పరమయోగి వై. హనుమంతరావుగారు కర్నూలులో మొన్న పొద్దున్న తెల్లవారు జామువేళ వైకుంఠవాసి అయ్యారు. రెండు రోజులు గడిచినా కూడా ఆ వార్త నాలోకి ఇంకినట్టుగా నాకు తోచడం లేదు. గత ముప్పై ఏళ్ళుగా నాకు తండ్రివలె, తల్లివలె, సోదరుడి వలె ధైర్యాన్నిస్తూ నిలబడ్డ ఒక మనిషి మరిక కనబడరనీ, ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు ఆ ఫోన్ ఎత్తరనీ, నేను ఏ సమస్య చెప్పుకున్నా, ‘మీకేమీ కాదు, నేనున్నాను, పోండి’ అనే మాటలు వినబడవనీ ఇంకా నా మనసుకు తోచడం లేదు.
కాని ఒక యోగికి మరణం ఉండదు కాబట్టి, అది శోకించవలసిన సందర్భంకాదనే ఎరుక నాలో ఎక్కడో ఉంది. మనుషులంతా, చరాచరాలతో కలిపి, అంతర్గతంగా ఒకే అస్తిత్వంతో అనుధానమై ఉంటారు కాబట్టి, ఇప్పుడు ఆయన ఎక్కడికీ వెళ్ళలేదనీ, ఇంకా మరింత దగ్గరగా వచ్చారనీ విజ్జి చెప్తున్న మాటలు నమ్మదగ్గట్టుగానే ఉన్నాయి.
ముప్పై ఏళ్ళ కింద పరిచయమయ్యారు. కర్నూల్లో. ఈ ముప్పై ఏళ్ళుగా ఎన్నో సార్లు ఆయన చేయి నేను విడిచిన సందర్భాలున్నాయిగాని, నా చేయి ఆయన విడిచిన సందర్భం ఒక్కటి కూడా లేదు. నా చిన్నతనంలో మా నాన్నగారు పొలాలమీద తిరిగి పంటల లెక్కలు రాసుకునేటప్పుడు నేను కూడా వెంటవెళ్తే నా చేయి చాలా గట్టిగా పట్టుకునేవారు. ఆ గ్రిప్ నా జీవితమంతా ఫీల్ అవుతూనే ఉన్నాను. హనుమంతరావుగారు కూడా నా మనసునట్లానే పట్టుకుని ఉన్నారు. ఆ గ్రిప్ ఎంత బలమైంది అంటే, చాలా రోజులుగా కర్నూలు వస్తాననీ, చూస్తాననీ ఆయనతో చెప్తున్నవాణ్ణి, రెండు వారాల కిందట నిజంగానే ఆయన్ని వెళ్ళి చూడగలిగానంటే, ఆ గ్రిప్ వల్లనే అనుకుంటున్నాను.
మన పురాణాల్లోనూ, ఇతిహాసాల్లోనూ ఋషులు త్రికాలజ్ఞులుగా ఉండేవారనీ, ఏదన్నా జరిగినప్పుడు దివ్యదృష్టితో అంతా చూడగలిగేవారనీ చదివాను. ఒక త్రికాలజ్ఞుడు ఎలా ఉంటాడో హనుమంతరావుగార్ని నా కళ్ళారా చూసాను. మనుషుల్ని చూడగానే, చాలాసార్లు. చూడనవసరం కూడా లేదు, వారి పేరు చెప్పగానే, ఆయన వాళ్ళ జీవితాల్లో ఇంతకు ముందు జరిగినవీ, రేపు జరబోయేవీ కూడా ఎంతో స్పష్టంగా, పుస్తకం చదివినట్టుగా చెప్పెయ్యడం కర్నూల్లో చాలామందికి అనుభవమే. నా వరకూ నా స్వానుభవంలో ఎన్నో ఉదాహరణలు ఇవ్వగలను.
ఆ మిరకిల్ ని ఆయన ఎప్పుడూ తన స్వార్థానికీ, స్వప్రయోజనాలు తీర్చుకోడానికీ వాడుకోలేదు. తనకు తెలిసిన మనుషులు కష్టాల్లో పడబోతున్నారంటే వాళ్ళని కాపాడటానికే ఆయన ఆ శక్తిని వాడుతూ వచ్చారు. చాలాసార్లు మనుషులు ఆ క్షణాన, ఆయన చెప్పినట్టుగా జరిగినట్టు గ్రహించిన క్షణాన ఎంత ఉద్విగ్నభరితులుగా ఉండేవారో, ఆ మరుక్షణానే, అది చాలా మామూలుగా జరిగిందనీ, అందులో ఆయన ప్రమేయం ఏమీ లేదనీ, ఆయన చేసింది ఏమి లేదనీ అనుకోవడం, ఆయన్నుంచి దూరంగా జరిగిపోవడం కూడా చాలా మాములు అనుభవమైపోయింది నాకు. మనుషుల్లోని ఈ కృతఘ్నతాభావం ఆయన్ని తీవ్రంగా గాయపరిచేది. చిన్నపిల్లవాడిలాగా వాళ్ళమీద నాతో తరచూ ఫిర్యాదు చేస్తుండేవారు. కాని మనుషుల్లోని ఆ సహజవక్రతని ఎలా నిర్లక్ష్యం చేయాలో నాకు తెలిసేదికాదు.
కానీ, ఆయన వాక్కుకున్న ఆ అద్వితీయ మహిమ ఆయన ఆధ్యాత్మిక వ్యక్తిత్వానికి విజిటింగ్ కార్డు పాటిది కూడా కాదు. ఆయన యోగి అంటే నిజమైన యోగి. కాషాయవస్త్రాలు, ఆశ్రమాలూ, శిష్యగణాలూ అవసరం లేని యోగి. పాంటూ, చొక్కా తొడుక్కున్న యోగి. తనలో ఒక దైవత్వం ఉందని తెలుసుకున్నాక, ఆయన దాన్ని కాపాడుకోడానికి పాటించిన క్రమశిక్షణ నా దృష్టిలో అన్నిటికన్నా గొప్ప మిరకిల్. తెల్లవారుజామున మూడు నాలుగ్గంటలకి లేచి, తన దేవుడి గది తుడుచుకుని, పూజ, ప్రార్థన ముగించుకుని, ఆరింటికల్లా తన ఇంటి తలుపు తెరిచి పెట్టి, తెల్లటి వస్త్రాలు ధరించి, తన కోసం ఏ ఆర్తులు వస్తారా అని ఎదురుచూసేవారు. ఎక్కడికి వెళ్ళినా పచ్చిమంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా రోజుల తరబడి గడపడం చూసాను. బయట ఎవరిదగ్గరా తినడం, తాగడం ఆయనకు నిషిద్ధం. ఎందుకు ఈ కఠిన నియమం అంటే, ఒక గర్భవతి తన కడుపులోని బిడ్డ కోసం ఏది తినాలో ఏది తినకూడదో ఎంత వ్రతంగా పాటిస్తుందో, తను కూడా అలానే అని చెప్పేవారు.
ఎనభై రెండేళ్ళ జీవితం. చెక్కుచెదరని వ్యక్తిత్వం. రాజీపడని మనస్తత్వం. ఎవరికీ అమ్ముడుపోకుండా జీవించగలిగిన స్వాతంత్య్రం. తన జీవితంలోని ప్రతిక్షణం మనుషులకి ఇవ్వకుండానే గడిచిపోతోందని దిగులుపడే ఔదార్యం. అటువంటి ఒక మనిషిని చూసాననీ, ఆయనకు ఎంతో సన్నిహితంగా మెలిగాననీ, ఆయన మా కుటుంబంలో ఒకడిగా, నేను ఆయన కుటుంబంలో ఒకడిగా మెలిగాననీ అనుకోవడమే నాకెంతో ఓదార్పుగా, ధైర్యంగా ఉంది.
ఆయన పరిచయమైన ఈ ముప్పై ఏళ్ళ కాలంలో నా ఉద్యోగ జీవితంలో నేనెన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. బహుశా నేనెదుర్కొన్నంత వేధింపు మరే ఉద్యోగీ ఎదుర్కొని ఉండడు. ఆ సమస్యలు నా తల్లిదండ్రులకో, తోబుట్టువులకో చెప్పుకోగలిగేవీ కావు, చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోగలిగేవీ కావు. అంగబలం, అర్థబలం, రాజకీయ బలం లేని నాకు ఇన్నేళ్ళుగా పెద్ద దిక్కుగా నిలబడ్డ ఒకరిద్దరిలో హనుమంతరావుగారినే మొదట తలవాలి. అతి చిన్న సమస్యనుంచి అతి పెద్ద సమస్యదాకా ప్రతి ఒక్కటీ ఆయనకు చెప్పుకునేవాణ్ణి. ఎప్పుడు పడితే అప్పుడు, అర్థరాత్రిళ్ళు కూడా ఫోన్ చేసిన రోజులున్నాయి. ఒక్క ఫోన్ కాల్. ఇదీ సమస్య అని ఆయనకు చెప్పడం. నేను చూసుకుంటానులే అని ఆయన భరోసాగా ఒక్క మాట చెప్పడం. అంతే, ఆ సమస్య మరుక్షణమే మర్చిపోయేవాణ్ణి.
ఏం చేసేవారు? ఆయన నా సమస్య విని ఎవరైనా రాజకీయ నాయకులకో, పెద్ద అధికారులకో ఫోన్ చేసి ఉండేవారనుకుంటున్నారా? వాళ్ళెవరూ ఆయనకు తెలీదు. నిజానికి నేను చేసే ఉద్యోగం ఏమిటో మా అమ్మకి ఎంత తెలుసో, ఆయనకీ అంతే తెలుసు. మరేమి చేసి ఉండేవారు? ఆయన ఏమి చేసి ఉండకపోతే, జడివాన ముంచెత్తేలాగా కమ్ముకున్న మబ్బులు చూస్తూండగానే దూదిపింజల్లాగా తేలిపోయేవి? అది ఒక విశ్వాసికి మాత్రమే అర్థం కాగల రహస్యం. ఒక విశ్వాసికి మాత్రమే బోధపడగల అనుభవం.
ఆయన పక్కన ఉంటే గొప్ప ధైర్యంగా ఉండేది. ఒకసారి ఆయన మా ఇంటికి వచ్చారు. ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను. ఇంతలో గౌరవనీయుడైన పార్లమెంటు సభ్యుడు ఒకాయన నాకు ఫోన్ చేసాడు. మొదట రెండు మాటలు సవ్యంగానే మాట్లాడేడు. ఆ తర్వాత ఏమైందో ఏమో, తన ముందు కార్యకర్తలు ఉండిఉంటారు, వాళ్ళముందు తన ప్రతాపం చూపించడానికా అన్నట్టు, అసభ్యంగా, ఇక్కడ రాయలేని మాటలు మాట్లాడటం మొదలుపెట్టాడు. నా మొహంలో ఏ కష్టం కనిపించిందో, ఏమిటని సైగ చేసారు హనుమంతరావుగారు. నన్ను నోటికొచ్చినట్టు దూషిస్తున్నాడని చెప్పాను. నోరుమూసుకొమ్మని చెప్పండి అన్నారు. అంతేనా అన్నాను. అంతే, నేనున్నాను, చూసుకుంటాను అన్నారు. మరుక్షణమే ఆ గౌరవసభ్యుడికి ఏ భాషలో జవాబివ్వాలో ఆ భాషలో జవాబిచ్చాను. అతడు ఫోన్ పెట్టేసాడు.
ఇలాంటివి, ఎన్నో చెప్పగలను. ‘మీ మంచికీ, చెడ్డకీ రెండింటికీ నేనున్నాను’ అనేవారు. మంచికోసం గురువులుంటారు. కాని చెడ్డలో కూడా నిన్నర్థం చేసుకుని నీకోసం నిలబడేవాళ్ళని ప్రాణస్నేహితులంటాం. హనుమంతరావుగారు నాకు ప్రాణస్నేహితులుగా ఉన్నారని ఇప్పుడు అర్థమవుతున్నది. ఎంత ప్రాణస్నేహితుడిగా ఆయన నన్ను భావించి ఉండకపోతే, మొన్న హాస్పటల్లో తన బెడ్ పక్కన నా ఫోన్ నంబరూ, విజ్జి ఫోన్ నంబరూ రాసిపెట్టుకుని ఉంటారు!
11-9-2022
I pray the omnipresent to get over this pain🙏