నాయని సుబ్బారావు

నాయని సుబ్బారావు గారు (1899-1978) భావకవితా యుగంలో ప్రసిద్ధి చెందిన కవి. ఆయన పుట్టిన ఊరు ప్రకాశం జిల్లా పొదిలి. ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాల్లో ప్రయాణం చేసేటప్పుడు పొదిలి మీంచి వచ్చి పోయేటప్పుడు ఆ ఊరు సుబ్బారావుగారిని ఏ మేరకు గుర్తుపెట్టుకుందా అనుకుంటూ ఉండేవాణ్ణి. ఎందుకంటే ఆయన మామూలు కవి కాడు. కన్నతల్లినీ, కన్న ఊరినీ అందరూ ప్రేమిస్తారుగాని, అంత గాఢంగా ప్రేమించే వాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు.
 
ఆయన తాను పుట్టిన ఊరు పొదిలి మీద ‘జన్మభూమి’ అని ఒక కావ్యం రాసారు. అందులో ఇలా రాసుకున్నారు:
 
ఇతరజనపదముల నేను ప్రవాసినై
మరచియైన, మేను మరచియైన
కన్నతల్లి పొదిలె యున్న దిక్కున కాళు
లుంచి యెపుడు పవ్వళించలేదు.
 
(వేరే ప్రాంతాల్లో నేను ప్రవాసిగా జీవించిన కాలంలో మర్చిపోయిగాని లేదా ఒళ్ళు మర్చిపోయిగాని నా కన్నతల్లిలాంటి పొదిలె గ్రామం ఉన్న వైపుకి ఎప్పుడూ కాళ్ళు పెట్టి పడుకున్నది లేదు)
 
ఆయన కన్నతల్లినీ అంతే గాఢంగా ప్రేమించాడు. ఆమె ఆయన ఇరవయి అయిదవ ఏట స్వర్గస్థురాలయ్యింది. ఆ మరణం ఆయన్ని చెప్పలేనంత దుఃఖంలోకి నెట్టివేసింది. ఆయన తన తల్లిని తలుచుకుంటూ 63 పద్యాలు రాసుకున్నాడు. వాటిని ‘మాతృగీతాలు’ పేరిట 1931 లో ప్రచురించాడు. తెలుగు సాహిత్యంలో అటువంటి సాంద్రశోకగీతాలు ఇప్పటిదాకా రాలేదు. ఆ గీతాలకి విశ్వనాథ ముందుమాట రాసాడు. అవి తాను రాసిన పద్యాలుగానే తనకి అనిపిస్తుందని చెప్పుకున్నాడు. ఇన్నాళ్ళ తరువాత మళ్ళీ చదువుతున్నప్పుడు కూడా ఆ పద్యాలు గుండెని కలచివేస్తూనే ఉన్నాయి. ఉదాహరణకి చూడండి:
 
పైని వేంచేసి యూపిరి పట్టుకొనుచు
చిన్ని తాబేలు నన్ను వీక్షించి జలము
త్రవ్వుకొనుచేగె కూపగర్భమున దాగ
పై నలముకున్న సుళ్ళు నా పాల విసిరి.
 
నీకు లేదమ్మ యన్నది నీటిపాము
పైకెగసి యొక్క కప్పను పట్టుకొనుచు.
నాకు లేదమ్మ యన్నాను శోకవహ్ని
తప్త హృదయుండనై యింటిదారి పట్టి.
 
(స్నానం చెయ్యడానికి బావి దగ్గరికి వెళ్తే, ఆ బావిలో గాలి పీల్చుకోడానికి నీళ్ళమీదకు తేలి ఉన్న తాబేలు నన్ను చూసి తొందరగా లోపలకి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోతూనే ఆ నీళ్ళు సుళ్ళు తిరిగి నీళ్ళ పైన సున్నాలు చుట్టుకుంటూ ఉన్నాయి. అంటే నాకు శూన్యమే మిగిలిందన్నమాట. ఒక నీటిపాము పైకి ఎగిరి ఒక కప్పని పట్టుకుని ‘నీకు అమ్మ లేదు’ అంది. నన్ను దహిస్తున్న దుఃఖంతో ‘నాకు కూడ అమ్మలేదు’ అని చెప్పి ఇంటిదారి పట్టాను. నన్ను కూడా మృత్యువు తన కోరల్లో చిక్కించుకున్నట్టే అనిపించింది.)
 
ఆయన తన మేనమామ కూతురిని ప్రేమించాడు. ఆమెకు వత్సల అని పేరుపెట్టుకున్నాడు. తాను బావ కాబట్టి సౌభద్రుడు. ఆమెని ఉద్దేశిస్తూ ప్రణయగీతాలు రాసాడు. వాటిని ‘సౌభద్రుని ప్రణయయాత్ర’ పేరిట 1935 లో వెలువరించాడు. భావకవితాయుగంలో కవులు తమ ప్రేయసుల్ని ఉద్దేశించి కవిత్వం రాయడం సాధారణం. కాని తక్కిన కవుల ప్రేయసులు నిజంగా ఉన్నారో లేక కవి కల్పనలో మనకి తెలియదు. కాని ఈ సౌభద్రుడి వత్సల ఒక సజీవ స్త్రీమూర్తి. వారు ప్రేమించుకున్నాక, ఆమెనిచ్చి పెళ్ళి చేస్తానని మేనమామ వాగ్దానం చేసాక, ఒకరోజు నాయని మహాత్మాగాంధి ప్రసంగం విన్నాడు. అవి సహాయనిరాకరణం రోజులు. ఆయన కళాశాల బహిష్కరించాడు. చదువు సంధ్యల్లేనివాడికి తన పిల్లనివ్వనన్నాడు మామ. కాని తాను పూరిపాకలోనే ఉంటాననీ, రాట్నం వడుక్కుంటూ ఉంటాననీ, తనకి కాబోయే భార్య రాట్నానికి ఆసులూ, కండెలూ పోగుచేస్తూ ఉండాలనీ అన్నాడు కవి. ఆ పెళ్ళి అయ్యేలా కనిపించలేదు. అప్పుడు కవి ఆ బాధనంతా అపురూపమైన విరహకవిత్వంగా మలుచుకున్నాడు. ఈ పద్యాలు చూడండి:
 
ఆ గవాక్షమ్ము తానెంత యమృతరాశి
ఎవ్వరును లేని సమయాన నేగి దాని
స్పర్శసుఖమున పులకలుజాదుకొనగ
ప్రణయమున ముగ్ధుడను పరవశుడనైతి
 
(ఆమె ఆ కిటికీ దగ్గర కనిపించేది. కాబట్టి ఆ కిటికీ ఎంత అమృతరాశిగానో మారిపోయింది. ఎవరూ లేనిసమయం చూసి అక్కడకు వెళ్ళి ఆ కిటికీని ముట్టుకోగానే ఒళ్ళంతా పులకలెత్తుతుంది. ఆ ప్రేమసంతోషంలో ముగ్ధుణ్ణీ, పరవశుణ్ణీ అయిపోతాను)
 
ఏమైతేనేం! వారిద్దరూ పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళి చేసుకున్నాక కూడా ఆయన అంతే ప్రేమతో ఆమె పట్ల కవిత్వం రాసాడు. అప్పుడు కూడా ఆ ప్రేమ ఏమీ తగ్గలేదు. కాని ఆ రసస్వరూపంలో మార్పు వచ్చింది అంతే. ఈ పద్యం చూడండి:
 
మునుపు పద్యమ్ము వ్రాయుట యనిన గుండె
చీల్చుకుని నెత్తురుల్ బయల్ జిమ్మెననుట
ఇపుడు పద్యమ్ము ప్రేమ పొంగించుకున్న
నా నవానందవాహినిలోని నలుసు.
 
మునుపు పద్యమ్ము వ్రాయని దినము లేదు
ఇప్పుడానంద పరమార్థమేలు చున్న
నాదు హృదయాంతరాళమ్మునన్ ధ్వనించు
అసలు పద్యమ్ము వచ్చినదని సతమ్ము.
 
(ఇంతకు ముందు ఆ విరహావస్థలో పద్యం రాయడమంటే గుండె చీల్చుకోవడం. ఆ నెత్తురు బయటకు చిమ్మటం. ఇప్పుడంటావా, ప్రేమ పొందిన నా కొత్త ఆనందపు ప్రవాహంలో పద్యం ఒక నలుసు. ఇంతకుముందు నేను పద్యం రాయని రోజే ఉండేది కాదు. కాని ఇప్పుడు ఆనందపరమార్థం ఏలుతున్న కాలం. ఇప్పుడే అసలైన పద్యం వచ్చిందని నిత్యం నా గుండెలోతుల్లో మార్మోగుతూనే ఉంటుంది)
 
ఒక నిజమైన ప్రేయసిని ఉద్దేశించి రాసిన తొలి తెలుగు ప్రణయకావ్యంగా మనం సౌభద్రుని ప్రణయయాత్రను చెప్పుకోవచ్చు, ఆ కవిత్వమంతా చిక్కని అనుభూతి. పారశీక కవుల ప్రేమకవిత్వంలాంటి తీయదనం. అందుకనే శ్రీ శ్రీ ‘సౌభద్రుని ప్రణయయాత్ర చదవాలని తొందర’ అని రాసుకున్నాడు.
 
ఆయనకి డెబ్బై ఏళ్ళ వయసులో తన కన్నకొడుకు, ఒకే ఒక్క కొడుకుని పోగొట్టుకున్నాడు. అది మరొక పెద్ద విషాదం. ఆ దుఃఖాన్ని కూడా పద్యాల్లో పెట్టుకున్నాడు. ‘విషాద మోహనం’ అనే పేరుమీద వెలువరించాడు. ఈ జీవితానుభవాలన్నీ ఇచ్చిన తాత్త్విక దృష్టితో ‘వేదనావాసుదేవం’ అని మరికొన్ని పద్యాలు వెలువరించారు.
 
తల్లి, పడతి, కొడుకు, కన్న ఊరు- ఒక మనిషి జీవితం తిరిగేది వీటి చుట్టూతానే. ఆ నాలిగింటితోటీ తన అనుభవాల్నీ, అనుభూతినీ కవిత్వంగా మార్చిన ఏకైక తెలుగు కవి నాయని సుబ్బారావు. నిజమైన స్వానుభవ కవి. ఇటువంటి కవి ఫ్రాన్సులోనో, ఇంగ్లాండులోనో పుట్టి వుంటే, ఈ పాటికి ఎన్నో దేశాల్లో ఈయన కవిత్వం చదువుకుంటూ ఉండేవారు. కాని తెలుగునేలమీదనే ఈయన పేరు ఇప్పుడు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. కనీసం పొదిలి అయినా ఆయన్ని గుర్తుపెట్టుకుంటే బాగుండనిపించేది.
 
అందుకని ఒకరోజు పొదిలి ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డితో తన పాఠశాలలో సుబ్బారావుగారి పేరు ఏదైనా భవనానికో, గ్రంథాలయానికో పెట్టమని అడిగాను. శ్రీనివాసరెడ్డి అద్భుతమైన వ్యక్తి. ఆయన లైబ్రరీ సైన్సులో డిప్లొమా చేసాడు. అద్భుతమైన గ్రంథాలయం ఏర్పాటు చేసుకున్నాడు తన పాఠశాలలో. ఆయన నా మాట మన్నించి పాఠశాల ఆవరణలో ఒక రంగవేదిక ఏర్పాటు చేసి దానికి ‘నవకవితాసౌభద్రుడు నాయని సుబ్బారావు కళావేదిక ‘ అని పేరు పెట్టాడు. మొన్న ఆదివారం ఆ కళావేదిక ఆవిష్కరణ సభ తో పాటు ‘చదువులు-కొత్త దారులు’ పేరిట ఒక గోష్టి కూడా ఏర్పాటు చేసి నన్ను పిలిచాడు.
 
నాతో పాటు సుబ్బారావుగారి అన్నదమ్ముల మనమలు కూడా ఆ వేడుకలో పాలుపంచుకున్నారు. సుబ్బారావుగారి అన్నగారు నరసింహారావుగారి మనమడు ఎ.కె.నరసింహారావు రిటైర్డ్ ఐ ఏ ఎస్ అధికారి. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ రాజ్ కమిషనర్ గా, నల్గొండ జిల్లా కలెక్టరుగా పనిచేసారు. వారి సోదరి జయశ్రీ తెలుగు సాహిత్య ఉపన్యాసకురాలు. నరసింహారావుగారి కూతురి కొడుకు సాయిపాపినేని చరిత్రకారుడు, చరిత్రని సాహిత్యంగా మలిచే ఉద్యమంలో భాగంగా ‘కాలయంత్రం’ పేరిట తెలుగు కథా ప్రక్రియకు కొత్త తలుపులు తెరిచినవాడు. మరొక మనుమడు ఆకునూరి హాసన్ గారు ప్రసిద్ధ రచయిత. వారంతా కూడా ఆ వేడుకలో భాగం పంచుకున్నారు.
 
ప్రకాశం జిల్లా గ్లోబల్ ఎన్నారై ఫోరం తరఫున ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చిన డా.కొర్రపాటి సుధాకర్, డా.మాధవి గారితో పాటు పిల్లలప్రేమికుడు సి.ఏ.ప్రసాద్ గారు ఈ మొత్తం వేడుక అంతా దగ్గరుండి నడిపించారు. పొదిలి ముద్దుబిడ్డ ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖలో సంచాలకులుగా ఉన్న పార్వతి, పాఠ్యపుస్తకాల సంచాలకుడు, చరిత్ర అభిమాని రవీంద్రనాథ రెడ్డి, ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు సుబ్బారావు, జిల్లా విద్యాశాఖాధికారి, గొప్ప వక్త, విజయభాస్కర్, సిఎంవొ కొండారెడ్డి, శివకుమారి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్కాపురం శాసన సభ్యుడు, విద్యారంగంలో ఏదో ఒకటి చెయ్యాలనే తపన ఉన్న డా.నాగార్జున రెడ్డి కళావేదిక ప్రారంభించారు. తల్లిదండ్రుల కమిటీ ఛైర్మన్, ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
 
చాలా సంతోషంగా అనిపించింది. ఒక కవికి ఒక పాఠకుడిగా నా వంతు నీరాజనం కూడా నేనివ్వగలిగినందుకు.
 
26-7-2022
 

Leave a Reply

%d bloggers like this: