే కాదు, వ్రతం పట్టినంతకాలం కూడా ఉండాలి, సబూరి అంటే అదే. సంతోషంతో ఓపిక పట్టడం.
3
సాయిబాబా జీవితమంతా వర్తకుల అయిష్టాన్ని చూస్తూ వచ్చాడు. ఒంటె సూదిబెజ్జంలోంచి పయనించగలదుగాని తేలీ (నూనె వ్యాపరి). వణి (చిల్లర వ్యాపారి) సాయిబాబా దగ్గరకు పోలేకపోయారు. సాయిబాబా తెరిచిపెట్టుకున్న లోకంలో బేరసారాలుండవు. కబీరు చెప్పుకున్న దేశంలాగా అక్కడ అమ్మకాలూ, కొనుగోళ్ళూ ఉండవు. యెరుషలేం దేవాలయంలో మొదటిసారి అడుగుపెట్టినప్పుడు ఆ దేవాలయప్రాంగణాన్ని దుకాణంగా మార్చేసారనే కదా క్రీస్తు ఆగ్రహోద్రిక్తుడయింది!
అలాగని సాయిబాబా తెరిచిపెట్టుకున్న అంగడిలో ప్రతి ఒక్కటీ ప్రతి ఒక్కరికీ ఉచితంగా దొరుకుతుందని కాదు. నువ్వు ప్రాపంచిక జీవితం నుంచి ఒక అడుగు దూరంగా వెయ్యగలిగిగే ఆయన రెండు అడుగులు నీకు దగ్గరగా వస్తాడు. ఈ సారి అటువంటి ఒక ధన్యుణ్ణి షిరిడీలో చూసాను.
మామూలుగా యువకులు ప్రభుత్వోద్యోగాల కోసం వెతుక్కునే వయసులో అతడు సాయిబాబామీద ప్రేమతో షిరిడీ వచ్చేసాడు. ఏమి చెయ్యాలని గాని, ఏదో ఒకటి చెయ్యాలని గానీ అనుకోలేదు. కాని ఒకసారి దేవస్థానం దగ్గర పిల్లలు వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన వృద్ధుల్ని చూసాడు. వాళ్ళకి ఎక్కడా ఆశ్రయం లేదు. ఎవరూ అన్నం పెట్టేవాళ్ళు కూడా లేరు. వాళ్ళని తన దగ్గరకు తెచ్చుకున్నాడు. తనే అన్నం పెట్టి చూసుకోవడం మొదలుపెట్టాడు. అలా నిరాశ్రయులుగా ఉన్న వృద్ధులకోసం ఒక వృద్ధాశ్రమం ప్రారంభిస్తే బాగుంటదనుకున్నాడు. 1997 లో ఒక సంస్థ రిజిష్టరు చేయించాడు. 2002 నుంచి కార్యక్రమం మొదలుపెట్టాడు. ముగ్గురితో ప్రారంభమైన ఆ వృద్ధాశ్రమంలో ఇప్పుడు 135 మంది వృద్ధులు ఉన్నారు. అతడి సేవానిరతి చూసి ఒక కాశ్మీరీ పండితుడు మూడుకోట్ల విలువైన భవనసముదాయం కట్టించి ఇచాడు. దేవస్థానంవారు ఆ వృద్ధులకి రాత్రి పూట భోజనవసతి, వైద్య సదుపాయం ఉచితంగా ఏర్పాటు చేసారు. పొద్దున్న అల్పాహారం, మధ్యాహ్న భోజనం దాతలు సమకూరుస్తున్నారు.
ఆ కేంద్రానికి వెళ్ళి చూసాను. ఆ భవనసముదాయం, అక్కడి పరిశుభ్రత, ఆ నిబద్ధత నన్నెంతో ఆకట్టుకున్నాయి. ‘నాకు తెలిసి కొంత మంది ఎంతో పెద్ద మనసుతో వృద్ధాశ్రమాలు మొదలుపెట్టి నడపలేక చేతులెత్తేసారు. మీరు నడపగలుగుతున్నారు ఏమిటి కారణం?’ అనడిగాను అతణ్ణి.
‘బాబా అనుగ్రహం ‘అన్నాడు అతడు.
2-10-2022