
నాలుగేళ్ళ కిందట గౌహతి వెళ్ళినప్పుడు ఈశాన్యరాష్ట్రాల సాహిత్యం కొంత కొనుక్కున్నాను. అందులో నాగాలాండ్ కి చెందిన Eastern Kire అనే ఆమె రాసిన Sky is My Father: A Naga Village Remembered (2018) నవల కూడా ఒకటి. అది ఇంగ్లిషులో వెలువడ్డ మొదటి నాగా నవల. చిన్న నవల. కానీ విలువైన కథ, ఎంతో విలువైన చారిత్రిక చిత్రణ.
1826 లో ఈస్ట్ ఇండియా కంపెనీకీ, బర్మా రాజుకి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అస్సాం, మణిపూరు లతో సహా ఈశాన్యభూభాగం కంపెనీ కి అప్పగించబడ్డాయి, మన రాయలసీమ లాగా. అప్పణ్ణుంచీ బ్రిటిష్ వాళ్ళకీ, నాగా గిరిజనులకీ మధ్య నిరంతరం యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. 1832 లో నాగా కొండల్లోకి కంపెనీ సైన్యాలు అడుగుపెట్టడంతో మొదలైన ఆ పోరు దాదాపుగా పందొమ్మిదో శతాబ్దం పొడుగునా కొనసాగుతూనే వచ్చింది. అందులో, 1879 లో, నాగా కొండల్లోని ఖొనొమొ అనే గిరిజన గ్రామానికీ, బ్రిటిష్ సైన్యాలకీ మధ్య భీకరమైన పోరాటం జరిగింది.
ఆ యుద్ధంలో మణిపూరు నుండి, డిబ్రూఘర్ నుండి, సిబ్సఘర్ నుండి ఢాకానుండి పెద్ద సంఖ్యలో ఏనుగులు, గుర్రాలు, కాల్బలం, తుపాకులు, ఫిరంగులతో బ్రిటిష్ సైన్యాలు పట్టుమని 300 మంది కూడా లేని ఖొనొమొ గిరిజన గ్రామం మీద దండెత్తాయి. ఆ యుద్ధం బ్రిటిష్ వారికి ఎంత ముఖ్యమైపోయిందంటే, చివరికి, ఆఫ్గన్ యుద్ధానికి పంపవలసిన సైన్యాన్ని కూడా ఆ చిన్న గిరిజన గ్రామం మీదకి మోహరించారు. కాని, నాలుగు నెలల ముట్టడి తర్వాత కూడా, 500 మంది సైనికుల్ని పోగొట్టుకుని కూడా, బ్రిటిష్ వాళ్ళు ఆ చిన్న అంగామీ గ్రామాన్ని వశపర్చుకోలేకపోయారు. చివరికి 1880 మార్చిలో, గిరిజనులకీ, బ్రిటిష్ వారికీ మధ్య మౌఖికంగా ఒక సంధి కుదిరింది. ఆ సంధి ఒకరకంగా కాల్పుల విరమణ కోసమే చేసుకున్నారా అన్నట్టుగా, అనతికాలంలోనే బ్రిటిష్ వాళ్ళు ఆ గ్రామాన్ని నేలమట్టం చేసారుగాని, ఏడాది గడిచేలోపే తిరిగి గిరిజనులు తమ గ్రామన్ని మళ్ళా పునర్నించుకోగలిగేరు.
దాదాపు అరవై ఏళ్ళ పాటు అంగామీ గిరిజనులతో పోరాడి వారిని తుపాకులతో లొంగదియ్యలేమని తెలిసిన తర్వాత, అమెరికన్ బాప్టిస్టు చర్చి మిషనరీలు బైబిల్ సువార్తలద్వారా వారి మనసు గెలుచుకోగలిగేరు. ఏళ్ళ తరబడి ఆ గ్రామాల్లో పాఠశాలలు, వైద్యశిబిరాలు నిర్వహించి, 1930 నాటికి, ఆ గ్రామాలనుంచి ఎందరో డాక్టర్లనీ, శాస్త్రవేత్తల్నీ, సంగీతకారుల్ని తయారు చెయ్యగలిగారు. నేడు అటువంటి ఒక గ్రామం నుంచి ఒక అంగామీ మహిళ చదువుకుని తమ జాతి కథని ఇలా ఇంగ్లిషులో చెప్పడం వెనక, ఒక శతాబ్దం పాటు ఆ మిషనరీలు చేసిన నిరుపమానమైన కృషి ఉందని నిస్సంకోచంగా చెప్పవచ్చు.
1879-1880 మధ్యకాలంలో ఖొనొమో ముట్టడి, చివరికి బ్రిటిష్ వారికి, అంగామీ గిరిజనులకి మధ్య కుదిరిన ఒప్పందం, ఆ తర్వాత, మొదటి నాగా బాప్తిస్మం పొందడం ఈ నవలకి నేపథ్యం. ఆ కల్లోల కాలంలో ఒక అంగామీ గిరిజన కుటుంబం చుట్టూ ఆమె తన కథ అల్లింది. లెవి అనే గిరిజన యోధుడు, అతడి భార్య పెనొ, అతడి పెద్దకొడుకు రొకొఖొటొ, అతడి చిన్న కొడుకు సటొ ఈ కథలో ప్రధాన పాత్రలు. బ్రిటిష్ వారికి తలవంచని పోరాటం చేసిన లెవి తన చిన్నకొడుకు క్రైస్తవం పట్ల ఆకర్షితుడు కావడంతో చెప్పలేని సంఘర్షణకు లోనవుతాడు. ఆ తండ్రీ, కొడుకుల మధ్య సంఘర్షణ నిజానికి, గిరిజన ఆరాధనా పద్ధతులకీ, క్రైస్తవ మతానికీ మధ్య సంఘర్షణ. సాంప్రదాయిక ఆరాధనలూ, విశ్వాసాలూ, సాంఘిక విధినిషేధాలతో కూడిన ప్రాచీన గిరిజన మతాన్ని వదిలిపెట్టి శాంతి, క్షమలతో కూడిన క్రైస్తవం వైపు నెమ్మదిగా ఒకరూ ఒకరూ గిరిజనులు మొగ్గుతూ ఉండటంతో కథ ముగుస్తుంది.
నైజీరియాకు చెందిన సుప్రసిద్ధ ఆఫ్రికన్ రచయిత చినువా అచెబె రాసిన Arrow of God (1964) లో కూడా ఇటువంటి సంఘర్షణనే చిత్రితమైంది. కాని ఈ నవలా రచయిత్రి, ఎటువంటి ప్రభావాలూ కనిపించని విధంగా, తన జాతికథని చాలా కొత్తగా, నేర్పుగా, స్తిమితంగా చెప్పగలగడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఇటువంటి సంఘర్షణ మన గిరిజన ప్రాంతాల్లో కూడా నేడు కనిపిస్తున్నది. ముఖ్యంగా, సీతంపేట ప్రాంతానికి చెందిన సవర జీవితాల్లో ప్రాచీన సవర ఆరాధనా పద్ధతులకీ, క్రైస్తవానికీ మధ్య ఒక సైద్ధాంతిక సంఘర్షణ నడుస్తూ ఉన్నది. కొన్నేళ్ళ కిందట అత్యధిక సంఖ్యలో సవరలు క్రైస్తవం వైపు మళ్ళిపోయారు. దాంతో సవర ఆరాధనా పద్ధతుల్లో, ఒక Reformation ఉద్యమం లాంటిది మొదలయ్యింది. అక్షర బ్రహ్మ లేదా మడి బ్రహ్మ ఉద్యమం, పురాతన సవర కర్మకాండనీ, ఆచారవ్యవహారాల్నీ సంస్కరించి, క్రైస్తవంలో చేరిన సవరలను తిరిగి సవర దేవతలవైపు, పితృదేవతల వైపు మరల్చడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఆ సంఘర్షణని కనీసం ఒక కథగా కూడా ఏ రచయితా ఇప్పటిదాకా చెప్పలేదు. కానీ, ఈ అంగామీ రచయిత్రిలాగా, ఒక సవర యువకుడో, యువతినో, తమ జాతి కథను ఒక నవలగా రాస్తే ఎంత బాగుంటుంది!
ఈ చిన్ననవలలో అంగామీ జీవన సంస్కృతి లోని ముఖ్య పార్శ్వాల్నీ, పుట్టుక, పెళ్ళి, మరణం, యుద్ధం, శాంతి వంటి జీవనసందర్భాల్నీ రచయిత్రి ఐతిహాసిక ప్రమాణాల్తో చిత్రించింది. నవలకు అనుబంధంగా నలుగురు గిరిజనులు తమ తెగల గురించీ, తమ తెగల పుట్టుక, నివాసం, తమ విశ్వాసాల గురించిన చెప్పిన మౌఖిక కథనాల్ని కూడా రచయిత్రి సేకరించి పొందుపరిచింది. వాటితో పాటు, అంగామీ పదకోశం నుంచి కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలతో పాటు, స్థలవాచకాల సూచిక కూడా అనుబంధంగా అందించింది.
ఈశాన్య భారతదేశంలో అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర ప్రాంతాల్లో పాలన భారత రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూలు లో పొందుపరిచిన విధానం ప్రకారం జరుగుతుంది. 1962 లో నాగాలాండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేదాకా నాగా కొండలు కూడా ఆరవ షెడ్యూలు పరిధిలోనే ఉండేవి. కాని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక నాగాలాండ్ ఆరవ షెడ్యూలు పరిధినుంచి తప్పించబడింది. (అది పూర్తి గిరిజన రాష్ట్రం కాబట్టి, అయిదవ షెడ్యూలు పరిధిలోకి రావాలిగాని, ఇప్పటిదాకా అటువంటి చర్యలేవీ భారతప్రభుత్వం తీసుకోలేదు.) అయితే, ఏ నేపథ్యంలో బ్రిటిష్ వాళ్ళు ఈశాన్య ప్రాంతాల్లో తమ పాలనా విధానాన్ని సవరించుకోవలసి వచ్చిందో, ఇటువంటి నవలలు చదివితే మనకి అర్థమవుతుంది.
ఈశాన్య ప్రాంతాలు కూడా భారతదేశంలో అంతర్భాగం అనీ, వారు కూడా భారతజాతి అని మనకి తెలియాలంటే ఇటువంటి సాహిత్యం మనకి విస్తృతంగా పరిచయం కావాలి. నా వరకూ నాకు, ఈ నవల చదివిన తరువాత, వెర్రియర్ ఎల్విన్, రెవరెండ్ రివన్ బర్గ్ వంటి వాళ్ళ రచనలు వెంటనే చదవాలనిపించింది. మన ప్రాంతాల్లో కూడా ఇటువంటి సాహిత్యం రావాలంటే ఇటువంటి రచనలు తెలుగులోకి రావడం అవశ్యం అని కూడా అనిపించింది.
10-6-2022