నర్మద దర్శనం

Reading Time: 3 minutes

కొన్నాళ్ళకిందట నేనొక మానేజిమెంటు కోర్సులో శిక్షణకి వెళ్ళినప్పుడు ఒక ఫాకల్టీ తన క్లాసులో ‘రెసిడ్యూ’ అనే పదాన్ని పదే పదే వాడాడు. ఆయన చెప్పిందేమంటే నువ్వు నీ కుటుంబ జీవితంలో, సామాజిక జీవితంలో మనుషుల్ని కలుసుకున్నప్పుడు, వారితో మాట్లాడినప్పుడు, అంగీకరించినప్పుడు, విభేదించినప్పుడు, కలిసి పనిచేసినప్పుడు, కలిసి పనిచేయడం సాధ్యం కాదని గ్రహించినప్పుడు, ఇలా అన్ని సమయాల్లోనూ, నువ్వు ఆ సన్నివేశం నుంచి పక్కకు తొలిగాక, అక్కడ నీ ప్రవర్తనకు సంబంధించిన ఒక ఇంప్రెషన్ ని వదిలిపెట్టి వస్తావు. నువ్వు నీ గురించి ఎంత చెప్పుకున్నా తెలియచెప్పలేనిది ఆ చిన్న ఇంప్రెషన్ చాలా గట్టిగా తెలియచెప్తుంది. చాలాసార్లు అది మనం మాటల్లో చెప్పేదానికన్నా బలంగా, గాఢంగా మాట్లాడుతుంది. కాని అది నిశ్శబ్దంగానే మాట్లాడుతుంది.

నువ్వు ఎటువంటి రెసిడ్యూ వదిలిపెట్టగలవనేది నువ్వు conscious గా చెయ్యగలిగే పనికాదు. అది నీకు తెలియకుండానే నీ అవ్యక్త అంతరంగం, నీ లోపలి సహజాతాలు, నీలోపల చెలరేగే ఆరాటాలు నీ మాటల్తో నిమిత్తం లేకుండానే కమ్యూనికేట్ చేసే ఒక సందేశం. అందుకనే గొప్ప యోగుల్నీ, సాధువుల్నీ కలుసుకున్నప్పుడు వారితో మనమేమీ మాట్లాడకపోయినా, వారి సన్నిధిలో కూచుని వస్తేచాలు, చాలాకాలం పాటు ఆ రెసిడ్యూ మనతో ఉండిపోతుంది. కొందర్ని కలిస్తే కస్తూరి పరిమళం గుప్పుమంటుందని రూమీ అటువంటి వాళ్ళ గురించే అన్నాడు.

ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే, మొన్న సంధ్య ఎల్లాప్రగడ మా ఇంటికి వచ్చారు. కొంతసేపు కూచున్నారు. ఆమె ఆధ్యాత్మిక సాధనగురించీ, ఆమె చేస్తున్న తీర్థ యాత్రల గురించీ నేనే ఆమెతో ఏదో మాట్లాడిస్తో ఉన్నాను. కొంతసేపు కూచున్నాక, ఆమె సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. కాని ఒక కస్తూరి పరిమళం వదిలిపెట్టి వెళ్ళిపోయారు.

ఒక కథలో చెహోవ్ పాత్ర అనుకుంటాడు: ఈ నగరంలో నలభై వేలమంది ఉన్నారు, కాని వీళ్ళల్లో తాము మరింత వివేకవంతులు కావాలనికోరుకుంటున్నవాళ్ళు ఒక్కరు కూడా కనిపించడం లేదు అని. కాని సంధ్యా ఎల్లాప్రగడ అటువంటి వ్యక్తి. నాకు తెలిసిన ప్రపంచంలో ఆమె ఒక ఆశ్చర్యం. తనని తాను మరింత పరిశుభ్రపరుచుకుంటూ, తనకి తాను మరింత సన్నిహితంగా జరగాలనే సాధనచేస్తున్నవాళ్ళు నాకు ఆట్టే తెలియదు. కవులు తెలుసు, మేధావులు తెలుసు, తమ ఉనికిని చాటుకోవడానికి తక్కినవాళ్ళ ఉనికిని ప్రశ్నిస్తోపోయేవాళ్ళు తెలుసు. కాని ఒక పువ్వులాగా నిశ్శబ్దంగా విప్పారేవాళ్ళు అరుదు. అటువంటి మనుషులు ఎక్కడ ఉన్నా కూడా ఆ పరిమళం మనని తాకక మానదు.

ఒక గురువుని అన్వేషించుకుంటో ఆమె చేసిన ప్రయాణాన్ని ‘సత్యాన్వేషణ’ పేరిట పుస్తకంగా తీసుకువచ్చినప్పుడు నేను దానికి ముందుమాట రాసాను. ఆ తర్వాత ఆమె నర్మదా పరిక్రమ చేసాననీ, దాన్ని కూడా ఒక పుస్తకంగా వెలువరిస్తున్నాననీ చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యంవేసింది. ఎక్కడి అమెరికా! ఎక్కడి నర్మద! ఎన్నాళ్ళుగా అనుకుంటున్నాను ఉజ్జయిని వెళ్ళాలని. కాని ఒక్క అడుగుకూడా ముందుకు వేసింది లేదు. అటువంటిది ఈమె రెండువారాల్లో నర్మద మొత్తం ప్రదక్షిణచేసారంటే ఆశ్చర్యం, గౌరవం రెండూ కలిగాయి. ఆమెకి పుస్తకాలు రాసుకోవడం, వేసుకోవడం, ఆవిష్కరణలు ఏవీ తెలియవు, అన్నీ కొత్త. కాని ఆమె గురువుగారు నర్మద పరిక్రమ గురించి నలుగురికీ తెలియాలని చెప్పారట. అందుకని ఆ పుస్తకావిష్కరణ సభ పెట్టుకుని నన్ను కూడా మాట్లాడమని అడిగారు. అది నా భాగ్యమని భావించాను. ‘నువ్వు నీళ్ళకోసం దప్పిక పడ్డప్పుడు గుర్తుపెట్టుకో, నీళ్ళు కూడా నీ కోసం దప్పిక పడుతున్నాయి ‘ అన్నాడు రూమీ. నర్మదకోసం నేనెంత దప్పికపడ్డానో నాకు తెలీదుగాని, నర్మద మాత్రం నా మాటలు వినాలని కోరుకుందని అర్థమయింది.

ఆ రోజు నేను మాట్లాడినదానికన్నా ఆమె పుస్తకంలోంచి ఈ వాక్యాలు చదివివినిపిస్తే ఆ రచనకు ఎక్కువ న్యాయం చెయ్యగలనిపించింది. నర్మద పరిక్రమ పూర్తయిన తర్వాత, ‘నర్మద దర్శనం’ అని రాసిన అధ్యాయంలో ఈ వాక్యాలు చూడండి:

మరి మాకు నర్మదామాయి ఎక్కడన్నా కలిసిందా?

అమ్మ హృదయానికి పదేపదే తడుతూనే ఉంది. ఆమె ఏ రూపంలో అనుగ్రహించిందో ఎవరికి తెలుసు??

ఓంకారేశ్వర్ లో పూజారిగారు మాతో ‘మేము అందరితో మర్యాదగా ఉంటాము. ఎక్కువ ఏమి ఆశించం. మాయి ఏ రూపంలో మమ్మల్ని పరిరక్షించటానికి వస్తుందో, మాయి మీరేనేమో అమ్మా !’ అన్నాడు.

నర్మదా తీరంలో ఓంకారేశ్వర్ లో మా సంచులు పెట్టి నీటిలోకి వెళ్ళటానికి మా వారు సందేహిస్తుంటే ‘పర్వాలేదు, వెళ్ళండి’ అని ధైర్యం చెప్పిన సామాను అమ్ముతున్న ముసలి అవ్వకాదా నర్మదామాయి??

నర్మదలో రెండో రోజు పడిపోతే సాయం చేసిన పరిక్రమవాసి కాదా నర్మదామాయి?

అంకలేశ్వర్ లో మా వారు తన మిత్రులను కలవటానికి ముందు వెళ్ళిపోయారు. నేను తరువాత గదిబయటకు వచ్చాను.

బయట ఒక అమ్మాయి ఆ హాల్ తుడుస్తోంది. నేను బయటకొచ్చేసరికే ఆమె ఒకవైపు ఆ తుడిచేవి పెట్టి నాతో పాటు లిఫ్ట్ లోకి వచ్చింది. చూడచక్కగా ఉందామె.

నేను మాస్కు పెట్టుకున్నా దగ్గు రావటం ఆగదుకదా.

దగ్గు వస్తుంటే ఆమెతో ‘జస్ట్ త్రోట్ ఇన్ఫెక్షన్ ..’ అన్నా.

ఆమె చిన్నగా నవ్వి ‘ఐ నో ‘ అంది.

ఆమెకెలా తెలుసు? అది ఉట్టి దగ్గుమాత్రమే అని, కరోనా కాదని.

ఆమెనా నర్మదామాయి?

నాకింత జబ్బుగా ఉంటే, నా ఆరోగ్యం, నా గురించి నేనే పట్టించుకోను..అలాంటిది కామేశ్వరిగారు నా కోసం ఎన్ని మందులు తెచ్చారు, ఎంత ప్రేమ చూపారావిడ, ఆమె నర్మదామాయి కాదా?

బరూచ్ లో నర్మద దగ్గర నేను బట్టలు మార్చుకోవటానికి సాయంగా నా చుట్టూరా తన చీరలు అడ్డం నిలబెట్టిన స్త్రీలు కారా నర్మదా మాయి?

అమర్ కంటక్ లో నా దగ్గర తన పిల్లలకు నోట్స్ కావాలని వచ్చి మరీ నోటుబుక్స్ తీసుకువెళ్ళిన స్త్రీమూర్తి నర్మదామాయి కాదా?

సీతెల్ ఘాట్ లో చెట్టుకింద ఉన్న వృద్ధురాలేమో?

….

చదవండి, ‘నమామి దేవి నర్మదే’ మనకు తెలియని కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఆమె చూసిన, మనకు చూపిస్తున్న ఆ భారతదేశమే నిజమైన భారతదేశమని మనం నమ్ముతాం. ఇంకా ఆ దేశం అక్కడ నిర్మలంగా, సజీవంగా ఉన్నందువల్లనే, మనం, మన పిల్లల్తో, ఈ దేశంలో ఇంకా భద్రంగా జీవించగలుగుతున్నాం అని తెలుసుకుంటాం.

2-9-2022

Leave a Reply

%d bloggers like this: