అప్రమేయమైన ఆనందం

యు.వి.స్వామినాథ అయ్యర్ తమిళ సాహిత్యవ్యాసాల ఇంగ్లీషు అనువాదం వెలువడింది. అందులో అధికభాగం ఆయన తన గురువు మీనాక్షి సుందరం పిళ్ళై గారి గురించిన తలపోతలే.

ఏమైనా చెప్పబ్బా, ఈ జీవితంలో గురుశిష్య అనుబంధం గురించి చదివినప్పుడు నాకు కలిగే ఆనందం మరి ఏ అనుబంధంగురించి చదివినా కూడా కలగదంటే నమ్ము. రక్తసంబంధాల్లో ప్రేమ ఉండటంలో ఆశ్చర్యంలేదు. ప్రేమానుబంధంలో రక్తం ఉప్పొంగడంలో ఆశ్చర్యంలేదు. ఒక ఉమ్మడి ధ్యేయంకోసం కలిసి నడిచే కామ్రేడరీలు పరస్పరం స్ఫూర్తిదాయకంగా ఉండటంలో ఆశ్చర్యంలేదు. కాని నిజంగా నిస్వార్థం, నిష్కారణం అయిన జీవితానుబంధమంటూ ఏదన్నా ఉంటే నా దృష్టిలో అది గురుశిష్యుల అనుబంధం మాత్రమే. దాదాపుగా అది నీకూ, నీ తల్లిదండ్రులకీ ఉండే అనుబంధంతో సమానమైన అనుబంధం.

మా నాన్నగారి గురించి తలుచుకుంటే, ఆయన తండ్రిగా మాకు చేసిన మహోపకారం చదువుమీద మా దృష్టిని మళ్ళించడమే. ఆయనకి పెద్ద చదువులు చదువుకునే అవకాశం జీవితం ఇవ్వలేదు. పిల్లల్ని పెద్ద చదువులు చదివించుకునే వనరులు కూడా ఆయనకి లేవు. కాని ఉన్నదల్లా పిల్లలు ఎలాగేనా మంచి చదువులు చదువుకోవాలన్న అపారమైన కోరిక. ‘మా అమ్మాయి ఎడుకేషన్ లో ఫస్ట్ ‘అని ఆయన మా అక్క గురించి అడిగినవాళ్ళకీ, అడగని వాళ్ళకీ ఎన్నిసార్లు చెప్తుండటం విన్నానో!

ఆయన తండ్రి ఆయన చిన్నప్పుడే పోయారు. ఆ చిన్నప్పటి రోజుల్లో ఆయన మా పూర్వీకుల్లో ఒక పెద్దాయన, ఆయన లాయరుగా పనిచేసేవాడు, వాళ్ళ ఇంటికి వెళ్తూ, వస్తూ ఉండేవారు. పందొమ్మిది, ఇరవయశతాబ్దాల మధ్యకాలంలో ఈ దేశంలో పట్టణాల్లో పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళ కుటుంబాలు వాళ్ళకే పరిమితం కాకుండా ఎంతో మందికి ఆశ్రయంగా ఉంటూ ఉండేవి. ఎందరో విద్యార్థులు, బంధువులూ, బంధువులు కానివాళ్ళూ కూడా ఆ ఇళ్ళల్లో ఉంటూనో, లేదా వారాలు చేసుకుంటూనో చదువుకునేవారు. ఆ పెద్దమనుషులు అట్లాంటి వాళ్ళకి నీడగా ఉంటున్నందుకే ఎక్కువ సంతోషించేవారు, వాళ్ళల్లో ఏ ఒక్కరు వృద్ధిలోకి వచ్చినా తమ పిల్లలే వృద్ధిలోకి వచ్చినట్టుగా గర్వించేవారు.

అట్లాంటి ఒక పెద్దమనిషి పేరు యర్రమిల్లి వెంకటచలం. ఆయన లాయరు. మా నాన్నగారి చిన్నప్పటిరోజుల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అలా కొంత మంది విద్యార్థులు ఉండటం, చదువుకోవడం చూసేవారు. అలాంటి మరొక కుటుంబం, మా బామ్మగారి తమ్ముడి కుటుంబం. అంటే మా నాన్నగారి మేనమామ కుటుంబం. ఆ ఇంట్లోనూ పిల్లలు ఇంగ్లిషు చదువులు చదువుకోవడం, చదువు గురించి మాట్లాడుకుంటూ ఉండటం ఆయన చిన్నప్పుడు చూసేవారు. ఆ దృశ్యాలు ఆయన్ని ఎంత గాఢంగా ప్రభావితం చేసాయంటే తన పిల్లలు కూడా అలా చదువుకోవాలనీ, పెద్ద పెద్ద గ్రంథాలు పఠిస్తూ ఉండాలనీ, ఎప్పుడూ వాటిగురించే మాట్లాడుకుంటూ ఉండాలనీ ఆయనకి పెద్ద కల ఉండేది. జీవిక కోసం ఆయన చేసిన కరణీకం, దానికి సంబంధించిన సమస్తమైన పంకం మధ్య ఆయన దృష్టి ఎప్పుడు ఆ పద్మాలయదేవిమీదనే ఉండేది. అందుకోసం ఆయన మమ్మల్ని ఎప్పుడూ ఒక్కక్షణం కూడా ఆగనివ్వలేదు. మేము ఆ పల్లెటూళ్ళో ఎక్కడ ఉండిపోతామోనన్న భయం ఆయన్ని కుదురుగా ఉండనిచ్చేదికాదు. ఏమి చేసేనా సరే పిల్లలు బయటికి వెళ్ళిపోవాలి,పెద్ద చదువులు చదువుకోవాలి, అనే ఆయన తాపత్రయాన్ని మా ఊళ్ళో మనుషులు మాత్రమే కాదు, అక్కడి చెట్లూ, కొండలూ కూడా ఎన్నోఏళ్ళు చూసేయి. సెలవులు పూర్తయి మేము మళ్ళా రాజమండ్రికో, కాకినాడకో, తాడికొండకో బయలుదేరుతుంటే, మేం బస్సెక్కాక కూడా, బస్సు కదిలాక కూడా, ఆయన ‘చేతులు బయటపెట్టవద్దు’. ‘ఆకలేస్తే పళ్ళు తినండి, నూనెతిళ్ళు తినొద్దు’, ‘వెళ్ళగానే ఉత్తరం రాయి’అంటూ, తువ్వాలు దులుపుకుంటూ, ఆ బస్సు వెనకనే వడివడిగా అడుగులు వేసుకుంటూ జాగ్రత్తలు చెప్పే ఆ దృశ్యాలు నిన్ననే జరిగినట్టు ఉంటాయి.

ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే నిన్న Essays of U Ve Sa (2022) చదువుతుంటే రాత్రంతా నా హృదయం ద్రవీభూతమైపోయింది. ఉ.వే.స అంటే యు.వి.స్వామినాథ అయ్యర్. ఆయన్ని తమిళానికి తండ్రిగా కొలుస్తారు. పందొమ్మిదో శతాబ్దపు చివరిరోజుల్లో ప్రాచీన తమిళ వాజ్ఞ్మయం, సంగం సాహిత్యాల్ని ఆయన వెలికి తీసి లోకానికి పరిచయం చెయ్యడంతో తమిళం రాత్రికిరాత్రే ప్రపంచప్రాచీన భాషల్లో ఒకటిగా మారిపోయింది. ఆయన ఆ కృషి అంతా ‘నా చరిత్ర ‘అనే పేరిట రాసుకున్నారు. నేను ఆ పుస్తకం గురించి గతంలో ఇక్కడ పరిచయం చేసాను కూడా. ఆయనకి మొత్తం తమిళభాష ఋణపడి ఉంటే, ఆయన తన గురువు మీనాక్షి సుందరం పిళ్ళై కి ఋణపడ్డానని పదే పదే చెప్పుకున్నాడు. ఆ గురుశిష్యుల అనుబంధం నా హృదయాన్ని ఎంతగా కదిలించిందంటే, నేను తమిళనాడు వెళ్ళినప్పుడు, ఆయన చదువుకున్న ఆ తిరువావుడుదురై ఆధీనం వెతుక్కుంటూ వెళ్ళాను. ఆ అనుభవాన్ని కూడా గతంలో ఇక్కడ మిత్రులతో పంచుకున్నాను.

ఆయన ఆత్మకథ తప్ప తక్కినదేదీ నేను చదవలేకపోయాను, ఎందుకంటే వాటికి, ఇంగ్లిషులోగాని తెలుగులోగాని ఏమీ అనువాదం కానందువల్ల. కానీ ఇదిగో, ఇప్పుడు తమిళనాడు టెక్స్ట్ బుక్ అండ్ ఎడ్యుకేషన్ కార్పొరేషన్ వారు ఆయన వ్యాసాలు కొన్నింటిని ఇంగ్లిషులోకి అనువదింపచేసారు. ఇద్దరు అనువాదకులు. ఒకరు ప్రభాశ్రీదేవన్. ఆమె మద్రాసు హైకోర్టులో జడ్జిగా పనిచేసి పదవీవిరమణ చేసారు. మరొకరు ప్రదీప్ చక్రవర్తి. ప్రస్తుతం పాండ్యరాజుల శాసనాల మీద పి.ఎచ్.డి చేస్తున్నాడు. ఆ ఇద్దరు పండితులూ అయ్యర్ గారివి 29 వ్యాసాలు ఎంపికచేసి చక్కటి ఇంగ్లిషులోకి అనువదించారు. ఇప్పటికి పదకొండు వ్యాసాలు చదివాను. పుస్తకం పూర్తి కాకుండా రాయడం నా స్వభావం కాదుగానీ, ఏం చెయ్యను? అప్రమేయమైన ఆ ఆనందం ఇట్లా తెల్లవారి మీతో పంచుకోకుండా ఉండలేననిపించింది.

ఆ వ్యాసాలు భాష గురించి, ప్రాచీన కాలపు తమిళసమాజం చదువునీ, సాహిత్యాన్నీ ఎట్లా నెత్తిన పెట్టుకుందో ఆ విశేషాల గురించీ, అన్నిటికన్నా మిన్నగా తన గురువు మీనాక్షి సుందరం పిళ్ళై గురించీ, తన గురుకులవాసం గురించీను.

నేను కూడా నా జీవితంలో గొప్ప గురువుల సన్నిధికి నోచుకున్నానుగాని, అట్లాంటి గురుకులవాసానికి నోచుకోలేకపోయాను. ఒక గురువు పాదాలదగ్గర ఏదో ఒక శాస్త్రమో, సాహిత్యమో క్షుణ్ణంగా అభ్యసించే అదృష్టం లేకపోయింది. ఒక విధంగా నేను కూడా వారాలు చెప్పుకుని చదువుకున్నట్టే గురువు, గురువు దగ్గరికీ తిరిగి మాధూకరభిక్ష తెచ్చుకునే బతికాను. కాని కల్పతరువులాంటి ఒక్క గురువు, ఆయన దగ్గర నేర్చుకున్న ఒక్క శ్లోకం లేదా కనీసం ఒక్క దోహా! అది లభించి ఉంటే బహుశా నేను కూడా ఉ.వే.స లాగా జీవించిఉండేవాణ్ణి కదా అనిపిస్తున్నది ఈ వ్యాసాలు చదువుతున్నంతసేపూ! బహుశా మా నాన్నగారు కోరుకున్నది కూడా అదేనేమో!

4-9-2022

Leave a Reply

%d bloggers like this: