నాలుగు తీపి మాటలు

1
 
ఈ మధ్య తాము నిర్వహించిన తెలంగాణా చరిత్ర గోష్ఠి వ్యాసాల సంకలనం నాకు ఇవ్వడానికి వచ్చాడతడు. ఆ పుస్తకం అట్టమీద సహ సంపాదకుడిగా డా. అరుణకుమారి గారితో పాటు అతడి పేరు కూడా ఉంది. నా ముందు కూచున్న డా. మల్లెగోడ గంగాప్రసాద్‌ని మరోమారు పరిశీలనగా చూసాను. ‘కొంతమంది కుర్రవాళ్ళు ముందు యుగం దూతలు’ అనే వాక్యం మదిలో మెదిలింది. ఇటువంటి వాళ్ళని చూసే కదా కవి ‘కొంతమంది కుర్రవాళ్లు పావన నవజీవన బృందావన నిర్మాతలు’ అని అన్నాడు అనుకున్నాను.
 
ఈ యువకుడు ఇంత దాకా నడిచిన దారి ఎందరో యువతీ యువకులకొక వ్యక్తిత్వ వికాస పాఠం. వెనకబడిన ప్రాంతం నుంచి, పేదరికంలో, అవకాశాల కొరతకి ఎదురీది, అంచెలంచలుగా, చదివిన ప్రతి చదువులోనూ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంటూ, ఇప్పుడు తాను పుట్టిన గడ్డకే చరిత్రకారుడిగా మారిన స్ఫూర్తిదాయకమైన చరిత్ర కదా అతడిది అనుకుంటూ, అతడు నా చేతుల్లో పెట్టిన అతడి కవిత్వం తిరగెయ్యడం మొదలు పెట్టాను.
 
2
 
అసలెవరేనా కవిత్వం ఎందుకు రాస్తారు? అందులోనూ, జీవితం తోవ స్పష్టంగా కనబడనప్పుడు, మహానిర్మాణాలతో ప్రపంచం తమ ముందు ప్రత్యక్షమైనప్పుడు, తమని తాము నిలబెట్టుకోడానికి సంఘర్షణపడే వాళ్ళు అన్నిటికన్నా ముందు కవిత్వం ఎందుకు రాస్తారు?
 
ఆధునిక యుగం మొదలైనప్పుడు చూడండి. భాషలు, దేశాలు, జాతులు తాము కొత్త జీవితంలోకి మేల్కొనట్టు గుర్తుపట్టగానే చేసిన మొదటి పని కవిత్వం రాయడమే. ఒక నవ జర్మనీ సాక్షాత్కరించేటప్పుడు గొథే, షిల్లర్; నవోన్మేషమైన కాల్పనిక లోక ప్రాకారం కనిపించగానే వర్డ్స్ వర్త్, కోల్రిడ్జ్, షెల్లీ, కీట్స్, బైరన్; ప్రపంచంలో ప్రజాస్వామిక స్వేచ్ఛ నెలకుంటున్నదనగానే ఎమర్సన్, వాల్ట్ విట్మన్; బానిసత్వం నుంచి దేశం స్వాతంత్య్ర ప్రభాతంలోకి మేల్కొనాలన్న ఆకాంక్షతో బంకిం, గురజాడ, భారతి, టాగోర్; ఆఫ్రికా వెలుతురు భూఖండంగా మారాలన్న తపనతో సెంఘార్, చినువా అచెబె; ఆఫ్రికన్ అమెరికన్లు కూడా మనుషులుగా జీవించాలన్న మానవతా ప్రకటనతో డన్ బర్, లాంగ్ స్టన్ హ్యూస్ – బహుశా, కవిత్వం కన్నా నిజమైన సాధికారికతా సాధనం మరొకటి లేదు.
 
ముందు కవి తనని తాను గుర్తుపడతాడు. తనకీ, తన జాతికీ ఒక ఉజ్జ్వల భవిష్యత్తుని స్వప్నిస్తాడు. అప్పుడు ఆ స్వప్నాన్ని సాకారం చేసుకోడానికి వీరుల, కార్యశూరుల, ఆత్మత్యాగుల పరంపర ఒకటి ప్రభవిస్తుంది.
 
కవిత్వాన్ని తూచడం చాలా కష్టం. ఒక్కొక్కప్పుడు, చాలా సరళపదాలే నిప్పులు చిమ్ముతాయి. మామూలు మాటలే ఫిరంగి గుండ్లలాగా అడ్డుగోడల్ని కూల్చిపారేస్తాయి. మనం చూడవలసిందల్లా, ఒక కవి కవిత పలుకుతున్నప్పుడు, ఆ మాటల్లో తన చుట్టూ ఉన్న కాలాన్ని దేశాన్ని ఎట్లా తట్టిలేపుతున్నాడన్నాడన్నది మటుకే. ‘నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబౌనొ, అందాక ఈ భూగోళంబున కగ్గిపెట్టెదను..’ అని దాశరథి అంటున్నప్పుడు, ఆ గళం ఏకవ్యక్తి గళంలాగా వినిపించదు. అనేక గళాల సమాహారంగా, సాకారమైన కాలంగా కనిపిస్తుంది.
 
కవితలు రాయడానికి ఉపక్రమిస్తున్న ప్రతి యువతీ, యువకుడూ తమకి తెలిసో, తెలియకో ఈ మహాశక్తిని ఆవాహన చేస్తున్నవారే. తమ పరిమిత దేహం నుంచీ, కాలం నుంచీ, దేశం నుంచి విడివడి ప్రపంచమంతా విస్తరించాలని ప్రయత్నిస్తున్న వారే. మరీ ముఖ్యంగా కవుల తొలి కవిత్వంలో ఆ పిపాస మరీ అధికంగా ఉంటుంది, మరీ నిర్మలంగా ఉంటుంది, మరీ ప్రేమాస్పదంగా ఉంటుంది.
 
అది మొగ్గ విచ్చేటప్పుడు తనలోపల సంభవించే సున్నితమైన ప్రతి ఒక్క ప్రకంపననీ, తన సర్వాస్తిత్వంతోటీ అనుభవంలోకి తెచ్చుకున్నట్టుగా ఉంటుంది. తనలోకి కింద నుంచి ప్రసరిస్తున్న భూసారానికీ, పైనుంచి ప్రవహిస్తున్న సూర్యకాంతికీ ఒక సేతువు కట్టుకుంటున్నట్టు ఉంటుంది. మనుషులు కవులుగా మారే ఆ తొలిక్షణాలు, ‘శోకం శ్లోకంగా’ మారే ఆ ప్రథమ సంస్పందనాలు పవిత్రమైనవి, పదే పదే స్మరించదగ్గవి.
 
ఇవి అట్లాంటి తొలిక్షణాలు పూసిన పూలు, తొలిదినాల మిగిల్చిన గాయాలు, తొలిరోజులు వెలిగించిన దీపాలు. ‘లౌక్యం తెలియని’ ఈ వాక్యాల్ని నాకై నేను ఎంతో శ్రద్ధగానూ, ఎంతో ప్రీతితోనూ చదివాను. వీటి మలుపుల్లో ఒక మట్టిబాట వెంబడి ఒక తెలంగాణా పల్లెకి ప్రయాణించిన అనుభూతికి లోనయ్యాను.
 
మా చిన్నప్పుడు, మా ఇంటి ముందొక పందిరి ఉండేది. ఆ పందిరి నిండుగా ఒక రాధామనోహరం పూలతీగ అల్లుకుని ఉండేది. వసంత ఋతువులోనూ, తొలివేసవి కాలంలోనూ, సాయంకాలం కాగానే, ఆ పందిరి మీద ఒక్కొక్క మొగ్గా తెరుచుకోడం మొదలు పెట్టేది. అట్లా నోరు తెరిచి ఒకదానితో ఒకటి ఆ మొగ్గలు పరిమళాలలో మట్లాడుకునేవి. ఆ సాయంకాలాల్లో ఆ పందిరి కింద ఆ పరిమళాల సంభాషణ వినడం ఒక అపూర్వానుభవం, ఇప్పుడు, ఈ కవితలు చదవుతుంటే, ఆ అనుభవమే గుర్తొస్తున్నది. ఒక మట్టివాసన మనసును తీయగా తాకుతున్నది.
 
ఈ వాక్యాల మీంచి ఈ యువకుడి జీవనోల్లాసం, ఆరోగ్యకరమైన జీవిత దృక్పథం, తాను మసలుతున్న ప్రతి చోటా ఆశావహసుగంధాన్ని వెదజల్లే ఇతడి స్వభావం గుప్పుమంటున్నవి.
‘కవీ’ అనే కవిత చూడండి. కవి ఏం చేస్తాడో చెప్తున్నట్టున్న ఆ కవిత, కవిగా తానేం చేస్తున్నాడో, ప్రతి ఒక్క కవీ ఏం చెయ్యాలో చెప్పే కవిత:
 
ఎక్కడినుండో గడ్డిపూలు కోసుకొస్తాడు.
ఏవేవో పరిమళాల కుండల్లో ముంచుతాడు
ఎప్పటికీ వాడిపోని గాజు శిల్పాల్లో భద్రపరుస్తాడు.
 
ఇంకా-
 
ఎవ్వరివో నాలుగు కన్నీటి చుక్కలను పట్టుకొస్తాడు
ఆవేదనాల కొలిమిలో అహోరాత్రులు మరిగిస్తాడు
కోరుకున్న హృదయాలకు కాసింత తాగిస్తాడు.
 
ఆ తర్వాత పంక్తుల్ని కూడా ఇక్కడ స్మరించాలని ఉంది:
 
ఎందుకనో ఎప్పుడూ ఊరవతలి వెదురుతోటలోకి వెళ్తాడు
ఎవ్వరికీ అందని కొమ్మలను వంచుతాడు
ఊపిరిని బిగపట్టి ఏకాంతంగా రాగాలు కడతాడు.
 
అతడు తన ఆకాంక్షని ఒకచోట స్పష్టంగా చెప్పేసాడు కూడా:
 
వికాస హృదయ సీమల ఉద్యానవనాలకు
విరామమెరుగని తోటమాలినవుదామని.
 
ఇట్లా ఈ కవిత మొత్తం ఇక్కడ తిరగరాయాలని ఉంది, కానీ, ఈ కవితని, ‘కవీ-కవి మిత్ర’ అనే కవితతో కలిసి చదవండి. కవిగా తాను చేస్తున్నది సరే, కవిమిత్రుడిగా, సహృదయ విమర్శకుడేం చెయ్యాలో కూడా చెప్తున్నాడు:
 
కవి అల్లిన అలంకార తీగలపై
సమీక్షకుని మునివేళ్ళు నాట్యమాడతాయి
కవి చల్లిన సుగంధాలు
విమర్శకుని పెదవుల్ని అంటుకుని తిరుగుతాయి.
 
అంతేనా?
 
కవీ నీ కన్నీళ్ళకు
పాఠకుని చెంపలో తడెందుకొస్తుంది?
కవీ, నువ్వు పెట్టే గిలిగింతలకు
చదువరుల చెక్కిళ్ళలో మెరుపెందుకొస్తుంది?
 
అని కూడా అడుగుతాడు.
 
మామూలు భాషని మానవీయభాషగా మార్చడమే కవిత్వంలోని ఆల్కెమీ. గడ్డిపరకల్లాంటి, మట్టిబెడ్డల్లాంటి మాటల్తో అతడు ఎటువంటి సంగీతాన్ని సృష్టిస్తున్నాడో చూడండి:
 
ఎవ్వలకు తెల్వకుండా పెద్దేటి కాల్వల
ఈతకొట్టిన తడిగుర్తులను తడిమొచ్చా
సారంగపూరు గుట్ట ఎత్తున ఉన్నా ఝుండా రెపరెపల
గర్వాన్ని గమనించొచ్చా
కారీల కోసం టైరాటాడుకుంటు
బేకరీకి పోయిన తొవ్వలో నడిచొచ్చా
వానకాలం మట్టిలో సలాక గుచ్చి కుంటికాలాటా ఆడించిన
టెక్నిక్స్ ని తలచుకుని వచ్చా.
 
మాట ఒక మెటఫర్ కావడమెలా తెలుసుకోవడమొక తపస్సు. కానీ, ఈ కవికి అప్రయత్నంగానే కవిత్వం సిద్ధిస్తుంది. ఈ వాక్యం చూడండి:
 
మా వూరెందుకో నాకు కొత్తగా కనిపిస్తుంది
అచ్చం పట్నానికి చిన్న సైజు కలర్ జిరాక్సులా
సంగం కాలిన మక్క కంకిలా.
 
ఆ ‘సగం కాలిన మక్కకంకి’ అనడంలోనే అతడి మాట, అతడి చూపు, అతడి తలపు కవిత్వంగా మారిపోతున్నాయి. ఇట్లాంటి ఆశ్చర్యకరమైన పదబంధాలు చాలానే కనబడతాయి. ఈ కవితల్లో, మచ్చుకి మరి రెండు:
 
నీ తనువు నునుపుదనం తెలుసుకోవాలని
అణువణువు తెరచాపల చీరలను చుట్టాను
కదిలించని శక్తులేవో సంకెళ్ళతో బంధిస్తే
నిదురించే అలలపై జాబిలి తల్వార్‌ను విసిరావు
 
ఒక మనిషి కవిగా సాధన చేస్తే అతడి మనోప్రపంచమెంత స్వర్ణ ప్రపంచంగా మారగలదో, ఈ సంపుటిలోని ‘నాన్న’ కవిత(మట్టి కాళ్ళు) ఒక ఉదాహరణ. ఇది తెలుగులో నేను చదివిన పరిపూర్ణమైన కవితల్లో ఒకటని చెప్పడానికి నాకు సంకోచం లేదు. ముఖ్యంగా ఈ వాక్యాలు చూడండి:
 
నీ మాట అమ్మ పాటలా తియ్యగా ఉండదెందుకు?
నీ పిలుపు చల్ల గాలిలా చక్కిలిగింతలు పెట్టదెందుకు
నువ్వు ఉన్నప్పుడు ఇల్లెందుకు అల్లరిని దీగుట్లో దాచేసుకుంటుంది
నువ్వు వచ్చినప్పుడు ఫ్యానెందుకు వేగంగా తిరుగుతుంది?
 
నాన్న అంటే భయం అనే అనుభవంతో మొదలైన ఈ కవిత ఈ వాక్యాలకు వచ్చేటప్పటికి గొప్ప అనుభూతి ఉంది, దర్శనం ఉంది, మానవత్వ సాక్షాత్కారం ఉంది, చూడండి:
 
ఎంత అణచుకున్నావ్ నాన్న నన్ను హత్తుకోవాలన్న కోరికను
ఎలా చంపుకున్నావ్ నాన్న నన్ను ముద్దాడాలన్న మురిపాన్ని?
 
3
 
మళ్ళీ మొదటి ప్రశ్నకి వద్దాం. ఒక మనిషి కవి కావడమెందుకు? ఎందుకో గంగాప్రసాద్ ‘మొన్న పండక్కి వూరెల్లాను’ కవితలో ఇలా చెప్తున్నాడు:
 
శారదకాండ్ర సాయన్న ఇంకా ఉన్నాడన్న ధైర్యంతో
పంటపొలాలు వరిగింజల పాటలను నెమరేస్తున్నాయి
ఒర్రెనిండా బర్లు తానమాడుతున్నందుకే
చెరువు అలుగు మీద జలతరంగ నాట్యమాడుతుంది.
 
ఇంకా
 
యక్షగానాలు పాడే గొంతు ఇంటెన్క ఉందన్న నమ్మకంతో
పిచ్చుకలు పికిలిపిట్టలు సూరుకింద గూడు కట్టుకున్నాయి
ఒగ్గుకథలను ఒలకబోసుకునే బీరప్ప గుడి కట్లపొంట ఉన్నందుకే
చెరువు సిగలో కలువల రెక్కలు విచ్చుకుంటున్నాయి
 
మనముందు ఈ లోకంలో కవులు నడిచి వెళ్ళినందువల్లనే మనకు వెలుతురు తోవల ఆనవాలు తెలిసింది. మనం కూడా కవిత రాసినప్పుడే మన వెన్నంటి వచ్చే వాళ్ళకి మనిషి మీద నమ్మకం మిగుల్తుంది.
 
ఇవి నా తీపిమాటలు. అతడి కవిత చదివిన సుగంధం పెదాలకు అంటుకున్నందు వల్ల పలకలేకుండా ఉండలేకపోయిన తీపి మాటలు. ఇప్పుడు మీరు కూడా ఈ తొవ్వవెంట నడిచివెళ్తే మీ మనసు కూడా మరింత తీపెక్కుతుంది.
 
featured photo courtesy: A.Gangareddy
 
16-9-2022

One Reply to “”

  1. కొన్ని పరిమళలు కొన్ని కనీళ్లు కలిపి మా మదిన కలపు చలి సంక్రాంతి ముగ్గు ఈ రచన 🙏

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading