
సల్మాన్ రూష్దీ పైన జరిగిన హత్యాప్రయత్నం అత్యంత దురదృష్టకరం. ఒకవైపు సాంకేతిక పరిజ్ఞానం వల్ల సరిహద్దులు చెరిగిపోతూ దిక్కులు మరింత దగ్గరగా జరుగుతున్న ప్రపంచం భావోద్వేగాల పరంగా మధ్యయుగాల్లోకి ప్రయాణిస్తుండటం నిజంగా విచారకరం. అందులోనూ మతాధికారీ, రాజకీయనాయకుడూ, ఉగ్రవాదీ కానీ ఒక వ్యక్తిని, నిరాయుధుణ్ణి ఒక సాహిత్యసభలో ఒక ఉన్మాది హత్యచెయ్యాలనుకోవడం ఈ ప్రపంచ భద్రత పట్ల, భవిష్యత్తు పట్ల అపారమైన ఆందోళనని కలగచేస్తున్నది.
రూష్దీ పేరు, ఆ పేరు చుట్టూ అల్లుకున్న వివాదాల గురించి గత మూడు దశాబ్దాలకు పైబడి వింటూ ఉన్నాను. ఆయన రాసిన రచనల్లో సుప్రసిద్ధమైన మిడ్ నైట్స్ చిల్డ్రన్, మరొక కథా సంపుటి కొనుక్కున్నాను. కాని రెండు పుస్తకాలూ చదవలేకపోయాను. మిడ్ నైట్స్ చిల్డ్రన్ కొన్ని పేజీల తరువాత ముందుకు సాగలేదు. అతణ్ణి వివాదాల్లోకి లాగిన శాటానిక్ వర్సెస్ ఎలానూ దొరకలేదు. కాబట్టి ఒక రచయితగా రూష్దీ పట్ల నేనొక అభిప్రాయాన్ని ఏర్పరచుకోలేకపోయాను, ఆ మధ్య ఆయన సాహిత్య వ్యాసాలు Languages of Truth, Essays, 2003-2020 (2021) వెలువడిందాకా.
ఆ వ్యాససంపుటిలో రూష్దీ విశ్వరూపం చూసాను. సమకాలిక రచయితల్లోనూ, సాహిత్యవేత్తల్లోనూ అతడు చాలా పొడగరి అని అర్థమయింది. ఆ వ్యాసాల్లో అతడు ఎంతో సూక్ష్మదృష్టితో, వివేచనతో, సంతులిత భావోద్వేగాల్తో కనిపించాడు. ఈ రచయిత మీదనా ఇంత గొడవ చేస్తున్నది, ఇతడి ప్రాణాల మీదనా ఫత్వా విధించింది అని ఆశ్చర్యపోయాను. ఆ వ్యాసాల్లో సాహిత్యం మీద మాత్రమే కాక, చిత్రకళమీదా, చిత్రకారులమీద కూడా అతడు ఎంతో అద్భుతమైన పరిచయాలు, సమీక్షలు రాసి ఉన్నాడు. నాకు తెలిసి సమకాలిక భారతీయ రచయితల్లో ఈ రెండు రంగాల్లోనూ కూడా ఇంత సాధికారికంగా రాయగలిగినవాళ్ళు, వేళ్ళమీద లెక్కపెట్టగలిగినవాళ్ళు కూడా లేరు.
ఆ వ్యాసాల్లో Another Writer’s Beginning అనే వ్యాసంలో అతడు తన సాహిత్య ప్రయాణం గురించి కొంత చెప్పుకున్నాడు. Joseph Anton అనే ఒక స్మృతిరచనలో అతడు తన గురించి రాసుకున్నదానికి ఇది అదనం. అందులో అతడు తనొక రచయిత కావడానికి, తన సొంత గొంతు తాను వెతుక్కోడానికి ఎంతగా నలుగులాట పడ్డాడో అదంతా చాలా వివరంగా, విశ్వసనీయంగా రాసుకొచ్చాడు. చివరికి ఇలా రాస్తున్నాడు:
‘”మిడ్ నైట్స్ చిల్డ్రన్ రాయడానికి నాకు అయిదేళ్ళు పట్టింది. ఎందుకంటే ఆ నవల రాస్తున్నంతసేపూ ఆ నవల ఎలా రాయాలో నాకు నేను బోధపరుచుకుంటూనే ఉన్నాను. రెండు శతాబ్దాల కాలానికి చెందిన స్వంత్రభారతదేశపు తొలిపౌరుల తరంలో నేను కూడా ఒకణ్ణి. మాలో స్వాతంత్య్రస్ఫూర్తితో పాటు, ఆ స్వాతంత్య్రభానూదయవేళ ముస్లిములు, హిందువులు ఒకరినొకరు ఊచకోత కోసుకున్న ఆ నరమేధం, ఆ రక్తపాతం కూడా మాకు గుర్తే. ఆ జ్ఞాపకాలు మేమింకా మోసుకు తిరుగుతూనే ఉన్నాం. అటువంటి పరివర్తన యుగాలకీ, దశలకీ చెందిన తరాలు నిజంగానే ప్రత్యేకమైనవి. అవి పూర్తిగా గతానికీ చెందవు, అలాగని పూర్తిగా భవిష్యత్తుకీ చెందవు. ఆ విలక్షణక్షణాన్ని పొదివిపుచ్చుకోవడం నాకు జన్మతః దక్కిన ఒక వరంగా భావిస్తాను. ఆ పరివర్తన శీల కాలాన్ని అక్షరాల్లోకి అనువదించడమెట్లానో నేర్చుకున్నాను. మన జీవితాల్లోని అత్యంత వైయక్తిక అనుభవాల్ని అత్యంత పౌర జీవితానుభవాలతో అల్లుకుంటూ, ఊరికే మాటలు పోగెయ్యడం కాకుండా, ఆ సన్నివేశాల్ని దృష్టాంతపూర్వకంగా నిరూపిస్తూ, అదే సమయంలో మనల్ని చరిత్ర ఏ విధంగా రూపొందింస్తోదో గమనిస్తూ, ఈ ప్రశ్న కూడా వెయ్యగలగడం నేర్చుకున్నాను: అదేమంటే మనం మన కాలాల్ని నిర్ణయిస్తున్నామా లేక మన కాలమే మన జీవితాల్ని నిర్ణయిస్తున్నదా? మనం చరిత్రను రూపొందిస్తున్నామా లేక భగ్నం చేస్తున్నామా? మనం, కేవలం మన ఇష్టాయిష్టాలతో, కార్యాచరణతో ప్రపంచాన్ని మార్చగలమా? తీర్చిదిద్దుకోగలమా?”
ఈ వాక్యాలు ఎంతో స్పష్టంగా ఉన్నాయి కదా. మరి ఇటువంటి సున్నితమనస్కుడు, భావుకుడు, జీవితప్రేమి అయిన రచయితని ఇలా ద్వేషమూ, మృత్యువూ ఎందుకు వెన్నాడుతున్నాయి?
నిన్న నాకో మిత్రుడు మధు జైన్ అనే ఒక పాత్రికేయురాలు రాసిన వ్యాసం ఒకటి పంపించారు. తన పుస్తకం మీద అనవసరమైన వివాదం చెలరేగడానికి ఇండియా టుడే పత్రికలో మధు జైన్ రాసిన సమీక్షనే కారణమని రూష్దీ భావిస్తూ ఉన్నాడట. అందుకు ఆమెను ఇప్పటిదాకా కూడా క్షమించలేదట. ఆమె తో మాట్లాడటం మానేసాడట. ఆ విషయాలన్నీ చెప్తూ, మధు జైన్ తన సమీక్ష గురించీ, తదనంతర పరిణామాల గురించీ కొంత వివరణాత్మకంగానే రాసింది. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ లింక్ చూడవచ్చు.
కాని ఆ వ్యాసం చదివాక నాకు ఏమి అర్థమయిందంటే, రచయితలకి నిజమైన శత్రువులెవరంటే పుస్తకాలు పూర్తిగా చదవనివాళ్ళు. సగం సగం చదివి, పుస్తకాలమీద తీర్పులు ఇచ్చే పాఠకులు, ఆ పుస్తకాల్ని సెన్సేషనుగా మార్చుకోడానికి ఎంతమాత్రం వెనకాడని పాత్రికేయులు. వాళ్ళు మతోన్మాదుల కన్నా ప్రమాదకరం.
రూష్దీ పుస్తకం మీద వివాదం సంగతినే చూడండి. ఆ సమీక్షకురాలు పుస్తకం ఇంకా పూర్తిగా విడుదల కాకుండానే మొదటి ప్రూఫుని పట్టుకుని సమీక్ష రాసింది. ఆ సంపాదకుడు పుస్తకంలోంచి సందర్భంతో నిమిత్తం లేకుండా, కొన్ని వాక్యాల్ని ఒక వర్గం వారి భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా, రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో అర్జంటుగా ప్రచురించాడు. మొదట్లో బ్యురోక్రేటుగా పనిచేసి ఆ తర్వాత రాజకీయనాయకుడుగా మారిన ఒక పెద్దమనిషి (ఆ పుస్తకమింకా బయటికి రాకుండానే, తాను చదవకుండానే) ఆ పుస్తకాన్ని నిషేధించాలని పిలుపునిచ్చాడు. ఆ పిలుపు మీద కరాచీలో అల్లర్లు, కాల్పులు జరిగాయి. అమాయికులు మరణించారు. అది టివిలో చూసి ఆయతొల్లా ఖొమేనీ రచయితమీద ఫత్వా జారీచేసాడు. ఈ మొత్తం సంఘటన క్రమం దీనికిదే ఒక హార్రర్ ఫిల్మ్ గా ఉంది కదూ! ఆశ్చర్యంలేదు. పుస్తకం పట్లా, స్త్రీ పట్లా మనుషులు చాలా తొందరగా తమ లేకితనాన్ని చాటుకుంటారు అన్నాడు భవభూతి కనీసం వెయ్యేళ్ళ కిందట.
రూష్దీ మీద గత మూడు దశాబ్దాలుగా నేను చదువుతూ వస్తున్నదంతా ఒక రొడ్డకొట్టుడు వివాదం. దానిలో రెండు శిబిరాలున్నాయి. ఒకరు పాశ్చాత్య ఉదారవాదులు. వారేమంటారంటే మనిషికి, ముఖ్యంగా రచయితకి తన అభిప్రాయాలు ప్రకటించే స్వేచ్ఛ ఉండాలి. వాటిని ప్రకటించడానికి అతడికి ప్రాణభయం ఉండకూడదు. మరొక శిబిరం ఆసియాఖండానికి చెందిన మతవర్గాలు. వారేమంటారంటే, స్వేచ్ఛ పేరిట, భావ, వాక్స్వాతంత్య్రాల పేరిట అత్యధిక సంఖ్యాకుల విశ్వాసాల్ని భంగపరిచే మాటలు మాట్లాడటానికి ఎవరికీ హక్కులేదు, అది ఎంత గొప్ప రచయిత కానీ అని. ఇది ఇంత తేలిగ్గా తేలే వివాదం కాదు.
కానీ ఒక రచయితగా, సాహిత్యాభిమానిగా, కులమతాలకి అతీతంగా తోటిమనిషిని ప్రేమించాలనుకునేవాడిగా నేనేమంటానంటే ఏ రచయితకైనా నలుగురి సానుభూతి, మద్దతు అవసరం కావడం కన్నా విషాదం మరొకటి ఉండదు. నువ్వు రచయితవి, నువ్వు నలుగురికీ మద్దతుకూడగట్టవలసిన వాడివి, నలుగురికి నీ సహానుభూతి ప్రకటించవలసిన వాడివి. నువ్వు ఒక రచయితగా సాధించవలసింది, చెప్పవలసింది, ప్రచారం చెయ్యవలసింది చాలా ఉంది. కులమతాల అడ్డుగోడలు కూల్చేప్రయత్నాలు మరింత ఓపిగ్గా, మరింత విపులంగా, విస్పష్టంగా చెయ్యవలసిన ప్రయత్నాలు. మన రాసే రచనలు ఎటువంటి అస్పష్టతకీ తావివ్వని విధంగా చెప్పాలి. నీ భావప్రకటనా స్వాతంత్య్రాన్ని నేను గౌరవిస్తాను అని మరొకడు చెప్పవలసిన అవసరం లేకుండా చెప్పాలి. ఒకసారి నీ భావాలు ప్రకటించిన తరువాత ‘నేను అంటున్నది అది కాదు, ఇది’ అంటో ప్రభుత్వాలముందూ, పాఠకులముందూ, న్యాయస్థానాలముందూ, మూర్ఖత్వపు మూకలముందూ సంజాయిషీ చెప్పుకోవలసిన అవసరం పడకూడదు. బహుశా నాకు రూష్దీని కలుసుకునే అవకాశం కలిగిఉంటే ఈ మాటలే చెప్పి ఉండేవాణ్ణి.
అతడి సాహిత్య వ్యాసాలు చదివిన తరువాత అతడినుంచి ఈ ప్రపంచం నిజంగా పొందవలసింది ఎంతో ఉందనీ, అదేమీ ఇంకా పూర్తిగా పొందనే లేదనీ అనిపించింది. కరోనా మహమ్మారి తన పట్టు విదిలించిన తరువాతి ప్రపంచంలో జీవించడానికి మనందరికన్నా ఎక్కువగా ఉత్సాహపడ్డవాడు రూష్దీనే అని Pandemic: A Personal Engagement with Coronavirus అన్న వ్యాసం చదివితే అర్థమవుతుంది. అందులో అతడు I guess I’m immune అని రాసుకున్నాడు. కాని వైరస్ కి మందుకనుక్కున్న సైన్సు ద్వేషానికి ఇంకా కనుక్కోలేకపోయింది.
రూష్ధీ బతకాలి. అతడికి పూర్తి ఆరోగ్యం సిద్ధించాలి. అతడు మళ్ళా రచనలు చెయ్యాలి, ఎందుకంటే అతడే రాసుకున్నట్టుగా the story was his birthright, and nobody could take it away.
14-8-2022