జీవనరోచిష్ణుత

Reading Time: 2 minutes
ఒక కవికీ, రచయితకీ అతడు రాసిన పుస్తకం ఒక సహృదయుడు చదివి మనఃపూర్వకంగా ప్రశంసిస్తే అంతకన్నా మించిన సత్కారం మరొకటి ఉండబోదు. అయితే ఆ సహృదయుడు కేవలం సాహిత్యాభిమాని మాత్రమే కాక, సాహిత్యవేత్త, ఉత్తమ సాహిత్యప్రమాణాలకు గీటురాయి వంటివాడు అయితే, ఆ సత్కారం కన్నా మించిన సత్కారం మరొకటి ఉండబోదు.
 
ఆ సహృదయుడు ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక పట్టణం, ఒక ప్రాంతం అయితే? ఆ కుటుంబం లేదా సంస్థ లేదా పట్టణం సాహిత్యవిశారద అయి ఉంటే! మొన్న అద్దంకిలో పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తిగారి కుటుంబం, మిత్రులు కలిసి నాకు అందించిన సత్కారం లాగా ఉంటుంది.
అద్దంకి తెలుగు నేలమీద విశిష్టమైన పట్టణం. తొలి తెలుగు పద్యం తరువోజ దొరికింది అక్కడే. ప్రాజ్ఞన్నయ యుగంలోని శాసనసాహిత్యం అధికభాగం దొరికింది గుండ్లకమ్మ తీరానే. పధ్నాలుగో శతాబ్దంలో ఎర్రాప్రగడ భారతంలో శేష భాగం పూర్తిచెయ్యడమే కాక, నృసింహపురాణం, హరివంశ ప్రబంధాలను రాసింది కూడా అక్కడే.
 
ఇంతకుముందు అద్దంకి వెళ్ళినప్పుడు ఎర్రాప్రగడ గురించి రాస్తూ, ఆయన కవిత్వంలోనే మొదటిసారిగా తెలుగు గ్రామసీమలు, పంటపొలాలు, వాగులు, వంకలు, తాటితోపులు, గొల్లపల్లెలు కనిపించడం మొదలయ్యిందని రాసాను. తర్వాత రోజుల్లో పోతన్నలో కనిపించే తెలుగు మందార మకరందాలు ఎర్రనతోటనుంచి తీసుకువెళ్ళి పాదుకట్టిపోషించినవే. ఈ పద్యాలు చూడండి:
 
నునుపగు పచ్చఁబట్టునఁ గనుంగొన నొప్పుగ దిండుగట్టి నూ
తనమగు బర్హిబర్హ దృఢదామము నెట్టెము సుట్టి కమ్రకా
నన తరుపుష్పమాలికఁ దనర్చు నురస్థలి నుద్ధరించి యిం
పొనరఁగ వేణునాద సరసోత్సుకుఁడై హరి యొప్పె నెల్లెడన్ (6:182)
 
(నున్నని పట్టు వస్త్రాన్ని అందంగా కాసెపోసి కట్టుకున్నాడు. కొత్త నెమలిపింఛాలతో గట్టిదండకూర్చి తలపాగాలాగా చుట్టుకున్నాడు. చక్కటి అడవిపూలతో అల్లిన దండ తన వక్షఃసీమమీద ధరించాడు. అప్పుడు సునాదమధురమైన వేణునాదంతో సరసోత్సుకుడిగా హరి అక్కడ విరాజిల్లుతున్నాడు)
 
లలితాలోకములన్ మనోజ్ఞ మధురాలాపంబులన్ విస్ఫుర
త్కల హాసంబుల బంధుర స్తనభరోత్థానాంగ సంగంబులన్
విలసద్వక్త్ర సరూరుహార్పణములన్, స్నిగ్ధోరు సంవేష్టనం
బులఁబూజించిరి గోపభామలు జగత్పూజార్హు దాశార్హునిన్ (8:19)
 
(సున్నితమైన చూపులతో, మనసులోంచి పలికే మాటలతో, వెలుగులు విరజిమ్మే నవ్వులతో, దిట్టమైన చనుకట్లతో అక్కునచేర్చుకుంటున్న కౌగిలింతలతో, శోభిల్లుతున్న తమ ముఖపద్మసమర్పణతో, ప్రేమైక చిత్తంతో పెనవేచుకుంటూ ఆ గోపభామలు సకలలోకం పూజించదగ్గ ఆ కృష్ణుణ్ణి పూజించారు)
 
ఇటువంటి భాష ఒక రసద్రవ్యం. ఒక కాలం, ఒక సమాజం ఎంతో శాంతిచిత్తంగా, రసోత్సుకంగా జీవిస్తే తప్ప వారి భాష ఇటువంటి కలకండ పలుకులుగా crystalize కాదు. అటువంటి అనుభవం ఉండటం ఒకటి, ఆ అనుభవాన్ని మనసులో సంభావించగల ఊహాశాలీనత ఉండటం మరొకటి. తాను జీవిస్తున్న జీవితం ఆధారంగా, తనకు లభిస్తున్న జీవనమకరందం ఆధారంగా కవి తన జీవనపుష్ప మహత్వాన్ని మనసారా సంభావిస్తో ఉంటే తప్ప ఇటువంటి మాటలు పుట్టవు. హరివంశంలోనే ఒకచోట, కృష్ణమహిమ వర్ణిస్తున్న వైశంపాయనుడితో జనమేజయుడు ఇలా అంటున్నాడు:
 
గోపాలత్వముఁబొంది యవ్విధమునన్ గోవిందుఁడున్నట్టి స
ద్వ్యాపారంబుల సెప్పఁగా శ్రుతికి నింపై యింత యొప్పారునే
యాపుణ్యాకృతి నాఁటివారలకు నెట్లై యొప్పెనో చూడ్కికిన్
రూపింపన్మదిలోన నిప్పుడును దా రోచిష్ణువై చెందెడున్ ( 6:175)
 
(గోవిందుడు అలా గోపాలకత్వం పొంది చేసిన మంచిమంచి పనులన్నీ నువ్వు చెప్తుంటే వినడానికే ఇంత సంతోషంగా ఉందా! మరి అటువంటప్పుడు, ఆ పుణ్యమూర్తి ఆ కాలంవాళ్ళకి ఎలా కనిపించి ఉంటాడో! అది మనసులో ఊహించుకుంటూ ఉంటే, ఇప్పుడు కూడా ఒక వెలుగు వెలుగుతున్నాడు)
ఆ రోచిష్ణుత- అది శ్రీకృష్ణుడనే పేరుమీద ఎర్రన సంభావిస్తున్న జీవనరోచిష్ణుత. అది పాకనాటిసీమ పల్లెటూళ్ళు వెలిగిన ఒక వెలుగు. అద్దంకిలో సన్మానం అనగానే నాకు ఆ రోచిష్ణుతనే కళ్ళముందు కదలాడింది.
 
పుట్టం రాజుగారు ప్రధానోపాధ్యాయుడిగా పదవీవిరమణ చేసారు. వారి తండ్రి కూడా ఉపాధ్యాయులే. ఆయన తన తల్లిదండ్రులమీద ఏర్పాటు చేసిన ఒక స్మారక పురస్కారాన్ని కూడా ఆ రోజు నాకు అందించారు. ఆ సభలో ప్రకాశం జిల్లావిద్యాశాఖాధికారి, గొప్ప వక్త, వ్యక్తిత్వవికాసవాది విజయభాస్కర్, మిత్రుడు, పాఠ్యపుస్తకశాఖ సంచాలకుడు, సాహిత్యాన్నీ, చరిత్రనీ అభిమానించే రవీంద్రనాథ రెడ్డి కూడా ఉండటం నాకెంతో సంతోషాన్ని కలిగించింది.
 
వైదుష్యంలోనూ, రసజ్ఞతలోనూ అద్దంకి ఇంకా తన వారసత్వాన్ని కొనసాగించుకుంటోందని చెప్పడానికి సాక్షులు జ్యోతి చంద్రమౌళిగారు ఒకరు. ఆయన చరిత్రపరిశోధకుడు, అద్దంకి చరిత్ర రాసినవాడు. గాథాసప్తశతినుంచి సుమారు నూరుపద్యాలకు పైగా చక్కటి పద్యాల్లోకి తీసుకువచ్చిన డి.వి.ఎం.సత్యనారాయణగారు మరొకరు. తెలుగులో బౌద్ధ సాహిత్యం పైన, ప్రకాశం జిల్లా జానపదగేయాలపైన, దళిత సాహిత్యం పైన గొప్ప వ్యాసాలు అందించిన దేవపాలన మరొకరు. ‘ఆకుపచ్చ నేల కోసం’ అనే తన నవలతో ఈ మధ్య సుప్రసిద్ధురాలైన కుందుర్తి స్వరాజ్యపద్మజ వారి శ్రీవారితో కలిసి ఆ సభలో పాల్గొనడం మరొక సంతోషం. ఇంకా చాలామంది ఉన్నారు సాహిత్యాభిమానులు, వారందరికీ పేరుపేరునా నమస్సులు.
 
1-9-2022

Leave a Reply

%d bloggers like this: