కొంత తేనె, కొంత పుప్పొడీ

సోమభూపాల్ కర్నూలుకు చెందిన యువకుడు, ఉపాధ్యాయుడు, భావుకుడు, సాహిత్యాన్వేషి. ఆరోగ్యవంతుడైన ఒక యువకుడు తాను ఎక్కడ సంచరించినా ఆ తావుల్ని కూడా ఆరోగ్యప్రదంగా మారుస్తాడనడానికి, ఇదిగో, ఈ వాక్యాలే సాక్ష్యం.

కొంత తేనె, కొంత పుప్పొడీ

కేవలం చినవీరభద్రుడు గురువు గారిని కలవడానికే మే, 26 రోజున హైదరాబాద్ వెళ్ళాను.ఆ ముందురోజు ఇలా రావాలనుకుంటున్నాను అని వాట్సాప్ మెసేజీ పంపాను అంతే గురువుగారికి.శురె అని సమాధానమిచ్చి అడ్రెస్ పంపారు.హైదరాబాద్ వెళ్లడం అది అయిదవసారి నాకు. అది కూడ సంవత్సరాల వ్యవధితో.అయినా అంతా కొత్తగానే ఉంది.నాకున్న ధైర్యమంతా గూగుల్ మ్యాప్స్, ఓలా, ఊబర్, రాపిడో మాత్రమే, లొకేషన్ చెప్తే సరిగ్గా అక్కడకు చేరుస్తారని.

ఆరోజు ఉదయం 5:30 కు లింగంపల్లి ఏరియాలో బస్ దిగి పక్కనే ఉన్న పే అండ్ యూస్ గదుల్లో స్నానం ముగించి, బైట టీ తాగేసి ఓ చోట పుస్తకం చదువుతూ కూర్చున్నాను.ఆయన దగ్గరికి ఓ పది గంటలప్పుడు వెళితే బాగుంటుంది ఫ్రీ గా ఉంటారు కదా అని నా సొంతాలోచనాల్లో పొద్దుపోనిస్తూ ఉన్నాను.

కాసేపయ్యాక అనిపించింది, హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ కదా, కాస్త ముందే బయలుదేరి ఆయన ఇంటికి దగ్గర్లోకి వెళ్లి కూర్చుంటే అనుకున్న సమయానికి ఇంటికి వెళ్లొచ్చు అనుకుంటూ రాపిడో బుక్ చేసుకుని ఆయన ఉంటున్న ఇంటికి కాస్త దూరంలో(ఇంటి దగ్గర దిగితే మళ్లీ కనిపించి అరే!లోపలికి రా అనేస్తారేమో అని నా భయం) దిగాను.కాసేపయ్యాక మళ్లీ అనిపించింది కదా, ఇంటికెళ్లాక టిఫిన్ తిన్నావా అనడిగితే, నేను తినలేదంటే బాగోదు కదా అని అక్కడే పక్కన బండిపై వేడిగా ఓ నాలుగు ఇడ్లి తినేసాను.ఇప్పుడు సమస్యేమిటంటే నేను ఆయన దగ్గరికి మొదటిసారి వెళ్తున్నాను, ఏమి తీసుకువెళ్లాలో నాకేమీ తోచడం లేదు. అదీగాక దానికి కొన్నాళ్ల ముందే ఆయన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కమీషనరు గా రిటైర్ అయ్యారు, అంటే నేను ఉపాధ్యాయుడు కాబట్టి, నేను పని చేసే శాఖకు ఆయన ఎంతో ఉన్నతమైన అధికారిగనుక మర్యాదకైనా ఎదో ఒకటి తీసుకెళ్లితీరాలి, కానీ ఇక్కడి నుండి ఏ గిఫ్ట్ కోసమో ఇంకెక్కడికి కదిలినా మళ్లీ ఇక్కడికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు, ఇప్పటికే 7:30 గంటలయ్యింది. చుట్టూ చూస్తే తాజాగా అమ్ముతున్న ఓ రకం రోజాలు కనిపించాయి.వెళ్లి కొన్ని రోజాలు, అలాగే కొన్ని ఆపిల్స్ తీసుకున్నాను, ఇప్పటికి ఇంతకుమించి నేనేమీ తీసుకునే పరిస్థితిలో లేను, ఏ బొమ్మకోసమో, ఫోటో కోసమే మరి దేనికోసమే ఎక్కడికో వెళితే ఎక్కడ దొరుకుతాయో ఏమో తెలీని అయోమయం ఒకవైపు, ఆయన్ని సమయానికి కలవలెనేమో అనే ఒక ఆదుర్దా మరోవైపు.

లొకేషన్ ఆన్ చేసుకుని…నడుస్తూ ఆయన ఉంటున్న అపార్ట్మెంట్ దగ్గరికి చేరుకున్నాను, ఆ అపార్ట్మెంట్ చూసాకగానీ నేను కాస్త స్థిమితపడలేకపోయాను.

ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు సర్ వాళ్ళింటికిచేరుకున్నావా అని, కాస్త విసుగ్గా సమధానమిచ్చాను, అదేమైన మన సొంతిల్లా అలా వెళ్ళడానికి, పొద్దుపొద్దున్నే వెళ్లి ఎందుకు ఇబ్బంది పెట్టడం, నేను ఆ అపార్ట్మెంట్ దగ్గరే ఉన్నాను, అక్కడికి వెళ్ళాక మెసేజ్ చేస్తాలే అని చెప్పి ఇక ఉంటానన్నాను. అపార్ట్మెంట్ చూసాను గనుక ఇంకేం భయంలేదు, ఇక్కడే ఉంటే పొరపాటున ఆయన చూసి అక్కడెందుకున్నావ్, వచ్చేసేయ్ అంటాడెమో అని ఒక బెరుకుతో మళ్లీ అక్కడి నుండి నడుస్తూ దూరంగా కనిపించే టీ స్టాల్ దగ్గరకి వెళ్లి ఇంకో టీ తాగాను.బ్యాగ్ లో ఉంది ఫోన్. కాసేపయ్యాక ఫోన్ చూస్తే గురువుగారి నుండి రెండు మిస్డ్ కాల్స్ వచ్చాయి, నాకు మొదలయ్యింది దడ. తిరిగి కాల్ చేసాను.

“గురువుగారు” అంటూ ఉండగానే అటువైపు నుండి ఎన్నోసార్లు మనం కలిసాం అనేంత చొరవతో నిండిన గొంతు.

“సోమ్ భూపాల్…ఎక్కడున్నావ్, నీ కాల్ కోసమే వెయిటింగ్, అడ్రెస్ పంపించానుగా..ఎన్ని గంటలకు చేరుకుంటావ్ ఇక్కడికి” అనడిగారు.

“నేను ఉదయమే వచ్చాను గురువుగారు, మీరు పంపిన అడ్రెస్ కు దగ్గర్లోనే ఉన్నాను ..” అనగానే “అరే..భలేవాడివే, ఒక కాల్ చేసి ఇంటికి రాకుండా బయటే ఎందుకు, వచ్చేసేయ్ సరేనా” అన్నారు.

మళ్లీ అక్కడి నుండి నడుస్తూ వెళ్ళాను.

ఎన్నాళ్లనుండో కలవాలి అనుకుంటున్న మనిషి.

ఈరోజు ఆ సమయం రానే వచ్చింది.

ఆనందంతో పాటూ ఏదో తెలియని భయం కూడా ఉంది లోలోపల.

********

అపార్టుమెంట్ 5వ ఫ్లోర్ లో ఉంటున్నారు, అక్కడికి చేరుకుని గుమ్మం ముందు నిలబడేసరికి గురువుగారు ఎవరితోనో కాల్ మాట్లాడుతూ పూల చెట్ల దగ్గర అటువైపు నిలబడి ఉన్నారు.

విరబూసిన పూల చెట్లు..మంచి శకునం నాకు.

నేను బయటే ఉన్నాను, నా వైపు తిరిగి “అరే, రా లోపలికి ” అంటూ కాల్ పూర్తిచేసి నా వైపు వచ్చి “రామ్మా, కూర్చో ఇక్కడ ” అంటూ సోఫా వైపు చూపించి ఆయన కూర్చున్నారు.కింద కూర్చోవాలని నా అసలు ఆలోచన.ఏమో, వీడు భలే అతిగాడులాగున్నాడు అనుకుండేమో అని బ్యాగ్ అక్కడ పక్కన పెట్టి కూర్చున్నాను.

“చెప్పమ్మా, ఎలా ఉన్నావ్, ఇంకా ఎవరినైనా కలవాలా ఇక్కడ” అంటూ “నువు ముందు వెళ్లి ఫ్రెష్ అవ్వు, టిఫిన్ చేద్దాం అన్నారు.

నేను ఆల్రెడీ స్నానం చేసి టిఫిన్ చేసాను గురువుగారు అన్నాను ధైర్యంగా.

“నువ్వేం మనిషివయ్యా, ఇక్కడికి వస్తూ మళ్లీ బైట తినేసి రావడం బాగుందా, నేనేమో నీకోసం ఎదురుచూస్తున్నాను” అన్నారు.

నాకు అది చాలు.అంతకు మించి ఇంకేమీ వద్దు అనిపించింది. టీ తాగుతావా, కాఫీనా అంటే మన ఓటు ఇప్పటికీ, అప్పటికీ, ఇంకెప్పటికైనా టీ కోసమే కాబట్టి టీ అన్నాను. ఇంట్లోంచి ఎవరో ఒకరు తెస్తారు కదా అనుకున్నాను, గురువుగారు వెళ్లి రెండు కప్పుల్లో టీ పట్టుకొచ్చారు.లేచి టీ అందుకుని ఆయన వైపే చూస్తూ ఉన్నాను

“చాలా సంతోషం, కేవలం కొన్ని పుస్తకాలు చదివి ఇంతదూరం నన్ను కలవడానికి వచ్చావు,ఎఫ్బీ లో నీ పోస్ట్లు చూస్తుంటాను, నా సర్వీసులో ఎంతోమంది టీచర్స్ ను చూసాను, కానీ నీలో ఉన్న ఈ తృష్ణను అందరిలో నేను చూడలేదు, ఎక్కడి నుండి మొదలయింది నీకీ సాహిత్య పరిచయం, తపన”

నాకేమీ మాటలు రావడం లేదు..నేను కేవలం అతణ్ణి చూస్తే చాలని, చూడటానికే వెళ్ళాను, కానీ నేనూ అతను ఇలా టీ తాగుతూ, నన్ను అభినందిస్తూ..

ఇదంతా నాకు ఊహక్కూడా అందనిది.

ఇదిగో నువ్వీ పుస్తకాలు చదువుతూ ఉండు, నేను పూజ ముగించి వస్తాను అంటూ, “విజ్జీ..ఈ పూలు తీసుకో. అక్కడ దేవుడి దగ్గర ఉంచు, పూజకువస్తాయి” అన్నారు.

నేను తీసుకువెళ్లిన పూలు అక్కడ పూజకు ఉపయోగిస్తే అంతకుమించిన అదృష్టం ఇంకేముంటుంది…

నేను లేచి నిలబడి నమస్కరించాను.

“ఈ అబ్బాయ్ సోమ భూపాల్ కర్నూల్ నుండి వచ్చాడు.టీచర్ గా పనిచేస్తున్నాడు” అని నన్ను అమ్మగారికి పరిచయం చేయగానే…

“కర్నూల్ నుండి వచ్చారా, మా ఊరే” అన్నారు అమ్మగారు.

నాకు ఏ విషయాలు తెలియవుగనుక నవ్వుతూ తలూపి కూర్చున్నాను.

నాకు అక్కడ గురువుగారు తప్ప ఎవరూ తెలియదు, ఒకింత ఎవరూ అక్కర్లేనితనం కూడా.నా వయసు ఉన్న ఒక అబ్బాయి వచ్చి హాయ్ చెప్పి మళ్లీ ఓ గదిలోకి వెళ్ళాడు.ఇంకోసారి నాకన్నా చిన్న వయసున్న ఓ అమ్మాయి వచ్చి హాయ్ చెప్పి లోపలికి వెళ్ళింది.గురువుగారి పిల్లలని మాత్రం నాకు అర్థం అయింది.

కాసేపటికి గురువుగారు వచ్చి వెళ్లి అక్కడ కూర్చో నేను ఇప్పుడే వస్తాను అని నాకు ఓ గది చూపించారు.ఆ గది లో కొన్ని పెయింటింగ్స్, మరేవో పుస్తకాలు ఉన్నాయి. అక్కడే కూర్చుని తిండి తిప్పలు మాని అవన్నీ చదవాలన్నంత వెర్రి పుట్టుకొచ్చింది ఆ అందమైన పుస్తకాలు, అవి క్రమంగా పేర్చిన తీరు చూసి.

**********

కొన్ని క్షణాలకే గురువుగారు వచ్చారు.

కిటికీ పక్కన కూర్చున్నాం.

కిటికీలోంచి చేతికందేంత దూరం లో పచ్చని చెట్టు,దానికి పసుపురంగులో చిన్ని పూలు.

కొమ్మలపై కొన్ని పక్షులు…

చల్లని గాలి వీస్తోంది లోపలికి…

గురువుగారు తదేకంగా అటువైపు చూస్తున్నారు.

నేను ఆయన వైపే చూస్తూ కూర్చున్నాను.

కేవలమంటే కేవలం ఈ క్షణం కోసమే నేను అంతదూరం నుండి వచ్చాను అని చెప్పాలనిపించింది.

ఎప్పుడూ చెప్పకూడని, చెబితే అవి వాడిపోయి పాతవైపోతాయేమో అనే విషయాలు ఉంటాయని నేను బలంగా నమ్ముతాను.

ఈ విషయం కూడా అలాంటిదే.

అవి ఎప్పటికీ….హిమాలయాల్లో ఎవరికీ తెలియని ప్రదేశంలో ఏ పువ్వులో వాడకుండా ఉన్నట్టు నా హృదయంలోనే అవి దాగిపోవాలి అని నా పిచ్చి ఆలోచన.

ఈ క్షణం కూడా అలాంటిదే.

నేనేమీ మాట్లాడకుండా కూడా ఇలా ఎంతో సేపు ఉండగలను ఆ పరిపూర్ణ మౌన పరిమళాన్ని ఆస్వాదిస్తూ….

అయినా నేను అడగాలనుకున్న చాలా కొన్ని విషయాల్లో కొన్నే అడిగాను.

నాకు ముందే తెలిసిన సమాధానాలే నాకు దొరికాయి.ఇదేమీ నా అతి విశ్వాసం కాదు.

సమస్త చరాచర విశ్వంలోని సత్యాన్ని కొందరు శబ్దంగానో, కాంతిగానో, లేదా ఇంకెలాగో ఎందరో దర్శించి ఉండవచ్చు.ఇతను సమస్త సృష్టిని సౌందర్యంగా దర్శించినవాడు.సత్యాన్ని సౌందర్యంగా దర్శించిన ఒక యోగి నుండి నేను విభిన్నమైన సమాధానాలు ఆశించడమన్నది నా అమాయకత్వం అవుతుంది.

“నా బాధకానిది నన్నెప్పుడూ కదిలించలేదు. ఎన్నో వైరుధ్యాలు, యుద్దాలు నా చుట్టూ ఉన్నాకూడా నాలో జరిగే యుద్ధమే నాకు ముఖ్యం. నేను చూసినది, అందులో నేను అనుభూతి చెందినది నిక్కచ్చిగా నేను రాయగలిగాను. ఎక్కడో జరిగే యుద్ధం నన్నిప్పుడు కదిలించలేదు. అదిగో… ఇప్పుడు ఓ పక్షి ఆ కొమ్మపై నుండి ఎగిరిపోయింది. ఇప్పుడు ఊగుతున్న ఆ కొమ్మనే నేను చూస్తూ ఉన్నాను. నాకిప్పుడు అదే ముఖ్యం.”

నేను అడిగిన ఓ మాటకు స్వయానా వీరభద్రుడు గారు చెప్పిన మాట ఇది. ఇది కదా నేను ఊహించిన ఓ సమాధానం.

ఇతణ్ని తెలుగు లోకం విస్మరించింది అనడం శుద్ధ తప్పు. ఇతనే తన జీవితంలో ప్రతి క్షణం తనకు ఎదురుగా నిలబడ్డ సమస్త సౌందర్యానికీ ఆప్తుడై తక్కిన లోకాన్ని విస్మరించాడన్నది మాత్రమే నిజం.

విస్మరించడానికీ, నిత్యం స్మరించడానికీ అవార్డులు, సర్టిఫికెట్లు, శాలువాలే గీటురాయైతే అవేవీ కనీసం ఈయన ఊహనైనా అందుకోలేవన్నది నా అభిప్రాయం.

నేను అడిగినవి, తెలుసుకున్నవి ఇక్కడ కొన్ని ప్రస్తావించలేను.

నేనేమీ ఎక్కువ మాట్లాడానుకోలేదు ఆరోజు.

నా గురించిన సమాచారం అడిగారు,కుటుంబం, ఉద్యోగం, నా ఆరోగ్యం గురించి.నా ప్రభుత్యుద్యోగం శాశ్వతంగా వదిలేయా లనుకుంటున్నానని చెబితే కాస్త మందలించారు.అలా ఎప్పుడైనా అనిపిస్తే నాతో ఒకసారి మాట్లాడి నిర్ణయం తీసుకోమన్నారు.

ఇంకొన్ని నాకు చెప్పాలని లేదు, అవి కేవలం నాకోసం మాత్రమే…

.

కాసేపటికి కమ్మని భోజనం పెట్టారు.నేను గురువుగారు భోంచేస్తుంటే అమ్మగారు ఎంత ప్రేమగా వడ్డించారనీ….నాకిప్పటికీ ఆ సందర్భం కళ్ళముందే ఉంది…

భోజనం చేసి మళ్లీ నేను గురువుగారు అదే గదిలో, అదే చోట కాసేపు కూర్చుని మాట్లాడుకున్నాం.

వెంటనే నన్ను “నువు ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఉంటావు, మళ్లీ రాత్రికే జయతి లోహితాక్షన్ లను కలవడానికి ప్రయాణ మంటున్నావు, ఇప్పుడు కాసేపు పడుకో, నేను మళ్ళీ వచ్చి టీ కోసం నిన్ను నిద్రలేపుతాను” అంటూ ఓ పదేళ్ల పిల్లవాడిలా లేచి ఎంత వద్దన్నా కూడా చకచకా నాకోసం మంచంపై ఎంతో శ్రద్దగా పరుపు వేశారు.నేను ఎప్పుడు తీర్చుకోవాలి ఈ ఋణం. ఈ జన్మలో కుదురుతుందా అసలు.నాకు గంటసేపు ఆ గదిని, ఆ పుస్తకాలను, అక్కడున్న ఆ రెండూ దేవాలయం పెయింటింగ్స్ ను చూస్తూ గడపడమే సరిపోయింది.

కాసేపటికి నేనే లేచి ఎదో పుస్తకం చదువుతూ కూర్చున్నాను.

సాయంత్రం 4;30 సమయంలో మళ్లీ గురువుగారే రెండు కప్పుల్లో టీ తెచ్చారు. మళ్లీ కాసేపు సంభాషణ.27ఏళ్ల వయసున్న నాకు 60ఏళ్ల అతనికి ఏ జన్మ స్నేహమో.లేదా ఏ బంధమో.నాకు చెప్పాలనుకున్నవి ఏ సంకోచము లేకుండా చెప్పారు.

తపస్సు చేసాక ఏమి అడగాలో తెలియని ఓ అమాయకుడికి ప్రేమతో వాత్సల్యంతో ఇచ్చిన వరాలవి.ఎన్నాళ్లనుండో తికమకలో ఉన్న విషయాలు కొన్ని నాకు సుస్పష్టమయ్యాయి.ఏదో నా కళ్ళకు కట్టిన ఒక తెర తీసినట్టు ఉంది ఆ రోజు నుండి నాకు.నాకేం కావాలో నేను అడగకముందే లేదా అడగలేనని తెలిసో ఇవ్వడం నా అదృష్టం.

“ఇదిగో ఇవి నేన్నీకిస్తున్న పుస్తకాలు.ఇంగ్లీష్ పుస్తకాలు చదవడం కూడా నిదానంగా అలవాటు చేసుకో…హైదరాబాద్ వస్తే వచ్చి కలసి వెళ్ళు. ఎలాగూ అంతదూరం వెళ్తున్నావు…ఈ కొన్ని పుస్తకాలు జయతి కి అందివ్వు.” మాట్లాడుతూనే ఉన్నారు గురువుగారు.

అప్పటికే నేను బయలుదేరాల్సిన సమయమైంది.

“విజ్జీ…ఈ అబ్బాయి ట్రైన్ లో ఏం తింటాడో ఏమో..ఏమైనా టిఫిన్ చేశావా??”

ఎంత వద్దు అని చెప్తున్నా కూడా వంకాయ వేపుడు, పులిహోరా, ఒక లడ్డు బాక్స్ లో పెట్టిచ్చారు అమ్మగారు.

ఇద్దరినీ ఒకచోట నిలబెట్టి పాదనమస్కారం చేయకుండా ఉండలేకపోయాను నేను.

కొన్ని పుస్తకాలు, రెండు పెయింటింగ్స్, టిఫిన్ బాక్స్ , నా బ్యాగ్ తీసుకుని జయతి లోహితాక్షన్ లు ఉండే రాజమండ్రి కి దగ్గర్లోని ప్రాంతానికి బయలుదేరాను.

**********

చినవీరభద్రుడు గారిని కేవలం సాహిత్యకారుడనీ, అందులోనూ ఒక వర్గపు కవిత్వ ధోరణికి పరిమితం చేయడం ద్వారా తెలుగు లోకం ఎంత కోల్పోతుందో నాకు తెలిసింది. ప్రతి అక్షరంలో ఎల్లలు దాటి ప్రయాణించగల కరుణ, నిగూఢమై ఉన్న మానవీయత, మనిషిని సంపూర్ణంగా సంస్కరించగల ఓ హృదయ భాష ఆయన రాసిన ప్రతి అక్షరంలో ఉందని నేను తెలుసుకోగలిగాను.

అలాంటి మహోన్నతమైన మనిషితో కనీసం నేను ఒక రోజు ఉన్నందుకు అది నా జీవితంలో ఎంతో ముఖ్యమైన, విలువైన రోజుగా నేను చెప్పుకుంటాను.రవీంద్రనాథ్ టాగోర్ ను నేను చూడలేకపోయానన్న అసంతృప్తి నేను చినవీరభద్రుడు గారిని కలవడం ద్వారా ఆ దప్పికను తీర్చుకున్నానని చెప్పడానికి నాకెలాంటి సందేహమూ లేదు.

ఎందుకంటే సత్యమూ, సౌందర్యమూ, ఎల్లలను, సరిహద్దులను, సమస్త పరిమితులను దాటి ఒక హృదయం నుండి మరో హృదయానికి,ఒక కాలం నుండి మరో కాలానికి ప్రయాణిస్తూనే ఉంటాయి.

దాన్ని పట్టుకోగల హృదయం ఉన్నవాళ్లకు అది దొరుకుతుంది.

దాదాపు ఐదు నెలల క్రితం సంగతులివి. అక్కడి నుండి నేను తెచ్చుకున్న గురువుగారి సాహితీ, వ్యక్తిత్వ సంస్కార పరిమళాల తాజాదనం ఈరోజుటికీ, ఈ క్షణానికి కూడా ఏ మార్పూలేక సుందరంగా నిలిచి ఉన్నాయి నా హృదయంలో.

ఏ ఒక్క ముఖ్య కారణమూ లేకుండానే ఒక రోజంతా నన్ను తమతో ఉండనిచ్చిన చిన వీరభద్రుడు గురువుగారి వాత్సల్యానికి,ప్రేమకు నేను మరోసారి పాదనమస్కారాలు చేస్తున్నాను.

“అతణ్ణి కలిసాను.
జీవితమంతా నిర్విరామంగా
తన హృదయపు రెక్కలు ఆడిస్తూ
సేకరించిన దాంట్లో
కొంత కమ్మని తేనె
మరికొంత రంగుల పుప్పొడీ
మౌనంగా నాకు దోసిట్లో
ఒంపాడు.
ఆ తేనె ఓ మార్మిక పదార్థమై
నా హృదయానికి రెక్కల్ని
కరుణించింది.
ఆ రంగుల పుప్పొడి
నా రెక్కలపై ఓ హృదయభాషని
హృదయమున్నవారు చదివేలా
బొమ్మ గీసింది.
నేను ఉన్మత్తుణ్ణై నింగిలోకి ఎగిరిపోయాను”
 
12-9-2022

One Reply to “కొంత తేనె, కొంత పుప్పొడీ

  1. మీ అనుభూతి లే మావికూడా ♥️🙏 కొంత తేనె ,కొంత పుప్పొడి ..ఎప్పటికీ దొరుకునో ఈ జన్మ లో మాకు!

Leave a Reply

%d bloggers like this: