పువ్వుల్లానే రోజులు కూడా

పువ్వుల్లానే రోజులు కూడా
ఒక్క పూట వికసించి
వాడిపోతాయి,
మిగిలేది ఒక్క గుక్క తేనె.

రోజూ ఒక్కొక్క గుక్క మకరందం పీల్చుకుని
తేనెపట్టు అల్లుకుంటున్నాను.
అందులో రాగరంజిత ప్రభాతాలతో పాటు
అర్థరాత్రుల నిశ్శ్బ్దం కూడా.

గాయాలనుండి కూడా తేనె ప్రసవిస్తుంది.
ఇది కూడా తెలుసుకున్నాను.
నువ్వొక భ్రమరానివి కాగలిగితే, రోజూ
నీకోసమొక పుష్పం సంసిద్ధం.

నువ్వు కూర్చిపెట్టుకున్న తేనెలు
పాటలు పాడుతుంటాయి, కొన్నాళ్ళు పోయాక
నిన్ను వెతుక్కుంటూ ఎవరో నీ ఇంటికొచ్చి
ఆ మధువుతో తమ పెదాలు తడుపుకుంటారు.

అప్పుడు వాళ్ళ చలితాధరాలు కూడా
పాటలు పాడటం మొదలుపెడతాయి.

(కోకిల ప్రవేశించే కాలం నుంచి)

13-9-2022

Leave a Reply

%d bloggers like this: