రావిశాస్త్రి

రావిశాస్త్రిగారి శతజయంతి సభలో సన్మానం అందుకోబోతున్న రాచకొండ లక్ష్మీ నర్శింహ ప్రసాద్‌ దంపతులు, ఆత్మీయ అతిథి గోరటి వెంకన్నగారు, ఈనాడు ఈ వేదికని పంచుకుంటున్న అతిథులు విమల గారు, మధురాంతకం నరేంద్రగారు, లక్ష్మీనరసయ్యగారు, వేణుగోపాల్‌ గారు, సుధాకర్‌ గారు, గుడిపాటిగారు, ఖదీర్‌ బాబు గారు, రావిశాస్త్రి పేరిట ఏర్పాటు చేసిన యువపురస్కారాన్ని తొలిసారిగా అందుకుంటున్న కృష్ణజ్యోతిగారు, చంద్రశేఖర్‌ గారు, ఈ సమావేశానికి సూత్రధారులైన కుమార్‌ కూనపరాజు గారు, ప్రకాశ్‌ గారు, వెంకట సిద్ధారెడ్డి గారూ,

మిత్రులారా!

రావిశాస్త్రి గారి రచనాసాగరానికి ముందుమాట రాస్తూ వివినమూర్తి ఆయన్ని మహారచయిత అని పిలిచాడు. బహుశా తెలుగులో ఇటువంటి విశేషణం ఈ ఒక్కరచయితకే దక్కిందేమో. రావిశాస్త్రి తాను చూసిన, మనకు చూపించిన ప్రపంచాన్ని చూపించడానికి తక్కిన భాషా సాహిత్యాల్లో కనీసం ఇద్దరు రచయితలు అవసరమయ్యారు. తనకి స్ఫూర్తి అని రావి శాస్త్రి పదే పదే చెప్పుకున్న డికెన్స్‌, ఆ Dickensian vastness అంతటికీ, ఒక షా వంటి సోషలిస్టు తన కత్తివాదరలాంటి వ్యంగ్యం జోడిస్తేనే ఇంగ్లిషు సాహిత్యం తను చెప్పదలుచుకున్నది మనకి పూర్తిగా చెప్పినట్టనిపిస్తుంది. ఒక మపాసా వంటి మహోద్రేకితో పాటు మోలియర్‌ వ్యంగ్యం జతపడకుండా ఫ్రెంచి సాహిత్యం రూపొందనేలేదు. రష్యన్‌ సాహిత్యానికి చెహోవ్‌ ఒక్కడూ చాలనిచెప్పవచ్చుగాని, గొగోల్‌ ఓవర్‌ కోటు లేకపోతే చెహోవ్‌ లేడు కాబట్టి ఆ ఇద్దరూ కలిస్తేనే రష్యన్‌ సాహిత్యం. అమెరికన్‌ సాహిత్యానికి వచ్చేటప్పటికి ఒక ఓ హెన్రీ శిల్పానికి, ఒక స్టీన్‌బెక్‌ చూసిన దుఃఖానికి, ఒక సింక్లెయిర్‌ వంటి muck-racker కూడా కలిస్తే తప్ప అమెరికన్‌ సాహిత్యం తన ధర్మాన్ని పూర్తిగా నెరవేర్చలేకపోయింది. కాని తెలుగులో ఒక్క రావిశాస్త్రి చాలు, తెలుగు సాహిత్యం గురించి మరొక పరిచయం అక్కర్లేదు. ఆ మాట గురజాడ అప్పారావు గురించి కూడా అనవచ్చు కదా అనవచ్చు మీరు. కాని, గురజాడలో లేని రాజధిక్కారం రావిశాస్త్రిలో కనబడటమే, రావిశాస్త్రి అదనపు అర్హత.

రావిశాస్త్రి ఒక్క తెలుగువాళ్ళు మాత్రమే చదువుకుంటూ ఉండిపోవలసిన రచయిత కాడు. ఈ మధ్య బుకర్‌ బహుమతి పొందిన The Tomb of Sand చదివినప్పుడు, అరె ఇది మనకి బాగా తెలిసిన శిల్పమే కదా అనిపించింది. ఆమె బహుశా ఆ శిల్పాన్ని క్లారిస్‌ లిస్పెక్టర్‌ లాంటి రచయిత్రులనుంచి గ్రహించి ఉండవచ్చు. కాని దాదాపుగా రావిశాస్త్రి శైలి. శాస్త్రిగారి మాటల్లో చెప్పాలంటే ‘చెప్పి చూపించడం’.

రావిశాస్త్రిగారి కథనం ఒక hermeneutics of social reality. ఒక వ్యాఖ్యాన శైలి. నన్నడిగితే దాన్ని poetic realism అంటాను. శాస్త్రి గారు కవి. ఆయన రచలన్నిటిలోనూ ఒక ఆకుపచ్చని పార్శ్వం మనకి కనిపిస్తుంది. అది ఆయన హృదయంలో దాచిపెట్టుకున్న పరదైసు. దాన్ని చూపించడం కోసమే అంత సాహిత్యం సృష్టించాడు. కాని ఆ స్వర్గాన్ని మనకి చూపించడం కోసం ఆయన వైతరణి గట్టులమ్మటంతటా మనల్నినడిపిస్తాడు.

శాస్త్రి గారిని సంస్మరిస్తూ ఈ మధ్య చాలా చోట్ల చాలా సభలు జరుగుతున్నాయి. కాని వాటికి లేని విశిష్టత ఈ సభకి ఉంది. అదేమంటే, ఇక్కడ ఈ రోజు శాస్త్రిగారి గురించి మాట్లాడటానికి వచ్చినవారంతా ఆయన సాహిత్యవారసులు. ఆయన ఏ దారిలో నడిచాడో ఆ దారినే మరింత ముందుకు తీసుకుపోతున్నవాళ్ళు. ఇటువంటి వక్తలతో ఒక గంట, రెండు గంటల సభ చాలదు. ఒక రోజంతా గోష్టి జరగాలి. ‘ఆరుసారో కథల’ నుంచి ‘ఆరు సారా కథల’ దాకా ‘అల్పజీవి’నుంచి ‘మూడు కథల బంగారం’ దాకా ‘నిజం’ నుంచి ‘ఇల్లు’ దాకా శాస్త్రిగారి రచనా ప్రస్థానాన్ని వివరించడానికి ఒక్కొక్క వక్త ఒక్కొక్క పుస్తకం మీద మాట్లాడాలి.

ఎందుకంటే శాస్త్రిగారిని మనం బాగానే చదివాం అనే ఒక విధమైన complacence లో మనం ఆయన ఏమి రాసాడో దాదాపుగా మర్చిపోయేం. ఆయన ఎంతో విస్తారంగా రాసాడనుకుంటాం గాని, ఆయనలో పునరుక్తిలేదు. రాసిన ప్రతి ఒక్క వాక్యం ఒక సూత్రవాక్యంలాగా రాసాడు. ఉదాహరణకి 1973 లో అంటే ఇప్పటికి యాభై ఏళ్ళ కిందట, విశాఖ పౌరహక్కుల సమితి సభలో అధ్యక్షోపన్యాసం చేస్తూ ‘..ఇప్పుడు feudal rich, modern rich కలిసి పాలిస్తున్నారు’ అన్నాడు.

ఆ ఒక్క వాక్యం దానికదే ఒక సోషియాలజీ.

రావిశాస్త్రి రత్తాలు రాంబాబు రాసిన రోజుల్లో లంపెన్‌ అంటూ ఒకటి విడిగా ఉండేది. సమాజంలో నేరం, పేదరికం కలగలిసిన ఒక చోట, ఎవరూ చూడటానికి ఇష్టపడని చోట వర్ధిల్లేది. కోర్టుల్లోనూ, జైళ్ళల్లోనూ, హాస్పటళ్ళోనూ మాత్రం నలుగురికీ కనబడేది. శాస్త్రిగారు లాయరు కాబట్టి దాన్ని ఆయన చాలా దగ్గరగా చూసాడు. యాభై ఏళ్ళల్లో పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు లంపెన్‌ మన పాలకవర్గంగా, మన మార్కెట్‌గా, మన మీడియాగా మారిపోయింది. ఒక మామూలు మనిషి, ఒక అర్భకుడు అనుకోకుండా క్రిమినల్‌గా మారగానే అతడికి celebrity status దానంతటదే ఎలా వస్తుందో మధురాంతకం నరేంద్ర ఈ మధ్య ఒక నవల కూడా రాసాడు. ఇది శాస్త్రి గారు కూడా ఊహించలేని వికృతవిశ్వరూపం.

మానవుడి ‘హిస్టరీ షీటు చాలా కంగాళీగా ఉందని’ ఆయనొక చోట రాసాడు. కాని, ఆయన మనిషిని నమ్మాడు. ‘రాజు-మహిషి’లో ఒక మాట రాస్తాడు: ‘దైవం, న్యాయం, ధర్మం, సత్యం అన్నీ కూడా మనిషి నిలబడితేనే నిలబడతాయి. వాటికోసం మనిషి నిలబడితేనే అవి నిలబడతాయి’ అని. అటువంటి మనిషి మరొక మనిషితో, అటువంటి మనుషులు మరికొంతమందితో, ఆపైన చాలామందితో కలిస్తే, ఈ ప్రపంచం తప్పకుండా బాగుపడుతుందని నమ్మాడు.

1991లో ఒకాయన ‘బీదాబిక్కీ జనం మీద రచనలు అవార్డ్‌ల కోసమే. వారి జీవితాల్లో మార్పుల్ని సాధించడానికి కాదు. ఏమంటారు?’ అని అడిగితే అంటే ఆయనిలా చెప్పాడు: ‘వ్యక్తిగతంగా నేను అవార్డుకోసం రాసేనని అనుకోవడం లేదు. బీద జనం కత్తిపుచ్చుకుంటే బాగుపడతారు కానీ కథల వల్ల కాదు.’

అటువంటి ప్రజాపోరాటాలు, ఉద్యమాలు, తిరుగుబాట్లు ఉవ్వెత్తున చెలరేగిన కాలంలో ఆయన జీవించాడు. వాటిని రెండుచేతులా స్వాగతించాడు. ప్రభుత్వం గురించి, రాజ్యం గురించి, పాలనాయంత్రాగం గురించి ఆయనకు చాలా స్పష్టత ఉంది. ప్రజలు కావాలని తిరుగుబాట్లు చెయ్యరు. కాని ప్రభుత్వాలు వాటిని కావాలని అణచేస్తాయి అని ఆయన పదే పదే చెప్పాడు. 1988 లో చేసిన ఒక ప్రసంగంలో ఆయన ఈ కథ కూడా చెప్పాడు:

‘ఈ మధ్య ఒక జాతకకథ గురించి ఎవరో చెప్పారు. రాజు-మంత్రి ఉంటారు. రాజు గృహంలో ఉంటాడు. ఒక కుక్క గృహం ముందు అరుస్తూంటుంది. అదెందుకు అరుస్తోందని మంత్రిని అడుగుతాడు. ఆకలేసి అరిచిందని మంత్రి చెబితే అన్నం పెట్టమంటాడు రాజు. సరే పెడతారు. అయినా మళ్ళీ అరుస్తూ ఉంటుంది. ఎందుకరుస్తోందని రాజు మళ్ళీ అడుగుతాడు. దాని ఆకలి తీరిందటగానీ, లోకం ఆకలి తీరలేదటండీ అని..మరింకెందుకు అయితే దాన్ని చంపిచెయ్యండి అంటాడు రాజు.’

ఈ స్పష్టత ఆయన సాహిత్యసారాంశం.

ఇంకొక మాట కూడా చెప్పాలి.

ఒక మనిషిలో ఉండే బలహీనతలకి రావిశాస్త్రి మినహాయింపు కాదు. పైగా వాటిపట్ల ఆయనకు చాలా జాగరూకత ఉంది. తనలోని అంతర్వైవిధ్యాల వల్ల తాను ఆ ఉద్యమాల్లో నాయకత్వ స్థానంలో ఉండటం తప్పనిపించినప్పుడు ఆ మాట కూడా బహిరంగంగా చెప్పాడు. జీవితానికి ఆ కొసన పాలకులూ, ఈ కొసన పీడితులూ ఉన్నారనీ, మధ్యలో ఉన్న మధ్యతరగతి వాళ్ళ విప్లవాత్మకతని అంతగా నమ్మలేమని, అందులో తాను కూడా ఉన్నాననీ, మనమంతా వట్టి ఫీలింగుగాళ్ళమనీ ఆయన పదే పదే చెప్తూ వచ్చాడు. శామ్యూల్‌ జాన్సన్‌ బాస్వెల్‌తో చెప్పాడట: ఈ ఫీలింగుగాళ్ళు they just pay you by their feeling అని. విరసం నుంచి రాజీనామా చేస్తున్నప్పుడు కూడా ఆయన ఈ మాటలే చెప్పాడు.

మనం రచయితలం, దాదాపుగా మధ్యతరగతికి చెందినవాళ్లం. మనం వట్టి feeling people గా మిగిలిపోకుండా ఉండటానికి మనం నిజంగా చెయ్యవలసినంత కృషి చేస్తున్నామా? ఈ ఇన్స్‌టాగ్రామ్‌ యుగంలో వ్యాపించవలసిన సకల దౌర్బల్యాలూ, దౌర్భాగ్యాలూ శరవేగంతో కాదు, సైబర్‌ వేగంతో వ్యాపిస్తుంటే, మనమేం చేస్తున్నాం? ఒకర్నికొకరం విమర్శించుకుంటున్నాం, మనం కూడా ఆ గుంపుతో కలిసి ఒకరినొకరం ట్రోల్‌ చేసుకుంటున్నాం. మనలో వైరుధ్యాలు ఉండటం తప్పుకాదు. అది మనం మనుషులమని మనకు తెలియచేసే ఒక గుర్తు. మన వైరుధ్యాల మీద, మన అవగుణాల మీద మన స్వీయవిమర్శ మనం చేసుకుంటూనే కలిసి పోరాడవలసిన అవసరం ఉంది. మనలాంటి ఎన్ని గొంతులు కలిస్తే, ఎంత సత్వరం కలిస్తే, ఎంత సకలంగా కలిస్తే ఈ ప్రజలు వినవలసింది వినగలుగుతారు? బహుశా మన బాధ్యతని మనకి మనం గుర్తు చేసుకోవడం కోసమే ఈ నాడు ఈ సభ జరుపుకుంటున్నామని భావిస్తున్నాను.

(రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి శతజయంతి సభలో 30-7-22న చేసిన అధ్యక్ష ప్రసంగం)

31-7-2022

Leave a Reply

%d bloggers like this: