మరొక నూరేళ్లు బతకాలనిపిస్తున్నది

ఈ రోజు అక్క పుట్టిన రోజు.

ఇంకా తెల్లవారని ఈ ఆషాడమాస ప్రత్యూషాన కోయిల ఒక్కటీ మేల్కొని తన వంతు కూజితం తను ఎలుగెత్తి కూస్తూనే ఉన్నది. గీతాంజలిలో టాగోర్ మొదటి పుటలోనే ఒక వాక్యం రాసిపెట్టుకున్నాడు: Faith is the bird, that feels the light, when the dawn is still dark అని. లోకం ఇంకా నిద్రపోతుండగానే సుప్రభాతాన్ని ఎవరు కలగనరో, ఎవరు తమ గానంతో, కవిత్వంతో, కార్యాచరణతో మేల్కొలపగలరో, వారిదే నిజమైన జీవితం, వారు జీవించినందువల్లనే ఈ పృథ్వి మరింత పులకిస్తుంది.

నాకు టాగోర్ ని చూస్తే అదే అనిపిస్తుంది. దేశం ఇంకా బానిసత్వంలో ఉండగా అతడు స్వాతంత్య్రాన్ని సాధించుకున్నాడు. దేశం స్వతంత్రమయ్యాక అటువంటి మహామానవుడు ఎవరూ నా కళ్ళకి కనిపించడం లేదు. తన పాటల్తో, బొమ్మల్తో, సంగీతంతో, తన పాఠశాలతో, తన ప్రసంగాలతో ఈ లోకమ్మీద వెలుగు వాన కురిపించగల ఆ ఆషాఢమేఘమేదీ మళ్ళా ఈ భారతీయ ఆకాశం మీద నాకు గోచరించడం లేదు.

చాలా ఆలస్యంగా చూసాను, టాగోర్ 70 వ ఏట, ఆయనకి ప్రపంచం సమర్పించిన పుట్టినరోజు కానుకని. The Golden Book of Tagore (1931) పేరిట వెలువరించిన నీరాజనాన్ని. నాకు తెలిసి ఇటువంటి పుష్పాంజలి ప్రపంచంలో ఏ కవికీ, ఏ కళాకారుడికీ కూడా లభించి ఉండదు. నాలుగు వందల పేజీల ఈ సప్తతిపూర్తి సంచికకి ప్రధాన సంపాదకులు ఎవరో తెలుసా? అయిదుగురు మహనీయులు, మహాత్మాగాంధి, ఐన్ స్టీన్, రోమేరోలా, గ్రీకు జాతీయ కవి కోస్టెస్ పలమాస్, జగదీష్ చంద్రబోస్. ఇక ఇందులో టాగోర్ కి తమ నుతులు, స్తుతులు, శుభాకాంక్షలు అందించినవారిలో బిపిన్ చంద్ర పాల్, అరవిందులు, రాధాకృష్ణన్, నెహ్రూ లతో పాటు యేట్సు, స్టెఫాన్ జ్వెయిగ్, పాల్ వేలరీ, బెట్రండ్ రస్సెల్, జూలియన్ హక్సలి, థామస్ మన్, నట్ హామ్సన్, మారిస్ మాటర్లింక్, విల్ డురాంట్, బెనెడిట్టొ క్రోసే, నికొలస్ రోరిక్ వంటివారున్నారు. దేశాధినేతలు, ధార్మికనాయకులు, శాంతిదూతలు ఉన్నారు. వారంతా ఒక కవికి, ఒక సంగీతకారుడికి కాదు, ఒక విశ్వమానవుడికి తమ సంస్తుతి సమర్పించుకున్నారు.

ఆ పుస్తకాన్ని రోజూ తెరుస్తూనే ఉన్నాను. ఒకటో రెండో వ్యాసాలు చదువుతూనే ఉన్నాను. కాని అన్నిటికన్నా ముందు, ఆ పుస్తకం పుటలు తెరవగానే నా వంట్లో ఎంత విద్యుత్తు ప్రవహిస్తోందని? ఎంత జీవితేచ్ఛ నాలో పొంగిపొర్లుతోందని. నాకు మరొక నూరేళ్లు బతకాలనిపిస్తున్నది. చదవాలనిపిస్తున్నది, రాయాలనిపిస్తున్నది, బొమ్మలు గియ్యాలనిపిస్తున్నది, పాటలు కట్టాలనిపిస్తున్నది, సంగీత ప్రపంచంలోకి ప్రవేశించాలనిపిస్తున్నది.

ఒక మనిషి ఈ భూమ్మీద పుడితే, నడయాడితే, ఇదిగో, వందేళ్ళ తరువాత కూడా, నూట యాభై ఏళ్ళ తరువాత కూడా ఇంత భావోద్వేగాన్ని రేకెత్తించలగాలి. ద్వేషం కాదు, దూషణ కాదు, ఇదుగో, ఇంత ప్రేమ పంచగలగాలి, ఇందరు మనుషులు, ఇన్ని జాతులు, ఇన్ని దేశాలు నిన్ను తమవాడనుకోగలగాలి.

ఎవరికి వారికి తమ భాషలో, తమ ప్రాంతంలో, తమ సంస్కృతిలో ఉత్తమోత్తమమైనవి ఆ మనిషిని చూస్తే గుర్తురావాలి. ఈ పుస్తకంలో కనీసం ఇద్దరు మరాఠీ పండితులు టాగోర్ని తలుచుకోగానే తుకారాం గుర్తొస్తాడని రాసారు. వట్టినే గుర్తురావడం కాదు, ఇద్దరూ కూడా రెండు అభంగాల్ని గుర్తుచేసుకోకుండా ఉండలేకపోయారు. ‘ఆయనకి కాళిదాసు, వాల్మీకిల తపోవనాలనుంచీ, షేక్ స్పియర్, షెల్లీల పూలతోటలనుంచీ ఎంత అందమైన పూలు ఏరితెచ్చుకోవాలో తెలుసు ‘ అని రాసాడో గ్రీకు కవి. ‘మిమ్మల్ని కలుసుకోవడం వల్ల మేము పరిశుభ్రపడ్డాం, మరింత ధీరత్వాన్ని సంతరించుకున్నాం ‘ అని రాసాడు విల్ డురాంట్. ‘టాగోర్ని ఆరాధించినంతగా నేను నా సమకాలికుల్లో మరే మనిషినీ ఆరాధించలేకపోతున్నాను ఎందుకంటే నాకు తెలిసిన అత్యంత పరిపూర్ణ మానవుడు ఆయన, విశ్వమానవుడు, సమస్తాన్నీ తన బాహువుల్లో బంధించుకోగలిగినవాడు ‘ అని రాసాడు హెర్మన్ కీసర్లింగ్.

అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన వాక్యాలు యేట్సు రాసాడు. డబ్లిన్ నుంచి ఉత్తరం రాస్తూ అతడిట్లా రాస్తున్నాడు: ‘నేను మీ విద్యార్థుల్లో అత్యంత విధేయుణ్ణయిన విద్యార్థిననీ, మీ ఆరాధకుడిననీ చెప్పనివ్వండి. మీకు తెలుసు, మీ కవితలు నన్ను గొప్ప భావోద్వేగంతో ముంచెత్తాయని. ఈ మధ్యకాలంలో నేను మీ వచనంలో కూడా గొప్ప జ్ఞానాన్నీ, సౌందర్యాన్నీ చూస్తున్నాను.. మనం కలుసుకున్న తరువాత, ఆ మధ్య నేను పెళ్ళి చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు. బాబు, పాప. ఇప్పుడు నాకు జీవితంతో మరింత గాఢంగా అల్లుకుపోయినట్టుగా ఉంది. జీవితం, అంటే జీవితం కానిదేదో దాన్నుంచి భిన్నమైంది, యాంత్రికం కానిది, సంక్లిష్టం కానిది, అటువంటి జీవితాన్ని తలుచుకోగానే నాకు పురాతన ఆసియాఖండపు జీవనవిధానమే మదిలో మెదుల్తుంది. ఆ జీవనస్వరూపాన్ని నేను మొదట్లో మీ పుస్తకాల్లో కనుగొన్నాను, ఆ తర్వాత చీనా కవిత్వంలోనూ, జపనీయ వచనరచనల్లోనూ దర్శించాను. మీ కవితలు మొదటసారి చదివినప్పటి ఆ ఉద్వేగాన్ని నేను ఏమని వర్ణించేది! మార్పులేని కాలాతీత క్షేత్రాల్లోంచీ, నదీ తీరాలమీంచి ఆ కవితలు నేరుగా నా దగ్గరకి చేరాయా అనిపిస్తుంది!’

నెమ్మదిగా తూర్పు రాగరంజితమవుతున్నది. వాగ్దాన పరిమళాలతో ప్రత్యూష పవనాలు కిటికీలోంచి నన్ను తాకుతున్నవి. జీవితం చాలా విలువైంది. ప్రతి క్షణం ఎంతో విలువైంది. మరొకసారి ఈ భాగ్యం మనకు దక్కుతుందో లేదో తెలియదు. ఎన్ని కష్టాలు, ఎన్ని క్లేశాలు, ఎంత దుఃఖం, ఎంత వేదన ఉండనీ, ఈ ప్రపంచంలో పుట్టడమే గొప్ప భాగ్యం. మనం పుట్టకపోయి ఉంటే, ఈ రాగాలు, ఈ రంగులు, ఈ భావాలు, ఈ కవులు, వారి మధ్య ఈ కరస్పాండెన్సు మనకెట్లా తెలిసి ఉండేది?

ఇంతదాకా ఈ భూమి మీద జీవించినవాళ్ళందరికన్నా మనం మరింత భాగ్యవంతులం. టెక్నాలజి వల్ల ఎక్కడెక్కడి సౌందర్యమూ నేరుగా మన ఇంటికి చేరుతున్నది. దేశదేశాల కవిత్వాలు చదువుకోవచ్చు, దేశదేశాల సంగీతాలు వినవచ్చు, సినిమాలు చూడవచ్చు. కాని వీటన్నిటినుంచీ అంతిమంగా మన జీవితేచ్ఛ, మన జీవితానందం నలుగురికీ ప్రసరించాలి. నదీ జలాల్లా మనం నడిచిన తావులన్నీ పచ్చగా కలకల్లాడాలి, సుభిక్షం కావాలి. విసుగులోనో, వేసటలోనో మనుషులు క్షణం పాటు ధైర్యం కోల్పోయినప్పుడు, మనల్ని తలుచుకుంటే, వాళ్ళకి మళ్ళా జీవనోత్సాహం ఊటలూరాలి. అది కదా, మన తల్లిదండ్రులు మనకీ జీవితాన్నిచ్చినందుకు, మన సమాజం మనకి విద్యాబుద్ధులు నేర్పినందుకు, మనల్ని ఇన్నాళ్ళు పోషించినందుకు మనమీ లోకానికి తీర్చగల ఋణం!

19-7-2022

One Reply to “మరొక నూరేళ్లు బతకాలనిపిస్తున్నది”

  1. …విసుగులోనో, వేసటలోనో మనుషులు క్షణం పాటు ధైర్యం కోల్పోయినప్పుడు, మనల్ని తలుచుకుంటే, వాళ్ళకి మళ్ళా జీవనోత్సాహం ఊటలూరాలి…

    మిమ్మల్ని తలచుకొంటే, మీ రచనల్ని చదువుతుంటే అదే కలుగుతుంది… “జీవనోత్సాహం”… _/\_

Leave a Reply

%d bloggers like this: