అభినందనలు

75 ఏళ్ళు.

భారతదేశం రాజకీయస్వాతంత్య్రాన్ని సాధించి డెబ్బై అయిదేళ్ళు. ఈ దేశ చరిత్రలో ఇంత దేశం రాజకీయంగా ఇలా ఒక గొడుగు కిందకి వచ్చి ఇన్నేళ్ళ పాటు నిలబడ్డ కాలం ఇదే. ఈ క్షణాల్లో నేను జీవించి ఉన్నందుకు గర్విస్తున్నాను.

1972 లో స్వాతంత్య్ర రజతోత్సవాలు జరుపుకున్నప్పుడు, 1997 లో స్వర్ణోత్సవాలు జరుపుకున్నప్పుడు కూడా నేను జీవించిఉండటం నా భాగ్యంగా భావిస్తున్నాను. భగవంతుడి కృప ఉంటే, 2047 లో కూడా నేను జీవించి ఉండాలనీ, స్వాతంత్య్ర శతసంవత్సరవేడుకలు కళ్ళారా చూడాలని కూడా కోరుకుంటున్నాను.

భారతదేశ స్వాతంత్య్రపోరాటం, జాతీయోద్యమం భారతదేశ చరిత్రలో అద్భుతమైన ఘట్టాలు. అప్పటిదాకా సాంస్కృతికంగా మాత్రమే ఉనికిలో ఉంటున్న భారతదేశమనే భావనకి అవి ఒక రాజకీయ స్వరూపాన్నిచ్చాయి. మొదటిసారిగా కులాల్ని, మతాల్ని, భాషల్ని, ప్రాంతాల్ని, అలవాట్లని దాటిన ఒక ఏకతాభావన దేశాన్ని ముంచెత్తింది. భారతజాతి ఆవిర్భవించింది.

స్వాంతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా ఈ ఏడాదిగా స్వాతంత్య్రవీరుల్ని తలచుకుంటూ ఉన్నాం. ఇంతదాకా విస్మృతి పొర కప్పేసిన ఎందరో మహనీయ స్వాతంత్య్రవీరులు మళ్ళా వెలుగులోకి రావడం మొదలయ్యింది. వారి బలిదానాల గురించి మనం తెలుసుకున్నాం. మన పిల్లలకి చెప్పాం. పాఠశాలల్లో, పత్రికల్లో, ప్రజావేదికలమీద ఏ చిన్న అవకాశం దొరికినా స్వాతంత్య్రఫలాల గురించి మనకి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఆ వారసత్వానికి అర్హులం కావాలనీ, ఆ ఆత్మత్యాగాల కానుకను ప్రాణప్రదంగా నిలబెట్టుకోవాలనీ మనకి మనం వాగ్దానం చేసుకుంటూనే ఉన్నాం.

నేననుకుంటాను, ఈ క్షణాన స్వాతంత్య్రపోరాట గాథని స్మరించుకోవడం ఎంత అవసరమో, ఈ డెబ్బై అయిదేళ్ళుగా, ఆ స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకున్న వైనాన్ని స్మరించుకోవడం కూడా అంతే ముఖ్యం. అసలు అన్నిటికన్నా ముందు, మనం ఒక ప్రజాస్వామ్యంగా, అత్యంత విశాల ప్రజాస్వామ్యంగా మనుగడ సాగించడమే ఒక మహత్తర విజయం. ఇది మామూలు విజయం కాదు. గత శతాబ్దంలో భారతదేశంతో పాటు వలసపాలననుండి విడుదల పొందిన ఎన్నో ఆసియా, ఆఫ్రికా దేశాల చరిత్రతో పోల్చినట్టయితే ఒక దేశంగా మనం రాజకీయంగా చూపించగలిగిన ఈ పరిణతి ఎంత విలువైనదో మనకి అర్థమవుతుంది.

ఈ డెబ్బై అయిదేళ్ళుగా ఈ దేశాన్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా స్వతంత్రంగా నిలబెట్టడంకోసం అహర్నిశం పోరాడిన స్వాతంత్య్రయోధులు ఎంత మందో ఉన్నారు. సస్యవిప్లవం, క్షీర విప్లవం, విద్యావిప్లవం, వైద్య ఆరోగ్య విప్లవం, వైజ్ఞానిక, సాంకేతిక విప్లవాల్ని సుసాధ్యం చేసిన శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, కర్షకులు, కార్మికులు, సైనికులు -వారంతా స్వాతంత్య్రవీరులే. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరులకు వారు ఏ మాత్రం తక్కువ కారు. అటువంటి వారి గురించి కూడా మనం తలుచుకోవలసి ఉంటుంది. అధ్యయనం చేయవలసి ఉంటుంది. దేశపాలకులు నియంతృత్వ పోకడలు మొదలుపెట్టబోతున్న ప్రతిసారీ, లేదా అవినీతిలో కూరుకుపోతున్నారన్న సూచనలు కనిపించిన ప్రతిసారీ ఈ దేశ మానసాన్ని ప్రక్షాళనం చేసిన స్వార్థత్యాగులు, గాంధేయవాదులు కూడా ఎందరో ఉన్నారు. వారందరూ ప్రతి రోజూ ప్రాతఃస్మరణీయులే.

ఈ డెబ్బై అయిదేళ్ళ చరిత్రలో కనీసం యాభై ఏళ్ళు నాకు స్పృహలో ఉంది. గత మూడున్నర దశాబ్దాలుగా, ఈ దేశ సామాజిక ప్రగతిలో నేను కూడా నా వంతు పాత్ర నిర్వహించాను. స్వాతంత్రోద్యమవీరులు ఏ ఆశయాలకోసం జీవించారో, మరణించారో ఆ స్ఫూర్తిని సదా నాలో నిలుపుకుంటూనే ఉన్నాను. నేనే కాదు, మీరు కూడా, మనలో ప్రతి ఒక్కరూ. మనలో ఒక స్వాతంత్య్రేచ్ఛ బలంగా ఉన్నందువల్లనే, ఆ ఆశయ స్ఫూర్తి మనలో సజీవంగా ఉన్నందువల్లనే మనం ఈ రోజుని మన జీవితాల్లో ఒక ప్రత్యేకమైన రోజుగా భావిస్తున్నాం. ఈ దేశం ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి కావాలనీ, హింసతో నిమిత్తం లేకుండా సమానతను సాధించగలగాలనీ, ద్వేషపూరితమైన నేటికాలంలో నిజమైన శాంతిఖండంగా విలసిల్లాలనీ మనం కోరుకుంటున్నాం. ఆ కోరిక చాలు. మనల్ని ముందుకు నడిపించడానికి.

మనందరికీ మనలో ప్రతి ఒక్కరికీ పేరుపేరునా మనం ఈ చారిత్రిక శుభోదయాన మనఃపూర్వకంగా

అభినందనలు చెప్పుకుందాం. ఒకరొకరి చేతులు కలిసి పట్టుకుందాం. కలిసి నిలబడదాం, కలిసి నడుద్దాం. దేశమనియెడు దొడ్డవృక్షము ప్రేమలను పూలెత్తవలెనోయ్ అని కలిసి పాడుకుందాం.

జై హింద్!

15-8-2022

Leave a Reply

%d bloggers like this: