
ఒక విద్యార్థిగా తాడికొండ వెళ్ళిన రోజుల్ని తలుచుకుంటూ మళ్ళా బస్సులో ప్రయాణించాను. విజయవాడనుంచి గుంటూరుకి, గుంటూరునుంచి తాడికొండకి. యాభై ఏళ్ళ కిందట నా తండ్రి నన్ను తీసుకువెళ్ళిన దారిన. గుంటూరునుంచి అమరావతిరోడ్డుమీద, అక్కడ అడ్డరోడ్డునుంచి తాడికొండకి. ఊరవతల తుళ్ళూరు వెళ్ళే రోడ్డుమీద మలుపులో డ్రైవరు బస్సు ఆపి ఇక్కడే ఈ స్కౌటు ఆఫీసుదగ్గర అడిగితే చెప్తారు స్కూలు కి ఎలా వెళ్ళాలో అన్నాడు. మనసులోనే నవ్వుకుంటూ, ఆ మలుపు తిరిగి, ఆ కొండవారనే నడుచుకుంటూ, ఆ బళ్ళో అడుగుపెట్టాను.
అప్పటికే మిత్రులంతా అక్కడికి చేరుకున్నారు. అంతా ఆ ప్రాంగణంలో తిరుగుతూ ఉన్నారు. 1972లో స్కూలు ప్రారంభించినప్పుడు రెండు తరగతుల్తో మొదలుపెట్టారు. ఎనిమిదో తరగతిలో తొంభై ఆరు మంది. మూడు సెక్షన్లు. అయిదవతరగతి ఒకటే సెక్షను. ముప్పై నలుగురు అనుకుంటాను. ఆ బాచిలో అయిదవతరగతిలో చేరినవాళ్ళం ముగ్గురం వచ్చాం. తక్కినవాళ్ళంతా ఎనిమిదవ తరగతిలో చేరినవాళ్ళే. దాదాపు ముప్పై అయిదుగురు వచ్చారు.
ఆ బాచిలో ఎనిమిదో తరగతిలో చేరిన వాళ్ళు 1975 లో పదవతరగతి పరీక్ష రాసారు. ఆ పరీక్షలో తాడికొండ రాష్ట్రంలో మొదటి ఏడు రాంకులు కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. అప్పుడు మొదటి రాంకు సాధించిన విద్యార్థి తూర్పుగోదావరి జిల్లాకి చెందిన ధర్మారావు. దళిత విద్యార్థి. అతనికి స్కూలు ఇచ్చిన యూనిఫాం తప్ప మరో జత కూడా అదనంగా ఉండేది కాదు. రాత్రి పూట ఒక కోటు వేసుకుని పడుకునేవాడు. ఆ తర్వాత ఐ ఐ ఎం చేసాడు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకు ఎంపికై మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసాడు. అతణ్ణి తాడికొండ విద్యార్థులకి ఒక రోల్ మోడల్ గా చూపించడం కోసం పూర్వవిద్యార్థులు 2001 లో రజతోత్సవాలు నిర్వహించారు. ఆ ఉత్సవాల్లో నేను కూడా నా భార్యాపిల్లల్తో పాల్గొన్నాను. కానీ ఈ సారి ధర్మారావు హాజరు కాలేకపోయాడు. ఎందుకంటే, ఆ తర్వాత ఒక రోజు హిమాలయాల్లో ప్రయాణిస్తుండగా అతడు సతీసమేతంగా ప్రమాదానికి గురయి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు.
ఆ బాచిలో రెండవ రాంకు తెచ్చుకున్న విద్యార్థి సుధాకర బాబు. ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి కొన్నాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేసాక మస్కట్ వెళ్ళిపోయాడు. అక్కడే దాదాపు మూడు దశాబ్దాలు పనిచేసాక రిటైర్ అయ్యి ఈ మధ్యనే స్వదేశానికి తిరిగి వచ్చాడు. తన బాచికి చెందిన విద్యార్థులందరితో స్వర్ణోత్సవ వేడుక నిర్వహించడం తన బాధ్యత అనుకున్నాడు. అతడే ఈ కలయిక ఏర్పాటు చేసింది. అతడి మాటల్లో, ప్రవర్తనలో, సమావేశాన్ని నిర్వహించిన పద్ధతిలో ఉన్నత వ్యక్తిత్వం, సంస్కారం అడుగడుగునా కనిపించింది.
ఆ రోజు అంటే యాభై ఏళ్ళకిందట మమ్మల్ని స్వాగతించిన వెంకటరత్నం మాష్టారిని ముఖ్య అతిథిగా పిలిచారు. ఆ నాటి మా ఉపాధ్యాయుల్లో మిగిలి ఉన్న ఇద్దరుముగ్గురులో ఆయన కూడా ఒకరు. మాలో ప్రతి ఒక్కరి జీవితం మీద, దృక్పథం మీద ఆయన ముద్ర విస్పష్టంగా ఉంది. ముందు అందరూ వందేమాతరం ఆలపించేక, అప్పటి మా పాఠశాల గీతం ‘ఇదియే గురుకుల విద్యావనము, నవ్వెడు పువ్వుల నందనవనము ‘ ఆలపించాం. రాళ్ళభండి కృష్ణమూర్తి గారనే మా తెలుగు ఉపాధ్యాయులు రాసిన గీతం అది. ఎలానో ఆ పాటలో మొదటి చరణాన్ని పట్టుకు రాగలిగేరు మిత్రులు. వెంకట రత్నం మాష్టారిని, ప్రిన్సిపాలుగారిని వేదిక మీదకు ఆహ్వానించేక, దివంగతులైన ఉపాధ్యాయులకీ, మా సహచర విద్యార్థులకీ శ్రద్ధాంజలి ఘటించేము. అప్పుడు పూర్వవిద్యార్థులు తమ జ్ఞాపకాలు పంచుకోవడం మొదలుపెట్టేరు.
ఆ రోజు చేరిన విద్యార్థుల్లో అకారాది క్రమంలో వై.అశోక్ మొదటి విద్యార్థి. ఆ రకంగా అతడు తాడికొండ పాఠశాల చరిత్రలోనే మొదటి విద్యార్థిగా చరిత్రకెక్కాడు. వైద్యవిద్య పూర్తిచేసుకుని భారతసైన్యంలో ఇరవయ్యేళ్ళకు పైగా పనిచేసాడు. కార్గిల్ యుద్ధంలో కూడా పనిచేసాడు. కాబట్టి ఇప్పుడు కూడా మాట్లాడే అవకాశం అతడికే మొదట లభించింది. అతడు ఎంత అద్భుతంగా మాట్లాడాడంటే ఇక ఆ తరువాత ఎవరు మాట్లాడినా ఆ మాటల్నే తిరిగి చెప్పవలసి ఉంటుంది. అతడి ప్రసంగం సారాంశం ఒకటే. అదేమంటే తాడికొండ తనకి చదువు మాత్రమే నేర్పలేదు, శీలం నేర్పింది, విలువలు నేర్పింది, రాజీపడని వ్యక్తిత్వాన్నిచ్చింది.
అక్కడికి వచ్చిన మిత్రులంతా కెరీర్ పరంగా ఎంతో ఉన్నతస్థానాలకు చేరుకున్నవాళ్ళే. వైద్యులు, పీడియాట్రిక్స్, సైకియాట్రీ లాంటి రంగాల్లో వైద్యులుగా పనిచేస్తున్నవాళ్ళు, రైల్వేలు, రక్షణ, బాంకింగ్, ఇన్సూరెన్స్, టెలికమ్యూనికేషన్స్ వంటి ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసినవాళ్ళు, ఎలక్ట్రికల్, మెటలర్జి, మెకానికల్ ఇంజనీరింగ్ వంటి రంగాల్లో అత్యున్నత ప్రతిభ కనపర్చినవాళ్ళూను. ఒక మిత్రుడు డి ఆర్ డి ఓ లో రాజారామన్న ఛైర్ లో ఉన్నాడు. మరొకమిత్రుడు పాల ఉత్పత్తిలో సాధించిన విజయాలకి ఆంధ్రా కురియన్ అని పేరుతెచ్చుకున్నాడు. కాని అందరూ చెప్పింది ఒకటే మాట, తాడికొండ తమకి జీవితాన్నిచ్చింది, తమని మనుషులుగా రూపొందించింది అని.
అందరిలోనూ ప్రత్యేకంగా చెప్పవలసిన విద్యార్థి ఒకాయన ఉన్నాడు. అతని పేరు భాస్కర పట్నాయిక్. ఆయన ఆ స్కూల్లో చదువుకుని బయటకి వెళ్ళాక, పందొమ్మిదోఏట కంటిచూపు పూర్తిగా కోల్పోయాడు. కాని ఆ తర్వాతే అతడి కెరీర్ మొదలయ్యింది. రెండు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు సాధిచాడు, లా చదివాడు, సి ఏ చేసాడు. బాంకులో ఉద్యోగం సంపాదించాడు. బాంకిగ్ వ్యవస్థలో ఉద్యోగం పొందిన మొదటి అంధ అభ్యర్థి. ఆ తర్వాత శారీరిక, మానసిక వైకల్యం ఉన్న విద్యార్థుల, అభ్యర్థుల హక్కుల కోసం జీవితమంతా పోరాడేడు. తను ఉత్తమ ఉద్యోగి అనిపించుకుని, వైకల్యం performance కి అడ్డురాదని నిరూపించాడు. అతడి జీవితానుభవాల్ని అతడి సహాధ్యాయి మురళీకృష్ణ ‘వెలుగులోకి’ అనే పేరిట పుస్తకంగా వెలువరించాడు. ఆ పుస్తకాన్ని రమణమూర్తి అనే మరో మిత్రుడు పరిచయం చేసాడు.
సుధాకర బాబు విష్ణుసహస్రనామాలకి దాదాపు పన్నెండు వందల పేజీల భాష్యం రాసాడు. ఆ పుస్తకం గురించి కూడా మిత్రులు మాట్లాడేరు. ఇప్పుడు అందరూ దాదాపుగా పదవీవిరమణ చేసిన దశలో ఉన్నారు కాబట్టి తమ అనుభవాల్ని రాయాలనీ, రచయితలుగా మారాలనీ గట్టిగా అనుకున్నారు.
పూర్వ విద్యార్థులు మామూలుగా తాము చదువుకున్న పాఠశాలలకి భవనాలో, సదుపాయాలో, వస్తుసామగ్రినో ఏదో ఒకటి అందిస్తారు. కాని మొన్న ఆ పూర్వ విద్యార్థులు ఒక మామిడితోట కానుక చేసారు. ప్రతి ఒక్కరూ తమ గుర్తుగా ముప్పై అయిదు మామిడిమొక్కలు నాటారు. దానికి ’50 వసంతాల తోట’ అని పేరు పెట్టారు.
పాఠశాల రజతోత్సవ వేడుకలకు 2001 లో హాజరయిన రాత్రి నేను చాలా వేదనకు లోనయ్యాను. ఆ పాఠశాల నాకు ఎంతో ఇచ్చినప్పటికీ నేనేమీ తిరిగి ఇవ్వలేకపోయాననే చింత ఆ రాత్రంతా నన్ను దహించింది. అందుకని, ఆ తర్వాత, నా విద్యానుభవాల్ని ‘కొన్ని కలలు, కొన్ని మెలకువలు ‘ పేరిట పుస్తకంగా రాసినప్పుడు, ఆ పుస్తకం ఆ పాఠశాలకు అంకితం చేసాను. ఆ గ్రంథం నా చేతుల్తో ఆ స్కూలుకి ఇవ్వలేకపోయాను. అప్పుడు రావెల సోమయ్యగారు, తాడికొండ వెళ్ళినప్పుడు నా తరఫున తనే ఆ రచనని ఆ పాఠశాలకు అందించారు. ఇన్నాళ్ళకు, అంటే, పాఠశాల స్వర్ణజయంతి రోజున ఆ గ్రంథాన్ని నా చేతుల్తో ఆ పాఠశాల ప్రిన్సిపాలు గారికి అందించే భాగ్యం కలిగింది. నా విద్యాయాత్ర పూర్తయింది.
27-8-2022