ఆత్మ వ్యాపించడానికే

Reading Time: 2 minutes

రావెల మనోహర్ అమెరికానుంచి నా కోసం తెచ్చిన బుట్టెడు పుస్తకాల్లో మార్క్ నెపో ‘Reduced to Joy’ ( వివా ఎడిషన్స్, 2013) కూడా ఒకటి. ఆ పుస్తకం నేను కొంత ఆలస్యంగానే తెరిచానుగాని, దాని సమ్మోహం నుంచి ఇప్పట్లో బయటపడగలనుకోను.

అది మార్క్ నెపో అనే అమెరికన్ రాసిన కవితల సంపుటి. వాటిని కవితలని కూడా అనలేం. Notes for Living అనాలి. (నా కవితల గురించి కూడా మిత్రుడు ఆదిత్య ఈ మాటే అన్నాడు.) 1987 లో మార్క్ అరుదైన ఒక తరహా కాన్సర్ బారినపడి ఎట్లాగైతేనేం బతికాడు. ఆ అనుభవం అతడికి జీవితంలోని ప్రతి క్షణాన్ని విలువైందిగా స్వీకరించడమెట్లానో నేర్పింది. ఆ మన:స్థితిని నలుగురితో పంచుకునే ప్రయత్నంలో అతడు రాసిన The Book of Awakening న్యూయార్క్ టైంస్ బెస్ట్ సెల్లర్ గా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ఈ కవితాసంపుటికూడా ఆ జీవనదృక్పథానికి కొనసాగింపే.

నేడు ప్రపంచమంతటా మానవప్రేమికులంతా రెండు అంశాలమీద దృష్టిపెడుతున్నారు, ఒకటి, సామాజికన్యాయం. మనుషులు ఉత్పత్తిచేస్తున్న సంపదమీదా , ప్రకృతివనరులమీదా అందరికీ న్యాయమైన హక్కు ఉండాలనేది. దీని గురించి ఎందరో పోరాటాలు, ఉద్యమాలూ చేస్తున్నారు. రెండవది, ఇంతకన్నా సూక్ష్మమైనది, అది మనుషులు ముందు తమలో ఉన్న ఆత్మశక్తిని పూర్తిగా గుర్తుపట్టడానికీ, దాన్ని వ్యక్తీకరించడానికీ, వినియోగించడానికీ అర్హులు కావాలనేది. యుగాలుగా ప్రవక్తలూ, సాధువులూ, కవులూ దీనిగురించే మాట్లాడారు. ఇప్పుడు ప్రపంచమంతా రూమీని, కబీర్ నీ, టాగూర్ నీ, జిబ్రాన్ నీ చదువుతున్నారంటే ఇందుకోసమే. ఇటువంటి కవిత్వం సామాజికన్యాయం కోసం పోరాడే కవిత్వానికి వ్యతిరేకమైంది కాదు. సామాజికన్యాయం గురించి మాట్లాడే కవిత్వం స్థూలస్థాయిలో పోరాటం చేస్తే ఆత్మస్వాతంత్ర్యం కోసం తపించే కవిత్వం సూక్ష్మస్థాయిలో పోరాటం చేస్తున్నది. రెండూ కూడా ఒకదానికొకటి పూరకాలు. నువ్వు రాజకీయంగా, ఆర్థికంగా విముక్తిచెందాక ఏం కోరుకుంటావు? మానసిక స్వాతంత్ర్యమే కదా. అలాగే ఒక మానవసమూహం రాజకీయంగా, సామాజికంగా విముక్తి చెందకుండా మానసికంగా మాత్రం ఎలా విముక్తి చెందుతుంది?

కవిత్వం తొలినుంచీ బాహ్యసంగ్రామసాధనంగా పనిచేస్తున్నప్పటికీ, మనిషి తనతో తాను చేసుకునే అంత: సంగ్రామంలోనే కవిత్వ ప్రాసంగికత, ప్రయోజనం ఎక్కువగా ఉన్నాయి. చారిత్రకంగా కల్లోలసమయాల్లో వచ్చిన కవిత్వానికి ప్రధానంగా చారిత్రిక ప్రాధాన్యత మాత్రమే ఉంటుంది. కాని ఒక మనిషి మృత్యువు అంచులదాకా ప్రయాణించి పెనగులాడి జీవితం విలువ గ్రహించి చెప్పే కవిత్వానికి సార్వకాలిక ప్రాధాన్యత ఉంటుంది. అందుకు మార్క్ నెపో కవిత్వం తాజా తార్కాణ. ఈ పుస్తకంలో మార్క్ జోసెఫ్ కాంప్ బెల్ చెప్పాడంటూ ఈ మాటలు ప్రస్తావించాడు.

People say we’re all seeking a meaning for life. I don’t think that’s what we’re really seeking. I believe we’re seeking an experience of being alive.

మార్క్ కవిత్వమంతా ఈ వాక్యాలకు వ్యాఖ్యానమే. ఆ కవితల్లోంచి మూడు మీ కోసం:

1.

సన్నసన్నగా చినుకు.తడుస్తున్నపొలాల్లో
గొర్రెలు, వాటి చెవులమీద,కళ్ళమీద,
నోటిమీద ఆకాశం కురుస్తున్ననీటిపూసలు.
పారవశ్యంనుంచి మెలకువలోకి బయటపడుతున్న
విగ్రహాల్లా ఉన్నాయవి. మొట్టమొదటిసారి
బతుకులోకి మేల్కొన్నట్టు, గాలినిన్నెక్కడపడితే
అక్కడ ముద్దాడుతున్న ఈ మంత్రమయలోకమేమిటా
అన్నట్టు చూస్తున్నాయవి.ప్రపంచంతో ప్రేమలో
పడినప్పుడిట్లానే ఉంటుంది.

2.

నేను సత్యంగా మారినప్పుడు
సత్యం మాట్లాడవలసిన అవసరం పడ్డప్పుడు
అదే మరింత మరింత స్పష్టంగా రూపుదిద్దుకుంటుంది.

అంటే, నాలో వెలుగుతున్నస్థలాన్ని నేను
చేరుకోగలిగినప్పుడు, నాకింక
ఉద్రేకంగా మాట్లాడవలసిన పనుండదు.
అప్పుడు నా మాటలు వేడిగాకాదు,వెచ్చగా
ఉంటాయి. అనంతత్వాన్ని నాలో పొదువుకోగలినప్పుడు
దేవుడిగురించి మాట్లాడవలసిన పనిలేదు,
అప్పుడు నా పక్కనెవరున్నా వాళ్ళకెంతో శాంతి.

చెట్టు శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది
కాబట్టి గాలి వీస్తుంది,
మనిషి ఎదుగుతున్నాడంటే
ఆత్మ వ్యాపించడానికే.

పశువులు గిట్టలతో
నేలను గోరాడినప్పుడల్లా
బలం పుంజుకుంటాయంటారు
మనం జీవితాన్ని పట్టించుకున్నప్పుడల్లా
మళ్ళా బతుకులోకి మేల్కొన్నట్టే.

3.

ప్రతి ఒక్కరూ నన్ను తమ తొందరతో కట్టిపడేసేవారు,
జీవితరహస్యం వాళ్ళ మనసులో
ఎదో మూలరాసిపెట్టిఉన్నట్టూ
దాన్నర్థం చేసుకునేలోపే అది రగిలిపోతున్నట్టూ.

ముందొక వందసార్లేనా నేను వాళ్ళు పిలిచిన
వెంటనే పరుగెత్తేను. చివరికొకరోజు, నా
జీవితరహస్య జ్వాలనన్నాపేసింది
నేను పరుగెత్తడం ఆపి
నాలో రగుల్తున్న అగ్నిని
కనబడ్డచోటల్లా ముద్దాడేను.

అవును, ఆ మంట నా పెదాల్ని కాల్చేసింది
ఇప్పుడు నేనేదీ సంక్లిష్టమైంది మాట్లాడలేను
నా మనసులో గాలి సుళ్ళు తిరగడం మానేసింది.

మీకు అర్థమవుతుందనుకుంటాను. మీలో
మీరు సతమతమవుతున్న రహస్యాల్నెవరూ
రహస్యంగా ఉంచమనలేదు. కనీసం
ఇప్పుడేనా మనం తెరలు తొలగించి
దాచుకున్నదేదో బయటపెడదాం.

హృదయానికింకేమీ సాకులుమిగల్లేదు కాబట్టి
ఇప్పుడింక మనకే తొందరా లేదు.

10-1-2014

3 Replies to “ఆత్మ వ్యాపించడానికే”

  1. ఎంతో గొప్పగా చెప్పిన కవి మాటల్ని మీదైన శైలిలో ప్రతిఫలించారు..ఇది చదివాక బహుశా ఇక ఉన్నదున్నట్టుగా బతకడానికి సందేహించనక్కరలేదు
    ధన్యవాదాలు సర్..మంచి poem అందించినందుకు .

Leave a Reply

%d bloggers like this: