ఉ.వే.స ఏకబిగిన చదివేసాను. ముప్పై వ్యాసాలు. ప్రతి ఒక్కటీ విలువైనదే. దేని అందం దానిది, దేని ఆనందం దానిది. మొత్తం పుస్తకం అనువదించడం ఎలానూ అయ్యేపని కాదు. కాని కనీసం ఒకటేనా మీతో పంచుకోవాలనిపించింది. కాని ఏది అనువదించాలో ఒక పట్టాన తేల్చుకోలేకపోయాను. కనీసం నాలుగైదు వ్యాసాలు నా ముందు నిలబడ్డాయి. చివరికి, ఇదిగో, ఈ వ్యాసం ఎంచుకున్నాను.
~
అడవిమల్లె
1887. అప్పట్లో నేను ‘జీవకచింతామణి’ పరిష్కరించి మొదటిసారిగా ప్రచురించడానికి తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నాను. ఆ పుస్తకంలో మరికొన్ని తమిళగ్రంథాల గురించి, ఎన్నో ప్రాచీన తమిళ గ్రంథాల గురించి ప్రస్తావనలు ఉన్నాయి. ‘తిరుమురుగాట్ట్రుప్పడై’ అనే పుస్తకంతో పాటు పది దీర్ఘకావ్యాల సంకలనం ఒకటి ‘పత్తుప్పాట్టు ‘ పేరిట ఉండేదని కూడా తెలిసింది. నాకు ఆ పది దీర్ఘకవితల్ని ఎలాగేనా సంపాదించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని కోరిక కలిగింది. చాలామంది మిత్రుల సహాయంతో నేను ఆ కవితలవి కొన్ని ప్రతులు సంపాదించగలిగాను. కాని ఆ తాళపత్రాల్లో అన్నికవితలూ లేవు. దొరికిన ఆ కొన్ని పత్రాలు కూడా చాలావరకు పాడైపోయి ఉన్నాయి. కొన్నిటిలో పద్యాలు ఉన్నాయిగాని, వ్యాఖ్యానం లేదు. కొన్నింటిలో పద్యాల్లో లేఖనదోషాలు ఉన్నాయి. అందుకని ఆ పదిపాటల గురించి వెతుకుతూనే ఉన్నాను.
నేను కుంభకోణం కళాశాలలో పనిచేస్తున్నప్పుడు సెలవు రోజుల్లో ఈ పనిమీదే ఉండేవాణ్ణి. ఒకసారి జంధ్యాల పండగ వచ్చింది. వారం రోజులు సెలవులు దొరికాయికాబట్టి తిరునెల్వేలి వెళ్ళి అక్కడ పండితుల ఇళ్ళల్లో వంశపారంపర్యంగా దాచుకుంటూ ఉండే తాళపత్రాల్ని శోధించడానికి మంచి అవకాశం దొరికింది అనుకున్నాను. ఆ సెలవుల్లో తిరునెల్వేలి, ఆళ్వారు తిరునగరి ప్రాంతాలు వెళ్ళి అక్కడి మిత్రుల్ని కలిసి తాళపత్రాల గురించి విచారించాలని నిర్ణయించుకున్నాను.
కాని మా నాన్నగారు ‘ఈ పండగపూటా ప్రయాణమేమిటి? ఈ సారికి ఇక్కడే ఉండి, మళ్ళా సారి వెళ్దువుగానిలే ‘అన్నారు.
నేనాయనకు చాలా నచ్చచూపాను. కాని ఆయన నా మాట వినలేదు. ఏమైతేనేం, పండగకన్నా పద్యాలు ముఖ్యం కాబట్టి నేను అతికష్టం మీద ఆయన్ను ఒప్పించి బయల్దేరాను. సాయంకాలం ఎనిమిది గంటలకి ఒంటెద్దుబండిలో రైల్వేస్టేషన్ కి బయల్దేరాను. నా తండ్రి నాకు అయిష్టంగానే వీడ్కోలు చెప్పాడు. నాతో పాటు ఒక ట్రంకుపెట్టె ఉంది. మేము వాణాదురై పక్కనుంచి పోతున్నప్పుడు బండి దేన్నో గుద్దుకుని తిరగబడింది. నేను కిందపడ్డాను. ఆ ట్రంకు పెట్టి నా మీద పడింది. కాని నేను నా ప్రయాణం ఆపలేదు. నా మనస్సు అప్పటికే తిరునెల్వేలి చేరిపోయింది. అప్పుడు ఎవరేనా సిద్ధుడు నన్ను కలిసి ఏదేనా అత్యవసర పరిస్థితిలో నువ్వు కోరుకుకున్న చోటుకి చేరాలంటే నీ కాళ్ళకి ఈ పసరు పూసుకో అని చెప్పిఉంటే నేను ఆ పసరు ఆ క్షణమే నా కాళ్ళకి పూసుకు ఉండేవాణ్ణి! నా మనోవేగాన్ని ఆ బండి అందుకోలేకపోతున్నది సరికదా, పైగా ఆ ప్రమాదం ఒకటి.
వెనక్కి తిరిగి వెళ్ళిపోయి మర్నాడు బయల్దేరదామా అని ఒక క్షణం అనుకున్నాను. కాని నేనలా చేస్తే మా నాన్నగారు జరిగింది అపశకునంగా భావించి నన్ను అసలు కదలనివ్వరనిపించింది. అందుకని ప్రయాణం కొనసాగిద్దామనే నిర్ణయించుకున్నాను. బండివాడికి మొత్తం బాడుగ చెల్లించి నా పెట్టిపట్టుకుని స్టేషన్లో అడుగుపెట్టేటప్పటికి అదృష్టవశాత్తూ రైలు సిద్ధంగా ఉంది. తంజావూరు దాటిన తరువాత ఒక అడవికి దగ్గర్లో రైలు ఆగింది. చాలామంది రైలు అధికారులు వచ్చి ఆ రైలును చాలాసేపు పరీక్షించి చూసారు. మా ముందు బోగీలో మంటలు వచ్చాయనీ, కాబట్టి మమ్మల్ని వేరే పెట్టెలోకి మారమని చెప్పారు. మా ముందు పెట్టెనుంచి మా పెట్టె విడదియ్యాలని చెప్పారు. నేను నిద్రమత్తులోంచి బయటపడి దేవుణ్ణి ప్రార్థించుకుని వేరే పెట్టెలోకి మారాను. అలా ఆటంకాలు కలుగుతున్నందుకు కొంత కలవరం చెందాను. కాని ఆ వెనువెంటనే మళ్ళా ఉత్సాహం ఆవరించింది.
మర్నాడు పొద్దున్నకి తిరునెల్వేలి చేరాను. అప్పట్లో కనకసభ ముదలియారు అక్కడ సబ్ జడ్జిగా ఉండేవారు. ఆయన తంజావూరులో ఉన్నప్పటినుండి నాకు మిత్రుడు. తర్వాత తిరునెల్వేలికి బదిలీ అయ్యారు. ప్రాచీన తమిళ తాళపత్రాల మీద నా ఆసక్తిగురించి ఆయనకు తెలుసు. కె.సుందరం అయ్యర్ ద్వారా ఆ ప్రాంతంలో తాళపత్రాల వెతకడానికి నాకు సాయం చేస్తానని గతంలో వాగ్దానం చేసిఉన్నారు. ఆ మాట గుర్తుంది కాబట్టి నేను ఆ పని మీద వస్తున్నానని బయల్దేరడానికి ముందు ఆయనకి ఉత్తరం రాసాను. అందుకని నేరుగా వారింటికి వెళ్ళాను.
కాని నేను అక్కడకు వెళ్ళగానే ప్రయాణం ఎలా జరిగిందని కూడా అడక్కుండా ఆయన ‘మీకిప్పుడే ఒక ఉత్తరం రాసాను. పోస్ట్ చెయ్యబోతూ ఉన్నాను. ఇదుగో చదువుకోండి’ అని నా చేతుల్లో ఓ కాగితం పెట్టారు. అది నాకే రాసింది. దానిమీద స్టాంపు కూడా అంటించి ఉంది.నేను ఆ ఉత్తరం తెరిచి చూసాను. అందులో ఇలా రాసి ఉంది:
‘నేను మీకు వాగ్దానం చేసినట్టుగా తాళపత్రాల అన్వేషణలో సాయంచెయ్యలేకపోతున్నందుకు విచారిస్తున్నాను. నా బాల్యస్నేహితుడు శ్రీ సి.వి.దామోదరం పిళ్ళై కూడా ఇటువంటి సాయమే అడిగినందువల్లా నేను ఆయనకు సాయం చేస్తానని మాటిచ్చాను. ఆయన కూడా మీరడిగిన పుస్తకాలే అడిగాడు. కాబట్టి దయచేసి మీరు ఇంతదూరం రావద్దు.’
‘మంచిది. మీరు నాకు సాయం చేస్తానని మాట ఇచ్చారు కాబట్టి ఇక్కడికి వచ్చాను. మీరు సాయంచెయ్యనంటే నాకు సాయం చెయ్యడానికి ఇక్కడ మరెందరో దాతలూ, పండితులూలేకపోలేదు, వస్తాను.’
తన ఉత్తరం చదివి నేను డీలాపడిపోతానని ముదలియారు భావించినట్టున్నాడు. దాంతో నా జవాబు ఆయన్ని నిర్ఘాంతపరిచింది.
‘నిజంగానా? మీకిక్కడ మనుషులు తెలుసా? ఈ ప్రాంతం తెలుసా? ఎవరు వాళ్ళు? మీరు ఏయే ఊళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు?’ అనడిగాడు.
‘ఈ ప్రాంతంలో నాకు చాలామంది సంపన్నులు సాయపడుతుంటారు. నాకు చాలామంది జమీందార్లు తెలుసు. నేను ఆళ్వారు తిరునగరి, శ్రీ వైకుంఠం, తెండ్రిరుప్పేరై ప్రాంతాలు వెళ్ళాలనుకుంటున్నాను.’
అంతేకాక నేను ఆ ప్రాంతంలో నాకు తెలిసిన చాలామంది ఉన్నతోద్యోగుల పేర్లు కూడా చెప్పాను. వాళ్ళంతా ఆయనకన్నా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు. నేను నా అన్వేషణలో ఏది సంపాదిస్తే దాన్ని తనకి కూడా ఇమ్మనీ, దాన్ని తాను తనమిత్రుడికి ఇస్తాననీ ముదలియారు అభ్యర్థించాడు.
‘నేనేమో అటూ ఇటూ పరుగెడుతున్నాను. మీరేమో నాకేది దొరికితే అది మీకు ఇమ్మంటున్నారు. మీరు ఎంతో పెద్ద ఉద్యోగంలో ఉన్నారు. తలుచుకుంటే మీకిలాంటి తాళపత్రాలు సంపాదించడం లెక్కనే కాదు’ అన్నాను. అని నవ్వేసి అక్కణ్ణుంచి సెలవు తీసుకున్నాను.
అప్పుడు నేను కైలాసపురంలో ఉంటున్న ప్రసిద్ధ న్యాయవాది, సంఘసేవకుడు ఏ. కృష్ణస్వామి అయ్యర్ గారి దగ్గరకు వెళ్ళాను. ఆయన నన్ను సాదరంగా ఆహ్వానించాడు.
‘ఎప్పుడొచ్చారు? వస్తున్నట్టు ముందే చెప్పి ఉండవచ్చు కదా’ అన్నాడు.
నేనాయనకు ఆళ్వారు తిరునగరి వెళ్ళాలని అనుకుంటున్నాననీ, అక్కడ కొందరు తమిళ కవుల్ని, పండితుల్ని కలిసి వారి ఇళ్ళల్లో ఉన్న ప్రాచీన తమిళ తాళపత్రాలు శోధించాలని అనుకుంటున్నాననీ చెప్పాను.
‘సరే, శ్రీ వైకుంఠంలో నా మిత్రుడు సుబ్బరాయ ముదలియారు వకీలుగా పనిచేస్తున్నాడు. బాగా ప్రసిద్ధుడు. నేను ఆయనకి ఒక ఉత్తరం రాసిస్తాను. ఆయన మీకు కావలసిన సాయం చేస్తాడు’ అని చెప్పాడు. అంతేకాక నన్ను అక్కడికి తీసుకువెళ్ళడానికి ఒక రెండెడ్ల బండి కూడా ఏర్పాటు చేసాడు.
శ్రీ వైకుంఠంలో సుబ్బరాయ ముదలియారు నన్నెంతో ఆదరంగా స్వాగతించాడు. నాకు కావలసిన సాయం చేస్తానని చెప్పాడు. మేమిద్దరం దగ్గరలోనే ఉన్న ఆళ్వారు తిరునగరి వెళ్ళాం. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి, నేను ఎవరెవరికి అప్పటికే ఉత్తరాలు రాసానో ఆ మిత్రులంతా నాకోసం ఎదురుచూస్తూ ఉన్నారు. తిరువావడుదురై ఆధీనం నుంచి శ్రీ అంబలవాణ దేశికరు వారు ఆళ్వారు తిరునగరి ఆధీనంలోని మఠాధిపతికి కూడా ఒక లేఖ రాసి ఉన్నారు. వారు అప్పటికే స్థానిక కవులనుంచి తాళపత్రాలు సేకరించి నా కోసం సిద్ధంగా ఉంచారు.
మేము మొదట లక్ష్మణ కవిరాయరు గారి ఇంటికి వెళ్ళాం. ఆయన సుప్రసిద్ధ కవి “తీరాద వినైత్తీర్త్త” తిరుమేని కవిరాయరు గారి వంశానికి చెందినవారు. ఆయన గ్రంథభాండాగారంలో వేలకొద్దీ తాళపత్రాలున్నాయి. వాటిలో వ్యాకరణం, స్తోత్రాలు, పురాణాలు, ఇతర ప్రాచీన గ్రంథాలు ఉన్నాయి. నేను వాటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించాను. కాని వాటిలో నాకు కావలసిన పది పాటలు లేవు. ఒక తాళపత్రంలో ముప్పై వేల తాళపత్రాల జాబితా ఉంది. ఆ జాబితాలో ఒక పుస్తకం దొరికింది. కాని అందులో ఏడు కవితలు మాత్రమే ఉన్నాయి. నేను బయల్దేరినప్పటినుంచి అప్పటిదాకా అపశకునాలే కనబడుతూ వస్తున్న నాకు ఆ గ్రంథం గురించి తెలియడం శుభశకునంగా తోచింది. నేను గట్టిగా వెతికితే మొత్తం పది కావ్యాలూ కూడా ఆ గ్రంథాలయంలో దొరకవచ్చుననే ఆశకలిగింది.
నేను ఆళ్వారు తిరునగరిలో మూడు రోజులున్నాను. మొదటిరోజు ఆవణి అవిట్టం. అంటే యజ్ఞోపవీతాలు మార్చుకునే రోజు. నాకు ఆతిథ్యం ఇచ్చిన గృహస్థు శివరామ అయ్యరు శ్రీ వైకుంఠం ప్రాంతంలో పాఠశాలల పర్యవేక్షకుడుగా పనిచేస్తున్నాడు. నేను రోజంతా లక్ష్మణ కవిరాయరు గ్రంథాలయంలోనే గడిపేను. మధ్యలో చిన్న విరామం తీసుకుని “తాయి అవలం తీర్త్త” కవిరాయరు, అమృత కవిరాయరు, మరికొందరు కవుల ఇళ్ళకి కూడా వెళ్ళాను. అలా మొత్తం ముప్పై మంది కవుల ఇళ్ళల్లో తాళపత్రాలు వెతికాను. లక్ష్మణ కవిరాయరు భాండాగారంలో ఉన్న అన్ని తాళపత్రాలూ తెరిచి చూసాను. కాని నేను దేనికోసం వచ్చానో ఆ గ్రంథం మాత్రం నాకు కనిపించలేదు. నేను ప్రయాణం మొదలుపెట్టినప్పుడు అపశకునాలు ఊరికినే కనిపించలేదు అని నాకు నేను చెప్పుకున్నాను.
లక్ష్మణ కవిరాయరు ‘మా ఇంట్లో కూడా చాలా తాళపత్రాలు ఉన్నాయి. మా పూర్వీకుల్లో ముగ్గురు సోదరుల్లో ఒకాయన మరణించినప్పుడు వారి భార్య తమ పుట్టింటికి వెళ్లిపోయారు. అలా వెళ్ళిపోతూ ఆమె తమ వాటాగా వచ్చిన తాళపత్రాలు కూడా తమ వెంట తీసుకు పోయారు’ అని చెప్పాడు.
‘బహుశా ఆ తాళపత్రాల్లో పత్తుప్పాట్టు ఉండిఉంటుంది. మనం ఇంత వెతికీ నిష్ప్రయోజనం అయిపోయింది’ అన్నాను ఆయనతో.
ఇంతలో ఆయనకి హటాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. ‘నేనో సంగతి మర్చిపోయాను. మా మామగారు దేవర్పిరాన్ పిళ్ళై గారు ఇక్కడే ఉంటారు. నాకూ ఆయనకీ మధ్య మాటల్లేవు. మా పనివాడు ఒకసారి ఆయనకి కొన్ని తాళపత్రాలు ఇచ్చాడు. మీరు వాటిని కూడా ఒకసారి పరిశీలించండి. అయితే మేము మాట్లాడుకోవడం లేదు కాబట్టి మీ అంతట మీరే వెళ్ళి చూసుకోవాలి’ అన్నాడు.
నేను వెంటనే ఆయనతో ‘అయ్యా, నా కోసం, తమిళ భాష కోసం దయచేసి మీ మనస్పర్థలు పక్కన పెట్టి ఆ తాళపత్రాలు తెప్పించండి. నేను కూడా మీతో వస్తాను’ అన్నాను. మా చుట్టూ ఉన్న మిత్రులు కూడా ఆ మాటలే చెప్పడంతో లక్ష్మణ కవిరాయరు ఒప్పుకున్నారు.
రోజంతా తాళపత్రాలు విప్పుతూ, కట్టిపెడుతూ, అది కూడా నిష్ప్రయోజకరంగా శోధించి ఉండటంతో నా చేతులూ, హృదయమూ కూడా డస్సిపోయాయి. అందుకని అక్కడ సబ్ రిజిస్టారుగా ఉన్న రామస్వామి అయ్యరు గారింటికి వెళ్ళాను. ఆ రాత్రి అక్కడే భోజనం చేసాను. భోజనం అయ్యాక ఆ ఇంటి ముందు అరుగుమీద కూచున్నాను. కొందరు వైష్ణవ పండితులు నా కోరిక మీద దివ్యప్రబంధ పాశురాలకు వ్యాఖ్యానం వివరిస్తూ ఉన్నారు. వారి మాటలు వింటుంటే ఎంతో సంతోషంగానూ, ఆసక్తిగానూ ఉండింది. కాని మామూలుగా అలాంటి వేళల్లో నాకు కలిగే పూర్తి సంతృప్తి మాత్రం కలగడం లేదు. అది వారి తప్పు కాదు. నాకు ఆ పదిపాటలు దొరకలేదన్న చింత నన్ను మామూలుగా ఉండనివ్వడం లేదు.
ఆ రాత్రి దేవుడి ఊరేగింపు నడుస్తున్నది. ఆ దేవుడితో పాటు, ఆ ఊళ్ళోనే జన్మించిన ఆళ్వారుకూడా ఆ ఊరేగింపులో ఉన్నారు. ఆ ఊరేగింపు మాకు దగ్గరగా రాగానే మేము గౌరవంగా లేచి నిల్చుని నమస్కారాలు సమర్పించాము. నా చుట్టూ ఉన్నవాళ్ళు నన్ను గౌరవించడం చూసి పూజారులు నన్ను పూలమాలతో, గంధపుష్పాక్షతలతో సత్కరించారు.
ఆ ఊరేగింపులో ఉన్న నమ్మాళ్వారు ఉత్సవ మూర్తిని చూస్తూ నేను నా మనసులో ఇట్లా ప్రార్థించుకున్నాను: ‘స్వామీ, నువ్వు తమిళవేదాన్ని అనుగ్రహించావని చెప్తారు. నేనొక తమిళ గ్రంథాన్ని వెతుక్కుంటూ నీ ఊరు వచ్చాను. తమిళభాషకు అంత దివ్యయశస్సును అనుగ్రహించిన నీకు నా కష్టం తెలియదా? తెలిసి కూడా నా పనుల్లో నాకు జయం కలగటంలేదంటే అది నీకు ఉచితమేనా? ‘. ఆ మాటలు నిరాశాతప్తమైన నా హృదయంలోంచి పొంగిపొరలిన భావనలు. నేను నా విధివిలాసమింతే అని చెప్పుకుని నా మనసును సమాధాన పరుచుకున్నాను.
ఆ దేవుడూ, ఆ ఊరేగింపూ అక్కణ్ణుండి తరలివెళ్ళిపోయిన తర్వాత మేము మళ్ళా ఆ అరుగుమీద కూచున్నాము. పుచ్చపువ్వులాగా ప్రకాశిస్తున్న అ వెన్నెట్లో లక్ష్మణ కవిరాయరు తన ఉత్తరీయంలో ఏదో దాచిపెట్టుకుని మా వైపు వడివడిగా అడుగులు వేస్తూ రావడం కనిపించింది. దేవస్థానం వారు మా కోసం ప్రసాదం పంపించినట్టున్నారు అనుకున్నాను.
ఆయన తన ఉత్తరీయంలో చుట్టిపెట్టిన కొన్ని తాళపత్రాలు బయటికి తీసి చూపిస్తూ ‘ఇవి చూడండి, మీరు చూడగానే తిరిగి ఇచ్చేస్తానని చెప్పి పట్టుకొచ్చాను’ అన్నాడు. నేను ఆయన ఆ తాళపత్రాల కట్ట నా చేతుల్లో పెట్టకముందే ఆబగా లాక్కున్నాను.
ఆ తాళపత్రాల కట్ట ముడి విప్పి తెరిచి చూసాను. ఆ వెన్నెల్లో , ఆ తాళపత్రాల పైన ‘ముల్లైప్పాట్టు’ అంటే ‘అడవిమల్లె పాట’ అనే మాట కనిపించింది.
నిజంగా ఆ తాళపత్రం ఆ వెన్నెలరాత్రి వికసించిన అడవిమల్లె. ఆ కవిత కూడా పదిపాటల్లో ఒకటికాబట్టి నా ఆనందానికి అవధుల్లేవు. నేను మళ్ళా మళ్ళా ఆ తాళపత్రాలు తిరగేసాను. అందులో మొదటిది తిరుమురుగాట్ట్రుప్పడై, ఆ తరువాత పొరునరాట్ట్రుప్పడై, సిరుపాణాట్ట్రుప్పడై, అలా చివరగా నెడునల్ వాడై దాకా, మొత్తం ఏడు పాటలు ఉన్నాయి. ఆ తాళపత్రాలు మళ్లీ మళ్ళీ చూసుకుంటూ నన్ను నేను మర్చిపోయాను. నన్నెవరేనా, ఆ రోజే, ఆ క్షణమే మొదటిసారి చూసి ఉంటే నన్ను తప్పకుండా పిచ్చివాడనే అనుకుని ఉంటారు! ఏం చెయ్యను? నా మనసుకి జ్వరం వచ్చేసింది!
ఆళ్వారు నా ప్రార్థనలు విన్నాడు. ఆయన నిజంగా దేవుడు. నా పక్కనున్నవాళ్లకి ఆ మాటే చెప్పాను. ఆ రాత్రంతా నాకు నిద్రపట్టలేదు. ఆ మర్నాడు నేను ఆ దేవాలయంలో విష్ణుమూర్తికీ, ఆళ్వారుకూ చిన్నపాటి పూజ చేసి వారి ఆశీర్వాదాలు నా కృషికి ఆముందు కూడా అలానే కొనసాగాలని కోరుకున్నాను.
నేను నాతో పాటు తీసుకువెళ్ళిన జీవకచింతామణితో పాటు తక్కిన పుస్తకాలు లక్ష్మణ కవిరాయరు చేతికిచ్చి వాటిని ఊట్ట్రుమలై జమీందారు హృదయాలయ మరుదప్పత్తేవరుకు అందించమని చెప్పాను. ఆయన గ్రంథాలయంలో పత్తుపాట్టుతో పాటు, ఐంగురునూరు లో కొన్ని పత్రాలు, కొంత వ్యాఖ్యానం, పదిట్ట్రుప్పత్తు, పురప్పొరుళ్ వెంబామాలై కూడా దొరికాయి. నేను నా స్నేహితులదగ్గర సెలవు తీసుకుని మరికిందరు కవిమిత్రుల ఇళ్ళల్లోనూ, గ్రంథాలయాల్లోనూ కూడా నా అన్వేషణ కొంత కొనసాగించుకుని తిరునెల్వేలికి తిరిగి వచ్చాను.
అప్పుడు మళ్ళా కనకసభ మొదలియారును కలిసాను. నేను అన్నాళ్ళూ ఎక్కడెక్కడికి వెళ్ళాననీ, ఎవరెవరిని కలిసాననీ, ఏమేమి సంపాదించాననీ అడిగాడు. నేను అన్ని ప్రశ్నలకీ జవాబిచ్చాను. వాటిలో కొన్ని తన మిత్రుడు దామోదరన్ పిళ్ళైకి ఇవ్వగలవా అని అడిగాడు.
‘నేనంత శారీరక, మానసిక శ్రమకోర్చి అంత తాపత్రయ పడి సేకరించుకున్నవాటిని ఎలా ఇవ్వగలను? నువ్వు కూచున్న చోటనే కూచుని పూచిక పుల్ల కూడా కదల్చకుండా మరొకరి కష్టార్జితంలో వాటా కోరుకోవడం న్యాయమేనా?’ అనడిగాను.
అప్పుడు కైలాసపురంలో కృష్ణస్వామి అయ్యర్ ను కలిసి వారికి నమస్సులు, ధన్యవాదాలు చెల్లించుకుని కుంభకోణం తిరిగివచ్చేసాను. ఆ వెన్నెల రాత్రి నా చేతులకి అందిన ఆ తాళపత్రంలో ఏడు దీర్ఘకవితలు వ్యాఖ్యానంతో ఉన్నాయి. కాని అవి అత్యంత నిర్దుష్టంగా ఉన్నాయి.
ప్రాచీన తాళపత్రసేకరణలో నేనెన్నో కఠినపరీక్షలకు, కష్టాలకూలోనయ్యాను. వాటిలో ఇది కూడా ఒకటి.
(ఈ అనువాదంలో తమిళ నామవాచకాలను, స్థలనామాలను సవరించి నిర్దుష్టంగా దిద్ది ఇచ్చినందుకు ఆదిత్య కొర్రపాటికి నా ధన్యవాదాలు. చిన్నపిల్లవాడు కాబట్టి ఆశీస్సులుగాని లేకపోతే నమస్కారాలే చెప్పి ఉందును.)
5-9-2022