పులికన్నా ప్రమాదకరమైంది

అశోక్ బుక్ సెంటర్ అధిపతి అశోక్ కుమార్ గారు తెలుగు ప్రచురణకర్తల్లో ఉత్తమ అభిరుచీ, విస్తృత పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. విజయవాడలో అశోక్ బుక్ సెంటర్ లో గాని, హైదరాబాదులో అక్షర లోగాని సరికొత్త పుస్తకాలు కనిపిస్తాయంటే, అందుకనే, ఆశ్చర్యం లేదు. నిన్న ఆయన్ని విజయవాడలో కలిసినప్పుడు, The Life and Wisdom of Confucius (2002) అనే చిన్న పుస్తకం ఇచ్చారు. ‘చైనీస్ సేజ్ సిరీస్’ కింద పిల్లలకోసం చైనాలో రూపొందించిన పుస్తకం. బుద్ధుడిలాగా, సోక్రటీస్ లాగా కన్ ఫ్యూసియస్ గురించి కూడా ఎంత తెలుసుకున్నా, ఇంకా తెలుసుకోవలసింది ఉంటూనే ఉంటుంది. తెలుసుకుంటున్న ప్రతిసారీ, కొత్తగానూ, ఉత్సాహకరంగానూ ఉంటుంది.

పిల్లలకోసం చైనీస్ లోనూ, ఇంగ్లిషులోనూ, రెండు భాషల్లో చిన్న చిన్న అధ్యాయాలుగా చక్కటి బొమ్మల్తో తీసుకొచ్చిన ఆ పుస్తకంలోంచి రెండు అధ్యాయాలు, మీ కోసం.

1

కన్ ఫ్యూసియస్ ‘లూ’ రాజ్యం వదిలిపెట్టి ‘కీ’ రాజ్యంలో ఝా-వో ప్రభువుని కలుసుకోవాలని బయల్దేరాడు. ఒక రోజు సాయంకాలం అయ్యేటప్పటికి ఆయన తన శిష్యులతో తాయి పర్వత ప్రాంతంలో పోతూ ఉండగా, అక్క్కడొక స్త్రీ ఒక సమాధి దగ్గర విలపిస్తూ కనిపించింది. కన్ ఫ్యూసియస్ తన శిష్యుడు ఝీ-లు ని సంగతేమిటో కనుక్కోమన్నాడు. ఆమె తన భర్తా, తన మామగారూ ఇద్దరూ కూడా అక్కడ పులి వాత పడ్డారని, ఇప్పుడు తన కొడుకు కూడా పులినోట చిక్కాడనీ చెప్పింది. అయితే అంతప్రమాదకరమైన చోటులోనే ఇంకా ఎందుకున్నావు, వేరే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చుకదా, అని ఝీ-లు ఆమెనడిగాడు. అందుకామె, ఆ మారుమూల కొండప్రాంతంలో నియంతృత్వం లేదనీ, అందుకే తాను అక్కణ్ణుంచి వెళ్ళిపోడానికి ఇష్టపడటం లేదనీ చెప్పింది. ఆ మాటలు విని కన్ ఫ్యూసియస్ దీర్ఘంగా నిట్టూర్చి అన్నాడు కదా : ‘కాబట్టి, మనమిప్పుడొక పాఠం నేర్చుకున్నాం. నియంతృత్వం పులికన్నా ప్రమాదకరమైంది అని ‘ అన్నాడు.

2

‘లూ’ రాజ్యానికి చెందిన దింగ్ పాలనా కాలం నాలుగో ఏడాది, అంటే క్రీస్తుకు పూర్వం 506 నాటికి, కన్ ఫ్యూసియస్ కి 46 ఏళ్ళు. ఒకరోజు ఆయన తన శిష్యులతో కలిసి ప్రవచనం చేయడానికి దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ యజ్ఞయాగాదుల్లో వాడే పెద్ద కంచుపాత్ర ఒకటి ఒక పక్కకి ఒరిగి పోయి కనిపించింది. అది ఎందుకు పక్కకు ఒరిగిపోయిందని కన్ ఫ్యూసియస్ అడిగాడుగాని, ఎవరూ కారణం చెప్పలేకపోయారు. కన్ ఫ్యూసియస్ తన శిష్యుడు కోంగ్-లి ని పిలిచి నీళ్ళు తెచ్చి ఆ పాత్రలో నెమ్మదిగా పొయ్యమని చెప్పాడు. నీళ్ళు పాత్రంలో సగం నిండేటప్పటికి ఆ పాత్ర తిన్నగా, కుదురుగా నిలబడింది. పూర్తిగా నిండేటప్పటికి మళ్ళా పక్కకి ఒరిగిపోయి, తల్లకిందులైపోయి, మొత్తం నీళ్ళన్నీ ఒలికిపోయాయి. అప్పుడు కన్ ఫ్యూసియస్ తన శిష్యులతో ఇలా చెప్పాడు. ‘ఇదే మనం గుర్తుపెట్టుకోవలసిన సూత్రం. దీన్ని రాజుగారి సింహాసనం పక్కన ఒక హెచ్చరికగా పెట్టారన్నమాట. ఏమి చెప్పడానికి? ఖాళీగా ఉంటే ఒరిగిపోతావు, మధ్యస్థంగా ఉంటే తిన్నగా ఉంటావు, పొంగిపొర్లావనుకో, తల్లకిందులవుతావు.’

2-7-2022

Leave a Reply

%d bloggers like this: