ఆ మందహాసాన్ని ఒక్కసారి చూడటానికేనా

కొంతమంది ఇక్కడికి వచ్చేముందే నాలుగు హారతులూ చూడటానికి ప్లాన్ చేసుకుని వస్తారు అంది విజ్జి. కాని మేము ఒక్క హారతి దర్శనానికే ఏర్పాట్లు చేసుకుని వచ్చినా నాలుగు హారతులు చూసాం ఈసారి షిరిడీలో. ఒకసారి ముందువరసలో, మరొకసారి రెండవ వరసలో, మూడవసారి అందరికన్నా వెనగ్గా, నాలుగవసారి సమాధిమందిరం ప్రాంగణంలో, ముఖదర్శనం చేసుకుంటూ.

ముప్పై ఏళ్ళయింది, షిర్డీ మొదటిసారి వచ్చి. అప్పుడు నేను ఉట్నూరులో పనిచేస్తున్నాను. ఢిల్లీలో ఒక ట్రయినింగుకి వెళ్ళినప్పుడు నాతో పాటు విజ్జి, మా చెల్లెలు అనసూయ కూడా ఉన్నారు. ఇద్దరు ప్రధానోపాధ్యాయులు జార్జి, పురుషోత్తమరావు కూడా ఉన్నారు. అప్పుడు ఈ రద్దీ, విస్తారమైన ఈ ఏర్పాట్లు లేవు. ఆ తర్వాత ఈ ముప్పై ఏళ్ళుగా చాలాసార్లే వస్తూ వున్నాను. ఎప్పుడు వచ్చినా తల్లిలాంటి ఆయన ప్రేమలో, తండ్రిలాంటి ఆ సంరక్షణలో మాత్రం ఎట్లాంటి మార్పూ లేదు.

చాలా ఏళ్ళ కిందట, నేను శ్రీశైలంలో పనిచేస్తున్నప్పుడు ఐ టి డి ఏలో పనిచేసే ఉద్యోగులు, ఇద్దరు అమ్మాయిలు మా ఇంటికి వచ్చారు. మేము వరండాలో కూచుని మాట్లాడుకుంటూ ఉండగా వారి దృష్టి అక్కడ గోడమీద మేము అలంకరించుకున్న సాయిబాబా పటం మీద పడింది. మీకు ఈయనంటే ఇష్టమా అనడిగారు. అవునన్నాను. ఎందుకన్నారు. ఎందుకంటే ఆయన casteless, classless human being కాబట్టి అన్నాను. వర్గరహిత సమాజం బృహత్ వ్యవస్థల్లో ఏమేరకు సాధ్యమవుతుందో, ఏ మేరకు నిలబడుతుందో నాకు తెలియదు, కాని చిన్న చిన్న బృందాల్లో, కమ్యూనుల్లో అది సుసాధ్యమే. భారతీయ భక్తికవులు, కబీరు, రైదాసు వంటివారి సన్నిధిలో, అల్లమప్రభు స్థాపించిన అనుభవమంటపంలో, దక్షిణేశ్వరంలో, తిరువణ్ణామలై mountain path లో అది సాధ్యమైందని ఆ భక్తుల అనుభవాలు చదివితే మనకి అర్థమవుతుంది. అది classless, casteless మాత్రమే కాదు, cultless కూడా.

సహ్యాద్రి అంతటా వ్యాపించిన దత్తసంప్రదాయం, పండరిపురం కేంద్రంగా విలసిల్లిన విట్ఠల సంప్రదాయం, సంత్ భక్తి వాగ్గేయకారుల కీర్తన సంప్రదాయం, వార్కరి, మహానుభావ సంప్రదాయం, నాథ సంప్రదాయం, మరొకవైపు దక్కన్ ని వెలిగించిన సూఫీ సంప్రదాయం ఇవ్వన్నీ సాయిబాబాలో సంగమించించాయి. అంతేకాదు, ఆ సంప్రదాయాలన్నింటిలోనూ కూడా ఒక ఎరుక ఉంటుంది, అదేమంటే తాము కలుసుకోబోతున్న ప్రతి ఒక్క మనిషీ, తమకి సంభవించబోతున్న ప్రతి ఒక్క అనుభవం ఒక భగవత్సందేశాన్ని వెంటతెస్తున్నవే అన్న ఒక నిత్యజాగృతి వాళ్ళల్లో సదా మెలకువగా ఉంటుంది.

ఇంతకీ ఒక మానవసమూహం classless, casteless అయిన తర్వాత ఏమి చేస్తుంది? మార్క్స్ ఊహించిన దాని ప్రకారం, దోపిడీ లేకపోయిన తర్వాత మనిషికి కాయిక శ్రమనుంచి కొంత విశ్రాంతి లభిస్తుంది. ఆ తీరికలో అతడు ప్రకృతికి మరింత సన్నిహితంగా జరుగుతాడు. కాని కాయికశ్రమనుంచి లభించిన తీరికని మనుషులు ఎలా ఉపయోగించుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మన తీరిక మనల్ని మనుషులకి దూరం చేసే తీరిక. మన apetites ని మరింత రెచ్చగొట్టే తీరిక. దీన్నుంచి బయటపడి, మన తీరికను మరింత సార్థకం చేసుకోవాలంటే మనజీవితం purpose driven life కావాలంటే మనకొక ధ్యేయమో, గురువునో, సత్సాంగత్యమో అవసరం.

సాయిబాబాని నమ్ముకున్నవాళ్ళ జీవితాలు చూస్తున్నాను, చాలా ఏళ్ళుగా. వాళ్ళ జీవితాల్లో ఆ తీరిక భగవత్ప్రార్థనల్తో, కవిత్వంతో, కీర్తనల్తో లేదా లోకానికి ఉపకరించే ఏదో ఒక సేవలో గడవడం చూస్తూ ఉన్నాను. ఇది ఇప్పుడే కాదు, సాయిబాబా భౌతికదేహంతో ఉన్నప్పణ్ణుంచీ కనిపిస్తున్న విషయమే.

ఒకప్పుడు మహారాష్ట్రలో గణేష్ శ్రీకృష్ణ కపర్దే ( 1854-1938) అనే ఒక న్యాయవాది ఉండేవాడు. ఆయన సంస్కృతంలోనూ, ఇంగ్లిషులోనూ కూడా మహాపండితుడు. లోకమాన్య బాలగంగాధర తిలక్ కి సన్నిహితుడు. ఆయన భారతజాతీయ కాంగ్రెసులో క్రియాశీల బాధ్యతలు నిర్వహించాడు. వైస్రాయి ఎక్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబరుగా కూడా ఉన్నాడు. తిలక్ ను రాజద్రోహ నేరం కింద మాండలే జైలులో నిర్బంధించినప్పుడు ఆయన విడుదలకోసం రెండేళ్ళ పాటు ఇంగ్లాండులో ఉండి విశ్వప్రయత్నం చేసాడు. 1911 లో తిరిగి వచ్చాక, షిరిడి వెళ్ళాడు. అక్కడ సాయిబాబా అతణ్ణి దాదాపు మూడునెలలపాటు కదలనివ్వకుండా అట్టేపెట్టేసాడు. తిరిగి వెళ్ళడానికి ఎన్నిసార్లు అనుమతి అడిగినా ఇవ్వలేదు. కాని ఆ తర్వాత రోజుల్లో కపర్దేకి అర్థమయిందేమంటే, ఆ రోజులన్నిటా బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకోసం వలపన్ని ఉన్నదనీ, ఆయన ఆ కాలంలో షిరిడీలో కాక మరెక్కడ ఉన్నా అరెస్టయి ఉండేవాడనీ. చివరికి, షిరిడీలో కూడా ఆయనకి తెలియకుండా, ఆయన ఎంతో గౌరవించే ఒక పండితుడి రూపంలో ఒక గూఢచారిని కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఆయన మీద నియమించడానికి కూడా వెనుదీయలేదని!

కపర్దేకి డైరీలు రాసే అలవాటు ఉంది. ఆయన 1910 లో మొదటిసారి షిరిడీ వెళ్ళినప్పుడు వారం రోజులు ఉండిపోయారు. ఆ వారం రోజులూ తన దినచర్య రాసుకున్నాడు. ఆ తర్వాత షిరిడీలో ఉండిపోయిన మూడునెలల దినచర్య 6-12-1911 నుంచి 13-3-2012 దాకా కూడా తన దినచర్య రాసిపెట్టుకున్నాడు. షిరిడిలో సాయిబాబా జీవితం, బోధనల గురించి సాయిసచ్చరిత్ర తర్వాత చెప్పుకోదగ్గ ప్రత్యక్ష కథనాల్లో కపర్దే డైరీ కూడా ఉంటుంది. ఆధునిక విద్యని అభ్యసించి, ఆధునిక వృత్తిజీవితం జీవిస్తూ, ఆధునిక రాజకీయాల్లో తలమునకలుగా ఉన్న ఒక ప్రత్యసాక్షి సాయిబాబా గురించి తనకై తాను రాసుకున్న డైరీకన్నా ఎక్కువ విశ్వసనీయమైన, ప్రామాణిక కథనం మరేముంటుంది కనుక!

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కపర్దే దినచర్య చూసినప్పుడు, అందులో రెండు అంశాలు కనిపిస్తాయి. ఒకటి హారతిసమయాల్లోనో, హారతి తర్వాతనో సాయిబాబాని చూడటం. ఆయన అవకాశమిస్తే, కొద్ది సేపు అక్కడ కూచోడం, ఆయన చెప్పే మాటలు వినడం. తక్కినసమయాల్లో పూర్తిగా సద్గోష్టి, సద్గ్రంథపఠనం. రామాయణం, భావార్థ రామాయణం, భాగవతం, దాసబోధ, జ్ఞానేశ్వరి, అమృతానుభవం, పంచదశి వంటి గ్రంథాలు కలిసి చదువుకోవడం, కీర్తనలు పాడుకోవడం, భజనలు-బహుశా అప్పటి షిర్డీకీ, ఇప్పటి షిర్డీకి తేడా ఎక్కడైనా ఉందంటే, ఈ అంశంలోనే అనుకోవాలి. ఇప్పుడు షిర్డీ వెళ్ళే చాలమంది భక్తులు, యాత్రీకులు నాతో సహా, హారతి దర్శనం మీదా, దర్శనమ్మీదా పెడుతున్న శ్రద్ధ, మిగిలిన సమయాన్ని ఎలా గడపాలన్నదాని మీద మాత్రం పెడుతున్నట్టు కనిపించడం లేదు. కాని కపర్దే డైరీ చదువుతున్నప్పుడు, ఆ భక్తులు సాయిబాబాని కలుసుకోడానికీ, కలుసుకోడానికీ మధ్య వ్యవధిలో తమని తాము సద్గ్రంథపఠనంలో, సంకీర్తనంలో గడిపినందువల్ల కాబోలు, వారికి సాయిబాబాని చూడగానే ఆ కొన్ని క్షణాల దర్శనం ఒక జీవితకాల అనుభవానికి సాటిగా అనిపించేది.

కపర్దే డైరీలో ఈ వాక్యాలు చూడండి:

‘మేమంతా పొద్దున్నే లేచి కాకడ హారతికి హాజరయ్యాము. అది ఎంతో నిష్టని కలగచేసే పుణ్యదర్శనంగా తోచింది.’ (8-12-1911)

‘ పొద్దున్నే లేచి చావడిలో జరిగే కాకడహారతికి హాజరయ్యాను. అన్నిటికన్నా ముందు సాయిమహరాజ్ వదనాన్నే దర్శించాను. ఆ వదనంలో అనుగ్రహం మధురాతిమధురంగా ప్రస్ఫుటమవుతూ ఉంది. నేను చెప్పలేనంత సంతోషాన్ని అనుభవించాను..’ (1-1-1912)

‘పొద్దున్నే లేచాను. బాపూసాహెబ్ జోగ్ స్నానానికి వెళ్ళడం చూసాను. ఈ లోపు నా ప్రార్థన పూర్తి చేసుకున్నాను. అప్పుడు మేము చావడిలో జరిగే కాకడ హారతికి వెళ్ళాం. ఆ రోజు మేఘా అస్వస్థుడిగా ఉండటంతో బాపూసాహెబ్ జోగ్ నే హారతి ఇచ్చాడు. అప్పుడు సాయిబాబా తన వదనదర్శనం మాకు అనుగ్రహిస్తూ ఒక దయార్ద్రభరిత మందహాసం చేసారు. ఆ మందహాసాన్ని ఒక్కసారి చూడటానికేనా ఏళ్ళకి ఏళ్ళు గడిపెయ్యవచ్చనిపించింది. నా ఆనందానికి హద్దులు లేవు. నేను పిచ్చివాడిలా అలానే నిలబడిపోయాను..’ (17-1-12)

1-10-2022

3 Replies to “ఆ మందహాసాన్ని ఒక్కసారి చూడటానికేనా”

  1. Casteless/Classless కాదు Cashless కూడా అయితే ఎంత బాగున్ను 🤔

Leave a Reply

%d bloggers like this: