మరోసారి స్వాగతం

మిత్రులు చాలామంది నా పుస్తకాల కోసం అడుగుతూ ఉన్నారు. అవి ఎక్కడ దొరుకుతాయో చెప్తే కొనుక్కుంటామని కూడా చెప్తున్నారు. నేను చాలా రోజుల కిందటే నా పుస్తకాల పిడిఎఫ్ లు ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోడానికి వీలుగా చాలావరకూ నా బ్లాగులో పెట్టేసాను. కాని అవి అక్కడ ఉన్నట్టు ఎలా తెలియాలి?

అందుకని నా బ్లాగు ఇంటర్ ఫేస్ కొద్దిగా మార్చి అందులో అందుబాటులో ఉన్న నా పుస్తకాల వివరాలు ప్రస్ఫుటంగా కనవచ్చేటట్టుగా పెట్టాను. నా బ్లాగు chinaveerabhadrudu.in తెరవగానే మెనూలో published books అని వస్తుంది. ఇప్పటిదాకా నేను వెలువరించిన 40 పుస్తకాల్లో 37 పుస్తకాల వివరాలు అక్కడ పొందుపరిచాను. వాటిల్లో 20 పుస్తకాలు డౌన్ లోడ్ చేసుకోడానికి పిడిఎఫ్ లు కూడా అందుబాటులో ఉంచాను.

ప్రచురణకర్తలు ప్రచురించిన పుస్తకాల మీద నాకు హక్కులు లేవుకాబట్టి అవి తప్ప దాదాపుగా తక్కినవన్నీ చదువరులకోసం అందుబాటులో ఉంచాను. కాబట్టి ఈ విషయాన్ని నలుగురితోనూ పంచుకోగలరు. మీకు నచ్చిన పుస్తకాలు మీ స్నేహితులతో పంచుకోగలరు. నా బ్లాగులో మీకు నచ్చిన పోస్టులు కూడా నలుగురితో పంచుకోగలరు.

నా పుస్తకాలు చదివితే ప్రయోజనమేమిటి? నాకు తెలిసి ఏమీ లేదు. ఎందుకంటే అందులో విజ్ఞానంగానీ, సమాచారంగానీ ఏమీ లేదు. అవి ఇప్పుడున్న సమాజాన్ని మరింత మెరుగుపరచగలవని నాకేమీ నమ్మకం లేదు. అవి చదివితే పాఠకులు మరింత వివేకవంతులవుతారని కూడా నేను నమ్మడం లేదు. సామాజిక ప్రయోజనం దృష్టిలో చూసినట్లయితే, బషో తన కవిత్వం గురించి చెప్పుకున్నట్టుగా, అవి ‘వేసవిలో చలినెగడులాంటివి, శీతాకాలంలో విసనకర్రలాంటివి.’

మరి ఎందుకు వాటిని రాసాను, ప్రచురించాను, ఇప్పుడు ఇలా నలుగురికీ అందుబాటులో ఉంచాను అని అడిగితే, ఈ ప్రపంచానికి ఒక తోట ఎంత అవసరమో నా సాహిత్యం కూడా అంతే అవసరమని అనుకుంటున్నాను కాబట్టి . నా సాహిత్యం ఒక తోట, ఒక కుటీరం. అక్కడ మీరు కొంత సేపు ఆగవచ్చు, అలిసిపోయినప్పుడు సేదదీరవచ్చు. ‘కొమ్మల్లో, ఉషఃకాల జలాల్లో తిరిగే గాలిలాంటిది మీ జన్మ, మీ వాక్ స్పర్శ ఈ సత్యాన్నే తెలుపుతోంది ‘ అని రాసారు శేషేంద్ర ఎన్నో ఏళ్ళ కిందట. ఒక ప్రత్యూషపవనంలాగా నా రచనలు చదువరికి ఇతమిత్థంగా చెప్పలేని ఏదో ఉల్లాసాన్నిస్తాయని నాకు నమ్మకం ఉంది.

అందుకని ఈ ప్రభాతవేళ మీకందరికీ నా కుటీరానికి మరోసారి స్వాగతం.

22-9-2022

6 Replies to “మరోసారి స్వాగతం”

Leave a Reply

%d bloggers like this: