సంపూర్ణంగా సఫలమయినట్టు లేదు

హరూకి మురకామి. సమకాలిక ప్రపంచ రచయితల్లో తరచూ వినబడే పేరు. జపనీస్ రచయిత. కథకుడు, నవలా కారుడు. ప్రతి ఏడాదీ నోబెల్ ప్రైజు ప్రకటించేముందు నలుగురూ చేసే ఊహాగానాల్లో తరచూ వినిపించే పేరు. పదేళ్ళ ముందు, ఈ సారి తప్పకుండా వచ్చే అవకాశం ఉండే మొదటి అయిదుగురిలో మురకామి కూడా ఉన్నాడన్నారు సదాశివరావు గారు.

ఇరవయ్యేళ్ళుగా ఏ పుస్తకాల షాపులో అడుగుపెట్టిన లిటరరీ ఫిక్షన్ అనే విభాగంలో మురకామి పుస్తకాలు చాలానే కనబడుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా Kafka on the Shore.

ఏం రాస్తున్నాడో చదువుదామని ఆయన పుస్తకాలు కూడా అప్పుడూ అప్పుడూ చేర్చిపెట్టుకున్నానని నా అల్మారా చూస్తే అర్థమయింది. కనీసం మూడు కథాసంపుటాలు కనబడ్డాయి నా పుస్తకాల్లో.

ఏ కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాడో, చూపిస్తాడో చూద్దామని after the quake (2003) తీసాను. ఆరు కథల సంపుటి. దాదాపు నూటనలభై పేజీల పుస్తకం. ఆరింటిలోనూ చివరి కథ కొద్దిగా పెద్ద కథ. కాని నవలిక అని అనలేం. అన్నీ కథలే, చిన్న కథలు కాదు, పెద్ద కథలు, ఖదీర్ బాబు సంతోషిస్తాడు.

కథలన్నిటికీ ఒక ఉమ్మడి ఇతివృత్తం ఉంది. అది భూకంపం. 1995 లో జపాన్ లో కోబె ప్రాంతంలో సంభవించిన ఒక భూకంపం చుట్టూ అల్లిన కథలు. అలాగని పాత్రలేవీ భూకంపబాధితులు కారు. వాళ్ళు ఆ భూకంపానికి దూరంగా, అంచుల్లో, దాదాపుగా ప్రేక్షకులుగా మాత్రమే ఉండిపోయినవాళ్ళు. కానీ ఏదో ఒకరకంగా ఆ భూకంపం వాళ్ళ జీవితాల్ని ఎంతో కొంత మంచికో, చెడ్డకో ప్రభావితం చేస్తుంది.

రచయిత పుస్తకం మొదట్లో గొడార్డ్ సినిమానుంచి ఒక సంభాషణ పొందుపరిచాడు. అది ఈ కథలకి స్ఫూర్తి అని అర్థమవుతుంది. అంటే మనం న్యూస్ పేపర్లో ఫలానా చోట భూకంపం వచ్చింది, ఇంతమంది మరణించారు, ఇంతమంది క్షతగాత్రులయ్యారు, ఇంతమంది నిరాశ్రయులయ్యారు అని చదువుతాం. అలాగని ఆ వార్తలు చదివితే మనకి వాళ్ళ గురించి మనకి నిజంగా ఏమీ తెలియదు. అవన్నీ వట్టి అంకెలు. ఒకవేళ టెలివిజన్లో దృశ్యాలు చూస్తే మాత్రం అదనంగా ఏమి తెలుస్తుంది? ఏమీ తెలియదు. మనం రిమోట్ నొక్కి మరో ఛానెల్ కి వెళ్ళిపోతాం.

కోబె లో భూకంపం సంభవించింది. దానిలో కొందరు మరణించి ఉంటారు, కొందరు గల్లంతయి ఉంటారు, కొందరు దిక్కులేనివారవుతారు. వాళ్ళెవరై ఉండవచ్చు, ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళ బంధువులో, స్నేహితులో ఆ వార్తకి ఎట్లా స్పందిస్తూ ఉండవచ్చు? కథకుడు ఆ ఊహాగానం మీంచి అల్లిన కథలివి.

కాని ఎందుకనో నాకు ఈ కథల్లో నేను ఎదురుచూసిన ప్రగాఢత కనిపించలేదు. కథకుడు తన చుట్టూ ఉన్న జీవితాన్ని ప్రగాఢంగా అనుభవంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్టూ, తన అనుభూతి ప్రగాఢంగా ఉందని నమ్మినట్టూ అనిపిస్తోందిగానీ ఆ ప్రగాఢత్వం నాదాకా అందలేదు.

అన్నిటికన్నా నన్ను ఆశ్చర్యపరిచిన విషయం, ఈ కథల్లో అనా కెరినినా, డాస్టవిస్కీ, ఆయన శ్వేతరాత్రులు, నీషే, జాన్ అప్ డైక్ లాంటి అమెరికన్, యూరపియన్ రచయితలు కనిపించారుగానీ, ఒక్క జపనీస్ రచయిత పేరుకూడా కనబడలేదు. అకుతగవా పేరు కనిపించిందిగాని, అకుతగవా బహుమతి అనే సందర్భంలో మాత్రమే. కనీసం హైకూ అనే మాటకూడా వినబడలేదు. ఒక్క జపనీస్ చిత్రలేఖనం కూడా కనిపించలేదు. అయితే జపాన్ విమానశ్రయాలు ఉన్నాయి, రెస్టరెంట్లు, స్పాలు, రిసార్టులు, సముద్రం, ఒక మారుమూల జపనీస్ పల్లె కూడా ఉన్నాయిగాని, జపాన్ లేదు. జపనీస్ మనస్సుని పట్టుకోడానికి తాను రచనలు చేస్తున్నానని చెప్పుకున్న ఈ రచయిత రాసిన కథలు చదువుతుంటే జపనీస్ లొకేషన్స్ లో తీసిన వెస్టర్న్ టెలివిజన్ సిరీస్ చూస్తున్నట్టు ఉంది.

వస్తువు మాత్రమే కాదు, శిల్పం కూడా. మొదటి కథ చదవగానే రచయిత రేమండ్ కార్వర్ తరహా శైలి కోసం ప్రయత్నిస్తున్నాడని అర్థమయిపోయింది. మురకామి కార్వర్ ను జపనీస్ లోకి అనువదించాడట కూడా. రెండవ కథ, స్పష్టంగా డాస్టవిస్కీ తరహా కథనం. కాని డాస్టవిస్కీ లోతు లేదు. మూడవ కథ మాజికల్ రియలిస్టు పంథాలో నడుస్తుంది. నాలుగవ కథ కాఫ్కా మెటమార్ఫసిస్ తరహా కథ. దాదాపు ఆరు కథల్లోనూ కూడా రచయిత శక్తిమంతులైన కొందరు పాశ్చాత్య రచయితల ధోరణిలో తనదైన కొత్త శిల్పం కోసం ప్రయత్నించాడుగాని, సంపూర్ణంగా సఫలమయినట్టు లేదు.

కాని రచయితకి అంతర్జాతీయ ప్రకాస్తి ఊరికే రాలేదు. అందుకు కారణం అతడు కథ చెప్పడంలో చూపించే స్తిమితం. సన్నివేశ కల్పనలో ఇవ్వగల అత్యంత సూక్ష్మవివరాలు. పాత్రలతో అతడు మెయింటెయిన్ చేసే దూరం. ( అన్నట్టు ఈ కథల్లోనే అతడు ప్రథమపురుష కథనాన్ని వాడాడుట. మామూలుగా అతడిది ఉత్తమపురుష కథనం అని విన్నాను).

సరే, ఇంతకీ, take home ఏమిటి? రెండు విషయాలున్నాయి. మొదటిది, కథలు రాయాలనుకున్నవాళ్ళు, బాగా రాయాలనుకున్నవాళ్ళు ఎంత పాశ్చాత్య శిల్పాన్ని అనుకరించినా, తమ ప్రాంతపు కథనరీతులకి దూరంగా జరిగిపోకూడదు.

(పాశ్చాత్య కథకుల్ని ఎంతమందిని చదివినా, వారి తాత్కాలిక ప్రభావానికి లోనవకుండా ఎంత ఉండలేకపోయినా మళ్ళీ మళ్ళీ చెకోవ్ ని చదువుతూనే ఉండాలి. ఇంతమంది రచయితల్ని, సమకాలికంగా ప్రఖ్యాతి చెందిన ఎందరో కథకుల్ని, చదివాను, కాని చెకోవ్ ని మించిన కథకుడు, చివరికి మపాసా తో సహా, నాకిప్పటిదాకా ఎవరూ కనబడలేదు. అన్నట్టు కార్వర్ కూడా చెకోవ్ ని పదే పదే చదివినవాడే. అయితే కథ రాయడానికి కూచున్నాక ఆ original model ని తాను పూర్తిగా చెరిపేసుకుంటానని కార్వర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అలా చెరిపేసుకోగలగడం మురకామికి బహుశా ఇంకా చాతకాలేదు అనుకోవాలి.)

ఇక రెండవది, ఇట్లాంటి ఒక ఇతివృత్తం చుట్టూ కథలు రాసే ఆలోచన. కరోనా కూడా భూకంపం లాంటిదే. అయితే ఒక్కరోజు ప్రకంపన కాదు, కొన్ని నెలలపాటు సంభవించిన ప్రకంపన. ఆ ఇతివృత్తం చుట్టూ ఇట్లాంటి కథలు ఒక్క రచయితనో లేదా నలుగురు రచయితలో అల్లితే ఎలా ఉంటుందంటారు?

28-6-2022

Leave a Reply

%d bloggers like this: