
తెలుగులో పద్య సంకలనాలు ఉన్నట్లుగా గద్య సంకలనాలు చాలా తక్కువ. తెలుగు కవిత్వాన్ని ‘కావ్యమాల’ (1959) పేరిట సాహిత్య అకాదెమీ కోసం కాటూరి వెంకటేశ్వర రావుగారు ఒక సంకలనం తీసుకొచ్చారు. అయితే అందులో కవుల ఎంపిక, పద్యాల ఎంపిక మొత్తం మల్లంపల్లి శరభయ్యగారే చేసారు.
అటువంటి విశిష్ట సంకలనం మరొకటి ఆంధ్ర గద్య చంద్రిక (1966). నన్నయనుండి చిన్నయసూరిదాకా ప్రాచీన సాహిత్యంలో తెలుగు గద్యం ఏ విధంగా పరిణామం చెందిందో తెలియచెప్పే అపురూపమైన సంకలనం ఇది. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాదెమీ కోసం విశ్వనాథ సత్యనారాయణగారు చేపట్టిన ఈ సంకలనం కూడా దాదాపుగా శరభయ్యగారు చేసిన సంకలనమే.
ఇటువంటి ఒక సంకలనం వచ్చిందనే తెలుగులో చాలామందికి, పండితులకే తెలియదు. ఇటువంటి ఒక పుస్తకం వచ్చిందని తెలిసిన తరువాత కూడా ఈ పుస్తకాన్ని కళ్ళతో చూడటానికి నాకు ఇరవయ్యేళ్ళు పట్టింది.
ఈ సంకలనం ఆరుభాగాలుగా విభజించి ఉంది. మొదటిభాగం నన్నయభట్టు, ఎర్రన పూరించిన అరణ్యపర్వ శేషం నుండి ఎంపిక చేసిన గద్యాలు. ఆ విభాగానికి విశ్వనాథ తానే ఒక పీఠిక రాసారు. తక్కిన అయిదు విభాగాలకి, ఆయన, శరభయ్యగారు, చెరుకుపల్లి జమదగ్ని శర్మగారు, ‘స్ఫూర్తిశ్రీ’ భాస్కరరావుగారు కలిసి రాసారుగాని,విశ్వనాథ మాటల్లో నే పీఠికలు ఉన్నాయి. చాలావరకూ ఆ పీఠికలమీద కూడా విశ్వనాథ ముద్ర కనిపిస్తుంది.
రెండవ విభాగంలో తిక్కన, ప్రబంధకవుల కావ్యాలనుంచి ఎంపికచేసిన గద్యం. మూడవసంపుటి వచనపురాణాలు, పారాయణ గద్యాలు. నాలుగవ సంపుటి తెలుగు వచనములు, అంటే వేంకటేశ్వర వచనములు వంటివి, కథలు, యక్షగానాలు. అయిదవ సంపుటి కైఫీయతులు,యాత్రాచరిత్రలు. ఆరవసంపుటి తొలి తెలుగు పత్రికలు, లేఖలు, పెద్దబాలశిక్ష, చిన్నయసూరి నీతిచంద్రికలనుండి ఎంపిక చేసిన రచనలు.
ఆధునిక తెలుగు వచనం తాలూకు మూలాలు మనకి నాలుగవ సంపుటినుండీ మనకి కనిపించడం మొదలుపెడతాయి. మొత్తం సంకలనం ఆద్యంతం చూసినప్పుడు తెలుగు వచనవికాసం, పద్యఛందస్సునుంచీ, లయనుంచీ, పద్యగంధి పరిమితులనుంచీ, breathlessness నుంచీ నెమ్మదిగా ఆధునిక తెలుగు వచనం విడివడటానికి ఎటువంటి పోరాటం చేసిందో, మరీ ముఖ్యంగా పద్ధెనిమిది, పందొమ్మిది శతాబ్దాల్లో, ప్రింటిగు ప్రెస్సు, ఆధునిక విద్య, ఉమ్మడి పాఠ్యపుస్తకాలు వచ్చిన తరువాత, తెలుగు వచనం ఒక ప్రత్యేకశాఖగా ఎలా రూపొందుతూ వచ్చిందో చూస్తాం.
ఇంత విలువైన సంకలనం గురించిగాని, దీని గుణదోష విశ్ళేషణ గాని నేను ఎక్కడా చూడలేదు. దీనికి కొనసాగింపుగా, చిన్నయసూరి నుంచి సమకాలిక తెలుగు వచనం దాకా మరొక సంకలనం తేవాలన్న అలోచన కూడా ఎవరికీ వచ్చినట్టు లేదు.
ఈ సంకలనం పట్ల నాకున్న చిన్నపాటి అసంతృప్తి ఇందులో నన్నయకు పూర్వం శాసనాల్లోని గద్యం నుంచి కూడా కనీసం రెండు పుటలేనా ఒక విభాగం ఉండి ఉంటే బాగుండు అన్నదే. వివిధ విభాగాలకు రాసిన పీఠికల్లో సంకలనకర్తలు ప్రకటించిన చాలా అభిప్రాయాలతో మనం అంగీకరించలేకపోవచ్చు, కాని వచన వికాసాన్ని ఎలా పరిశీలించాలో వారొక పద్ధతినేర్పారని మాత్రం ఒప్పుకోక తప్పదు. ఈ సంకలనానికి గిడుగు రామ్మూర్తిగారు సంకలనం చేసిన ‘గద్యచింతామణి’ ని కూడా కలుపుకుంటే వెయ్యేళ్ళ తెలుగు గద్య వికాసం పైన సమగ్రమైన అవగాహన కలుగుతుంది.
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ పుస్తకాన్ని ఇక్కడ మిత్రులతో పంచుకుంటున్నాను.
29-8-2022
గురూజీ పై లింకు మరలా పంపండి ఓపెన్ కావడం లేదు