
తెంసులా ఆవో నాగాలాండ్ లోని ఆవో తెగకు చెందిన రచయిత్రి. ఆమె పుట్టింది అసాంలో. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకుంది. దుర్భరమైన పేదరికంలో కష్టపడి చదువుకుంది. ఇంగ్లిషు ఉపాధ్యాయినిగా జీవితం ప్రారంభించి, నార్త్ ఈస్ట్ హిల్ యూనివర్సిటీలో పనిచేసింది. కొన్నాళ్ళు దింపూర్ లో నార్త్ ఈస్ట్ కల్చరల్ జోన్ డైరక్టరుగా కూడా పనిచేసింది. తర్వాత రోజుల్లో ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్ కింద అమెరికాలో రెడ్ ఇండియన్ల సంస్కృతిని దగ్గరగా చూసింది. ఆ అనుభవంతో భారతదేశానికి తిరిగి వచ్చాక ఆవో తెగల మౌఖిక సంప్రదాయం మీద చాలా ఏళ్ళు కృషి చేసి వారి మౌఖిక సాహిత్యం పైన ఒక పుస్తకం కూడా వెలువరించింది.
నేను అసాం వెళ్ళినప్పుడు తెచ్చుకున్న పుస్తకాల్లో నాగాలాండ్ సాహిత్యంలో ఈస్టరన్ కైర్ రాసిన నవల అంగామీ తెగ జీవితాన్ని చిత్రిస్తే, తెంసులా కథాసంపుటి These Hills called Home: Stories from a War Zone (2006) ఆవో తెగ జీవితాన్ని వర్ణిస్తున్న రచన. కైర్ రాసిన కథ పందొమ్మిదో శతాబ్దిలో బ్రిటిష్ ప్రభుత్వంతో అంగామీ తెగ చేసిన పోరాటాన్నీ, సంఘర్షణనీ చిత్రిస్తే, తెంసులా రచన, ఇరవయ్యవ శతాబ్దంలో ఆవో తెగవారు, ప్రత్యేకనాగాలాండ్ కోసం భారతప్రభుత్వంతో చేసిన పోరాటాన్నీ, సంఘర్షణనీ ఎంతో వాస్తవికంగా, గొప్ప కౌశల్యంతో చిత్రించిన రచన. బహుశా గత రెండు శతాబ్దాలుగా నాగాలాండ్ అనుభవించిన సంఘర్షణనీ, రక్తపాతం నుంచి ప్రజాస్వామ్యానికి చేసిన ప్రయాణాన్నీ తెలుసుకోవాలనుకునేవారికి, ఈ రెండు పుస్తకాలూ, ఒక సమగ్ర అవగాహన కలిగిస్తాయని చెప్పవచ్చు.
తెంసులా ఆవో చెప్పిన కథలు దాదాపుగా స్వతంత్ర భారతదేశంలో కాశ్మీరు, పంజాబు, మధ్యభారతదేశంలో ఛత్తీసగఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల్లోని అంతర్గత సంఘర్షణ ప్రాంతాల కథలే అని చెప్పవచ్చు. ప్రజాస్వామిక భారతదేశంలో, కారణాలేమైనా గానీ, ఒకసారంటూ insurgence తలెత్తాక, ఆ ప్రాంతాలు సైన్యం ఆధీనంలోకి పోయిన తరువాత, అక్కడి సాధారణ ప్రజాజీవితం ఎలా అతలాకుతలం అయిపోతుందో ఈ కథల్లో చూడవచ్చు. భారతప్రభుత్వ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించే సైన్యానికీ, ప్రభుత్వం మీద ధిక్కారం ప్రకటించి రాజ్యాధికారం కోరుకునే అండర్ గ్రౌండ్ సైన్యానికీ మధ్య జరిగే పోరాటంలో మామూలు మనుషులు ఎలా నలిగిపోతారో, వాళ్ళు పగలు ప్రభుత్వం వైపూ, రాత్రి అండర్ గ్రౌండ్ ఆర్మీ వైపూ, ఊళ్ళో ప్రభుత్వం వైపూ, అడివిలో అజ్ఞాత సైన్యం వైపూ, ఇలా రెండు విధేయతల కోరల్లోనూ చిక్కి ఎలా దయనీయమైన పరిస్థితుల్లోకి జారిపోతారో రచయిత్రి ఎంతో సూక్ష్మంగా చిత్రించింది.
ఈ సంపుటిలో మొత్తం పది కథలున్నాయి. ఈ పది కూడా నలభైలనుండీ మొదలై 1962 లో నాగాలాండ్ ఒక రాష్ట్రంగా ఏర్పడే దాకా నడిచిన కథలు. చివరి కథలో ఒకడు జీవితంలో ఉన్నతోద్యోగాల్లో స్థిరపడలేక చిన్నపాటి కంట్రాక్టరుగా మారి, పెద్ద కంట్రాక్టరుగా ఎదిగి, అటు అండర్ గ్రౌండ్ కీ, ఇటు బయటి సైన్యానికీ కూడా ముడుపులు చెల్లించుకుంటూ, నాగాలాండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడగానే ఎమ్మెల్యే గా ఎన్నికవడం దాకా కనిపిస్తుంది.
అంత సూక్ష్మవివరాలు ఆమె ఎలా తెలుసుకుందో ఆశ్చర్యమనిపిస్తుంది. నాకు తెలిసి, తెలుగు సాహిత్యంలో ఇటువంటి సంఘర్షణ గురించి ఇటువంటి సూక్ష్మ చిత్రణతో కూడిన రాలేదనే అనుకుంటున్నాను. పరస్పరం పెనగులాడిన రెండు వర్గాల్లోనూ ఆమె ఎవరి పక్షమూ వహించలేదు. ఉన్నది ఉన్నట్టుగా, నిష్పాక్షికంగా, తనంతటతాను ఎటువంటి తీర్పులూ ఇవ్వకుండా, తనకు తెలిసింది చెప్పడానికే ప్రయత్నించింది.
పుస్తకం తెరవగానే మొదటి పేజీలో ఈ వాక్యం కనిపిస్తుంది: I hear the cry, over and over again, ‘Let all the dead awaken and teach the living how not to die’ అని. ఈ మాటలో రెండు అర్థాలు వినిపించాయి నాకు. మరణించిన వాళ్ళు మరణించకుండా ఉండి ఉంటే బాగుండేదనే ఒక అర్థం, లేదా జీవిస్తున్నవాళ్ళు సార్థకంగా జీవించికపోతే అది కూడా మరణంలాంటిదే అనే మరొక అర్థమూ. ఏమైనప్పటికీ, నూట యాభై పేజీలు మించని ఈ పది కథల సంపుటి, జీవితాన్నీ, మృత్యువునీ; యుద్ధాన్నీ, శాంతినీ ఐతిహాసిక ప్రమాణాల్తో చిత్రించిందనే చెప్పాలి.
తన సంపుటికి ఆమె Lest We Forget అని ఒక ముందుమాట రాసుకుంది. అందులో ఇలా అంటున్నది:
‘.. మరొకరి జ్ఞాపకాన్ని నువ్వేమి చేస్తావు? అందులోనూ ఆ జ్ఞాపకం వేదనతో, కేవలం వేదనతో మాత్రమే కూడుకుని ఉన్నప్పుడు? అది నీకు సంబంధించినది కాదని పక్కన పెట్టేస్తావా? అలా చేసావే అనుకుందాం. అయితే ఒక్క మాట చెప్పు, ఆ వేదన గురించి తెలిసిన తర్వాత కూడా నువ్వు మునుపటిలానే ఉండ గలుగుతావా? ఉండలేవు కదా. కాబట్టే, ఇదిగో, ఈ కథలు. తమ వేదన గురించి ఎవరూ మాట్లాడకుండానే, ఎవరూ పట్టించుకోకుండానే నిష్క్రమించిన వారి వేదనని పునఃపరామర్శించే ఉద్దేశ్యంతోనే నేను ఈ కథలు చెప్పడానికి ప్రయత్నించాను. కొంతమంది అదేమంత అవసరం కాదనవచ్చు. కొంతమంది హోలోకాస్ట్ లాంటిది అసలు జరగనే లేదని నమ్ముతున్నట్టు. ‘అదేమంత ముఖ్యంకాదు ‘అనే వాళ్ళని చూస్తే మనుషుల మనస్సుల్లో ఇంత నిర్లక్ష్యం పేరుకుపోయి ఉండగలదా అనిపిస్తుంది. తమని తాకనంతవరకూ ఎటువంటి అన్యాయాన్నీ, అమానుషత్వాన్నీ మనుషులు పట్టించుకోరన్నమాట అనిపిస్తుంది. అయితే ఈ కథలు ‘చారిత్రిక యథార్థాలు’ కావు. దాదాపు అర్థ శతాబ్దం కిందట ఈ భూమిని కార్చిచ్చులాగా చుట్టబెట్టిన సంఘటనల్ని ఖండించడానికో, సమర్థించడానికో, లేదా న్యాయం చెయ్యడానికో రాసిన కథలు కూడా కావు. అందుకు బదులుగా ఈ కథలు చెప్తున్నదేమిటంటే, అటువంటి సంఘర్షణల్లో విజేతలంటూ ఉండరు, బాధితులు మాత్రమే ఉంటారు అనేది. ఆ పర్యవసానాల్ని మానవ ప్రమాణాల ప్రకారం మాత్రమే లెక్కించవలసి ఉంటుంది అనేది. ఎందుకంటే ఆ బాధితులు అనుభవించిన ఆఘాతం కేవలం శారీరిక చిత్రవధకో, లేదా ప్రాణనష్టానికో మాత్రమే సంబంధించింది కాదు, అన్నిటికన్నా ముందు అక్కడ మానవత్వమే చెరచబడింది, అత్యాచారానికి లోనయ్యింది. ఆ నరమేధంనుంచి ఎవరు బయటపడ్డారో వారి ఆత్మల్లోనూ, మనసుల్లోనూ కూడా ఆ గాయాల మరకలు ఇప్పటికీ మిగిలిపోయాయి.’
బహుశా, ఈ కథల సారాంశాన్ని ఆమె రాసుకున్న ఈ వాక్యాలే మరింత స్పష్టంగా చెప్పగలవనుకుంటాను:
‘..ఈ సంపుటిలోని చాలా కథలకు మూలం గత శతాబ్దంలోని యాభైల మొదటినుంచీ నాగాలాండ్ చరిత్రగా మారిన నెత్తురూ, కన్నీళ్ళూను. భారతదేశం నుంచి తామొక ప్రత్యేక దేశంగా విడివడాలన్న కోరికతో యుద్ధం చేసిన సంక్షుభిత సంవత్సరాలనుంచి ఏరిన కథలు ఇవి. అయితే ఆ సంఘర్షణ ఈ కథలకు నేపథ్యం మాత్రమే. ఆ శకంలో సంభవించిన సంఘటనలు నాగా మానసాన్ని ఏ విధంగా ‘విప్లవీకరించాయో’ పరిశీలించడం ఈ కథల ఉద్దేశ్యం. ఆ కాలంలో ఒక ప్రళయసన్నిభమైన తిరుగుబాటు ఎన్నో వాస్తవాల్ని నాగాలముందుకు తీసుకొచ్చింది, తమదైన యథార్థమైన గుర్తింపు ఏమిటో తెలుసుకోడానికి వారింకా తమలో తాము నలుగుతూనే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అది అగ్నిలోంచి సంభవించిన జన్మ. కొంతమంది ఆ అగ్నిశిఖలు తమని తాకకుండా ఉండగలిగినప్పటికీ, చాలామంది ఆ అగ్నిలో నడిచి తమని తామే గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. స్వయం నిర్ణాయకత్వం కోసం నాగాలు చేపట్టిన ఈ యుద్ధగాథ గొప్ప ఆదర్శవాదంతోనూ, తీవ్ర జాతీయవాదం తాలూకు స్వప్నాలతోనూ మొదలయ్యిందికాని, చివరికి, తాము ఏ పరిస్థితుల్ని అధిగమించాలనుకున్నారో అటువంటి పరిస్థితుల్లోకే కుప్పకూలిపోయింది.’
నేను 1987-90 ప్రాంతంలో పార్వతీపురంలో పనిచేస్తున్నప్పుడు అప్పటికి ఇరవయ్యేళ్ళ కిందట శ్రీకాకుళం తిరుగుబాటులో పాల్గొన్న గిరిజనుల్నీ, ఎన్నో ఏళ్ళ పాటు ఏ విచారణా లేకుండానే విశాఖపట్టణం సెంట్రల్ జైల్లో మగ్గి వచ్చిన పోరాటకారుల్నీ, వాళ్ళ త్యాగాల్ని దగ్గరగా చూసిన రచయితల్నీ కొందర్ని చూడగలిగాను. వాళ్ళల్లో కురుపాం మండలం లంకాజోడు గ్రామానికి చెందిన ఆరిక గుంపస్వామి, చినమేరంగికి చెందిన ప్రసిద్ధ రచయిత భూషణంగారూ ఇంకా నా కళ్ళముందు మెదుల్తున్నారు. కాని ఆ పోరాటం తాలూకు ప్రకంపనాలు, అది విడిచిపెట్టి వెళ్ళిన గాయపు మరకలూ చిత్రించబడవలసినంతగా చిత్రణకు నోచుకోలేదనే ఈ కథలు చదివాక నాకు అర్థమయింది.
మా గ్రామాల్లో 1980 తర్వాత నక్సలైట్లు అడుగుపెట్టాక సంభవించిన ఎన్నో పరిణామాల్ని ఈ కథల్లో నేను పోల్చుకోగలిగాను. కాని వాటిని కూడా ఎవరూ, నాతో సహా, ఏ రచయితా రాసినట్టు లేదు (మా అక్క రాసిన ‘కొండఫలం’ లాంటి ఒకటి రెండు కథలు తప్పించి. )
రచయితలూ, కవులూ ఎవరూ పైకి ప్రకటించని ప్రజాప్రతినిధులు అన్నాడు కవి. నేనేమంటానంటే, ప్రతి రచయితా తన కంటూ ఒక వార్తాపత్రిక లేని విలేకరి. అతడు ఏ యాజమాన్యం ప్రయోజనాల కోసమూ పనిచెయ్యనవసరం లేని రిపోర్టరు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి రచయితా ప్రజల విలేకరి కావాలి. ఇదిగో ఇటువంటి రచయితల్ని చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తుంది.
21-6-2022