అరుణాచల ప్రదేశ్

సుప్రసిద్ధ స్పానిష్ రచయిత కార్లోస్ ఫ్యుయెంటిస్ ఒక ఇంటర్వ్యూలో ఒక ఫ్రెంచి సాహిత్యవేత్త చెప్పిన మాటల్ని ఉటంకించాడు. ఆ ఫ్రెంచి విమర్శకుడు చెప్పిందేమంటే, నవలారచనలో పంతొమ్మిదో శతాబ్ది పూర్వార్థం యూరోప్ ది కాగా, ఉత్తరార్థం రష్యాది అనీ, ఇరవయ్యవ శతాబ్ది పూర్వార్థం అమెరికాది కాగా, ఉత్తరార్థం లాటిన్ అమెరికాది అనీ. అతడు చెప్పలేదుగానీ నేను ఆ వాక్యాన్ని మరికొంత పొడిగించి చెప్పేదేమంటే, ఇరవై ఒకటవ శతాబ్ది పూర్వార్థం భారతీయ రచయితలదని. అంటే సాల్మన్ రష్ది, అరుంధతీ రాయ్, నయిపాల్, విక్రం సేఠ్, ఝంపా లహిరి వంటి ఇంగ్లిషులో రాసే భారతీయ రచయితలది కాదు, భారతీయ భాషల్లో రచయితలది అని. ఈ మధ్య గీతాంజలి శ్రీ నవలకు బుకర్ బహుమానం రావడం ఈ కొత్తధోరణిని సూచిస్తున్నదని నేను అనుకుంటున్నాను.
 
ఎందుకంటే, గత శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన రచయితల నవలలు నేను కొన్ని ఈ మధ్య చదివాను. కాని అవి నాలో రేకెత్తించలేని స్పందన, ఇదిగో, అరుణాచల ప్రదేశ్ కి చెందిన ఆదివాసీ రచయిత్రుల ఈ సంకలనం రేకెత్తించగలిగింది. మమంగ్ దాయి వెలువరించిన The Inheritance of Words (జుబాన్, 2021) అనే ఈ సంకలనం ఆద్యంతం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. రానున్న కాలం ఈ రచయిత్రులదీ, ఇలా ఇంగ్లిషులోకి రాగలిగిన తక్కిన భారతీయ రచయిత్రులందరిదీ కూడా అని నిస్సంకోచంగా చెప్పగలను.
 
మమంగ్ దాయి పేరు నేను మొదటసారి విన్నది నాలుగేళ్ళ కిందట అస్సాం వెళ్ళినప్పుడు. అప్పుడు నా యాత్రానుభవాలు రాయడానికి కూచున్నప్పుడు, బ్రహ్మపుత్ర గురించి మమంగ్ దాయి రాసిన వాక్యాలు ఎవరో ప్రస్తావిస్తే చదివాను. అప్పుడే ఆమె పరిణతి నన్ను ఎంతో ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ సంకలనం చూసిన తరువాత ఆమె సంస్కారానికి నమోవాకాలు సమర్పించకుండా ఉండలేకపోతున్నాను.
 
ఒక భాషకీ, ఒక ప్రాంతానికీ చెందిన వారు తమ భాషనీ, తమ సంస్కృతినీ, తమ సాహిత్యాన్నీ నలుగురికీ పరిచయం చేయవలసిన పద్ధతి ఇది. తెలుగు సాహిత్యం నుంచి కూడా ఇంగ్లిషులోకి కొన్ని అనువాద సంకలనాలు రాకపోలేదుగాని, అవి ఆ సంకలనకర్తల రాగద్వేషాల్ని ప్రతిబింబించినట్టుగా తెలుగు సాహిత్యాన్ని ప్రతిబింబించటం లేదని చెప్పగలను. వాళ్ల ఎంపిక కూడా చాలా lopsided. కాని ఒక ఆదివాసీ రచయిత్రి, తన ప్రాంతాన్ని పరిచయం చేయడానికి తీసుకువచ్చిన ఈ సంకలనంలో తన ప్రాంతం పట్ల, తమ సంస్కృతి పట్ల గౌరవం తప్ప మరే ప్రయోజనాలూ కనిపించడం లేదు.
 
అరుణాచల ప్రదేశ్ కావటానికి చిన్న రాష్ట్రమే అయినప్పటికీ, ఇరవై తెగలతో, దాదాపు తొంభై కి పైగా మౌఖికభాషల్తో అపారమైన సాంస్కృతిక వైవిధ్యం ఉన్న ప్రాంతం. చాలా కాలందాకా, ఆ గిరిజన తెగలు తమలో ఒకరికొకరిని కలిపే అనుసంధాన భాష ఏమీ లేకపోవడం వల్ల ఎవరికి వారుగానే ఉంటూ వచ్చారు. గత వందేళ్ళుగా అస్సామీ అటువంటి ఒక అనుసంధాన భాషగా కొంత పాత్ర పోషించింది. పాఠశాలల్లో బోధన-అభ్యసన భాషగా అస్సామీ అరుణాచల ప్రదేశ్ లో వివిధ తెగల మధ్య దూరాన్ని తగ్గించకపోగా మరింత పెంచిందనే విమర్శ ఎదుర్కొంది. అందుకని 1987 లో అరుణాచల ప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడగానే ఇంగ్లిషు బడిభాషగా అవతరించింది. మరొకవైపు జనవ్యవహారంలో హిందీ కొత్త అనుసంధానభాషగా రూపొందుతూ ఉంది. అరుణాచల్ హిందీ పేరిట వ్యాపిస్తున్న ఈ భాషలో ఒక గుణం, ఒక అవగుణం రెండూ ఉన్నాయి.
 
గుణమేమిటంటే, ఇది అరుణాచల ప్రదేశ్ ని భారతదేశ సంస్కృతిలో మరింత చేరువగా తీసుకురాగలుగుతంది. కాని అవగుణం కూడా అదే. అలా అరుణాచల ప్రదేశ్ ని ఆలింగనం చేసుకునే క్రమంలో ఆ గిరిజన గీతాల స్థానంలో, ఆ కథలూ, పొడుపుకథల స్థానంలో హిందీ రాజకీయాలు, హిందీ కమర్షియల్ సినిమాలూ అరుణాచల్ ని ముంచెత్తేసే ప్రమాదం లేకపోలేదు. అటువంటి ప్రమాదం నుంచి తమను తాము కాపాడుకోవడం కోసమా అన్నట్టుగా ఇటువంటి సంకలనం వెలువడిందని చెప్పుకోవాలి.
 
ఇందులో కథలున్నాయి, వ్యాసాలున్నాయి, పొడుపుకథలున్నాయి, చిత్రలేఖనాలున్నాయి, ఫొటోలున్నాయి, చివరికి ఒక పర్వతారోహకురాలితో చేసిన ఇంటర్వ్యూ కూడా ఉంది. పట్టుమని 200 పేజీలు కూడా లేని ఈ సంకలనం చదివితే ఆ అరుణాచల ప్రదేశ్ అడవుల్నీ, కొండల్నీ, ఆ ఆదివాసుల్నీ చాలా దగ్గరగా చూసిన అనుభూతి కలుగుతుంది. ఇందులో ముఖ్యవిశేషమేమంటే, సంకలనకర్తతో సహా ఇందులో చోటుచేసుకున్న 32 మంది కూడా రచయిత్రులు. ఆదివాసులు. వారిలో కొందరు ఇంగ్లిషు సాహిత్యం చదువుకుని ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవారు. కొందరు మానవశాస్త్రం, సాంఘిక శాస్త్రాలు చదువుకున్నవాళ్ళు. కొందరు పాత్రికేయులు. చాలామంది అరుణాచల ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు.
 
అందరూ కూడా ఒక అరుణాచల ప్రదేశ్ ను అన్వేషిస్తున్నారు. అది ఎక్కడ కనబడ్డా దాన్ని గుర్తుపట్టగలుగుతున్నారు. తాము ఎక్కడికి వెళ్ళినా తమ ప్రాంతం ముద్ర ఏదో ఒక రూపంలో వదిలిపెట్టి వెళ్ళాలని కోరుకుంటున్నారు. ఇందులో ఒక పర్వతారోహకురాలి ఇంటర్వ్యూ ఉందని చెప్పాను కదా. తినె మెనా అనే ఆ అమ్మాయి అరుణాచల ప్రదేశ్ నుంచి మొదటిసారిగా ఎవరెస్టు అధిరోహించిన మహిళగా చరిత్ర సృష్టించింది. ఆమెని ఇంటర్వ్యూ చేస్తున్న మమంగ్ దాయి ‘ఎవరెస్టు అధిరోహించినప్పుడు నీ మెడలో మన అరుణాచల ప్రదేశ్ సాంప్రదాయిక వస్త్రమొకటి చుట్టుకుని ఉండటం చూసాను, అదేమయ్యింది?’ అని అడిగితే ‘దాన్ని అక్కడ ఆ కొండమీద మన ప్రాంతానికి గుర్తుగా వదిలిపెట్టి వచ్చాను’ అని చెప్పిందామె!
 
సాధారణంగా ఒక ప్రాంతానికీ, లేదా ఒక భాషకీ ప్రతినిధిగా వెలువడే ఇటువంటి సంకలనాల్లో సాహిత్యవిలువలకి ప్రాధాన్యత ఉండకపోవడం సహజం. ఈ పుస్తకం లో అన్ని రచనలూ ఒకే సాహిత్యగాఢతని కలిగిఉన్నాయని చెప్పలేనుగాని, పలచటి రచనలు లేవని మాత్రం చెప్పగలను. కొన్ని చాలా అత్యున్నత స్థాయి రచనలు కూడా. ఉదాహరణకి లెకి థుంగాన్ అనే ఆమె రాసిన Doused Flames (చల్లార్చిన మంటలు) నిస్సందేహంగా గొప్ప కథ. ఆ రచయిత్రి నేపథ్యమేమై ఉండవచ్చునా అని పరిచయం చూస్తే ఆమె మెక్ గిల్ యూనివెర్సిటీ నుంచి యాంత్రొపాలజీలో పి.ఎచ్.డి చేస్తున్నదని తెలిసింది. ఇటువంటి రచయిత్రులు, ఇటువంటి కథలు కావాలి తెలుగులో కూడా.
 
తెలుగులో కూడా ఈ మధ్య అనువాదాల గురించి ఒక జాగృతి మొదలయినట్టు కనిపిస్తున్నది. నేను వారికిచ్చే సలహా ఏమిటంటే, ఒక వర్క్ షాపులాగా కూచుని ఇలా ఒక సంకలనాన్ని రూపొందించుకుని దాన్ని ఇంగ్లిషులోకి అనువదించడానికి ప్రయత్నించండి. ప్రచురించడానికి ఎవరో ఒకరు ముందుకొస్తారు. అది పెద్ద విషయం కాదు.
 
ఈ రచనలు ఎలా ఉన్నాయో మచ్చుకి రెండు కవితలు తెలుగుచేస్తున్నాను మీ కోసం.
~
 
1
 

చెక్క ఇల్లు

 

గ్యాటి .టి.ఎం. అంపి

 
గలగల్లాడుతున్న ఆకులు
కిర్రుమంటున్న తలుపులు
కొండగాలి వీవెన.
 
పరిచిత పదధ్వనులు
గొంతుతగ్గించిన గుసగుస
రగులుతున్న నెగడి సెగ.
 
అబ్బా, తియ్యటి సువాసన
రహస్యంగా చెప్పుకున్న పాతకథలు
తచ్చాడుతున్న ఆత్మల వెలుగు.
 
రాళ్ళదారిన నడక
గడిచినకాలాల్ని గుర్తుచేసే నవ్వులు
గృహం ఇల్లు గా మారిపోయింది.
 
2
 

నాలో ఏ భాగం

 

కొల్పి దాయి

 
నాలో ఏ భాగం వాస్తవం
లోపల గదిలో దాక్కున్నదా?
లేక బయట మందిని ఎదుర్కుంటున్నదా?
 
బాధలో నేను పెట్టుకున్న కన్నీళ్ళా
లేక నేను పంచిపెట్టిన చిరునవ్వులా
ఇంట్లో నివసిస్తున్నా ఆ బాలికనా
లేక బయట తలెత్తుకున్న ఆ వనితనా
భయంతో వణుకుతున్న ఆ చిన్నారినా
లేక గర్వంగా సంచరిస్తున్న ఆ మహిళనా
సిగ్గుపడుతూ తప్పుకుంటున్న ఆ పిల్లనా
లేక వ్యవహారాలు చక్కబెడుతున్న ఆ యువతినా?
 
కొన్నిసార్లు నేను పొద్దుతిరుగుడు పువ్వుని,
మరికొన్నిసార్లు లేత గులాబిని.
 
13-7-2022

Leave a Reply

%d bloggers like this: