
కృష్ణుడు ఆకాశమంత అనుకుంటే కృష్ణభక్తి సాహిత్యం సముద్రమంత. ఒక జీవితకాలం సరిపోదు. అన్నిటికన్నా ముందు ఆ కృష్ణుడు ఎక్కడికక్కడ ఏ భాషకి తగ్గట్టుగా ఆ భాషలో ఒక అందంగా అమరిపోయాడు. పోతన వర్ణించిన కృష్ణుణ్ణి చూడటమంటే తెలుగు భాష తియ్యదనం నీ స్వంతం కావడం. ఒక్క సంస్కృతంలోనే ఎందరు కృష్ణకవులున్నారో అన్ని సంస్కృతాలున్నాయి.
లీలాశుకుడు, జయదేవుడు, నారాయణతీర్థులు, నారాయణీయకర్తల సంస్కృతం ఒక్కలాంటి సంస్కృతం కాదు. ఎవరి సంస్కృతం వారిది. ఒక ముకుందమాలలోని సంస్కృతమూ, ఒక చైతన్యమహాప్రభు సంస్కృతమూ ఒకటికానే కావు. కృష్ణభక్తి వాజ్ఞ్మయంలోకి ప్రయాణించడంటే ఒక్క సముద్రం కాదు, ఇక్షుసముద్రం, క్షీరసముద్రంలాంటి సప్తసముద్రాలూ చుట్టిరావడం.
నా అలమారులో ప్రతి అరలోనూ కృష్ణభక్తి కవులున్నారు. ఆ పుస్తకాల్లో ప్రతి పుటలోనూ శిరసున నెమలిపింఛం, ఉరాన పీతాంబరం, చేతుల్లో వేణుఖండం ధరించిన గోపబాలకుడు ప్రత్యక్షమవుతూనే ఉంటాడు. ఎవరి పిలుపు వినను? సూర్ దాస్ దా? మీరా మాయి దా? సంత్ శంకర దేవ్ దా? లేక వల్లభాచార్యులదా?
అప్పుడు గుర్తొచ్చింది, మొన్ననే నమ్మాళ్వారు కి కొత్త ఇంగ్లిషు అనువాదం వచ్చిందని, తెచ్చుకున్నానే గాని ఇంకా తెరవనేలేదని. ఆ అపురూపమైన పుస్తకం తెరిచాను. To Plunge Within (2022). వసంత సూర్య అనే పండితురాలు, భావుకురాలు దాదాపు ఇరవై ఏడేళ్ళ పాటు సాధనచేసి తిరువాయిమొళి నుంచి ఇంగ్లిషులోకి అనువదించిన 110 పద్యాల సంకలనం, అనువాదం.
రాత్రంతా కూచుని చదివాను. మూలంతో పోల్చుకుని చదివాను. ఆమె కృషి మామూలు కృషి కాదనిపించింది. ఆమె మామూలు అనువాదకురాలు కూడా కాదనిపించింది. నిజంగానే కాదు. ఎందుకంటే ఆమె బ్రెహ్ట్ నీ, రిల్కనీ జర్మన్ నుంచి తమిళంలోకి అనువదించిందట. తమిళం నుంచి కథాసాహిత్యాన్ని ఇంగ్లిషులోకి అనువదించిందట. కాని ఈ అనువాదం ప్రత్యేకం. ఇది ఆమె తన యావచ్ఛక్తి వినియోగించి చేసిన అనువాదం అని అర్థమవుతూనే ఉంది.
80 ల్లో ఎ.కె.రామానుజన్ ఒక సారి చెన్నై వచ్చినప్పుడు అక్కడి పండితులకి చెప్పాడట, ఆళ్వారుల్ని, ముఖ్యం నమ్మాళ్వారుని ప్రతి ఒక్కరు ఇంగ్లిషులోకి తీసుకురావడానికి ప్రయత్నించండి అని. ఆ మాటలు ఆమె మనసులో నాటుకుపోయాయి. ఆ రోజునుంచీ ఆమె తిరువాయిమొళి అనే సముద్రంలో మునకలేస్తూనే ఉంది. ప్రతి ఒక్క పాశురంలోని, ప్రతి ఒక్క పదబంధాన్నీ ఆమె చేతుల్లోకి తీసుకుని చూసింది. ప్రతి మాట మలుపులోనూ మునకలేసింది. భక్తుణ్ణి భగవంతుణ్ణి సంబోధించిన ప్రతి ఒక్క పిలుపునూ- పెరుమాళ్ తిరుమాళ్, మాల్, అప్పన్, అమ్మాన్, మాయోన్- ప్రతి ఒక్క పేరునూ తను కూడా బిగ్గరగా పలికి చూసింది. ఫలితం! మరే అనువాదకులూ ఇంతదాకా గమనించని ఎన్నో సూక్ష్మ సౌందర్యాల్ని ఆమె పట్టుకోగలిగింది. మనతో పంచుకోగలిగింది.
ఆ పద్యాలు చదువుకోవడమే నాకు గోకులాష్టమి. వెన్నలాంటి ఆ వాక్కుని మీక్కూడా ఎంతో కొంత పంచాలి కదా, కాబట్టి, ఈ రెండు పద్యాలు చూడండి:
ఇన్ కవి పాడుం పరమకవి గళాల్
తన్ కవితాన్ తన్నై పాడు వియాదు ఇన్రు
నంగు వన్దు ఎన్నుడన్ ఆక్కి యెన్నాల్ తన్నై
వన్ కవి పాడుమ్ ఎన్ వైగుంఠ నాథనే. (7:9:6)
(చక్కటి వాక్కులో గానం చెయ్యగల ఎందరో కవీశ్వరులుండగా, తన గురించిన కవిత్వాన్ని వారితో పాడించుకోకుండా, చాలా సంతోషంతో తనంత తానే నా దగ్గరకు వచ్చిన నా పరమనాథుడు నన్ను వదిలిపెట్టకుండా తన గీతాలు నాతో పాడించుకుంటున్నాడు.)
ఆమె ఇంగ్లిషు అనువాదం:
Great poets who sing the finest poetry
those who’ve been made to sing
of you, by you
this may not be.
But it’s to me you’ve come today.
Apt upon my tongue
have you begotten
mighty poems!
Through me you sing
of your self
my lord of Vaikuntha!
ఈ అనువాదంలోని అందం ముఖ్యంగా రెండు చోట్ల ఉంది. ఒకటి ‘నన్దు వన్దు’ అంటే తానే వచ్చి అని మూలంలో ఒకపక్కగా, లోగొంతులో వినబడీ వినబడకుండా ఉన్న మాటని But it’s to me you’ve come today అనే ఒక ప్రత్యేక వాక్యంగా మార్చడంలో ఉంది. నమ్మాళ్వారులో ఉన్న మహిమ అదే. ఆయనకి తన గీతాలు కడురమ్యాలని తెలుసు. అటువంటి గీతాల్ని తమిళ భాషలో అప్పటిదాకా ఎవరూ పాడలేదని తెలుసు. కాని అది తన ప్రతిభ కాదు, తన దేవుడు తనంత తనుగా తన దగ్గరికి వచ్చి పాడించడంలోని కృపాతిశయమని కూడా తెలుసు. మరో మాట ‘వన్ ‘ అనే విశేషణం. వన్ అంటే గొప్పది. వన్ కవి అనే పదబంధాన్ని ఆమె mighty poems అని అనువదించింది. నేను పాడుతున్న పాటలు గొప్పవి అని కవి అనుకోవడం స్వోత్కర్ష కాదు, అది కూడా భగవద్దివ్యలీలాగానమే!
మరొక పద్యం చూడండి. ఇది కూడా ఏడవ సర్గలోని తొమ్మిదవ పదికమే. ఆమె హృదయానికి ఈ పదికం హత్తుకుపోయిందని అర్థమవుతూనే ఉంది.
ఆముదల్వనివనెన్రు తన్ తేళ్లి ఎన్
నా ముదల్ వందు పుగుందు నల్ ఇన్ కవి
తూముదల్ పత్తర్ క్కు త్తాన్ తన్నై సొన్న ఎన్
వాయి ముదలప్పనై యెన్రు మరప్పనో
(ఈ జగత్తుకి తానే కారణమన్న ఎరుక నాకు ప్రసాదించి, నా నాలుక మీద అడుగుపెట్టి, గొప్ప భక్తులకి ఆనందాన్ని కలిగించే వాక్కుని నాకు అనుగ్రహించి నాతో ఈ పద్యాలు పలికిస్తున్న నా తండ్రిని నేనెప్పటికీ మరవలేను)
ఆమె ఇంగ్లిషు అనువాదం.
Yes, he is the First.
Of that he has himself assured me.
Entering my tongue of fine poetry
he has made me sing of him, to those pure
who stand first in his worship.
The first word on my lips is ‘father ‘
How can I ever forget him?
ఇక్కడ అందమంతా ఆ yes అని మొదలుపెట్టడంలో ఉంది. ఆ నిర్ధారణ పదం మూలపద్యంలో లేదు. కాని ఆ పద్యం సారాశమంతా తన భాగ్యనిర్ధారణే. కాబట్టి, ముందే yes అని మొదలుపెట్టడంలో ఎంతో సున్నితమైన అందముంది. మొత్తం పద్యమంతా చదివాక మళ్ళా మొదటి వాక్యానికి వచ్చినప్పుడు, కవి కన్నా ముందే మనం yes అనుకుంటాం.
కొన్నిచోట్ల ఆమె మూలం నుంచి బాగా పక్కకు జరిగిన తావులు కూడా లేకపోలేదు. ఉదాహరణకి 5-10-7 పాశురానికి చేసిన అనువాదంలో ‘ఒణ్ శుడరోడు ఇరుళుమాయ్ నిన్రావరుం ఉణ్మయోడు ఇనమై ఆయ్ వమ్దు ‘ అనే వాక్యాన్ని ఆమె In flame you stand as darkness అని అనువదించింది. కాని మూలమే చాలా చక్కగా ఉంది. ‘నిన్ను ఆశ్రయించినవారికి నువ్వు సుందరమైన కాంతితో ప్రకాశిస్తూ కనిపిస్తావు, నిన్ను ఆశ్రయించనివారికి నువ్వు చీకటిలాగా కాంతిరహితంగా కనిపిస్తావు..’అనే అర్థమే చక్కగా ఉంది.
ఇలా ప్రతి ఒక్క పాశురాన్ని పోగులు, పోగులుగా విడదీసి ప్రతి పోగునీ పైకెత్తి పరిశీలించుకోవడంలో, చర్చించుకోవడంలో ఉండే ఆనందం కోసమే ఆమె ఈ కావ్యాన్ని మనకి అందించిందని భావిస్తున్నాను.
ఇలా పోతన్నని కూడా ప్రపంచమంతా చదువుకునే రోజు ఎప్పుడు రానున్నదో కదా!
19-8-2022