విప్లవాత్మక జాతీయవాది

Reading Time: 5 minutes

నీల్ కమల్ పబ్లికేషన్స్ అధినేత సురేశ్ చంద్ర శర్మ, సుభాస్ చంద్ర బోస్ మీద పుస్తకం తీసుకువస్తూ దానికి, ముందుమాట రాయమని నన్ను అడగడం ద్వారా నాకు మహోపకారం చేసాడు. లేకపోయుంటే, విస్మృతి అనే మంచుతో కప్పబడి పోయిన సుభాస్ బోస్ అనే అగ్నిపర్వతాన్ని నేనింత దగ్గరగా చూడగలిగి ఉండేవాణ్ణి కాను.

ఆ స్ఫూర్తిలో చదివిన మరొక పుస్తకం బిల్డర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా సిరీస్ కింద పబ్లికేషన్స్ డివిజన్ వారికోసం గిరిజ కె ముఖర్జీ రాసిన ‘సుభాస్ చంద్ర బోస్’ (1975) మోనోగ్రాఫు. ముఖర్జీ నేతాజీకి సన్నిహితుడు. నేతాజీ రాజకీయ ప్రస్థానాన్ని చాలా దగ్గరగా చూసినవాడు. కాని నేతాజీ జీవితచరిత్ర రాయగలిగే సామర్థ్యం తనకి లేదని రాసుకున్నాడు. ఎందుకంటే నేతాజీ పైన చిన్నపాటి సంగ్రహచరిత్ర రాయాలన్నా కూడా అపారమైన అధ్యయనం చెయ్యవలసి ఉంటుందనీ, ఎంతో జాగ్రత్తగా రాయవలసి ఉంటుందనీ కూడా అన్నాడు. ఆయన మీద ఎన్నో పుస్తకాలు వెలువడుతున్నప్పటికీ, అవి ఏవీ నిర్దిష్టమైనవి కావనీ చెప్తూ, నేతాజీపైన ఒక సమగ్ర చరిత్ర ఇంకా వెలువడవలసే ఉందని పేర్కొన్నాడు.

1975 లో ఆయన ఈ మాటలు రాసేనాటికి నేతాజీకి సంబంధించిన చాలా ఫైళ్ళు బహిర్గతం కానేలేదు. చాలా సమాచారం పబ్లిక్ డొమయిన్ లోకి రానేలేదు. అయితే అటువంటి సమాచారం విస్తారంగా అందుబాటులోకి వచ్చిన తరువాత, ఆ సమాచారం కోసం ఉద్యమించిన వాళ్ళల్లో ఒకడైన చంద్రచూర్ ఘోష్ తాను ఇటీవలనే వెలువరించిన Bose: The Untold Story of An Inconvenienet Nationalist (2022) లో కూడా తాను నేతాజీకి సంబంధించి ఎక్కువగా చర్చలోకి రాని అంశాలమీదనే దృష్టి పెట్టానని రాసుకున్నాడు. కాబట్టి, నేతాజీ పైన ఇంతదాకా తెలిసినవీ, ఇప్పుడిప్పుడే తెలుస్తున్నవీ, అన్నీ కలిపి, ఒక సమగ్ర జీవిత చరిత్ర ఇంకా రావలసే ఉందనుకోవాలి.

అయితే ముఖర్జీ రచన, పట్టుమని వందపేజీలు కూడా లేకపోయినప్పటికీ, ఎంతో విలువైన రచన. ఆయన ఎంతో సంతులిత మనస్తత్వంతో, ఎంతో పరిణతి చెందిన అవగాహనతో బోస్ వ్యక్తిత్వాన్ని, భారత జాతీయోద్యమంలో బోస్ నిర్వహించిన పాత్రని అంచనా కట్టి మనముందుంచాడు. స్వాతంత్య్రం వచ్చి పాతికేళ్ళు కూడా కాకుండానే ఆయన అటువంటి మూల్యాంకనం చెయ్యగలగడం విశేషమే అనిపిస్తుంది. బోస్ గురించిన అవగాహన బలపడాలనుకున్నవాళ్ళూ, మరింత తెలుసుకోడానికి ఎక్కడ మొదలుపెట్టాలా అని ఆలోచిస్తున్నవాళ్ళూ ఈ పుస్తకంతో మొదలుపెట్టవచ్చు.

లింక్ ఇక్కడ పొందుపరుస్తున్నాను.

ఈ రచనలో నేతాజీ జీవిత ప్రస్థానానికి సంబంధించిన సంక్షిప్త చరిత్ర తో పాటు ఆయన ముఖ్యప్రసంగాలనుంచి, వ్యాసాలనుంచి ఎంపిక చేసిన పది వ్యాసాలు కూడా ఉన్నాయి. నేతాజీ జీవితచిత్రణకు చెందిన భాగంలో మహాత్ముణ్ణీ, నేతాజీని తులనాత్మకంగా వివరిస్తూ ఒక ప్రత్యేక అధ్యాయమే ఉంది. నాకు అది చాలా విలువైన అధ్యాయం అనిపించింది. అలానే ఉపసంహారంగా రాసిన అధ్యాయంలో కూడా ఆయన నేతాజీ నేపథ్యాన్నీ, ఆనాటి బెంగాల్ సామాజిక నేపథ్యం నేతాజీపైన చూపించిన ప్రభావాన్నీ కూడా ఎంతో నిష్పాక్షికంగా అంచనా వెయ్యడానికి ప్రయత్నించాడు. జర్మన్ సంఘటనలు అనే అధ్యాయంలో నేతాజీ ని నాజీగా, ఫాసిస్టు అనుకూలుడిగా ముద్ర వెయ్యడం ఎంత సత్యదూరమో, ఎన్నో సాక్ష్యాధారాలతో, ఎంతో ఓపిగ్గా వివరించాడు. ముఖ్యంగా 1935 లో డా. థియర్ ఫెల్డెర్ అనే జర్మన మిత్రుడికి నేతాజీ రాసిన ఉత్తరంలో ఈ వాక్యాలు చూడండి:

‘.. నేను 1933 లో మొదటిసారి జర్మనీ సందర్శించినప్పుడు, జర్మనీ తన జాతీయ శక్తినీ, ఆత్మవిశ్వాసాన్నీ ప్రోదిచేసుకోగల చైతన్యాన్ని సముపార్జించిదని భావిస్తూ తనలానే జాగృతమవుతున్న తక్కిన దేశాల పట్ల కూడా సంఘీభావం ప్రకటిస్తుందని అనుకున్నాను. కాని ఇప్పుడు నా అభిప్రాయం మారిపోయింది. జర్మనీలో కనిపిస్తున్న ఈ కొత్త జాతీయవాదం సంకుచితం, స్వార్థపూరితం మాత్రమే కాదు, దురహంకారపూరితం కూడా అనే తెలివిడితో నేను నా దేశానికి వెనుతిరుగుతున్నాను. ‘

అలాగే 1939 లో ఫార్వార్డ్ బ్లాక్ పైన ఫాసిస్టు అనుకూల వర్గమనే విమర్శ వచ్చినప్పుడు నేతాజీ ఇలా రాసారట:

‘…ఫాసిస్టు అనే పదం హిట్లర్లనీ, సూపర్ హిట్లర్లనీ, లేదా ఇప్పుడిప్పుడే మొగ్గతొడుగుతున్న హిట్లర్లనీ సూచించే పదం అనుకుంటే, అటువంటి నమూనాలు కాంగ్రెసు రైటిస్టు విభాగంలో మాత్రమే కనబడతారు.’

ఈ సందర్భంగా లూయీ ఫిషర్ కీ, మహాత్ముడికీ మధ్య జరిగిన ఒక సంభాషణ కూడా నేను చదివింది మీతో పంచుకోవాలి. నేతాజీ విమాన దుర్ఘటన వార్త విన్నప్పుడు లూయీ ఫిషర్ కీ గాంధీకి మధ్య జరిగిన సంభాషణలో ఫిషర్, అత్యంత సత్వరంగా భారతదేశానికి స్వాతంత్య్రం తేవాలన్న ఆకాంక్షవల్ల నేతాజీ ఫాసిజం ప్రలోభానికి లోనై ఉండవచ్చు అని అన్నప్పుడు గాంధీ అంగీకరించలేదు. పైగా, ‘అసలు బ్రిటిష్ పాలనలోనే భయంకరమైన ఫాసిస్టు శక్తులున్నాయి. వాటిని భారతదేశంలో మనం రోజూ చూస్తూనే ఉన్నాం. ఈ యుద్ధంలో బ్రిటిష్ వారు గెలవాలని అనుకుంటే ముందు భారతదేశాన్ని స్వతంత్రం చెయ్యమనండి. అప్పుడు పరిశుద్ధ హృదయంతో యుద్ధానికి వెళ్ళమనండి’ అని అన్నాడట.

అయితే, ఇంత సమాన హృదయం, అవగాహన కలిగి ఉన్నప్పటికీ, నేతాజీ, మహాత్ముడూ ఎందుకు కలిసి పనిచేయలేకపోయారు? 1939 లో నేతాజీ కోరుకున్నట్టుగా ఆయన్ను కాంగ్రెసు అధ్యక్షుడిగా పనిచెయ్యనిచ్చి ఉంటే, భారతదేశ భవితవ్యం మరోలా ఉండేది కదా అని నాకే కాదు, చాలామందికి అనిపిస్తుంది. అయితే, మా చిన్నప్పటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు చరిత్రలో if అనేది లేదని చెప్తుండేవాడు. ‘ఇది ఇలా జరిగి ఉంటే’ అనే ఊహాగానానికి చరిత్ర తావు ఇవ్వదు. ఎందుకంటే, మనుషుల వ్యక్తిగత అభిప్రాయాల కన్నా, రాగద్వేషాల కన్నా, చారిత్రక గతి శక్తులు పెద్దవి.

గాంధీ, సుభాష్ విభేదాల్ని అర్థం చేసుకోవాలంటే, భారతదేశంలో బ్రిటిష్ పాలన మొదటి రోజులనుంచీ సంభవించిన పరిణామాలని అర్థం చేసుకోవలసి ఉంటుంది. మనం బ్రిటిష్ పాలన అంటున్నప్పుడు నేరుగా ఇంగ్లాండును దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాం. కాని భారతదేశంలో బ్రిటిష్ పాలన ఒక polity గా రూపొందే పరిణామం దాదాపు నూటయాభై ఏళ్ళకు పైగా జరిగింది. 1773 రెగ్యులేటింగ్ యాక్టు మొదలుకుని, 1935 భారతచట్టం దాకా మొదట్లో ఈస్టిండియా కంపెనీ ద్వారా, తరువాత నేరుగా, బ్రిటన్ భారతదేశంలో ఒక పాలనావ్యవస్థని నిర్మించడానికి ప్రయత్నిస్తూనే వచ్చింది. దాన్ని వీలైనంత ప్రాతినిధ్యంతో కూడిన ప్రజాస్వామిక పాలనగా మార్చమని భారత జాతీయవాదులు పోరాడుతూ వచ్చారు. బ్రిటన్ తో సంబంధం లేకుండా భారతదేశం తనను తాను పరిపాలించుకోవాలనే సంపూర్ణ స్వపరిపాలన ఒక ఆశయంగా 1857 నుండీ మరొకవైపు సమాంతరంగా కొనసాగుతూనే వచ్చింది. 1885 లో ఏర్పాటయిన భారతజాతీయ కాంగ్రెసు 1930 దాకా సంపూర్ణ స్వాతంత్య్ర సాధన తన లక్ష్యమని బిగ్గరగా ప్రకటించలేదు. అప్పటిదాకా, అంటే 1885 నుండి 1930 దాకా కాంగ్రెసు, ఇతర రాజకీయ పక్షాలు, చట్టసభల్లోనూ, సివిల్ సర్వీసులోనూ భారతీయులకి మరిన్ని సీట్లు కావాలన్నదాని మీదనే పోరాటం చేస్తూ వచ్చారు. దాన్నే వారు పాలనలో వాటాగా భావించారు.

1885 నుండి 1920 దాకా ఒక దశ. పంతొమ్మిదో శతాబ్దం ద్వితీయభాగంలో ఇంగ్లిషు చదువువల్లా, ఆధునీకరణవల్లా లబ్ధి పొందిన కులీన తరగతి, నూతన మధ్యతరగతి, బ్రిటిష్ పాలనలో, తమకి కూడా ఎంతో కొంత వాటా కోసమే ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. 1909 మింటో-మార్లే సంస్కరణలు, 1919 లో మాంటేగ్-చెమ్స్ ఫర్డ్ సంస్కరణలు వారి ఆశల్ని కొంత ఎగదోసాయి, కొంత నీళ్ళు చల్లాయి. అలా చట్టసభల్లోనూ, సివిల్ సర్వీసులోనూ భాగం కావాలనుకునే స్వాంతంత్య్రపోరాటాన్ని constitutionalism అన్నారు. మరొకవైపు, ఈ రాజీ జీవితాన్ని ధిక్కరిస్తూ, బ్రిటిష్ పాలన సమూలంగా తొలగిపోవాలని విప్లవకారులు చేపట్టిన విప్లవ పంథా ఉండనే ఉంది. సరిగ్గా అటువంటి చీలుదారి దగ్గర భారతదేశం నిలబడ్డ సందర్భంలో గాంధీ జాతీయోద్యమంలో ప్రవేశించాడు. బ్రిటిష్ వాళ్ళతో రాజీ పడి, పాలనలో భాగం కావాలనుకునే శక్తుల పట్ల విప్లవకారులకున్న అసహనాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. అదే పరిస్థితిలో, అత్యధిక సంఖ్యాకులైన భారతప్రజానీకం హింసా మార్గాన్ని అనుసరించే అవకాశం లేదని కూడా గ్రహించాడు. దాంతో, ఒక కొత్త పోరాట ప్రక్రియకు అంకురార్పణ చేసాడు.

అది అహింసా పద్ధతిలో చట్టాన్ని ధిక్కరించడం, మరొకవైపు ఇంగ్లిషు చదువుని, చట్టసభల్ని బహిష్కరించే విప్లవశీలధిక్కారం. 1920 ల నాటికి కొత్త భారతీయ మధ్యతరగతి పట్టణాల్లోనూ, నగరాల్లోనూ స్థిరపడ్డారు. ఆర్థికంగా కూడా నిలదొక్కుకున్నారు. అందుకని వారు రాజకీయ స్థిరత్వాన్ని, యథాతథవాదాన్ని కోరుకుంటున్నారు. మరొకవైపు గ్రామాల్లో కొత్త తరం పుట్టుకొచ్చారు. పట్టణ మధ్యతరగతికి దక్కిన అవకాశాలు వారికి లేవు. వారి భవిష్యత్తు బ్రిటిష్ వారికి సహకరించడంతో ముడిపడిలేదు. వారికి సహాయనిరాకరణ చెయ్యడం ద్వారా పాలనని స్తంభింపచేసి భారతదేశానికి స్వర్యాజ్యం వస్తే తప్ప వారికి అభ్యున్నతి లేదు. అందుకనే 20 ల్లో గాంధీ సహాయనిరాకరణ చేపట్టినప్పుడు అది దేశవ్యాప్త ఉద్యమంగా ఉవ్వెత్తున ఎగిసిపడింది.

కాని కాంగ్రెసులో ఒక వర్గం చట్టసభల్లో ప్రవేశించాలనీ, బ్రిటిష్ విధానాల్ని లోపలనుండి ఎండగట్టాలనీ వాదించేరు. వారు కాంగ్రెసుతో తెగతెంపులు చేసుకుని స్వరాజ్యపార్టిగా అవతరించి చట్టసభల్లో ప్రవేశించారు. కాని రాజకీయంగా అత్యంత క్రియాశీలమైన, విప్లవశీల భావాలు కలిగిన శక్తులు మహాత్ముడితోటే ఉండిపోయాయి. ఇది మనందరికీ తెలిసిందే.

అయితే, 1920 వ దశకంలో చట్టసభల్లో ప్రవేశాల పట్ల ఇంత విప్లవాత్మకత వ్యతిరేకతని ప్రదర్శించిన మహాత్ముడు 1930 వ దశకంలో మెత్తబడ్డాడన్నది సుభాష్ ఆరోపణ. 1929 నుండీ ఆయన గాంధీకి, కాంగ్రెసుకి చెప్తూ వచ్చినదేమంటే, 1920 ల్లో క్రియాశీలక పాత్ర వహించినవారి స్థానంలో ఇప్పుడు అంటే 30 ల్లో మరొక కొత్త తరం అంతకన్నా విస్తృతమైన తరం తల్లెత్తిందనీ, వారు బ్రిటిష్ వారితో రాజీలేని పోరాటం కోరుకుంటున్నారనీ, కాబట్టి కాంగ్రెసు చట్టసభల బహిష్కరణ కొనసాగించి, ఈ సరికొత్త శక్తులతో సరికొత్త ఉద్యమాన్ని మొదలుపెట్టాలనీ ఆయన వాదిస్తూ వచ్చాడు. 1933 లో నేతాజీ, విఠల్ భాయ్ పటేల్ వియన్నాలో సంయుక్తంగా వెలువరించిన ఒక ప్రకటనలో ఈ విషయాలు ఎంతో స్పష్టంగా చెప్పారు.

కానీ, మరొకవైపు కాంగ్రెసు, ముస్లిం లీగు, ఇతర రాజకీయ పక్షాలు 1935 భారతప్రభుత్వ చట్టం వైపు ఆశగా చూస్తున్నాయి. కొత్త చట్టంలో ప్రొవిన్షియల్ ప్రభుత్వాల్లో జాతీయోద్యమ శక్తులకు కొంత పాలనావకాశం లభిస్తుందనే ఉత్సాహంలో వారున్నారు. 1934 కాంగ్రెసు మహాసభలో మహాత్ముడు ఆ వర్గాల ఆకాంక్షలకు అడ్డుపడకపోగా, వారిని సమ్మతిస్తూ మాట్లాడేడు.

ఆ తర్వాత 1937 నుంచి 1939 దాకా సుభాష్ తన యూరోప్ పర్యటనలో ప్రపంచం మరొక యుద్ధం వైపు నడుస్తున్నదనీ, ఏ రోజైనా యుద్ధం మొదలుకావచ్చనీ, కాబట్టి మరొక జాతీయ స్థాయి పోరాటాన్ని ప్రకటించి, బ్రిటిష్ వారిని ఇరుకున పెట్టాలనీ పదే పదే చెప్తూ వచ్చాడు. కాని 1937 లో ప్రొవిన్షియల్ ప్రభుత్వాలకు ఎన్నికలు జరిగాయి. దేశంలోని 11 ప్రావిన్సుల్లో 7 ప్రావిన్సులు కాంగ్రెసు గెలుచుకుంది. అప్పటిదాకా తమ జాతీయ పోరాటంలో ఎంతో విప్లవాత్మకతను పోషించిన కాంగ్రెసు తన క్రియాశీలతను చట్టసభల్లో చూపించడానికి ఉవ్విళ్ళూరుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెసు సుభాష్ మాట వినకపోగా, ఆయన్ని కాంగ్రెసు అధ్యక్షుడిగా పనిచెయ్యడానికి కూడా సుముఖత చూపలేదు. సరిగ్గా ఆ వైఖరిమీదనే, ఆ రాజీపడటం మీదనే సుభాష్ తన అస్త్రాల్ని ఎక్కుపెట్టాడు. ఆ విమర్శలో ఎంతదాకా వెళ్ళాడంటే, మారిన పరిస్థితుల్లో సరికొత్త జాతీయోద్యమాన్ని నిర్మించే శక్తి గాంధీకి లేదనీ, ఒకటి ఆయన వయోభారం, రెండవది, ఆయన శాంతిదూత కావడం అని కూడా అన్నాడు. .

కాని కొత్త ప్రభుత్వాల ఉత్సాహం ఎంతోసేపు నిలబడలేదు. యుద్ధం మొదలుకాగానే, 1939 లోనే కాంగ్రెసు ప్రభుత్వాలు తమ పదవులకు రాజీనామా చేసేసాయి. చివరికి 1942 లో సుభాష్ కోరుకున్నట్టుగానే గాంధీ మరొక జాతీయ స్థాయి ఉద్యమాన్ని, క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపు ఇవ్వక తప్పలేదు. కాని అప్పటికే జరగవలసిన ఆలస్యం జరిగిపోయింది.

1920 ల్లో తన వెంట ఎవరూ నిలబడతారన్న నమ్మకం లేకపోయినా అంత విప్లవాత్మకతను చూపించిన గాంధీ 1930ల్లో సుభాష్ వంటి నాయకుడు పక్కన నిలబడినప్పటికీ, రాజీలేని తెగువ ఎందుకు ప్రదర్శించలేదనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. మనం ఇంతదాకా సుభాష్ వాదన విన్నాం. అలాగే గాంధీ వాదన కూడా వినవలసి ఉంటుంది. అది మరోసారి.

కాని ఇప్పటికి లభ్యమైన సమాచారం బట్టి మనకి కొత్తగా తెలుస్తున్నదేమంటే, 1941 తర్వాత, అంటే, బ్రిటిష్ నిఘావిభాగాల కన్నుకప్పి, నేతాజీ భారతసరిహద్దులు దాటిపోయినప్పటినుండీ, సుభాష్ పట్ల గాంధీజీ అంచనాల్లో ఎంతో మార్పు వచ్చిందని. గుణాత్మకంగా అది ఎంత పెద్దమార్పు అంటే సుభాష్ తన పక్కన ఉండి ఉంటే, దేశవిభజన జరగకపోయి ఉండేదని మహాత్ముడు భావించేటంత.

ఏమైనప్పటికీ గాంధీ-సుభాష్ సంవాదంలో ఇప్పటి మన చరిత్రకి అవసరమైన విలువైన పాఠం ఒకటి ఉంది. ఇప్పుడు కూడా మన దేశంలో అన్ని రాజకీయ పక్షాల్లోనూ, రాజకీయ పక్షాల్లో భాగస్వాములు కాని రాజకీయ శక్తుల్లోనూ కూడా పాలనలో భాగం పంచుకోవాలని ఉవ్విళ్ళూరే వర్గం ఎంత బలంగా ఉందో, పదవులకోసం రాజీ పడకుండా ప్రజావిముక్తిని కోరుకునే వర్గం కూడా అంత బలంగానూ ఉంది. నిజమైన రాజనీతి విద్యార్థికాని, రాజకీయ నాయకుడు గాని ఆ విప్లవశక్తుల్ని గుర్తుపట్టగలగాలి, సమీకరించగలగాలి, రాజీలేని పోరాటాన్ని సాగించగలగాలి.

1-6-2022

Leave a Reply

%d bloggers like this: