ఇంకా సంగీత కచేరీ మొదలుకాకముందు దొంతర్లుగా
పేర్చిన కుర్చీల్లాగా మబ్బులమీద మబ్బులు, సంగీత
వాద్యాలు శ్రుతి చేసుకునేటప్పుడు అలముకునే నిశ్శబ్దం.
తొలికీర్తన కోసం గొంతు సవరించుకున్నప్పటి ఉత్కంఠ.
రాగానికీ రాగానికీ మధ్య గాయకుడు ఊపిరికోసం
ఆగిన విరామం, వాది స్వరం నుంచి అంగుళులు
సంవాది స్వరానికి చేరేదాకా ఆగలేకబిగిసిపోయిన
తంత్రులు, పలికిన రాగమంతా అల్లిన అగరు పొగ.
కరతాళ ధ్వనులు వెల్లువలా ముంచెత్తేముందు పాట
ముగిసిన తొలిక్షణాలు. ఇప్పుడో మరికాసేపటికో
లోపలి రసస్రవంతి కన్నీరుగా పొర్లిపోయెముందటి
వినూత్న స్తబ్ధత. అందుకోసమే ఉగ్గబట్టిన దిక్కులు
(నీటిరంగుల చిత్రం నుండి)
13-9-2022