చేసిన మంచిపనుల సంతోషం

Reading Time: 2 minutes
ఆషాడ శుద్ధ ఏకాదశి. రాత్రంతా వాన ఈ నగరాన్ని దగ్గరకు తీసుకునే నిద్రపోయినట్టుంది, అందరికన్నా ముందు లేచే కోకిల కూడా ఇంకా నిద్రలేవలేదు. కిటికీలోంచి చూస్తే ఎదురుగుండా విప్పారి కొన్ని వందల పక్షులకి ఆశ్రయమిచ్చే పచ్చపూలచెట్టు కూడా ఇంకా కునికిపాట్లు పడుతూనే ఉంది. తల్లికన్నా ముందు లేచి అల్లరి చేసే పిల్లల్లాగా ఒకటీ అరా పిట్టలు కిచకిచలాడుతున్నాయి.
 
ఆకాశమంతా ఒకే ఒక్క మబ్బుగా మారిపోయింది, like a rain-cloud of July అంటాడే టాగోర్, అట్లా.
ఈ రోజు వార్ కరి యాత్రీకులు పండరిపురం చేరుకుంటారు. చంద్రభాగ ఒడ్డున బసచేస్తారు. ఈ రోజు పండరిపురంలో వైకుంఠం నేలమీదకి దిగుతుంది. విఠలుడు గుడి వదిలిపెట్టి పండరి వీథుల్లో పాటలుపాడేవాళ్ళతో కలిసి తిరుగుతుంటాడు. ఎట్లాంటి ఊరు పండరిపురం! అక్కడ ఒక్కచోటే బజార్లలో కవిత్వమూ, సంగీత వాద్యాలూ తప్ప మరేమీ లేకపోవడం చూసాను. అక్కడ ఒక్కచోటే కవులు స్వర్గానికి పోకుండా భూమినే అంటిపెట్టుకున్న వీథులు చూసాను. ప్రతి ఏడాది అనుకుంటాను, ఆ పల్లకీలతో నేను కూడా ఆ యాత్రీకుల వెంబడి పండరినాథుడి పాటలు పాడుకుంటూ పోవాలని.
 
అభంగం. బహుశా ఛందస్సుల్లో ఇంత అందమైన పేరు మరే ఛందస్సుకీ లేదనిపిస్తుంది. భంగపాటు తప్ప మరేమీ దొరకని ఈ జీవితంలో అభంగం ఒక్కటే నిజమైన నీడ, ఓదార్పు.
అందుకని, ఇదిగో, ఎలాగూ పండరిపోలేకపోయినా, జ్ఞానేశ్వరుడు, తుకారాము, నామదేవులు నా దగ్గర ఉన్నారు కాబట్టి వారి కావ్యగానానికిట్లా చెవి ఒగ్గుతున్నాను. మీరూ వినండి, రెండు అభంగాలు, సంత్ జ్ఞానేశ్వర్ వి.
 
Sumalatha Satoor, ఈ క్షణాల్లో మిమ్మల్నే తలుచుకుంటున్నాను.
 
1
 
ఈ ప్రపంచాన్ని సంతోషభరితం చెయ్యాలనుకుంటున్నాను
మూడులోకాల్నీ సంతోషంతో నింపెయ్యాలనుకుంటున్నాను.
 
పండరిపురం వెళ్తాను, ప్రభువు విఠలుణ్ణి చూస్తాను
అక్కడే మా కుటుంబసభ్యులందర్నీ కలుసుకుంటాను.
 
చేసిన మంచిపనుల సంతోషం నా చేతికందుతున్నది
అంతటికీ కారణం పాండురంగడే అని ఎలుగెత్తి చాటుతాను.
 
నా తండ్రి విఠలుణ్ణి, మా అమ్మ రుక్మాని కలుసుకుంటాను
పండరిపురంలోనే ఉండిపోతాను, నా సకలశుభాలూ అక్కడే.
 
(అవగాఛీ సంసార్ సుఖాచా కరీన్)
 
2
 
ఆయన చరణాలు సమసుందరం, మేనిపై పీతాంబరం
కంఠాన పూలమాలలు, నగలు, మరీ ముఖ్యం వైజయంతి.
 
ఆ ముఖమండల శోభ ఏమనిచెప్పేది? కోటిసూర్యుల కాంతి,
బంధాలు తెగిపోయిన సంతోషం ఈ క్షణాన. ఇంకేమి కోరేది?
 
ఉరాన శ్రీవత్సలాంఛనం, సాక్షాత్తు నారాయణుడు నా ముందు
చేతుల్లో శంఖం, చక్రం, పద్మం, గద. దారి తుడిచి, తలుపులు
 
నాలుగూ బార్లా తెరిచిపెట్టాడు, తనదగ్గరే ఉండిపొమ్మంటున్నాడు
ఇంకేమి కావాలి? రెండు చేతుల్తోనూ ఆయన్ని చుట్టేసుకుంటాను.
 
( సమచరణ సుందర్ కాసే ల్యాలా పీతాంబర్)
 
 
10-7-2022

Leave a Reply

%d bloggers like this: