దాదాపుగా అదొక జీవితకాలం

Reading Time: 4 minutes

యాభై ఏళ్లు. అర్థ శతాబ్దం.

1972 ఆగస్టు 25. మా నాన్నగారు నన్ను తాడికొండ స్కూల్లో నిన్ననే జాయిన్ చేసినట్టుగా ఉంది. ప్రసిద్ధ ఈజిప్షియన్ రచయిత నగీబ్ మహఫూజ్ కథలో లాగా ఈ యాభైఏళ్లు ఒక్క పూటలో గడిచిపోయినట్లుగా అనిపిస్తున్నది. ఈ యాభై ఏళ్లలో నా చదువు, ఉద్యోగ జీవితం కూడా పూర్తి అయిపోయాయి. ఈరోజు ఆ మొదటి బ్యాచ్ విద్యార్థులు కొంతమంది తాడికొండలో కలుసుకోబోతున్నారు. నేను కూడా వాళ్లతో పాటు మళ్ళా ఆ తొలిరోజు జ్ఞాపకాలను తలుచుకుంటూ ఆ స్కూల్లో అడుగుపెట్టబోతున్నాను.

ఈ యాభై ఏళ్లుగా నాలో మార్పు చెందకుండా ఉన్నది ఏది? ఆరోజు ఎలా ఉన్నానో ఈరోజూ అలానే ఉన్నానని ఏ అంశంలో చెప్పగలను? రాత్రంతా ఇదే ఆలోచిస్తూ ఉన్నాను. ఒక్క క్షణం కూడా నిద్రపోలేకపోయాను.

School అనే మాట గ్రీకు నుంచి పుట్టిన పదం. గ్రీకులో దాని మూల పదం scholē. అంటే అర్థం ‘తీరిక’ అని. ఒక మనిషి తీరికలో చెయ్యగలిగే పనిని, చేయవలసిన పనిని గ్రీకులు schooling గా భావించారు. గ్రీకుల ఉద్దేశంలో ఒక మనిషి తన తీరికని ఏ విధంగా ఉపయోగించుకుంటాడనేదే అతడి విద్య. మనం ఇప్పుడు స్కూల్ గురించి భావిస్తున్నది దీనికి పూర్తిగా విరుద్ధమైన భావన. ఇప్పుడు స్కూలు అంటే నీకు తీరిక లేకుండా చేసేది. నిన్ను పూర్తిగా ఏదో ఒక పనిలో నిమగ్నం చేసేది. నీ జీవిక కోసం, ఉపాధి కోసం నువ్వు ఏదో ఒక పని వెతుక్కోవటానికి సహకరించేది. కానీ పూర్వకాలపు ఏథెన్సువాసుల దృష్టిలో స్కూలు నీ పనిని, ఉపాధిని, వ్యాపకాన్ని నిర్ణయించేది కాదు. ఆ పనులు చేయటానికి, ఆ పనులు నేర్పటానికి వారు జిమ్నాషియం వైపు చూసేవారు. స్కూలు అంటే వాటిని దాటిన ఒక సాంస్కృతిక స్థలం. అది నీ జీవితాన్ని నువ్వు లోతుగా, గాఢంగా తరచి చూసుకొనే ఒక అవకాశం. నీ విలువలను కనుగొనే ప్రయోగశాల. వాళ్ల దృష్టిలో స్కూలు శిక్షణ ఇచ్చేది కాదు, విద్య నేర్పేది.

నిజానికి తాడికొండలో మాకు ఒక్క క్షణం కూడా తీరిక దొరికేది కాదు. రాత్రి పదింటికి పడుకుంటే పొద్దున్నే నాలుగింటికి ఫిజికల్ ఎడ్యుకేషన్ మాస్టారు విజిల్ వేసి మమ్మల్ని లేపగానే ఇప్పుడే కదా పడుకున్నాం అప్పుడే లేపేస్తున్నారు ఏమిటి అనిపించేది. ఇక అప్పటినుంచి రాత్రి మళ్లా పదింటి దాకా ఒక్క క్షణం కూడా మాకు తీరిక ఉండేది కాదు. కానీ తాడికొండని నేను నిజమైన అర్థంలో స్కూలు అనే పిలవదలుచుకున్నాను. ఎందుకంటే ఆ స్కూలు అంత పని మధ్యా, అంత వ్యాపకం మధ్యా, జీవితపు విలువల్ని కనుగొనడానికి, నాలో ఉన్న ప్రగాఢమైన అభినివేశాల్ని వెలికి తీసుకోవటానికి, వాటిని వ్యక్తీకరించుకోవటానికి అపారమైన అవకాశాల్ని ఇచ్చింది.

ఒకరకంగా చెప్పాలంటే కఠోపనిషత్తులో చెప్పిన శ్రేయో మార్గం, ప్రేయోమార్గం లాగా, ప్లేటో రాసిన Phaedrus సంభాషణలో సోక్రటీస్ వివరించిన రెండు గుర్రాల్లాగా, తాడికొండ నా ముందు ఎప్పుడూ రెండు ఆదర్శాలని ఉంచుతూనే వచ్చింది. ఒకటి ఒక జిమ్నాషియంగా నా శారీరక, బౌద్ధిక శక్తులకి శిక్షణ ఇవ్వడం ద్వారా, నన్ను ఒక మంచి విద్యార్థిగా తర్ఫీదు చేయటం, తద్వారా నాకు ఒక కెరీర్ ని, ఒక జీవనోపాధిని సమకూర్చటం. కానీ దానికన్నా లోతుగా నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దడానికీ, నా జీవితాశయాల్ని కనుగొనడానికి, వాటిని నా రెండు చేతులతో రూపొందించుకోవటానికి నాకు దారి చూపించింది.

ఈ రెండవ అంశంలో తాడికొండలో నాకు కలిగిన మెలకువ వల్ల నేను తాడికొండ నాకు ఇచ్చిన మొదటి అవకాశాన్ని తర్వాత రోజుల్లో నా అంతటి నేనే పక్కకు నెట్టేసుకున్నాను. ఒక కెరీర్ ని నిర్మించుకోవడం కన్నా జీవితాన్ని మరింత దగ్గరగా, మరింత లోతుగా, మరింత స్ఫూర్తిదాయకంగా సమీపించడమే ఎక్కువ సార్ధకమని భావించాను. దాని ముందు నా పై చదువులు, నా కెరీర్ నాకేమంత ముఖ్యంగా తోచలేదు.

అందుకని ఇప్పుడు యాభై ఎళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తుంటే ఆరోజు స్కూల్లో అడుగు పెడుతున్నప్పుడు ఒక జిజ్ఞాసిగా ఒక అభ్యాసకుడిగా ఎంత ప్రగాఢమైన ఉత్సాహంతో అడుగుపెట్టానో, ఈరోజు అంతే జిజ్ఞాసతో అంతే ఉత్సాహంతో ఉన్నానని గ్రహిస్తున్నాను. బహుశా ఈ యాభై ఏళ్లుగా నాలో మారనిది, ఇంకా చెప్పాలంటే మరింత ప్రజ్వరిల్లుతున్నది ఏదైనా ఉందంటే అది నా జిజ్ఞాస మాత్రమే. ఈ జిజ్ఞాసని పెంచి పోషించి ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ దీపం ప్రజ్వరిల్లుతూ ఉండేటట్లుగా చూడటమే తాడికొండ నాకు ఇచ్చిన గొప్ప కానుకగా నేను భావిస్తున్నాను.

తాడికొండ పాఠశాల మాత్రమే కాదు గురుకులం కూడా. మన ప్రాచీన గురుకులాల్లో విద్యార్థికి చదువు చెప్పటం ప్రధాన కర్తవ్యం కాదు. చదువు ఏ విద్యార్థికి ఆ విద్యార్థి తపస్సు ద్వారా స్వాధ్యాయం ద్వారా కొనసాగించుకోవలసిన విషయంగా వారు భావించారు. అంతకన్నా కూడా విద్యార్థికి శీల నిర్మాణం చేయడం గురుకులం తన ప్రధాన కర్తవ్యంగా భావించేది. ఇక్కడే గ్రీకు విద్యాదర్శాలకూ, భారతీయ విద్యాదర్శాలకూ మధ్య ప్రధానమైన తేడా ఉంది. పాఠశాలలో కానీ జిమ్నాషియంలో కానీ మనం నిజంగా శీల నిర్మాణం చేయగలమా? శీలాన్ని అలవర్చగలమా అని గ్రీకులు ప్రశ్నించుకుంటూనే ఉన్నారు. ప్లేటో రాసిన, ‘మెనో’, ‘ప్రోటాగరస్’ వంటి సంభాషణల్లో, శీలం నేర్పితే నేర్చుకోగలమా అనే విషయం మీద సోక్రటీస్ చాలా చర్చిస్తాడు. కానీ మన ప్రాచీన గురుకులాల్లో శీల నిర్మాణం కోసమే విద్యార్థులని గురుకులాలకు పంపేవారు. తక్కిన నైపుణ్యాలు, కళలు ఏ విద్యార్థికి ఆ విద్యార్థి తనంతట తాను నేర్చుకోగలడని గురుకులాలు భావించాయి. ఈ అర్థంలో చూసినప్పుడు తాడికొండ నాకు తపస్సుని, స్వాధ్యాయాన్ని అలవర్చకపోలేదు కానీ అంతకన్నా శీల నిర్మాణం మీదనే తన యావచ్ఛక్తిని కేంద్రీకరించిందని ఇప్పుడు గ్రహిస్తున్నాను. మా ప్రిన్సిపాల్ సుగుణమ్మ గారు చదువు ఎలాగైనా వస్తుంది కానీ డిసిప్లిన్ ముఖ్యమని చెప్తూ ఉండేవారు. ఆ మాటలు ఇప్పటికీ నా చెవుల్లో మోగుతూనే ఉన్నాయి. శీలం పట్ల జాగృతినే తాడికొండ మాకు ఇచ్చిన అత్యున్నతమైన కానుక అని చెప్పవలసి ఉంటుంది.

తీరికను ప్రతిభగా మార్చుకోవటం, శీలాన్ని నిర్మించుకోవడం ఈ రెండూ గురుకుల పాఠశాలల ప్రధాన విద్యాదర్శాలు అని చెప్పిన తర్వాత నాకు గొథే మాట ఒకటి గుర్తొస్తున్నది. గొథే ఏమన్నాడంటే ప్రతిభ తీరికలో ఏర్పడుతుంది కానీ శీలం మాత్రం దైనందినజీవితపు ఆటుపోట్లలో, నీ తోటి మనుషులతో ఏర్పడే సంబంధాల్లో నుంచి మాత్రమే రూపుదిద్దుకుంటుంది అని. తాడికొండ నాకు చూపించిన మూడవ దీపం ఇదే. నా జీవితాన్ని నా వ్యక్తిగత వికాసానికి మాత్రమే ఉపయోగించుకుంటూ, ఒక ద్వీపం లాగా ఎవరితోనూ సంబంధం లేకుండా, నాకోసం మాత్రమే నేను బతికే ప్రమాదం నుంచి నన్ను కాపాడింది అని కూడా చెప్పాలి. నాకు ఒక సాంఘిక జీవిగా జీవించవలసిన అవసరాన్ని తాడికొండ అనుభవాలు ఎప్పటికప్పుడు నాకు గుర్తు చేస్తూనే ఉన్నాయి. నా తోటి మనుషులతో ఏర్పడే నా సంబంధాల్లోంచి, నా దైనందిన జీవితంలో నుంచి నేను నా వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవలసి ఉంటుంది అనేది తాడికొండ నుంచి కలిగిన మెలకువ అని ఈరోజు నేను గుర్తుపట్టగలుగుతున్నాను.

తాడికొండలో ఒక విద్యార్థిగా నా సాంఘిక జీవితం ఏమంత సంతోషకరంగా ఉండేది కాదు. తోటి విద్యార్థుల అసూయ నన్ను చాలా హింసించేది. ఇంటి నుంచి దూరంగా ఉన్న బెంగ నన్ను ఒకవైపు తినేస్తుండేది. నా హృదయాన్ని విప్పి చెప్పుకోవటానికి నాకు ఎవరూ స్నేహితులు ఉండేవారు కాదు. అప్పుడు నా తల్లిదండ్రుల స్థానంలో, నా స్నేహితుల స్థానంలో నా ఉపాధ్యాయులే నాకు నా తల్లిదండ్రులుగా స్నేహితులుగా నిలబడేవారు. తోటి మనుషులతో ఆరోగ్యప్రదమైన సంబంధాలు ఏర్పడకపోతే, ఉత్సాహప్రదమైన సాంఘిక జీవితం సాధ్యపడకపోతే నీ ప్రతిభ, నీ శీలం సార్థకత చెందవు అనేది తాడికొండ నాకు నేర్పిన అతిపెద్ద పాఠం.

ఒక మనిషి జీవితంలో యాభై ఏళ్లు తక్కువ కాదు. దాదాపుగా అదొక జీవితకాలం. ఒక జాతి జీవితంలోనూ అది తక్కువ కాలం కాదు. ఎందుకంటే అది అర్థ శతాబ్దం. ఒక అర్థ శతాబ్దపు ప్రయాణం తరువాత ఈరోజు తాడికొండ ముందు నిలబడి నేను సంతోషంగా చెప్పగలిగింది ఏమంటే విద్య అంటే ఏమిటో, శీలం అంటే ఏమిటో, సాంఘిక జీవితం అంటే ఏమిటో నేను తెలుసుకోవటానికి, గాఢంగా వివేచించడానికి తాడికొండనే నాకు పునాది సమకూర్చిందనీ, ఆ స్ఫూర్తితో నాతో నేను చేసుకున్న ప్రయోగాల్లో తక్కిన సమాజానికి పనికొచ్చే పాఠాలు ఎన్నో కొన్ని లేకపోలేదనీ.

ఈ ఎరుకతో కృతజ్ఞతా పూర్వకంగా ఈరోజు తాడికొండ పాఠశాల ముందు నేను మోకరిల్లబోతున్నాను.

25-8-2022

Leave a Reply

%d bloggers like this: