ఆ సినిమానే సాక్ష్యం

Reading Time: 2 minutes

నాలుగు రోజుల కిందట విజయవాడ నుంచి హైదరాబాదు వస్తూ గరుడ బస్సు ఎక్కాను. మామూలుగా నేను ఎక్కేది నాన్ ఏ-సి సూపర్ డీలక్సు. ఆ రోజు అర్జంటుగా దొరికింది ఆ బస్సే కావడంతో ఎక్కేసాను. తీరా ఎక్కాక, బస్సు బయల్దేరగానే, పైన ఉండే డబ్బాలో సినిమా మొదలయ్యింది. అప్పటికే టైటిల్సు అయిపోయినట్టున్నాయి అది ఏ సినిమానో తెలియలేదు. చాలా సేపటిదాకా అది కొత్త సినిమానో, పాత సినిమానో కూడా తెలియలేదు. మొత్తానికి అది బంగార్రాజు అనే సినిమా అని, ఈ ఏడాదే విడుదల అయ్యిందనీ తెలుసుకోగలిగాను. ఒక రాత్రి వేళ బస్సువాడు కర్టెన్లు సర్ది, ఆ డబ్బా కట్టేసేదాకా నేను లోనయిన చిత్రహింస మాటల్లో చెప్పలేనిది. ఒక సినిమా అంత వల్గర్ గా ఉండవచ్చునని నేనిప్పటిదాకా ఊహించలేదు. ఒక జాతిగా తెలుగువాళ్ళు ఎంత వల్గాతివల్గరుగా తయారయ్యారో ఆ సినిమానే సాక్ష్యం.

తెలుగు సినిమా చూడకూడదనుకుంటాను, కాని ఇదిగో ఇలా చూడవలసి వస్తుంది. చూసాక తెలుగు సినిమా గురించి ఏమీ రాయకూడదనుకుంటాను. ఎందుకంటే, ఏమి రాసినా, ఒక స్నేహాన్నో, ఒక పరిచయాన్నో పోగొట్టుకోవలసి వస్తుంది.

ఒక రచయిత ఉన్నాడు. ఇరవయ్యేళ్ళ కిందట, ఆ రచయిత యువకుడిగా ఉన్నప్పుడు, అద్భుతమైన కథలు రాసాడు. కాని ఆ కథల్ని ఎవరూ మెచ్చుకోవడం లేదనీ, ప్రచురించటానికి ఎవరూ ముందుకు రావడంలేదనీ ఒకరోజు నాతో వాపోయాడు. నేను ఆ కథలకి సవివరంగా ఒక పరిచయ వ్యాసం రాసాను. నాకు తెలిసిన ఒక ప్రచురణకర్తకి ఆ కథల విషయం చెప్తే ఆయన ఆ కథల్తో పాటు అతడిది మరో పుస్తకం కూడా ప్రచురించాడు. మా స్నేహం ఇరవయ్యేళ్ళ అనుబంధం. అటువంటిది మొన్న ఒక రోజున ఒక అభూతకల్పన లాంటి తెలుగు సినిమాని నేను విమర్శించానని అతడు నా మీద విరుచుకుపడ్డాడు. తెలుగు సినిమా అంటే మీకు కడుపుమంట అన్నాడు. సినిమావాళ్ళంటే మీకు ఎక్కడలేని బాధ వస్తోందన్నాడు. అతడు నన్ను విమర్శిస్తే బాధపడకపోదునుకాని, దూషణ కూడా మొదలుపెట్టాడు. ఆలోచించాను, ఇరవయ్యేళ్ళ స్నేహాన్ని కూడా మరిపించేటంతగా నా మాటలు అతణ్ణి ఎందుకు బాధించేయా అని. ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. బహుశా, నా వ్యాసం మీద తాను రాసిన రాతలు ఎలాగేనా, ఎవరేనా, ఆ దర్శకుడికి తీసుకువెళ్ళి చూపిస్తారేమో, దాంతో ఆ దర్శకుడు తనకి కూడా తన రాబోయే సినిమాల్లో ఏదో ఒక చిన్న పాటి అవకాశం ఇవ్వకపోతాడా అన్న ఉద్దేశ్యం ఉండి ఉండవచ్చు.

తెలుగు సినిమా చాలామందికి ఒక మంత్రలోకం. ఆ రంగంలో చేరితే రాత్రికి రాత్రే సెలబ్రిటీ కాగలమన్న ఒక ఊహాగానం. ఒక్క హిట్టు కొడితే తన జీవితం రాత్రికి రాత్రే మారిపోతుందన్న ఒక అమాయికమైన కల. కాని ఏమి చేస్తే ఒక సినిమా హిట్టు కాగలదో ఇప్పటికీ, ఏ ఒక్క దర్శకుడికీ తెలిసినట్టు లేదు. అందుకే వాళ్ళు ఇట్లాంటి సినిమాలు తీస్తున్నారు.

కాని ఒక జాతి తన సున్నితత్వాన్ని కోల్పోడంకన్నా విషాదం మరొకటి ఉండదు. జాతి అభిరుచికి సున్నితత్వాన్నీ, సౌకుమార్యాన్నీ ప్రోది చేసేవి కళలే అనుకుంటే, అందులోనూ, ప్రస్తుతం సినిమా ఒక్కటే మన ఏకైక కళారూపం అనుకుంటే, ఈ బండతనం, ఈ వెకిలితనం, ఈ నిర్లజ్జతనం మన జీవితంలోంచి సినిమాలోకి ప్రవేశిస్తున్నాయా లేక సినిమాలోంచి మన జీవితాల్లోకి అడుగుపెడుతున్నాయా అర్థం కావడం లేదు.

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హింస, సెక్సు ప్రధానంగా ఉండేవి. కాని జియో విప్లవం వల్ల ఈ రోజు గ్రామగ్రామానా పొర్నొగ్రఫీ అందుబాటులోకి వచ్చేసిన తర్వాత, సెక్సు కూడా ప్రజల్ని ఆకర్షించడం మానేసింది. హింస అంటే స్టంట్లు అనుకుంటే అవి కూడా, ఎప్పటికప్పుడు ఎంతో వైవిధ్యభరితంగా తియ్యకపోతే తప్ప వాటిని చూడటంలో కూడా ప్రజలకి ఆసక్తి ఉండటం లేదు. మరి వాళ్ళ ఆసక్తిని ఎట్లా రగిలించడం? ఇప్పటి దర్శకుల వెతుకులాట అదే. అందుకనే బంగార్రాజు లాంటి సినిమాలు పుట్టుకొస్తున్నాయి.

ఒక జాతి వస్తుపరంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు, సంపద పోగుచేసుకుంటున్నప్పుడు, అభిరుచి పరంగా పతనం చెందటం చరిత్రలో ఇదే మొదటిసారి కాదు. ఒకప్పుడు గ్రీకు సంస్కృతి వర్ధిల్లినప్పుడు వాళ్ళ కవిత్వంలో, నాటకాల్లో, చిత్రలేఖనంలో,శిల్పంలో, సంగీతంలో అత్యున్నతమైన అభిరుచి వికసించింది. కాని రోమన్ నాగరికత మొదలయ్యాక, రోమన్లు దాదాపుగా యూరోపు అంతా విస్తరించాక, వాళ్ళు భౌతికంగా సాధించిన అభివృద్ధి అపారం. వాళ్ళు రోడ్లు నిర్మించారు, ఆక్విడెక్టులు నిర్మించారు, సైన్యాన్ని నిర్మించారు, ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారు. కాని ఒక సోక్రటీసుని, ఒక ప్లేటోని మాత్రం సృష్టించుకోలేకపోయారు. వారు బయటి ప్రపంచంలో అభ్యున్నతి సాధించేకొద్దీ వారి ఆంతర్లోకంలో దివాలా తీస్తూనే వచ్చారు. చివరికి గ్లాడియేటింగ్ తప్ప మరేదీ వారిని రంజింపచెయ్యలేని స్థితికి చేరుకున్నారు.

గ్లాడియేటింగ్ అంటే, ఇద్దరు కైదీల్ని, ప్రజలు చూసేటట్టుగా, బహిరంగంగా పోరాడుకోడానికి విడిచి పెడతారు. అందులో ఒక కైదీ మరొక కైదీని చంపెయ్యాల్సి ఉంటుంది. అలా చంపగలిగితేనే ఆ గెలిచినవాణ్ణి వదిలిపెడతారు. కొన్నాళ్ళకి ఆ దారుణక్రీడ కూడా ఆ రోమన్లని సంతృప్తి పరచడం మానేసిందనీ, ప్రజలు గ్లాడియేటింగ్ మరింత ఆసక్తికరంగా ఉండాలని గోల చెయ్యడం మొదలుపెట్టారనీ ఎడిత్ హామిల్టన్ తన The Roman Way (1986) లో వివరిస్తుంది.

మనం సరిగ్గా ఈ దారిలోనే ఉన్నాం.

17-8-2022

Leave a Reply

%d bloggers like this: