ఒక జీవనది

బాలసాహిత్య ఉద్యమకారుడు, పిల్లలప్రేమికుడు రెడ్డి రాఘవయ్యగారు ఈ లోకాన్ని వదిలివెళ్ళిపోయారని తెలిసినప్పుడు చాలా వెలితిగా అనిపించింది. ఆయన జీవించి ఉండగా తెలుగు జాతి ఆయనకు తీర్చుకోవలసిన ఋణం తీర్చుకోలేదనే అనిపించింది. అలాగని ఆయనకు గుర్తింపు రాలేదని, పురస్కారాలు రాలేదని అనలేను. కాని ఆయన తెలుగు సాహిత్య ప్రపంచానికి, తెలుగు సమాజానికి తెలియవలసినంతగా తెలియలేదు.కేవలం తమ రాజకీయాలు, తమ ముఠాలు, తమ పురస్కారాలు మాత్రమే ప్రధానంగా ఉండే ‘ప్రధాన స్రవంతి’ తెలుగు సాహిత్యం ఆయన కోసం నిజంగా ఒక్క రోజు కూడా చెవి ఒగ్గింది లేదు.

నేననుకుంటాను, ఈ లోపం అసలు మన సాహిత్య దృక్పథంలోనే ఉంది. 1950 కి పూర్వం ప్రధాన స్రవంతి తెలుగు రచయితలు, కవులు, ఉద్యమకారులు బాలసాహిత్యకారులు కూడా. వీరేశలింగం పిల్లలకోసం పాఠ్యపుస్తకాలు రాస్తాడు. గురజాడ పిల్లల పాటలు రాసాడు. గిడుగు సవరపిల్లలకోసం కథలూ, పాటలూ సంకలనం చేసాడు. చలం బిడ్డల శిక్షణ మీద ఏకంగా ఒక పుస్తకమే రాసాడు. చింతాదీక్షితులు పిల్లలకోసం రాసిన పాటలు, కథలు ఆయన్ని ఇప్పటికీ తెలుగు బాలసాహిత్యంలో అగ్రేసరుడిగా నిల్బెడుతున్నాయి. విశ్వనాథ, కృష్ణశాస్త్రి, బాపిరాజు బాలసాహిత్యంలో చెప్పుకోదగ్గ కృషి చేసారు. ఆ తర్వాతి తరంలో జాషువా, కొ.కు, కరుణశ్రీ, దాశరథి, బైరాగి. అంతే, ఆ తర్వాత మరొక్క కవి, రచయిత నాకు కనబడటం లేదు.

1980 ల తర్వాత ప్రధాన స్రవంతి సాహిత్యమూ, బాలసాహిత్యమూ వేరు వేరు శాఖలుగా చీలిపోయాయి. ఉధాహరణకి గత నలభయ్యేళ్ళల్లో సాహిత్య అకాదెమీ పురస్కారం ఏ రచయితకి గాని, ఏ పుస్తకానికిగాని బాలసాహిత్యానికి వచ్చిందా? బహుశా ఈ లోటుని గమనించి సాహిత్య అకాదెమీ బాలసాహిత్యం కోసం వేరే పురస్కారాన్ని ఏర్పాటు చేయడంతో ఇక ప్రధాన స్రవంతి రచయితలకీ, కవులకీ, ఆ బరువు తప్పిపోయింది. నాకు తెలిసి, బహుశా, నామిని, చంద్రలత వంటి ఏ ఒకరిద్దరో తప్ప, నవల, నాటకం, కథ వంటి ప్రక్రియల్లో విశేష కృషి చేసిన ఏ సమకాలిక రచయిత కూడా బాలసాహిత్యంలో ప్రయత్నిస్తున్నదృష్టాంతం లేదు. ( నేను పొరపడితే చెప్పండి. ఏ రచయిత అయినా తాను పిల్లలకోసం కూడా రాస్తున్నానని చెప్తే ఆ వార్త నేను సంతోషంగా స్వీకరిస్తాను. నా సమాచారాన్ని అప్ డేట్ చేసుకుంటాను.)

2009 లో ఒక రోజు నేను సంక్షేమభవన్లో పని చేసుకుంటున్న రోజుల్లో రాఘవయ్య గారు మా ఆఫీసుకి వచ్చారు, నన్ను వెతుక్కుంటూ. అప్పటికి నేను ఆయన పేరైతే విన్నానుగాని, చూడటం అదే ప్రథమం. పూర్వకాలపు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిలాగా, ఒక రైతులాగా నిరాడంబరంగా కనిపించిన ఆ మనిషిని చూస్తూనే నా దగ్గర బంధువు ఎవరో నన్ను వెతుక్కుంటూ వచ్చినట్టనిపించింది. ఆ రోజు ఆయన బాలసాహిత్యం గురించి నాకెంతో చెప్పారు. ‘బాల సాహిత్య నిర్మాతలు’ అని తాను రాసిన పుస్తకం నా చేతుల్లో పెట్టారు. తెలుగులో తొలి తెలుగు బాల గేయం గిడుగు సీతాపతి రాసిన ‘చిలుకమ్మ పెండ్లి’ (1902) అనే పాట అని చెప్తూ, 2002 నాటికి బాలగేయాలు శతవత్సరాలు పూర్తిచేసుకున్నాయనీ, ఆ నూరేళ్ళ కాలంలో ప్రసిద్ధి చెందిన బాలగేయాల్ని తాను ఒక సంకలనంగా తీసుకురావాలనుకుంటున్నాననీ, దానికి నన్ను ముందుమాట రాయమనీ అడిగారు. అది నేను అపూర్వమైన గౌరవంగా భావించేను. తన పుస్తకం మీద మాట్లాడమని డా. నారాయణ రెడ్డి అడిగినప్పటికన్నా, తన పుస్తకానికి ముందుమాట రాయమని ఇస్మాయిల్ అడిగినప్పటికన్నా అది నాకు ఎక్కువ సంతోషాన్ని కలిగించింది. ఆయన ఇచ్చిన సమాచారంతో, స్ఫూర్తితో నేను ఆ ముందుమాట చాలా విపులంగా రాసాను. (ఆ పూర్తి వ్యాసం నా ‘సాహిత్యమంటే ఏమిటి ‘(2011) సంపుటిలో https://chinaveerabhadrudu.in/ రచనలు/సాహిత్యమంటే ఏమిటి పే.126-132 లో చూడవచ్చు.)

రెండేళ్ళ కిందట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్ వాడీలని ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా మారుస్తూ వారికి ప్రిప్రైమరీ-1, ప్రి ప్రైమరీ-2 కోసం పాఠ్యపుస్తకాలు రూపొందించగలమా అన్నప్పుడు దేశంలోనే అత్యుత్తమ పుస్తకాలు రూపొందించాలనుకున్నాం. అప్పటికింకా భారతప్రభుత్వం ప్రి-ప్రైమరీ కోసం కరికులం ఫ్రేమ్ వర్క్ ని ఇంకా విడుదల చెయ్యలేదు. కాని మేం రాష్ట్రంలోనూ, దేశంలోనూ అత్యుత్తమ విద్యావేత్తలతో చర్చించి ముందొక ఫ్రేమ్ వర్క్ రూపొందించాం. మేం పుస్తకాలు రూపొందించడం పూర్తయ్యేటప్పటికి భారతప్రభుత్వం తన ఫ్రేమ్ వర్క్ విడుదల చేసింది. అది దాదాపుగా మేము రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారమే ఉండటం మాకెంతో సంతోషాన్నిచ్చింది. అయితే ఆ సందర్భంగా, పిల్లలకి, తెలుగులోనూ, ఇంగ్లిషులోనూ నర్సరీ రైమ్సు ని పొందుపరచడం కోసం చాలా వెతికాం. ఇంగ్లిషు మీడియం కాన్వెంటుల్లో వాడుతున్న వివిధ పుస్తకాలు ( దాదాపు ముప్పై రకాల పుస్తకాలు వాడుతున్నారు, ఒక చిన్న వీథి కాన్వెంటునుండి డిల్లీ పబ్లిక్ స్కూలుదాకా) తెప్పించుకుని చూసాం. ఆ పుస్తకాలు చూసినప్పుడు నాకు చెప్పలేనంత నిరుత్సాహం కలిగింది. ఎందుకంటే ఏ ఒక్క నర్సరీ రైము పుస్తకంలోనూ పిల్లల పట్ల ప్రేమగాని, శ్రద్ధగాని కనిపించలేదు. చేతికి ఏది దొరికితే అది ఆ పుస్తకంలో చేర్చి దాన్నే పిల్లలకు నేర్పుతున్నారు.

అదే తెలుగు విషయానికి వస్తే, తెలుగు బాలగేయాల్లో ఉన్న వైవిధ్యం, భాషా సౌందర్యం, రంగుల ప్రపంచం ఎంతో అద్వితీయంగానూ, ఇంగ్లిషు ఇప్పట్లో అందుకోలేనంత ఎత్తుల్లోనూ కనిపించాయి. (నిజానికి తాను బాలగేయాలు రాయడానికి స్ఫూర్తి విక్టోరియా యుగం నాటి ‘బాయ్స్ ఓన్ యాన్యువల్’ అనే పుస్తకం అని సీతాపతిగారు చెప్పుకున్నారు. కాని ఇంగ్లిషు నర్సరీ రైములు విక్టోరియా యుగంలోనే ఆగిపోయాయి). తెలుగు బాలగేయాలు ఎంతో సుసంపన్నంగా కనిపించినప్పటికీ, అవన్నీ కూడా దాదాపుగా 1960 కి పూర్వానివే. ఆ తర్వాత కూడా రాశిలో ఎంతో బాలసాహిత్యం వచ్చినప్పటికీ, అదంతా ఏదో ఒకదాన్ని, సైన్సునో, మరొకటో ప్రచారం చెయ్యడానికి రాసిందే తప్ప, సాహిత్యాన్ని సాహిత్యంగా రాసింది చాలా తక్కువ.

ఇటువంటి నిర్జలభూమిలో రాఘవయ్యగారు ఒక ఒయాసిస్సు మాత్రమే కాదు, ఒక జీవనదిగా ప్రవహిస్తూ వచ్చారు. తాను రాసారు, రాసినవాళ్ళని నలుగురికీ తెలిసేలా పైకెత్తి చూపారు. తమకోసం మాత్రమే తాము రాసుకుంటూ, తమ రచనలు మాత్రమే తాము చదువుకుంటూ, ఎంతసేపూ తమగురించి మాత్రమే మాట్లాడుకుంటూ ఉండే ‘ప్రధాన స్రవంతి’ తెలుగు సాహిత్యాన్ని (అందులో నేను కూడా ఉన్నాను) సిగ్గుపడేలా చేసారు.

పిల్లలున్నంతకాలం రాఘవయ్యగారు ఉంటారు. సదా బాలకుడిగా ఉంటారు.

25-7-2022

Leave a Reply

%d bloggers like this: