కన్ ఫ్యూసియస్

అశోక్ బుక్ సెంటర్ నుంచి తెచ్చుకున్న కన్ ఫ్యూసియస్ పుస్తకం నాకు చాలా ఉత్తేజాన్నిచ్చింది. అందుకని ఆ పుస్తకాన్ని చదువుతూనే అనువాదం చెయ్యకుండా ఉండలేకపోయాను. ఆ అనువాదానికి ఒక పరిచయ వ్యాసం జోడించి అశోక్ కుమార్ గారికి పంపించాను.

బహుశా ప్రతి ఉద్యమకారుడికీ, రాజోద్యోగికీ కూడా కన్ ఫ్యూసియస్ మాటలు చాలా దగ్గరగా వినిపిస్తాయనుకుంటాను. నా వరకూ నాకు ఎన్నో తావుల్లో కన్ ఫ్యూసియస్ జీవితంతోనూ, ఆయన మాటల్తోనూ ఎన్నో పోలికలు కనిపించాయి. అంటే నేను కన్ ఫ్యూసియస్ అంతటివాణ్ణి అని కాను. నాలాంటి వాణ్ణి కూడా తనతో మమేకపరుచుకునే శక్తి ఆ జీవితానికీ, ఆ సంభాషణలకీ ఉందని దాని అర్థం.

ఆ పుస్తకం చదువుతూ ఉండగానే, నేనెప్పుడో Confucius, A Biography (2006) అనే పుస్తకం కొని పెట్టుకున్నానని గుర్తొచ్చింది. అది కూడా తీసి చదివాను. Jonathan Clements అనే ఆయన కన్ ఫ్యూసియస్ సమగ్ర సాహిత్యాన్నీ, ఆయన మీద వచ్చిన రచనల్నీ కూలంకషంగా చదివి చాలా సరళంగానూ, సాధికారికంగానూ రాసిన పుస్తకం.నూట యాభై పేజీలు కూడా లేని ఈ పుస్తకం కన్ ఫ్యూసియస్ గురించి తెలుసుకోవాలనుకునేవాళ్ళకి ఒక సులభ పరిచయంగా ఉపకరిస్తుంది. ప్రపంచంలోని కొందరు గొప్ప విద్యావేత్తల గురించి రాయాలని ఒక ప్రణాళిక వేసుకుని, అందులో భాగంగా చేర్చి పెట్టుకున్న పుస్తకాల్లో ఇది కూడా ఒకటి. ఇన్నాళ్ళకు చదవగలిగాను.

కన్ ఫ్యూసియస్ మొత్తం డెబ్భై మూడేళ్ళు జీవించాడు. కాని అతడి జీవితకాలం మొత్తం మీద, ఆయన అనుకున్న పాలనా విధానం ప్రకారం పరిపాలించడానికి ఒక నగరాధికారిగా ఒక ఏడాది అవకాశం దొరికింది. లూ అనే చిన్న రాజ్యానికి న్యాయశాఖామంత్రిగా మరొక రెండేళ్ళు అవకాశం దొరికింది. రెండు సార్లూ ఆయన్ని పదవిలో పూర్తి కాలం కొనసాగించలేదు. తనకే గనుక మూడేళ్ళు పాలనాధికారం లభిస్తే అద్భుతాలు చేసి చూపించగలని అనుకున్నాడు. కాని తన స్వదేశమైన లూ రాజ్యంతో సహా, అప్పటి చీనాలోని ఏ ఒక్క రాజ్యమూ కూడా తమ చరిత్రలో ఆయనకి ఒక మూడేళ్ళు అప్పగించలేకపోయాయి.

తన సలహాలు, సూచనలు విని తాను చెప్పినట్టుగా పాలన చేసే రాజుని వెతుక్కుంటూ ఆయన ప్రాచీన చీనా మొత్తం పర్యటించాడు. అప్పటి ప్రధాన రాజ్యాల తలుపులన్నీ తట్టాడు. ఆశ్చర్యమేమిటంటే, ప్రతి ఒక్క చోటా, రాజులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కాని మంత్రులు ఆయన్ని తమ పాలన దరిదాపులకు కూడా రానివ్వలేదు. ఎందుకని?

మనకి వేదకాలం లాగా, చీనా చరిత్రకి కూడా ఒక వేదకాలం ఉంది. ఒకప్పుడు అంటే మూడు వేల ఏళ్ళ కిందట పడమటి ఝౌ చక్రవర్తులు షాంగ్ రాజవంశ పాలనని కూలదోసి ఒక ఏలుబడి సాగించారు. కొన్ని ధర్మాల మీద, విలువలమీద ఆధారపడి తాము పాలన చేస్తున్నామనీ, ఆ ధర్మం తప్పితే తమకి పాలనాధికారం పోతుందనీ వాళ్ళు నమ్మారు. అన్నట్టుగానే ఏడువందల ఏళ్ళ పాలన తర్వాత ఆ రాజవంశం కూలిపోయింది. చీనా ఉత్తరాది తెగల దండయాత్రలకు గురయి, ఆ పడమటి ఝౌ సామ్రాజ్యం తూర్పు సామ్రాజ్యంగా మారి లొయాంగ్ రాజధానిగా నడిచింది.

కానీ పవిత్ర రోమన్ సామ్రాజ్యంలాగా అది పేరుకు మాత్రమే సామ్రాజ్యం. యథార్థమైన పాలన ఏడు సామంత రాజ్యాల చేతుల్లో ఉండేది. తూర్పు ఝౌ చక్రవర్తులు కేవలం ధార్మిక కార్యకలాపానికి మాత్రమే పరిమితమైపోవలసి వచ్చింది. ఆ ఏడు సామంత రాజ్యాలతో పాటు మరికొన్ని చిన్నరాజ్యాలు కూడా ఒకరితో ఒకరు కలహించుకుంటూ ఉండేవారు. ప్రజలమీద పన్నులు విధిస్తూ, తాము మాత్రం భోగలాలసతతో, పరస్పర ద్రోహాలతో కాలంగడుపుతుండేవారు.

చీనా చరిత్రలో సమరశీల రాజ్యాల కాలంగా పేరు పొందిన ఆ కాలంలో కన్ ఫ్యూసియస్ పుట్టి పెరిగాడు. ఆయన ప్రాచీన ఝౌ చక్రవర్తుల ధర్మశాస్త్రాలు, సాహిత్యం, సంగీతం క్షుణ్ణంగా అధ్యయనం చేసాడు. ఆ పాలన లోని సద్గుణాల్ని, తన కాలం నాటి దుర్గుణాల్ని ఆయన తైపారు వేసుకుని చూసుకున్నాడు. తన కాలం నాటి సమాజానికి రాజకీయ-సామాజిక విముక్తి లభించాలంటే రెండు విలువలు అవసరమని భావించాడు. అవి దయార్ద్రహృదయంతో కూడిన పాలన, ధార్మిక శీలమూను. ఆ రెండు విలువల్నీ ఆయన ప్రచారం చేస్తూ గడిపాడు. ఆ విలువల్ని కన్ ఫ్యూసియస్ తనకి పాలనాధికారం లభించినప్పుడు స్వయంగా అమలుచేసి చూసాడు. ఆ విలువల్ని ఎవరు ఉల్లంఘిస్తున్నా, రాజులుగాని, మంత్రులుగాని, సైనికాధికారులుగాని, మిత్రులు గాని, శిష్యులుగాని, చివరికి తన కన్న కొడుకు గాని, ఎవరు వాటినుంచి దారితప్పినా ఆయన వారి ముఖం మీదనే వారికి హితవు చెప్తూ వచ్చాడు, వినకపోతే మందలిస్తూ వచ్చాడు, పూర్తిగా పెడతోవ పడితే అభిశంసిస్తూ వచ్చాడు.

ఆయన తన యుటోపియాకి ఒక ప్రాచీన కాలంలోని సరళయుగాన్ని ఆధారంచేసుకున్నప్పటికీ, ఆ విలువలు దాదాపుగా సార్వకాలికాలు, సార్వజనీనాలు. ప్రతి ఒక్క విలువనీ ఆయన తరచిచూసాడు. నిశితపరీక్షకి గురిచేసాడు. ఎప్పుడైనా ఆయన తన మాటలు మర్చిపోతే శిష్యులు వాటిని గుర్తుచేసేవారు. కాబట్టి సోక్రటీస్ చెప్పినట్టుగా ఆయనది thouroughly examined life. ఆయన మాట్లాడిన విలువలు కూడా thouroughly examined.

ఉదాహరణకి, ఆయన మాట్లాడిన విలువల్లో కౌటుంబిక విధేయత filial piety చాలా ప్రధానమైనది. అంటే కొడుకు తండ్రి పట్ల చూపించవలసిన విధేయత. ఆయన న్యాయశాఖామంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరకి ఒక వ్యాజ్యం విచారణకు వచ్చింది. ఆ గొడవలో ఒక తండ్రి తన కొడుకు తనని నిర్లక్ష్యం చేయడమే కాక హింసిస్తున్నాడని కూడా ఫిర్యాదు చేసాడు. కన్ ఫ్యూసియస్ కి వెంటనే పరిష్కారం దొరకలేదు. ఆయన ఆ తండ్రీ కొడుకులిద్దరినీ మూడు నెలలు కైదులో పెట్టాడు. ఆ తర్వాత ఇద్దర్నీ విడుదల చేసేసాడు. కన్ ఫ్యూసియస్ మాట్లాడే ధార్మిక సూత్రాల ప్రకారం ఆ కొడుక్కి మరణశిక్ష విధించాలి. ఎందుకంటే అతడు కౌటుంబిక విధేయతని పూర్తిగా ఉల్లంఘించాడు. ఆ వ్యాజ్యాన్ని కన్ ఫ్యూసియస్ ఏ విధంగా పరిష్కరిస్తాడా అని ఆ రాజు ఆసక్తిగా, కానీ మౌనంగా చూస్తూ ఉన్నాడు. కానీ కన్ ఫ్యూసియస్ వాళ్ళిద్దర్నీ విడుదల చెయ్యగానే ఆ కొడుకుని ఎందుకు విడుదల చేసారని అడిగాడు. అందుకు కన్ ఫ్యూసియస్ చెప్పాడు కదా: ఆ కొడుకు అలా తప్పుదోవపట్టాడంటే అందుకు ప్రధాన కారణం ఆ తండ్రినే. అతడు తన కొడుకుని సరిగ్గా పెంచలేదు. అందుకని ఇద్దర్నీ సమానంగా శిక్షించి, ఇద్దర్నీ వదిలేసాను అన్నాడు!

కన్ ఫ్యూసియస్ నమ్మిన, మాట్లాడిన విలువలన్నిటినీ ప్రధానంగా ఎనిమిది విభాగాల కింద అర్థం చేసుకోవచ్చునని క్లెమెంట్స్ చెప్తున్నాడు. అవి: దయార్ద్రహృదయం, సత్యసంధత, మర్యాద, వివేకం, విధేయత, విశ్వాసం, కౌటుంబిక బాధ్యత, పెద్దవాళ్ళ పట్ల గౌరవం. ఈ విలువలు ఏ కాలానికైనా, ఏ సమాజానికైనా వర్తించేవే. నాలాగా ప్రభుత్వంలో నలభై ఏళ్ళు పనిచేసినవాడికి కన్ ఫ్యూసియస్ సంభాషణల్లోని ప్రతి ఒక్క సంభాషణకి ఎన్నో సంఘటనలు ఉదాహరణలుగా గుర్తొస్తూనే ఉంటాయి.

ఉదాహరణకి, పెద్దవాళ్ళని గౌరవించడం అనే విలువని తీసుకోండి. చూడటానికి ఇది గ్రామీణజీవితంతాలూకు, మధ్యయుగాల నాటి విలువలాగా అనిపించవచ్చు. కాని ప్రభుత్వాల్లో ఈ విలువ ఎంత మృగ్యమో నేనెన్నో సార్లు చూసాను. పాతికేళ్ళు కూడా నిండకుండానే సివిల్ సర్వీసులో సెలక్ట్ అయి ఉన్నతోద్యోగం దక్కించుకున్న ఎందరో యువకులు వయసులోనూ, జ్ఞానంలోనూ, అనుభవంలోనూ తమకన్నా ఎంతో ఉన్నతులైన అధికారుల్ని, కేవలం వారు ఆల్ ఇండియా సర్వీసు అధికారులు కారు అన్న కారణం వల్ల నించోబెట్టి మాట్లాడటం, నోటికి ఏమొస్తే అది మాట్లాడటం నేనెన్నో సార్లు చూసాను.

ఇది చాలా చిన్న ఉదాహరణ. కాని చాలా పెద్ద విషయాలు ఉన్నాయి. ప్రభుత్వాల ప్రధాన ధ్యేయం సుపరిపాలననే అయితే అందుకు కన్ ఫ్యూసియస్ ని మించిన గురువు మరొకరులేరు. ఈ క్షణాన కన్ ఫ్యూసియస్ సంభాషణల ( The Analects) నుంచి ఎన్నో వాక్యాలు గుర్తొస్తున్నాయి. వాటన్నిటినీ ఉల్లేఖించాలన్న ప్రలోభాన్ని కష్టం మీద అదుపు చేసుకుంటున్నాను. ఒక్క మాట మాత్రం చెప్తాను. సమాజం పట్ల అపారమైన బాధ్యత, మనుషులు సంతోషంగానూ, శాంతిగానూ జీవించాలన్న తపన ఉన్న మనిషి మాత్రమే అటువంటి జీవితం జీవించగలుగుతాడు, అటువంటి మాటలు మాట్లాడగలుగుతాడు.

21-7-2022

Leave a Reply

%d