ఆ ఋషులందరిదీ ఒకటే భాష

Reading Time: 2 minutes

ఆ మధ్య అజయ వర్మ అల్లూరి, డా.కొర్రపాటి ఆదిత్య మా ఇంటికి వచ్చినప్పుడు సాహిత్యం గురించి చాలానే మాట్లాడుకున్నాం. ఆ పిల్లలిద్దరికీ ఎంత సాహిత్య ప్రపంచం తెలుసని! ఒక్క తెలుగు అనే కాదు, కన్నడం, మళయాళం, తమిళం,ఇంగ్లిషు- మా సంభాషణ ఎమిలి డికిన్ సన్ మీదకు మళ్ళింది. ఆ పిల్లల అభిమాన కవుల్లో, ఆరాధ్య భావుకుల్లో డికిన్ సన్ ఉండటం నాకెంతో సంతోషమనిపించింది.

సంస్కృతం రాక వేదసూక్తాలు చదువుకోని భారతీయులకోసమే డికిన్ సన్ ఇంగ్లిషు లో కవిత్వం రాసిందా అనుకుంటాన్నేను. ఋగ్వేద ఋషులు ఏ ఉషస్సుగురించి, ఏ మరుత్తుల గురించి, ఏ అగ్ని గురించి, ఏ హిరణ్మయ ధూళి గురించి, ఏ సర్యవ్యాపక కాంతి గురించి గానం చేసారో, అవన్నీ మనకి అర్థమయ్యే మాటల్లో, అలతి అలతి ఇంగ్లిషు పదాల్లో డికిన్ సన్ కవితలుగా రాసిపెట్టింది.

కాని డికిన్ సన్ కి సంస్కృతమూ రాదు, వేదాలూ చదవలేదు. నేను మాట్లాడుతున్నదొక రూపకాలంకార భాష. కబీరు గురించి చెప్తూ హిందీ సాహిత్యవేత్తలు ఒక సాధుక్కడి ఉంటుందని చెప్పినట్టే నేను కూడా ప్రపంచవ్యాప్తంగా ఋషులందరికీ ఉమ్మడిగా ఒక ఋషి భాష ఉంటుందని చెప్తున్నాను. అది బషొ అయినా, హాఫిజ్ అయినా, బ్లేక్ అయినా, జిడ్డు కృష్ణమూర్తి అయినా ఋషులందరిదీ ఒకే ప్రపంచం, ఒకటే భాష. ఈ ప్రపంచాన్ని వాళ్ళు పరికించే తీరు ఒక్కటే. ఈ ప్రపంచానికి ఆవల ఉన్న లోకాల గురించి చెప్పవలసి వచ్చినప్పుడు వాళ్ళంతా చెప్పే కొండగుర్తులు కూడా దాదాపుగా ఒక్కలాంటివే.

వాళ్ళు వచ్చివెళ్ళిన రెండు మూడు వారాల తర్వాత గంగారెడ్డి వస్తే మళ్లా డికిన్ సన్ కవితలు కొన్ని వినిపిస్తే అతడు పరవశించిపోయాడు. నేను రూమీనో, బుల్లేషానో, రమణమహర్షి సంభాషణలో వినిపిస్తున్నట్టుగా చలించిపోయాడు.

డికిన్ సన్ ఇంగ్లిషు ఒకపట్టాన అర్థం కాదనీ, ఆమె పదాల మధ్య చాలా ఖాళీలు వదిలిపెడుతుందనీ, ఆ చిన్న కవితలో సముద్రమంత అనుభూతిని కుక్కిపెడుతుందనీ అంటారు. కాని నాకు షేక్స్పియరు నాటకాలు చదువుతున్నప్పుడు, ఆ ఇంగ్లిషు కన్నా ముందు ఆ భావం ఎట్లా సులభగ్రాహ్యమవుతూ ఉంటుందో డికిన్ సన్ ఇంగ్లిషు కూడా అలానే అనిపిస్తుంది. అయినా, ఒక కవితలో, అర్థమేమయి ఉంటుందా చూద్దాం అని నెట్ తెరవగానే అద్భుతమైన ఒక బ్లాగు సాక్షాత్కరించింది. The Prowling Bee (దిమ్మరి తేనెటీగ) పేరిట సుసాన్ కోర్న్ ఫీల్డ్ అనే ఆమె http://bloggingdickinson.blogspot.com/ నడుపుతున్న బ్లాగు అది. ఆమె డికిన్ సన్ రాసిన మొత్తం 1789 కవితలన్నిటికీ మనోహరమైన వ్యాఖ్యానం రాసే ప్రాజెక్టు మొదలుపెట్టింది. ఇప్పటికే చాలా పద్యాలకి వ్యాఖ్యానం రాసింది. అసలు అన్నిటికన్నా ముందు ఒక భావుకురాలు, సాహిత్యవిద్యార్థి తన కాలాన్నిట్లా డికిన్ సన్ ని చదవడంలో, ఆ కవిత్వం మీద తన తలపుల్ని మనతో పంచుకోవడంలో గడుపుతున్నది అన్న విషయమే నాకెంతో ఆరాధనీయంగా అనిపించింది. ఆమె తలపుల పందిరి కింద నించున్నాక డికిన్ సన్ కవిత్వ పరిమళం మరింత నాజూగ్గా తాకుతున్నది.

డికిన్ సన్ రాసిన ఏ ఒక్క కవిత తెరిచినా నాకు అన్నిటికన్నా ముందు మా ఊరు గుర్తొస్తుంది. ఆ సోమరి మధ్యాహ్నాలు, ఆ తూనీగలు, ఆ మబ్బుపింజలు, ఆ మట్టిబాటలు గుర్తొస్తాయి. మా ఊళ్ళో ఏరు ఒక మలుపు తిరిగిన చోట పెద్ద తెల్లమద్ది చెట్టు ఒకటి ఉండేది. ఆ చెట్టుదగ్గర నీళ్లు ఆగి గుమ్ము తయారయింది. పిల్లలం మధ్యాహ్నాల వేళ ఆ గుమ్ములో మునిగేవాళ్ళం. ఏళ్ల తరువాత నేను పునర్యానం రాస్తున్నప్పుడు అక్కడ అపరాహ్ణవేళల్లో దేవతలు వస్త్రాలు ఆరవేసుకున్నట్టు ఉండేది అని రాసాను. కాని అప్పుడు నాకు తెలీదు, డికిన్ సన్ కూడా అపరాహ్ణవేళల్లో దేవతలు ఆడుకుంటారని రాసిందని. ఈ కవిత చూడండి:

మరీ కష్టపడి పనిచేసే దేవదూతల్ని
దేవుడు మధ్యాహ్నం పూట ఆడుకోనిస్తాడు.
అలా ఒక దేవదూత కనబడ్డప్పుడు
నేను నా జతకత్తెల్ని మర్చిపోయాను.

సూర్యుడు అస్తమిస్తూండగానే దేవుడు
దేవదూతల్ని వెనక్కి తీసుకుపోతాడు.
దేవదూతల్తో వైకుంఠపాళీ ఆడాక
నా నేస్తాల్తో గోళీక్కాయలు ఎట్లా ఆడేది!

ఈ కవిత మీద సుసాన్ తలపులెట్లా ఉన్నాయో చూడండి. http://bloggingdickinson.blogspot.com/search…

23-9-2022

Leave a Reply

%d bloggers like this: