గురుభక్తి

Reading Time: 6 minutes

సురేష్ కొలిచాల గారికి నేనెంతో ఋణపడి ఉన్నాను. యూనీకోడ్ నుండి అనూ ఫాంట్లకి ఆయన రూపొందించిన కన్వర్టరు వల్ల నాకు వేరే డిటిపి ఆపరేటర్ మీద ఆధారపడవలసిన అవసరం తప్పిపోయింది. అందుకు వారికి ఏమిచ్చినా ఋణం తీరదు.

నిన్న ఆయన ఉ.వే.స వ్యాసాల్లోంచి మరికొన్ని అనువదించమని అడిగారు. అందుకని ఆయనకు నేను పడ్డ బాకీలో కొంత చెల్లింపుగా ఈ అనువాదాన్ని అందిస్తున్నాను.

~

గురుభక్తి

తిరుచ్చి మీనాక్షి సుందరం పిళ్లై గారి శిష్యుల్లో సుందరం పిళ్లై కూడా ఒకరు. అతనికి తన గురువంటే అపారమైన భక్తి ఉండేది. తన గురువుగారికి ఏదైనా అవసరం పడిందంటేనో లేదా ఏదన్నా ఇబ్బంది ఎదురయిందంటేనో అతడు ఏమి చేసైనా సరే దాన్ని పరిష్కరించకుండా ఉండేవాడు కాడు.ఎవరేనా తన ఎదట తన గురువుగారి గురించి తక్కువచేసి మాట్లాడితే వెంటనే వాళ్ళతో పోట్లాటకి దిగేవాడు. వాళ్ళ నోరుమూయించేవాడు. అతడికి లోకరీతి బాగా తెలుసు. చక్కటి మాటకారి. విచక్షణ, వివేకం ఉన్నవాడు. అతడికి చాలమంది స్నేహితులు ఉండేవారు. వాళ్ళు కూడా అతడి గుణగణాలకి ముచ్చటపడి అతడేమి అడిగినా కాదనకుండా చేసిపెట్టేవారు.

ఒకసారి మీనాక్షి సుందరం పిళ్లైగారు తిరుత్తణిగై పురాణం సంపాదించి చదవడం మొదలుపెట్టారు. అది తిరుత్తణి దివ్యక్షేత్రం గురించిన పురాణం. దాన్ని ఆయన చెన్నయిలో ఉంటున్న కనకసభాపతి ముదలియారు నుంచి తెప్పించుకున్నారు. దాన్ని లోతుగా అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. అయితే అందులో అగస్త్యుడు అనుగ్రహించబడ్డ ఘట్టానికి సంబంధించిన కొన్ని అధ్యాయాల్ని ఆయన పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. దాని అర్థం ఏమై ఉండవచ్చునో చెప్పమని చాలామంది పండితుల్ని అడిగారుగాని ఎవరూ చెప్పలేకపోయారు.అయితే శివదరుమోత్తరం అనే గ్రంథం చదివినట్లయితే ఆ భాగాల్ని బాగా అర్థం చేసుకోవచ్చునని ఎవరో ఆయనకు చెప్పారు. ఆయన వెంటనే ఆ గ్రంథం గురించి కూడా అన్వేషించారుగాని ఎక్కడా దొరకలేదు.

అయితే అది తిరుచ్చికి చెందిన ఒక శైవ గురువు అభిషేకస్థరు దేశికరు అనే వారిదగ్గర ఉందని తెలుసుకున్నారు. ఆ గ్రంథాన్ని తనకొకసారి అరువిచ్చినట్లయితే చదువుకుని తిరిగి ఇచ్చేస్తానని మీనాక్షి సుందరం పిళ్లై ఆ దేశికరును అభ్యర్థించారు. కాని ఎన్ని సార్లు అడిగినా ఆ శివగురువు ఆ పుస్తకం ఇవ్వడానికి సుముఖత చూపించలేదు. దాంతో పిళ్లైగారు తన తరఫున ఆయన్ని అభ్యర్థించవలసిందిగా కొందరు మిత్రుల్ని కోరారు గాని ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. పుస్తకం ఇమ్మని అడిగిన ప్రతిసారీ ఆ గురువు ఏదో ఒక కారణం చెప్పేవాడు. ఒకసారి అది పూజలో ఉంది, బయటికి తియ్యలేననేవాడు, మరోసారి ప్రపంచానికి దాని విలువ తెలియదనేవాడు, ఇంకోసారి దాని అర్థం బోధపర్చుకోవడం అంత సులభం కాదని చెప్పేవాడు, అలా ఏదో ఒక సాకు చెప్తుండేవాడు. మరీ మరీ అడిగేకొద్దీ అతడు మరింత బిగుసుకుపోతూ వచ్చాడు.బహుశా కొంత సొమ్ము ముట్టచెపితే అతడు పుస్తకం అరువిస్తాడేమో అనుకుని పిళ్ళైగారు ఆ పుస్తకం అరువివ్వడానికి బయానా కింద కొంత సొమ్ము ఇవ్వగలనని చెప్పారుగాని ఆ గురువు దానికి కూడా ఒప్పుకోలేదు. తన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో పిళ్లైగారు చాలా నిరాశకు లోనయ్యారు.

‘నేను ఆ గ్రంథం కోసం అన్నిచోట్లా గాలించాను. తీరా అది ఇక్కడే మన దగ్గరలోనే ఉండికూడా దాన్ని చూడలేకపోతున్నాను. ఇటువంటి పరిస్థితికి ఎవరి గుండె తల్లడిల్లకుండా ఉండదు?’

ఒకరోజు సుందరం పిళ్ళై తన గురువుగారు దిగాలుగా ఉండటం చూసాడు. అతడు ఎంతో గౌరవంతో గురువుగారి దగ్గరకు వెళ్ళి కారణం అడిగాడు. మీనాక్షి సుందరం పిళ్ళై గారు అతడికి మొత్తం కథంతా చెప్పారు. తాను తిరుత్తణిగై పురాణం చదువుతుంటే అగస్త్యఘట్టం దగ్గరకి వచ్చేటప్పటికి తనకు కొన్ని భాగాలు అర్థం కాకపోవడం, అది అర్థం కావాలంటే శివదరుమోత్తరం అనే పుస్తకం చదివితే తెలుస్తుందని తెలియడం, అది పట్టణంలో అభిషేకస్థరు అనే గురువు దగ్గర ఉందని తెలియడం, ఆ పుస్తకం అరువిమ్మని ఎన్నిసార్లు అడిగినా ఆ గురువు ఇవ్వడానికి ఇష్టపడకపోవడం, మొత్తం అంతా చెప్పారు. సుందరం పిళ్లై అదంతా విని, ఒకవేళ ఆ పుస్తకం నిజంగానే ఆ గురువు దగ్గర ఉన్నట్లయితే దాన్ని ఎలాగేనా తెచ్చి తన గురువు పాదాల దగ్గర పెడతాననీ ఆ విషయం గురించి ఇంక ఆలోచించవద్దనీ చెప్పాడు. తాను ఎన్నో సార్లు ప్రయత్నించీ సాధించలేనిదాన్ని సుందరం పిళ్ళై ఎలా సాధించగలడో ఆ గురువుకి అర్థం కాలేదు.

*
ఒకరోజు ఆ దేశికరు ఇంటిముందు రెండు గుర్రాలు పూన్చిన బండి ఆగింది. దాన్లో ఒక సంపన్నుడు కూచుని ఉన్నాడు. ఆ బండిలోంచి ఒక ఉద్యోగి కిందకు దిగి దేశికరు ఇంటికి వెళ్ళి ఆ గుమ్మం దగ్గర నిలబడి అది దేశికరు గారి ఇల్లేనా అని మర్యాదగా అడిగాడు.

‘అవును. ఇది వారి ఇల్లే, ఆయనతో మీకేమి పని?’ అని ఒక మనిషి లోపలనుంచే జవాబిచ్చాడు.

‘దేశికరు గారు ఇంట్లోనే ఉన్నారా? అయితే నేను ఎందుకు వచ్చానో వారికే స్వయంగా నివేదిస్తాను.’

‘చెప్పండి, నేనే దేశికరును. ఏమి చెప్పాలనుకుంటున్నారు?’

ఈ సంభాషణ నడుస్తూ ఉండగానే ఆ బండిలోంచి మరొక ఉద్యోగి దిగి బండిదగ్గరనుంచి వీథరుగు దాకా ఎర్ర తివాసీ పరిచాడు. మరొకరు ఆ వీథరుగు మీద ఒక ఆసనం, బాలీసు అమర్చారు. ఆ సంపన్నుడు ఆ బండిలోంచి ఎంతో హుందాగా దిగి రాజసం ఉట్టిపడుతూండగా ఆ అరుగుమీద ఆ ఆసనం మీద బాలీసుని ఆనుకుని కూచున్నాడు. రాజోద్యోగులకు తగ్గవస్త్రాలు ధరించిన పనివారు మర్యాదసూచకంగా, గౌరవం ఉట్టిపడేలాగా తమ నోటికి చేతులు అడ్డుపెట్టుకుని అటూ ఇటూ నిలబడ్డారు. వాళ్ళని చూడగానే అప్పటిదాకా లోపల దేశికరుతో సంభాషిస్తున్న ఉద్యోగి బయటికి పరుగెత్తుకుంటూ వచ్చాడు.

అప్పటికి ముందు నడవాలో అడుగుపెట్టిన దేశికరు తన ఇంటిముందు జరుగుతున్న హంగామా అంతా చూసాడు.
‘ఎవరో పెద్దమనిషి తన పరివారంతో వచ్చినట్టున్నాడు. నన్ను కలవడానికో, మరి ఎవరిని కలవడానికో తెలియటంలేదు. ఏమైనా తొందరలోనే తెలుస్తుంది కదా. అటువంటి పెద్దమనిషి ముందు నా అంతటనేను పోయి నిలబడటం భావ్యంగా ఉండదు. నన్ను రమ్మని పిలిస్తే వెళదాం’ అని అనుకుంటూ దేశికరు లోపల పీటమీద కూచుని చదువుకోటానికి ఒక పుస్తకం చేతుల్లోకి తీసుకున్నాడు.

ఇదంతా జరుగుతుండగా, ముందు ఆ ఇంట్లో అడుగుపెట్టి బయటకు వెళ్ళిన ఉద్యోగి మళ్ళా నెమ్మదిగా లోపల అడుగుపెట్టాడు. దేశికరును మళ్ళా పిలవవచ్చునా లేదా అని సందేహిస్తున్నట్టుగా ముఖం పెట్టి చిన్నగా దగ్గాడు.

‘ఏమి?’ అనడిగాడు దేశికరు.

‘మా యజమాని మిమ్మల్ని కలుసుకోవడం వీలవుతుందేమో అడగమని నన్ను పంపించారు.’

‘రమ్మనండి ఆయన్ని’ అన్నాడు దేశికరు హడావిడిగా లేస్తూ.

‘మా యజమాని అశౌచంలో ఉన్నారుకాబట్టి లోపలకి రాలేరు.’

‘అలాగా, అయితే నేనే బయటికి వచ్చి వారిని కలుస్తాను. అయినా ఆయన లోపలకి వచ్చినా కూడా పర్వాలేదు’ అంటో అతడు రుద్రాక్ష తావళం, ఇతర ఆభరణాలు ధరిస్తూ ఆ సంపన్నుణ్ణి చూడటానికి బయటకు అడుగుపెట్టాడు. ఆ ఆగంతుకుడు దేశికరుకు అభివాదం చేస్తూ ఆయన్ని దగ్గరగా రావద్దనీ, ఉన్నచోటే ఉండమనీ కోరాడు. దేశికరు ఆ సందర్శకుణ్ణి ఆపాదమస్తకం పరిశీలనగా చూసాడు. ఆ సందర్శకుడి పనివాళ్ళల్లో ఒకరు దేశికరు పక్కగా నిలబడ్డాడు.

‘మీ యజమాని ఎవరు? వారు ఇక్కడికి ఎందుకు వచ్చారు?’ అని అడిగాడు దేశికరు లోగొంతుకతో.

‘మా యజమాని దక్షిణాదికి చెందిన పెద్ద జమీందారీ వంశానికి చెందినవారు. ఆయన తమ తల్లిగారితో కలిసి చిదంబరం దర్శనానికి వచ్చారు. ఇక్కడ జంబూనాథులు, తాయిమానవరు, రంగనాథుల దర్శనం చేసుకువెళ్దామని తిరుచ్చిరాపళ్ళిలో ఆగారు. కంటోన్మెంటులో పెద్దబంగళాలో విడిదిచేసారు. కనీసం మూడు రోజులేనా ఇక్కడ ఉండాలనుకున్నారు. కాని వారి తల్లిగారు అస్వస్థులయ్యారు. ఆయన ఎంతప్రయత్నం చేసినప్పటికీ, వైద్యం కోసం డబ్బు ఖర్చుపెట్టినప్పటికీ వారి తల్లిగారు కైలాసవాసి అయిపోయారు. వెంటనే దహనకార్యక్రమం పూర్తయిపోయింది. ఆమె మా స్వస్థలంలో పరమపదించిఉంటే అంత్యక్రియలు ఘనంగా చెయ్యగలిగి ఉండేవారం. కాని ఏమి చెయ్యడం? అంతా దైవేచ్ఛ. మన చేతుల్లో ఏముంది? అస్థి సంచయం ఈ రోజు పొద్దున్న జరిగింది. ఈ సందర్భంగా మరికొన్ని కర్మలు చెయ్యవలసి ఉండి, తగిన సలహాసూచనలు తీసుకోవడానికి ఎవరు తగిన మనిషి అని విచారిస్తే ఈ ఊళ్ళో వాళ్ళు మీ పేరు చెప్పారు. అందుకని మా యజమాని మీదగ్గరకు వచ్చారు. మేము డబ్బు చెల్లించడానికి సిద్ధపడ్డా కూడా మా ప్రాంతంలో దొరికినట్టుగా ఇక్కడ ఏమీ దొరకడం లేదు. చివరికి కర్మకాండ చెయ్యడానికి మనుషులు కూడా అంత సులభంగా దొరకడం లేదు. నిన్న చేసినంత ప్రయత్నమూ ఇవ్వాళ కూడా చేసాంకాని ఇక మిగిలిన అంత్యక్రియల నిర్వహణ కోసం మా ఊరు వెళ్ళిపోదామనుకుంటున్నాం.’

‘అన్నీ దొరుకుతాయిక్కడ. మీ దగ్గర డబ్బుంటే దొరకనిదేమిటి? నాకు ఇక్కడ అందరూ తెలుసు, వడ్రంగులు, బంగారుపనివాళ్ళు, పాత్రలు అమ్మేవాళ్లు, వస్త్రవ్యాపారులు. కర్మకాండ నిర్వహించడానికి తగిన స్థలాలు కూడా ఉన్నాయిక్కడ. నా దగ్గర డబ్బుంటే ప్రతి ఒక్కటీ చెయ్యగలనిక్కడ. కాబట్టి మరేమీ ఆలోచించకండి, మీరు అన్నీ చక్కగా చేసుకోగలరు. వారి తల్లిగారి దశదిన కర్మ ఇక్కడే కానిమ్మని మీ యజమానికి చెప్పండి.’

‘మా యజమాని కర్చుకు వెనకాడటం లేదు’ అన్నాడు ఆ ఉద్యోగి. దేశికరు ఎంతో సానుకూలంగా మాట్లాడిన మాటలు విన్నాక అతడిలా అన్నాడు: ‘ అన్ని వస్తువులూ కొనితేవడానికి మా దగ్గర మనుషులున్నారు. కాని మా యజమానికి ఒక కోరిక ఉంది. అదేమంటే మీ దగ్గర శివదరుమోత్తరం అనే గ్రంథం ఉందట. ఆయన ఈ అశౌచ దినాల్లో ఆ గ్రంథం చదువుకోవాలని అనుకుంటున్నారు. గతంలో వారి తండ్రి గారు పోయినప్పుడు కూడా ఇలానే ఎవరో సలహా ఇస్తే వారు ఆ గ్రంథం సంపాదించి ఆ ద్వాదశదినాల్లో ఆ గ్రంథం పఠించారు. అది దేవనాగర లిపిలో ఉంటే వారు చదవలేరు. ఆయనకి తమిళలిపిలో ఉన్న గ్రంథమే కావాలి, అందుకనే మేము మా ఊరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాం’ అని చెప్పి, ఆ పైన ఆ ఉద్యోగి గొంతు తగ్గించి దేశికరుతో ‘మేము మిగిలిన అంత్యకర్మలు కూడా ఇక్కడే పూర్తి కానిచ్చుకుని వెళ్ళిపోదామని చెప్తుంటే మా యజమాని వినిపించుకోవడం లేదు. ఇప్పుడా గ్రంథం పఠించకపోతే ఏమైపోతుందని?’ అని అన్నాడు.

‘శివదరుమోత్తరం తమిళ లిపిలో నా దగ్గరుంది. మీకు కావాలంటే తీసుకువెళ్ళి చదువుకోవచ్చు. మీలాంటి ఉత్తముల సేవకు ఉపయోగించకపోతే ఆ పుస్తకం నా దగ్గర ఉండీ ఉపయోగం ఏమిటి?’ అన్నాడు దేశికరు ఆ సంపన్నుణ్ణే చూస్తూ.

దేశికరు పక్కన నిలబడ్డ ఉద్యోగి తన యజమాని అభిమతాన్ని గ్రహించి మిగిలిన కార్యకలాపం నిర్వహించడానికి అవసరమైన వస్తు సామగ్రి జాబితా మొత్తం రాసిపెట్టమని దేశికరును అభ్యర్థించాడు. దేశికరు కలమూ, కాగితాలూ తెచ్చుకుని సవివరంగా మొత్తం రాసిపెట్టాడు. ఆ జాబితా చూసి ఆ ఉద్యోగుల్లో ఒకరు అదే సామాను తమ ఊళ్ళో కొనుక్కుంటే అంతకంటే ఎంతో ఎక్కువనే కర్చయ్యేదని అన్నాడు.

‘కాని ఈ మాత్రం కర్చుపెట్టడానికి కూడా ఈ ఊళ్ళో మనుషులు ఎంతో వెనకాడుతున్నారు’ అన్నాడు దేశికరు.

‘మీరు ఈ మొత్తం సామగ్రి కొనిపెట్టడమే కాదు, దినకర్మ జరిగినన్ని రోజులూ మీరు మా దగ్గరే ఉండాలి’ అని ఆ సంపన్నుడు ఎంతో గౌరవంతో దేశికరును ఉద్దేశించి చెప్పి సెలవుతీసుకుని బండిలో అడుగుపెట్టాడు.

‘మమ్మల్ని మళ్ళా ఎప్పుడు రమ్మంటారు?’ అనడిగాడు అంతదాకా దేశికరు పక్కనే నిలబడ్డ ఉద్యోగి.

‘మీరు పెద్ద కర్మకి వారం రోజులు ముందొస్తే సరిపోతుంది. మనకు కావలసిన సామానులన్నీ అరువుమీద కొనుక్కోవచ్చు.’

అని చెప్తూనే దేశికరు ఆ సంపన్నుణ్ణి ఒక్కనిమిషం ఆగమని చెప్పి, ఇంట్లోకి పరుగెత్తి, శివదరుమోత్తరం గ్రంథం తీసుకువచ్చి ఆ సంపన్నుడి చేతుల్లో పెట్టాడు.

‘ఈ పుస్తకం వెంటనే తెచ్చిఉండేవాణ్ణి. కాని మీ వంటి పెద్దమనుషుల పరిచయం, సంభాషణ ఎప్పుడు దొరుకుతాయి చెప్పండి? పుస్తకం కన్నా పరిచయభాగ్యం ఎంతో గొప్పదికదా, అయినా అన్నీ తెలిసిన వాళ్లు, మీవంటి పరోపకారపారీణులకు చెప్పగలిగేవాణ్ణా నేను?’ అన్నాడు దేశికరు ఆ బండికమ్మీని గట్టిగా పట్టుకుని.

ఆ సంపన్నుడు తాను తెలుసుకోవలసింది మొత్తం తెలుసుకున్నాననీ, ఇంక సందేహాలేవీ లేవని చెప్తూ దేశికరు చేతుల్లో అయిదు రూపాయలు పెట్టాడు. ఆ బండి ఒక్క ఉదుటున ముందుకు కదిలింది. ఆ సంపన్నుడితో వచ్చిన ఉద్యోగులు కొందరు బండిముందూ, కొందరు బండి వెనకా పరుగెత్తడం మొదలుపెట్టారు. దేశికరు ఆ దృశ్యాన్ని ఎంతో సంతోషంగా తిలకించి తన ఇంట్లో అడుగుపెట్టాడు.

*

ఒకరోజు ఉన్నట్టుండి సుందరం పిళ్ళై తన గురువుగారిముందు ప్రత్యక్షమై ‘ అయ్యా, ఇదుగో, శివదారుమొత్తిరం’ అంటో ఆ గ్రంథాన్ని ఆయన చేతుల్లో పెట్టాడు.

‘ఇది నువ్వెక్కడ సంపాదించావప్పా?’ అని అడిగారు మీనాక్షి
సుందరం పిళ్ళై ఆ గ్రంథాన్నీ, తన శిష్యుణ్ణీ మార్చి మార్చి చూస్తూ.

‘ఏమైంది మీ ఇంట్లో? అదేమిటి? మీసం ఎందుకు తీసేసావు? అయ్యో! మీ ఇంట్లో ఎవరో కాలం చేసినట్టున్నారు. నాకెందుకు చెప్పలేదు?’ అనడిగారు సుందరం పిళ్ళైని.

‘అయ్యా, అదంతా తర్వాత చెప్తాను. ఈ గ్రంథానికి వారం రోజుల్లో నకలు రాసుకుని నాకు తిరిగి ఇచ్చెయ్యండి. అలా ఒక ప్రతి రాసుకుంటున్నట్టు ఎవరికీ తెలియనివ్వకండి.’

మీనాక్షి సుందరం పిళ్ళై అందుకు అంగీకరించి, ఆ తాళపత్రాలు తన శిష్యులకీ, మిత్రులకీ ఒక్కొక్కరికీ పదేసి చొప్పున ఇచ్చి ప్రతులు రాయమని చెప్పారు. మిగిలిన తాళపత్రాలకి తనే నకలు రాసుకోవడం మొదలుపెట్టారు. అన్నట్టుగానే ఆ మొత్తం పని వారం రోజుల్లో పూర్తయిపోయింది. ఎనిమిదో రోజు ఆ తాళపత్ర గ్రంథం సుందరం పిళ్లైకి తిరిగి ఇచ్చేసారు. ఆ తర్వాత ఆయన ఆ గ్రంథం చదివి తిరుత్తణిగై పురాణంలో తనకు కలిగిన సందేహాల్ని నివృత్తి చేసుకోగలిగారు.

*

సుందరం పిళ్ళై తన మిత్రుణ్ణి పిలిచాడు. అతడు ఆ రోజు ఆ సంపన్నుడి పరివారంలో ఒక ఉద్యోగిగా నటించినవాడు. అతడికి ఆ తాళపత్ర గ్రంథంతో పాటు ఒక బంగారునాణెం కూడా అందచేస్తూ వాటిని దేశికరు చేతుల్లో పెట్టమని చెప్పాడు. ఆ మనిషి తనను కలుసుకోగానే దేశికరు ఎంతో సంతోషపడ్డాడు. సాదరంగా స్వాగతించాడు. ఆ సంపన్నుడి ఉద్యోగి వేషంలో ఉన్న ఆ మనిషి బంగారుమొహిరీ, తాళపత్ర గ్రంథం దేశికరుకు అందచేసాడు.

‘మా యజమాని బంధువులు వారి తల్లిగారి అంత్యక్రియలు తమ స్వస్థలంలోనే జరిపించాలని పట్టుపట్టారు. దాంతో మా యజమాని తన పరివారంతో వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు తమరిని కలిసి స్వయంగా తమదగ్గర సెలవుతీసుకోనందుకు ఎంతో చింతిల్లుతూనే ఉన్నారు. అయితే వారు త్వరలోనే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని తమ ప్రాంతానికి ఆహ్వానిస్తారని అనుకుంటున్నాను.’

అని చెప్పి అతడు వెళ్ళిపోయాడు. దేశికరు ఆ మాటలు విని కొంత నిరుత్సాహానికి లోనయ్యాడు గాని, ఆ బంగారు నాణెం చూసి కొంత శాంతించాడు. ఈ సంగతి అంతా ఎవరిద్వారానో తెలుసు కున్న మీనాక్షి సుందరం పిళ్ళైగారు పట్టలేనంత ఆశ్చర్యానికి లోనయ్యారు. తన శిష్యుడికి తన పట్ల ఉన్న భక్తి చూసి ఆయన హృదయం ఆనందంతో నిండిపోయింది.

కాని తను చేసిన చేష్టకి తన గురువుగారు తన గురించి ఏమనుకుంటారో అన్న భయంతో సుందరం పిళ్ళై చాలా రోజులు గురువుగారి ఎదటపడలేదు. కాని మీనాక్షి సుందరం పిళ్ళై అతణ్ణి వెంటనే వచ్చి కలుసుకొమ్మని కబురు చేసారు. సుందరం పిళ్ళై గురువు గారి దగ్గరకు వచ్చాడు.

‘ఏమిటప్పా ఇది? ఇట్లాంటి పని చెయ్యొచ్చా చెప్పు? ‘

ఆ ప్రశ్న వినగానే సుందరం పిళ్ళై తన జవాబుగా తిరుక్కురళ్ నుంచి ఒక కురళ్ వినిపించాడు. ‘ఎప్పుడేనా మంచి ఒనగూడుతుందంటే సత్యం స్థానాన్ని అసత్యం తీసుకోవచ్చు, తప్పులేదు ‘* అని అంటున్నది కురళ్’ (పొయ్ మైయుమ్, 30:292)

‘నేను ఈ కురళ్ చెప్పినట్టే నడుచుకున్నాను. నేను చేసినదాని వల్ల ఎవరికీ ఏమీ హాని జరగలేదు. ఒకవేళ నేను చేసింది అయ్య తప్పే అనుకుంటే, నన్ను క్షమించగలరు’ అన్నాడు.

ఆ తర్వాత మీనాక్షి సుందరం పిళ్ళై గారు ఈ సంగతి ఎన్నోసార్లు ఎంతోమందికి చెప్తూ సుందరం పిళ్ళై గురుభక్తిని, సమయస్ఫూర్తిని నోరారా ప్రశంసించడం నేనెన్నోసార్లు విన్నాను.

~

*பொய்மையும் வாய்மை யிடத்த புரைதீர்ந்த
நன்மை பயக்கும் எனின்

poimaiyum vaaimai yidaththa puraitheerndhtha
nanmai payakkum yenin

 
6-9-2022

Leave a Reply

%d bloggers like this: