సంస్కారవంతుడు

తెలుగు వెంకటేష్ ని నేను మొదటిసారి కాశీభట్ల వేణుగోపాల్ గారిని కలుసుకున్నపుడు చూసాను. ఆ రోజు ఆయన అతడి గురించి ప్రశంసాపూర్వకంగా ఒకటి రెండు మాటలు కూడా చెప్పినట్టు గుర్తు. కానీ మొన్న కర్నూల్లో అతడి పుస్తకం ‘నూర్జహాన్ కు ప్రేమ లేఖ’ ఆవిష్కరించి, అతడి కవిత్వం గురించి మాట్లాడమని రాయలసీమ రచయితల ప్రచురణల వారు పిలిచినప్పుడు అతడి కవిత్వం చదివాను. అతడు ఏ కళాశాలలోనూ చదువుకోలేదనీ, కర్నూల్లో ఎలక్ట్రికల్ వైండింగ్ పనులు చేసుకుంటూ జీవిక సాగించుకుంటాడనీ తెలిసినప్పుడు గొప్ప దిగ్భ్రాంతికి లోనయ్యాను.
 
నా దిగ్భ్రాంతికి కారణాలు రెండు. మొదటిది, అతడి భాష. అది చాలా సున్నితమైన, గాఢమైన, అత్యంత కవితాత్మకమైన భాష. నిజానికి అటువంటి భాష కవుల దగ్గర నేర్చుకోవలసిందే తప్ప, కళాశాలలు నేర్పగలిగేది కాదు. ఏ కవులు అతడిని ఎంత అనుగ్రహిస్తే అతడికి అంత పువ్వులాంటి భాష పట్టుబడుతుంది!
 
రెండవది మరింత ఆశ్చర్యకరమైంది. ఆ మధ్య ఎవరో నాతో మాట్లాడుతూ ఫలానా కవి అభ్యుదయ కవినా అని అడిగారు. ‘అవును, ఎందుకని’ అని అడిగాను. ‘ఏంలేదు. ఈ మధ్య వాళ్ళింటికి వెళ్ళాను. పెద్ద మేడా, మేడలో లిఫ్టు కూడాను’ అన్నారు. తాము ఎంతో సౌకర్యవంతమైన జీవితం సమకూర్చుకుని తామూ, తమ పిల్లలూ, పిల్లల పిల్లలూ భద్రలోకంలో జీవిస్తూ ‘సమ్మె కట్టిన కూలీల, కూలీల భార్యల బిడ్డల’ మీద జాలి, ప్రేమ కురిపిస్తూ కవిత్వం రాసే కవులు తెలుగు కవిత్వంలో కొల్లలు. వాళ్ళని చూస్తుంటే, వాళ్ళ కవిత్వం ఎప్పుడేనా వినబడితే, నాకు శ్రీ శ్రీ మాటలు గుర్తొస్తుంటాయి. ఒక అభ్యుదయ కవి శ్రీ శ్రీ కి తన కవిత్వం వినిపించి, ‘ఇది చాలునా, ఇంకొద్దిగా నిప్పులు కక్కమంటారా?’ అనడిగాడట. ‘అవసరం లేదు మిత్రమా, ఆ కవిత్వాన్నే నిప్పుల్లో కక్కు’ అన్నాడట మహాకవి. నిప్పుల్లో కక్కవలసిన కవిత్వం మాత్రమే వినిపిస్తున్న తెలుగునాట, ఒక కవి, తాను స్వయంగా శ్రామికుడై ఉండి, ప్రేమ కవిత్వం రాయడం నన్ను నిజంగా ఆశ్చర్యానందాలకు గురిచేసింది.
 
వెంకటేష్ రాసిన కవిత్వం మామూలు ప్రేమ కవిత్వం కాదు. నిజానికి తెలుగులో మంచి ప్రేమకథలు కనిపించవు. అందుకు కొంతవరకూ మన ‘సామాజిక స్పృహ’ కవిత్వం కారణమైతే, మన సినిమాలు చాలా కారణం. యాభై ఏళ్ళ కిందట తెలుగు సినిమాల్లో, మొదటి చూపులో ప్రేమ పుట్టే కథలు కనిపించేవి. ఆ ధోరణి పోయి ఇరవయ్యేళ్ళ కిందటిదాకా, మొదటి చూపులోనే కామం పుట్టే కథలు చూసాం. ఇప్పుడు అది కూడా పోయింది. మొదటిచూపులోనే హింస పుట్టే కథలు విజృంభిస్తున్నాయి. ర- సినిమాలు చూడండి. ఆ హీరో మొదటిసారి హీరోయిన్ని చూడగానే ఆమెని కొరికెయ్యాలనుకుంటాడు, నలిపెయ్యాలనుకుంటాడు, ఆమెని చూడగానే అతడి దేహం ఎన్ని వంకర్లు, కొంకర్లు పోతుందో చెప్పలేం. ఆశ్చర్యం లేదు, ఏ భాషలో రచయితలు సున్నితమైన అనుభూతిని కవిత్వంగా, కథలుగా, నవలలుగా రాయడం మానుకుంటారో, ఆ భాషలో ప్రేమ ఫలించకపోతే ఆసిడ్ దాడులు చేసే కథలే సినిమాలుగా వస్తాయి.
 
ఇంత బీభత్సమయ సమాజంలో తెలుగు వెంకటేశ్ ప్రేమ గురించి రాయడమే అపురూపంకాగా, అతడి ఆలోచనలు, సంస్కారం ఎంతో ఆరోగ్యకరమైనవి కావడం నాకు మరింత ఊరటనిచ్చింది.
మన కవులు సాధారణంగా అభిప్రాయాల కవులు. తమ అభిప్రాయాలు ప్రకటించడం ద్వారా వారు తక్కిన సమాజంకన్నా తాము ఎంత ఉన్నతంగా ఉన్నారో చాటుకోవడమే ప్రధానంగా ఉంటారు. ఒకప్పుడు ఒక యువకవి సంజీవ దేవ్ కి ఉత్తరం రాస్తూ పత్తి రైతుల ఆత్మహత్యలపైన తాను రాసిన కవిత ఒకటి పంపించాడు.సంజీవదేవ్ గారు అతడి ఉత్తరానికి జవాబు రాసారు గాని, ఆ కవిత గురించి ఏమీ రాయలేదు. ఆ యుకకవి మళ్ళా వెంటనే మరొక ఉత్తరం రాసాడు, నా కవిత మీద మీ అభిప్రాయం చెప్పలేదు అంటో. దానికి సంజీవ దేవ్ రాసారు కదా: పత్తి రైతుల ఆత్మహత్యలమీద వేరే అభిప్రాయం ఏముంటుంది, ఆ రైతులు ఆత్మహత్యలు చేసుకోకూడదని కోరుకోవడం తప్ప అని. కాని సూక్ష్మమంతా ఇక్కడే ఉంది. ఆ యువకవి కోరుకున్నది రైతుల ఆత్మహత్యల గురించి సంజీవ దేవ్ ఏమనుకుంటున్నారని కాదు, వాటిగురించి తాను రాసిన కవిత ఎలా ఉందో, అందులో తాను ‘కక్కవలసినంతగా నిప్పులు కక్కాడా లేదా ‘అన్నదాని గురించి. తెలుగు కవిత్వం నూటికి తొంభై పాళ్ళు ఇంతే. ఒకప్పుడు పత్తిరైతుల గురించి రాసారు, ఇప్పుడు పరువు హత్యల గురించి రాస్తున్నారు. కాని కవి తన అభిప్రాయాన్ని కాకుండా, ఆవేదనని, హృదయం నుంచి నేరుగా బయటపడ్డ ఆవేదనని కవితగా మలిస్తే ఎలా ఉంటుందో వెంకటేశ్ రాసిన ‘భిన్న వర్ణాలు’ అనే కవిత చదివితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ వాక్యాలు:
 
పేదోడు
ముద్దనే ప్రేమించాలి
ముద్దును కాదని తెలుసుకునేలోపు
గోడమీద పటమై వేలాడుతుండు.
 
నేను ఎవరిదైనా కవిత్వం చదివినప్పుడు అందులో అలంకారం కాదు, సంస్కారం ఎటువంటిదా అని చూస్తాను. సంస్కారవంతుడు (పూర్వకాలంలో అతణ్ణి ఋషి అనేవారు, కాని అది మరీ పెద్దమాట. ఇప్పుడు ఋషులూ లేరు, ఉన్నా, వాళ్ళు కవిత్వమూ రాయరు)అయిన కవి వాక్యం ఎలా ఉంటుందో ఈ వాక్యం చూడండి:
 
పెదాలు కదపకుండా ప్రేమించుకోవడం
పువ్వూ, తుమ్మెదలా
మాట్లాడుకోవడమే.
 
ఇక్కడ పెదాలు కదపకపోవడం అంటే సంభాషణతో పనిలేకపోవడమే కాదు, ముద్దుల్తో పనిలేకపోవడం కూడా. సంస్కారం మూర్తీభవించిన కవిత్వం ఎలా ఉంటుందో మరొక ఉదాహరణ ఇమ్మంటే, ‘నిశ్శబ్ద గీతం’ అనే మొత్తం కవితను ఎత్తిరాయవలసి ఉంటుంది. చూడండి:
 
చాలా సార్లు చెప్పానునీవంటే ఇష్టమని.
నీవే పదే పదే తనిఖీ చేసుకుంటావు.

ఎప్పుడూ చెబుతుంటాను
ఇప్పుడూ అదే చెబుతాను.

నిశ్శబ్దాన్ని ఏకాంతంగా ప్రేమించాలని
ప్రేమను బహిరంగం చేయరాదని.

నీవు నిశ్శబ్దంలో శబ్దంగా ఉంటావు
నేను శబ్దంలో కూడా నిశ్శబ్దంగా ఉంటాను.

నదిలోకి రాయి విసిరి
అలలు పరిచయమయితే తప్ప
నది ఉందని నిర్ధారించుకోలేవు నీవు.

విసిరిన రాయికి ఉలిక్కిపడ్డ చేపపిల్లను
జోకొడుతున్న నది నిశ్శబ్ద గీతాన్ని వినగలను నేను.

దగ్గరగా జరగమంటావు
దూరంగా మసిలినా దగ్గరగా ఉంటాను.

ప్రేమకు రుజువు ముద్దంటావు
మొట్టికాయ వేసి ఇదే సాక్ష్యమంటాను.

స్వేచ్ఛాకాంక్షతో ఒకటవుదామంటావు
ఋతువులోనే వానచినుకు
మట్టిని తాకాలంటాను.

నలుగురి కళ్ళల్లో ప్రేమికుల్లా మసలాలంటావు
ప్రేమకు చిరునామా అక్కర్లేదు.

ఇది పదహారేళ్ళ కన్య రాసిన కవిత తప్ప, యాభైఏళ్ళ మగవాడు రాసిన కవిత అనుకోలేను. ‘ఆయన ఉనికి కన్య హృదయంలో ప్రేమలాంటిది’ అని బసవేశ్వరుడు చెప్పిన మాటకి ఇంతకన్నా వ్యాఖ్యానం మరొకటి ఉంటుందనుకోను.

వెంకటేశ్ వంటి కవిని ఆదరిస్తున్నందుకు కర్నూలు ఇప్పుడు నాకు మరింత ప్రీతిపాత్రమైంది.

23-8-2022

Leave a Reply

%d bloggers like this: